నెయ్యం నుంచి వియ్యం దాకా…

సాహిత్యం హోమ్

_______

150దాకా కవితలు,75 కథలు,తొమ్మిది నవలలు,మూడు కథా సంపుటాలు, ఒక కవితా సంపుటి..ఇవి ప్రముఖ సాహితీవేత్త సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి సృజన సాహిత్యంలో పండిన మేలైన పంట.1987 నుండి కథలు, నవలలు, కవితలు వ్రాస్తున్న సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి నవల “చినుకుల సవ్వడి” ఇంగ్లీషు భాషలోనికి అనువదించబడింది. కొన్ని కథలు హిందీ, కన్నడ, ఒరియా భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి రచనలపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయాలలో పి.హెచ్.డి. స్థాయిలో మూడు పరిశోధనలు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలలో ఎం.ఫిల్. స్థాయిలో రెండు పరిశోధనలు జరిగాయి.ఆటా,తానా నవలల పోటీలో బహుమతులతోపాటు అనేక బహుమతులు,పురస్కారాలు పొందారు. ‘కొండపొలం’ నవల క్రిష్ దర్శకత్వంలో సినిమాగా రూపొందినది.వృత్తిరీత్యా పాఠశాల ఉపాధ్యాయుడు. మనిషితనానికి సరికొత్త నిర్వచనం. ముప్ఫయి ఐదు సంవత్సరాలపాటు విద్యా బోధన చేసి ఈ రోజు ఉద్యోగ విరమణ చేస్తున్న ప్రముఖ సాహితీవేత్త సన్నపురెడ్డి గారితో ఉన్న జ్ఞాపకాల అనుబంధ మాలికను యం.వి.రామిరెడ్డి గారు మా పాఠకులతో పంచుకుంటున్న ప్రత్యేక వ్యాసం ఇది -సంపాదకులు.

______

1994లో ఓరోజు… డిప్లొమా పూర్తయి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న రోజులు. కవిత్వాన్ని కలవరిస్తున్న కాలం. హైదరాబాదు సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఒక సాహిత్యసభకు హాజరయ్యాను. అది పూర్తయ్యాక కవులతోపాటు నడుచుకుంటూ రోడ్డు మీదికి వచ్చాను. వాళ్లల్లో కొందరు టీ తాగటానికి సుధ హోటల్లోకి నడిచారు. నేను నా దారిన పోతుండగా ఓ వ్యక్తి ‘సోదరా, నువ్వు గూడా రా. టీ తాగుదాం’ అన్నారు. నేనెవరో ఆయనకు తెలియదు. ఆయన మాత్రం నాకు తెలుసు. అప్పటికే రచయితగా పేరొందిన ‘సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి’ గారు. ఆనందంగా లోపలికి నడిచాను.బల్ల చుట్టూ భేటీ వేశాం. నేను ఆయన పక్కనే కూచున్నాను.

‘‘ఏం పేరు సోదరా?’’ అడిగారాయన.
‘‘ఎమ్వీ రామిరెడ్డి’’ చెప్పాను.
‘‘ఏం జేస్తాండావు?’’
‘‘ఉద్యోగం కోసం చూస్తున్నా సార్’’ అంటూ వివరాలు చెప్పాను.
‘‘ఏవన్నా మాట సాయం గావాల్నా? వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గరకైతే నేను నేరుగా పోగల్ను. ఆయన్తో ఏమైనా అయితదా?’’

కలిసింది మొదటిసారి. అంతలోనే ఎంత కన్సర్న్! ఆశ్చర్యం కలిగింది.‘‘లేదు సార్. ప్రయత్నిస్తున్నా. డిప్లొమా మీద మరీ నాసిరకం నౌకరీలు వస్తున్నాయి. కాస్త మంచి అవకాశం కోసం చూస్తున్నా’’చెప్పాను.
‘‘అంతేలే. అస్సలు తొందర పడకు. నచ్చిన జాబులోనే చేరు’’ ఆత్మీయంగా చెప్పారు.

టీ పొగల మధ్య, కవుల కబుర్ల మధ్య మొదలైన ఆ పరిచయ పరిమళం మరింతగా, ఏకంగా కుటుంబంలోకే వ్యాపిస్తుందని ఊహకైనా అందే అవకాశం లేదు.

*****

ఎందుకోగానీ, డిస్టింక్షన్ సాధించినప్పటికీ డిప్లొమా మీద ప్రేమ ఉండేది కాదు. మాతృభాష పట్ల మనసు లగ్నమై ఉందన్న విషయం గ్రహించి, ప్రైవేటుగా బి.ఎ. (తెలుగు) పూర్తి చేశాను. ఈ క్రమంలో సాహిత్యాధ్యయనంతోపాటు కథలూ కవిత్వమూ రాయటంపై కసరత్తు మొదలైంది. కొన్ని కవితలకు బహుమతులు దక్కాయి. ఈనాడు జర్నలిజం స్కూలులో సీటు వచ్చింది. మహానుభావులు డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ, డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గార్ల శిష్యరికం కేవలం ఓ వరం.

1996లో ఈనాడు సబ్ ఎడిటర్‌గా సూర్యాపేటలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమయ్యాక అడపాదడపా కవితలు రాస్తూ ఉండేవాణ్ణి. పత్రికల్లో కథలు, కవితలు వదలకుండా చదివేవాణ్ణి. ఎక్కడైనా సన్నపురెడ్డి గారి రచన కనిపిస్తే ఆకలితో నమిలేసేవాణ్ణి. పరంపరగా ఆయన కథలకు బహుమతులు లభిస్తూ ఉండేవి. ఆ కథలు చదివి, రెండుమూడు సార్లు ‘ఫలానా కథ బాగుం’దంటూ ఉత్తరాలు రాసిన గుర్తు.

2003లో ఈనాడు ఆదివారం అనుబంధానికి హైదరాబాదు ట్రాన్స్‌ఫర్ అయ్యాక, ఒకట్రెండు సభల్లో ఆయన్ని కలిసిన జ్ఞాపకం. ఓసారి ఈనాడు ఆదివారం సంచికకు ఆయన పంపిన కథ చదవటం, సెలెక్ట్ చేయటం, బొమ్మలు వేయించే పనిని ప్రత్యేకంగా పర్యవేక్షించటం, పేజీ లేఔట్ చేయించటం వంటి పనుల్ని ఎందుకో ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించాను.

2006లో నేను ఈనాడు వదిలి, ‘రామ్‌కీ ఫౌండేషన్’ బాధ్యతలు స్వీకరించాక ఒకట్రెండు సార్లు ఫోన్లో మాట్లాడాను. 2018లో నా రెండో కథాసంపుటి ‘‘వెంట వచ్చునది’’ వెలువడింది. నేనైతే పంపలేదుగానీ, ఆయనకా పుస్తకం ఎలాగో చేరింది. కథలన్నీ చదివి ఫోన్ చేసి, ‘‘సోదరా, ఈ నడమ నిన్ను చదువుతున్నాను. భలే రాస్తున్నావు. అభినందనలు’’ అన్నారు. ఉన్న ఫళంగా ఆకాశంలోకి లేచి, గింగిర్లు కొట్టాను. ఆయన నోటి వెంట ‘వెంట వచ్చునది’కి ప్రశంస లభించిన వేళావిశేషమో ఏమోగానీ, ఆ సంపుటికి ‘‘కొండసాని నారాయణరెడ్డి స్మారక జాతీయ సాహిత్య పురస్కారం’’ ప్రకటించారు. 2019 డిసెంబరులో అవార్డు అందుకోటానికి పుట్టపర్తి వెళ్లాను, శ్రీమతితో సహా. చిత్రంగా అదే అవార్డును కవిత్వ విభాగంలో సన్నపురెడ్డి గారి కవితా సంపుటి ‘‘బడి’’కి ప్రకటించారు.

అవార్డు అందుకోటానికి ఆయన తన చిరకాల మిత్రుడైన జయరామిరెడ్డి గారితో కలిసి వచ్చారు. సమావేశ మందిరంలోకి ప్రవేశిస్తూనే ‘‘సోదరా, బాగున్నావా’’ అంటూ ఆత్మీయంగా హత్తుకున్నారు. నా శ్రీమతి రాజ్యలక్ష్మిని పరిచయం చేశాను. సాహిత్యం బాగా చదివే అలవాటున్న తను కాసేపు వెంకటరామిరెడ్డి గారితో ముచ్చటించింది.
కథారచనలో చేయి తిరిగిన ఆయన తన ‘కవిత్వానికి’, కవిగా కాస్త పేరు గడించిన నేను ‘కథలకు’ అవార్డులు అందుకోవటం చిత్రంగా ఉందంటూ ఇద్దరం కబుర్లు కలబోసుకున్నాం.
అప్పట్నుంచీ సాన్నిహిత్యం మరింత పెరిగింది. చరవాణి సంభాషణలు పెరిగాయి. ప్రచురితమయ్యే రచనలపై అభిప్రాయ పంపకాలు పెరిగాయి.

సాహిత్యలోకంలో సంచలనం సృష్టించిన ఆయన ‘‘కొండపొలం’’ నవలపై నేను చాలా ఇష్టంగా ఓ సుదీర్ఘ సమీక్ష రాశాను. పాలపిట్టలో వచ్చిన ఆ వ్యాసం చదివి, సన్నపురెడ్డి గారు ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారు. అది ఆయన సంస్కారం.

2020లో నవ్య వీక్లీలో ఆయన జీవనరేఖలపై ప్రచురితమైన వ్యాసం చదివినప్పుడు మాత్రమే సన్నపురెడ్డి కుటుంబ వివరాలు తెలుసుకున్నాను. ఇద్దరమ్మాయిలకు పెళ్లయింది. అబ్బాయి ఎంబీఏ (అగ్రికల్చర్) చదువుతున్నట్లు తెలుసుకుని, వెంటనే ఫోన్ చేశాను.

‘‘చెప్పు సోదరా, ఏమిటి సంగతులు’’ అన్నారు ఎప్పట్లాగే తనదైన భోళాతనంతో.
‘‘మీ అబ్బాయి పీజీ పూర్తయిందా?’’ అడిగాను.
‘‘ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి’’ చెప్పారు.
‘‘అయిపోగానే మీ వాణ్ని నాకిచ్చేస్తారా’’ అన్నాను నవ్వుతూ.
‘‘ఉజ్జోగమిస్తావా ఏంది?’’
‘‘అవునన్నా. మాకు అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీ వాడి సేవలు ఉపయోగించుకుంటాం.’’
‘‘అంతకంటేనా! తీసుకో. వాడి బాధ్యత నీదే. హైదరాబాదొచ్చి, నిన్ను కలుస్తాడులే’’ అన్నారు.

2020 మార్చి 19. సన్నపురెడ్డి శ్రీనాథ్ రెడ్డి వచ్చి నన్ను కలిశాడు. ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా అయిపోలేదని చెప్పాడు. అయిపోగానే వచ్చి ఉద్యోగంలో చేరమన్నాను. అదేరోజు నుంచి కరోనా లాక్‌ డౌన్ మొదలు కావటంతో శ్రీనాథ్ తంటాలు పడి ఇంటికి చేరుకున్న విషయం ఆ తర్వాతెప్పుడో తెలిసింది.

*****
శ్రీనాథ్ ‘రామ్‌కీ ఫౌండేషన్’లో చేరాడు. అప్పటికే సోషల్ వర్క్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన మా అమ్మాయి హిమవర్ష కూడా నా దగ్గరే పని చేస్తోంది. కొద్ది నెలలకే మా అమ్మాయి మరో కంపెనీకి వెళ్లిపోయింది. ఎప్పుడైనా మా ఆఫీసుకు వచ్చినప్పుడు అందరితోపాటు శ్రీనాథ్‌తోనూ మాట్లాడేది.

‘అమ్మాయికి 24 వచ్చాయి. ఇప్పట్నుంచీ మొదలు పెడితేగానీ మంచి సంబంధం దొరుకదు. మీరూ మీ పనులూ తప్ప, ఇంతవరకూ అమ్మాయి బయోడేటా కూడా తయారు చెయ్యలేదు’ అంటూ మా ఆవిడ సతాయింపులు మొదలయ్యాయి.
‘బయోడేటాలూ బయోస్కోపులూ అక్కర్లేదోయ్. మనమ్మాయికి మంచి సంబంధం దానంతట అదే తోసుకొస్తుంది’ అంటూ నేను బడాయి పోయేవాణ్ణి.

2021 సెప్టెంబరులో ఓరోజు హిమవర్ష మా ఆఫీసుకొచ్చి, శ్రీనాథ్ పక్కన నిలబడి ఏదో సామాజిక కార్యక్రమం గురించి మాట్లాడుతుండటాన్ని నా క్యాబిన్‌లోంచి చూసినప్పుడు… బుర్రలో ఏదో స్ఫురించింది. ‘అవును… జంట బాగానే ఉంటుంది!’ అనుకున్నాను.

2021 అక్టోబరు 2. ‘కొండపొలం’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్. సన్నపురెడ్డి గారు తన భార్య, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలతో ఆ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు శ్రీనాథ్ చెప్పాడు. అప్పటికే నా మస్తిష్కంలో ఓ స్క్రిప్ట్ సిద్ధమైంది. కనీసం నా శ్రీమతికి కూడా చెప్పలేదు. తనను, మా అమ్మాయిని, అక్క, బావ, అన్నయ్యలను ఆ ఫంక్షన్‌కు తీసుకెళ్లాను.

అప్పటికి నేను తనకు బాస్‌ ను కాబట్టి శ్రీనాథ్ నాకు, మా కుటుంబసభ్యులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికాడు. నన్ను చూస్తూనే ‘‘సోదరా, ఎలా ఉన్నావు’’ అన్నారు. నేను మా వాళ్లను పరిచయం చేశాను. పనిగట్టుకొని నా శ్రీమతిని తీసుకెళ్ళి, ఆయన కుమార్తెలకు పరిచయం చేశాను. శ్రీనాథ్‌ నూ మా వాళ్లకు పరిచయం చేశాను.

కొద్ది రోజుల తర్వాత మా ఆవిణ్ణి అడిగాను… ‘‘మనమ్మాయికి శ్రీనాథ్ ఎలా ఉంటాడు?’’ అని. తను ఏమాత్రం ఆలోచించకుండా ‘‘చాలా బాగుంటుంది’’ అంది. రెండ్రోజుల తర్వాత మా అమ్మాయికి చెప్పాం. వెంటనే పగలబడి నవ్వింది. మాకర్థం కాలేదు.

‘‘అసలు మీకీ ఆలోచన ఎలా వచ్చింది?’’ అనడిగింది. ‘‘ఏదో, అలా అనిపించింది. నీకిష్టం లేకపోతే వదిలెయ్’’ అన్నాను తన మనసులో ఏముందో అర్థం కాక. నాలుగైదు నిమిషాలపాటు మా మధ్య నిశ్శబ్దం.కాస్త గంభీరంగా మారి ‘‘నాక్కొంచెం టైమివ్వండి నాన్నా’’ అంది.రెండ్రోజుల తర్వాత ‘‘నేనోసారి ఆ అబ్బాయితో మాట్లాడాలి’’ అంది. ‘‘ఇంతకీ తనకిష్టమో లేదో కనుక్కున్నారా?’’ అనడిగింది.

నాకా అబ్బాయిని కదిలించటం ఇష్టం లేదు. వాళ్ల నాన్నవైపు నుంచి రావాలనుకున్నాను. అది కూడా నేను అడగటం బాగోదనిపించింది. సహోద్యోగి ఒకరు ఆ బాధ్యత నిర్వర్తించారు. మా అమ్మాయి ఫొటోను ఆయనకు పంపారు. కుటుంబ సభ్యులు సరేననుకున్నారు.

శ్రీనాథ్‌ కు తన తండ్రితో కన్నా వాళ్ల పెద్ద బావతో అనుబంధం ఎక్కువ. సన్నపురెడ్డి గారు తెలివిగా తన పెద్దల్లుడు ప్రొఫెసర్ శివారెడ్డి (పుణె) గారికి బాధ్యతలు బదలాయించారు. అప్పటికే బంధువుల తరఫున నాలుగైదు సంబంధాలు సిద్ధంగా ఉన్నాయని, వాళ్లు సంప్రదించినప్పుడు శ్రీనాథ్ ‘ప్రభుత్వోద్యోగం వచ్చేదాకా పెళ్ళి చేసుకోకూడదనుకుంటున్నా’డని తెలిసింది. ఓరోజు శివారెడ్డి గారు ఫోన్ చేసి ‘‘శ్రీనాథ్, నీకు పెళ్ళి సమయం ఆసన్నమైందోయ్’’ అన్నారు(ట).

‘‘సారీ, ఇంకో సంవత్సరం దాకా దాని గురించి మాట్లాడొద్దు’’ అన్నాడట.‘‘మంచి సంబంధం. ఆలోచించుకో’’ అన్నారట.
‘‘అయినా సరే, ఆగాల్సిందే’’ అన్నాడు.
‘‘కనీసం అమ్మాయెవరో కూడా అడగవా?’’
‘‘ఎవరైనా సరే’’ తేల్చి చెప్పాడు.‘‘సరే. ఆ అమ్మాయి ఫొటో నీ వాట్సాప్‌ కు పంపుతున్నాను. చెక్ చేసుకొని ఫోన్ చెయ్యి’’ అని చెప్పి, చల్లగా ఫోన్ పెట్టేశారు.
శ్రీనాథ్ యథాలాపంగా ఫొటో డౌన్‌లోడ్ చేసుకున్నాడు. హిమవర్ష!

తన బావ ఏదో పొరపాటున పంపి ఉంటాడనుకొని, ఫోన్ చేసి, అదే అడిగాడు.
‘‘పొరపాటు కాదు. ఆ అమ్మాయే పెళ్లికూతురు.’’, ‘‘మా సార్‌ కు తెలుసా?’’ అనడిగాడు(ట).‘‘హారి పిచ్చోడా, ఆయనకన్నీ తెలుసు. నువ్వే ఆలోచించుకో. తొందరేమీ లేదు. బలవంతం అసలే లేదు’’ చెప్పారు.
‘‘నేనా అమ్మాయితో ఓసారి మాట్లాడాలి’’ అన్నాడు.

ఇద్దరూ ఎ.ఎం.బి. మాల్‌ దగ్గర కలుసుకున్నారు. నిర్మొహమాటంగా మాట్లాడుకున్నారు. ఒకరి లక్ష్యాలను ఒకరు తెలుసుకున్నారు. ఒకరి అభిరుచుల్ని ఒకరు గౌరవించుకున్నారు.

‘‘నాకు ఓకే నాన్నా’’ చెప్పింది మా అమ్మాయి.‘‘మీ సంభాషణలో నీకు బాగా నచ్చిన అంశం?’’ కావాలనే అడిగాను. “ఆ అబ్బాయి ఓ ప్రశ్న అడిగాడు నాన్నా. ‘మీరు నన్ను ఇష్టపడుతున్నారా లేక సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారబ్బాయిని ఇష్టపడుతున్నారా’ అని. అది నాకు బాగా నచ్చింది.’’

‘‘మరి నువ్వేం చెప్పావు?’’

‘‘సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి కొడుగ్గా మా నాన్న ఇష్టపడుతున్నారు. సన్నపురెడ్డి శ్రీనాథ్‌గా నేను అభిమానిస్తున్నాను’ అని చెప్పాను.’’ నా బిడ్డను సంతోషంగా కౌగిలించుకున్నాను. ఇప్పుడు బంతి నా కోర్టులోకి వచ్చి పడింది. చిరకాల మిత్రులైన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారికి ఫోన్ చేశాను. జీవితంలో అదో అరుదైన క్షణం. ఏదో తెలియని ఉద్విగ్నం.

ఆయన ఫోన్ తీసి ‘‘ఆ… రామిరెడ్డి గారూ. చెప్పండి’’ అన్నారు. ఉద్దేశపూర్వకంగా పాత సంబోధనను తొక్కిపెట్టిన ధ్వని అర్థమైంది.
‘‘ఏముంది… వరస మార్చుకుందామా!’’ అన్నాను నవ్వుతూ. ‘‘సంతోషంగా’’ అన్నారాయన.ఆ తర్వాత కాలం గిర్రున తిరిగింది. మేం తొమ్మిది మందిమి కడప జిల్లా కాశినాయన మండలంలోని బాలరాజుపల్లె అనే కుగ్రామానికి వెళ్లాం. సాదరంగా ఆహ్వానించారు.

సంబంధం సంగతి పక్కనబెట్టి… ఆయన ఇంటిని, ఆ ఇంటి ముందున్న వేపచెట్టును (దీనికే కొండపొలం నవలను అంకితమిచ్చారు), ఆయన రాసుకునే చిన్న గదిని మురిపెంగా చూశాను.వేపచెట్టుకు ఆవల ఉన్న స్థలంలో కూచొని పెళ్లి ముచ్చట్లు మాట్లాడుకున్నాం.
_________
మా బావగారు కట్నకానుకల సంగతి ప్రస్తావించబోతే, సన్నపురెడ్డి గారు మండిపడ్డారు. అసలా విషయం ప్రస్తావనకే తేవద్దంటూ ఆత్మీయంగా మందలించారు.ఒకరి కుటుంబం గురించి మరొకరం మాట్లాడుకున్నాం. పెళ్లి చేసే అవకాశం ఇవ్వమని మేమే అభ్యర్థించాం. ఆ తర్వాత ఆయన తన బంధువులతో హైదరాబాదులోని మా ఇంటికి వచ్చారు.
నా స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదపరిమిలో వివాహం వైభవంగా జరిగింది. సుమారు మూడు వేల మంది హాజరయ్యారు. కడప జిల్లా వాసులు, మా ఆఫీసు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రచయితలు, మిత్రులు, బంధువులు కొత్తజంటను ఆశీర్వదించారు.
_________

‘‘బహుశా, ఆధునిక సాహిత్యచరిత్రలో ఇద్దరు రచయితలు వియ్యంకులు కావటం ఇదే ప్రథమం అనుకుంటా’’ అన్నారొక ప్రముఖ రచయిత. కొన్నిసార్లు అదృష్టాన్ని నమ్మి తీరాలి. నా మట్టుకు నాకు ఇదో పెద్ద అదృష్టమే. ఇప్పుడు మా అమ్మాయి, అల్లుడు కలిసి మాకు మరో వరం ప్రసాదించారు. ఆ వరప్రసాదం- ‘‘నయనిక’’. మనవరాలు. మా బంగారు తల్లి. భాస్వంత్ నా కొడుకు. శ్రీనాథ్ నాకిప్పుడు మరో కొడుకు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, ఇంద్రావతి గార్లకు మా హిమవర్ష మూడో కూతురు.

-ఎమ్వీ రామిరెడ్డి

98667 77870

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *