కుప్పంలో ‘సూర్య ఘర్‌’ సోలార్‌ పైలట్‌ ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్

ప్రతి ఇంటిలో నెలకు 200 యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి
ఏడాదికి రూ.4వేల విలువైన కరెంట్‌ ఉచితంగా వినియోగం
’స్వర్ణ కుప్పం విజన్‌-2029’ డాక్యుమెంటరీని ఆవిష్కరించిన సిఎం చంద్రబాబు
చిత్తూరు : మన ఇళ్లపై మనమే కరెంట్‌ ఉత్పత్తి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సౌర, పవన విద్యుత్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని.. వీటి కారణంగా ప్రజలపై బిల్లుల భారం తగ్గుతుందన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో ’సూర్య ఘర్‌’ సోలార్‌ పైలట్‌ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటిలో నెలకు 200 యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేసుకొనేందుకు అవకాశం ఉందన్నారు. 60 యూనిట్లు వాడుకోవచ్చు.. మిగతా 120 యూనిట్లను గ్రిడ్‌కు అనుసంధానం చేయొచ్చన్నారు. ఏడాదికి రూ.4వేల విలువైన కరెంట్‌ ఉచితంగా వినియోగించుకోవచ్చని, అదనంగా మరో రూ.5వేలు వరకు ఆదాయం వస్తుందని సీఎం వెల్లడిరచారు. ప్రజలు భవిష్యత్తులో కరెంట్‌ బిల్లు కట్టే భారం ఉండదన్నారు. ఈ సందర్భంగా ’స్వర్ణ కుప్పం విజన్‌-2029’ డాక్యుమెంటరీని ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్యుమెంటరీని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. అంతకుముందు నడిమూరు గ్రామంలో సోలా సోలరైజేషన్‌ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, మంత్రులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ’అసాధ్యం అన్న వాటిని సుసాధ్యం చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం. విజన్‌-2020 తయారు చేసినప్పుడు చాలా మంది విమర్శించారు. ఒక డైరెక్షన్‌ లేకుండా జీవితాల్లో ఎవ్వరూ పైకి రాలేరు. ఏ వ్యక్తి అయినా సరే పద్ధతి ప్రకారం పని చేయగలిగితే జీవితంలో ఏదైనా సాధించే స్థితికి చేరుతారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు శాపాలుగా మారుతాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే చరిత్ర మారిపోయే పరిస్థితి ఉంటుంది. మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు దేశ ప్రధాని అయిన తర్వాత అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణల వల్ల ఆయన దేశం దశదిశ మార్చారన్న విషయం మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన్మోహన్‌ సింగ్‌ కూడా మంచి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మరవలేని వ్యక్తిగా నిలిచారు. ద్రవిడ యూనివర్సిటీ రావడానికి కారణం నందమూరి తారక రామారావు. బాగా కష్టపడితే 2030 నాటికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే భారత్‌ నెంబర్‌ వన్‌గా నిలుస్తుంది. అమెరికాలో అమెరికన్ల తలసరి ఆదాయం కంటే భారతీయులు, తెలుగు వారిదే ఎక్కువని చెప్పారు.