‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్​)’గా కల్వకుంట్ల కవిత పార్టీ

‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్​)’గా కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రకటించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ కోసం అనేక కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడామన్నారు. జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని పదిలంగా కాపాడుకున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి రాష్ట్రప్రజలను దోచుకుంటున్నారని కవిత అన్నారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణ ఆత్మ కోల్పోయినందుకే ‘తెలంగాణ రాష్ట్ర సేన’ వచ్చిందని వెల్లడించారు. కేసీఆర్‌ రాజకీయ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నారని, కేటీఆర్‌కు ఏమీ తెలియనందున ఆయన మాట్లాడినా పట్టించుకోరని, ప్రజలు తప్పు చేశారని కేసీఆర్‌ చెబుతున్నారని, అధికారం ఇవ్వకపోతే ప్రజలను వదిలేస్తారా? అని నిలదీశారు. తనను పార్టీలో నుంచి బయటకు పంపితే వెంటనే పార్టీ పెట్టలేదని, మారతారేమోనని వేచి చూశానని, పది నెలలైనా మారలేదని అన్నారు. ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే ఇంకా గట్టిగా మాట్లాడాల్సిందని తెలిపారు. నాడు మీకు జరిగిందే, ఇవాళ తనకు జరిగిందని ఉద్యమకారులను ఉద్దేశించి అన్నారు. కండువా వేసుకుని తిరిగిన ఉద్యమకారులకు సరైన గుర్తింపు రాలేదని, అధికారం వచ్చిన తర్వాత అమ్మతనం, మమకారం పోయిందని విమర్శించారు. కేసీఆర్‌ మారినందునే తాను నిలబడి యుద్ధం చేస్తున్నానని వెల్లడించారు. తెలంగాణ గడ్డకు ప్రాణాలు అడ్డుపెట్టి ప్రజలను కాపాడే వ్యక్తులు కావాలని, తెలంగాణ ప్రజలను కాపాడే సైన్యంగా మారేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఉద్యమ సమయంలో మాదిరిగా ఇప్పుడూ పని చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఒక్క పాలమూరు-రంగారెడ్డి మాత్రమే కాదు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, అవినీతి జరిగిందని చెప్పినందుకే తనను బయటకు పంపారని తెలిపారు. అవినీతి చేసిన పందికొక్కులను పక్కన కూర్చోపెట్టుకున్నారని, ఆత్మ లేని మరబొమ్మలా కేసీఆర్‌ మారారని, అందుకే పోరాడుతున్నానని పేర్కొన్నారు. తనతో కలిసి పోరాడేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ అనేక తప్పులు చేస్తోందని విమర్శించారు. కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పిందని, తెలంగాణ ప్రజల ఆర్తిని అర్థం చేసుకోలేకపోయిందని, సామాజిక తెలంగాణ రథ చక్రం విరిగి ముక్కలైందని , కొత్త రాష్ట్రంలో జరగాల్సిన పనులు సరిగా జరగలేదని విమర్శించారు. తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతాయని భావించామని, రైతులకు బేడీలు పడ్డాయని, ఇసుక దందా వల్ల దళితులు దెబ్బలు తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్లు ఎక్కడ పర్యవేక్షిస్తున్నారోనని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదని తెలిపారు. దారుణమైన నిఘా నీడలో తెలంగాణ అంతా బతికిందని, మనం అనుకున్న తెలంగాణ రాలేదనేది ముమ్మాటికీ వాస్తవమని, ఆనాడు పరిపాలించిన కుటుంబంలో తాను కూడా ఒక భాగమని గుర్తు చేశారు. తాను కూడా భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నానని అన్నారు. తెలంగాణ ప్రజలను క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. తెలంగాణ సాధించినందుకు గర్వపడుతున్నానని, జన్మధన్యమైందని భావిస్తున్నానని, తప్పులో తనకు భాగం ఉన్నందుకు క్షమాపణ చెబితే సరిపోదని అన్నారు. సామాజిక న్యాయ తెలంగాణ కోసం నడుం బిగించి కష్టపడి పనిచేయాలని తెలిపారు. పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ప్రజల ముందుకు వచ్చిందని, తమ పని తీరు ఎలా ఉంటుందో ప్రజలు చూస్తారని అన్నారు. ప్రజలకు మంచి చేయాలంటే పోరాడితే సరిపోదని, రాజకీయ అధికారం ఉండాలని తెలిపారు. రాజకీయ అధికారం తోడైతేనే ప్రజలకు మంచి చేయగలమని, ఏ పార్టీకైనా ఆత్మ, నేపథ్యం ఉండాలని, బీఆర్‌ఎస్‌ సాంకేతికంగా ఉన్నా ఆత్మను కోల్పోయిందని, బీఆర్‌ఎస్‌ తెలంగాణ ఆత్మ కోల్పోయినందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చిందని వెల్లడించారు.