ఒక మనిషి సామాజిక జీవనం సాఫీగా సాగాలంటే అందులో కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు పటిష్టంగా ఉంటేనే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. స్వార్థం, ప్రలోభాల కారణంగా ఆ వ్యవస్థ చిన్నాభిన్నమైతే మనుషుల జీవితాలు కల్లోలితమవుతాయి. మనిషి నిరంతరం అనుభవించే సామాజిక సంఘర్షణలో కుటుంబ వ్యవస్థ పాలు ఎంతోకొంత ఉంటుంది. ఆ వ్యవస్థ నిర్మించే మమతల సౌధాలలోనే మనిషి కలకాలం మనగలుగుతాడు. మనిషిని అనుబంధాల లాహిరిలో నడిపించే కుటుంబ వ్యవస్థ పగుళ్లు తీసినప్పుడు, మనుషుల మధ్య అనుబంధాలు కల్లోల సుడిగుండాలై వారిని కుంగదీసినప్పుడు… ఆ కల్లోల జీవితాల్లోని విభిన్న పార్శ్వాల్ని కథావస్తువులుగా స్వీకరించి వర్తమాన రచయిత్రి వాసరచెట్ల జయంతి వెలువరించిన కథాసంపుటి ‘శర్వమ్మ మరణం’.
__________________
మనిషి జీవితం కుటుంబ వ్యవస్థలోనే ప్రారంభమవుతుంది కనుక తెలుగు కథ ఆది నుంచి కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యతనిస్తూ, ఆ వ్యవస్థలో చోటుచేసుకునే ఎన్నో లోపాల్ని ఎత్తిచూపుతూ, వాటిని సరిదిద్దుకోవడానికి పరిష్కార మార్గాలను సూచిస్తూనే ఉంది. ఇప్పుడు తెలంగాణ మట్టి పరిమళాన్ని ఆస్వాదిస్తూ సాహితీ కేదారంలో కథల సుమాలు పూయిస్తున్న రచయిత్రి వాసరచెట్ల జయంతి ఈ దిశగానే తన కథా ప్రయాణాన్ని ప్రారంభించారు.
_____________________
అభ్యుదయ భావాల్ని పుణికిపుచ్చుకున్న ఈమె ఇదివరకే ‘నేల విమానం’, ‘తురాయి పూలు’ అనే కవితా సంపుటాలను వెలువరించారు. ఉపాధ్యాయురాలిగా తన వృత్తిలో ఎదురైన పలు అనుభవాలు కథలుగా జాలువారి, 19 కథలతో వెలువడిన ఈ రచయిత్రి మొదటి కథాసంపుటి ఇది. ఈ శతాబ్దంలోనే అత్యంత విషాదాన్ని మిగిల్చిన కరోనా మహమ్మారి మనుషుల్లో పెల్లుబిగింపజేసిన స్వార్థం, ప్రలోభాల్ని ఎత్తిచూపడమే కాకుండా, ఆ సమయంలో కర్తవ్య పరిమళాలతో మనుషులు కురిపించిన మానవతా ధారల్నీ ఈ కథలు స్పృశించాయి. మనిషి జీవన విధానాల్లో అతడే సృష్టించుకుంటున్న పలు లోపాల్ని ఎత్తిచూపాయి.
నిత్య జీవితంలో మనుషుల భావోద్వేగాలకు కారణమయ్యే సున్నితమైన విషయాలు కూడా ఈ కథల్లో చోటుచేసుకున్నాయి. చెమటోడ్చి తమ పిల్లలకు సింహాసనాలు సమకూర్చినా, ఆ తల్లిదండ్రులకు ఎదురయ్యే పిల్లల నిరాదరణ; చదువు కోసమే కాక సమాజం కోసం కూడా తమ కొత్త ఆలోచనలతో, అభివృద్ధికి దోహదం చేసే పథకాలతో స్కూలు విద్యార్థులు తమ గ్రామంలో కలిగించే సామాజిక జీవన మాధుర్యం; భార్యాభర్తల గొడవ కారణంగా తన తండ్రి నుంచి వేరైన తల్లితో పాటు, తన ముగ్గురు చెల్లెళ్లకు ఆసరాగా ఆకాశమే హద్దుగా నిలిచే యువతి ఆత్మవిశ్వాసం; పెంచి పెద్దచేసిన కన్నకొడుకు తనను నిర్లక్ష్యం చేస్తే ఆత్మహత్యకు పాల్పడి, తన వీలునామాలో అతడికి బుద్ధి చెప్పిన మహిళ సమయస్ఫూర్తి; భర్త నిరాదరణకు గురై, చివరికి కొడుకు, కోడలు ఆదరణకు కూడా నోచుకోని మరో తల్లి ఒంటరితనం; జీవితమంతా తాను పట్టించుకోని తన చిన్నకొడుకు తనకు చివరి దశలో సేవలు చేసి అమితమైన ప్రేమను ప్రకటిస్తే, అతనికి ఏమీ చేయలేకపోయాననే నిస్సహాయతతో ఒక తండ్రి పడే పశ్చాత్తాపం; సాఫీగా సాగిపోతున్న కుటుంబ జీవనంలో ఒక్కసారిగా తండ్రి మరణించి తల్లి ఒంటరిదైతే, ఆమెకు మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించే వారి పిల్లల ఆదర్శం; మనుషుల మధ్య మమతానురాగాల్ని పటిష్టం చేసే నమ్మకం… ఇవన్నీ ఈ కథలకు వస్తువులయ్యాయి.
రచయిత్రి తన ముందుమాటలో చెప్పినట్టుగా ఈ సంపుటిలోని కథలు నిత్య జీవితంలో జరిగిన సంఘటనలకు ప్రతిబింబాలుగా కనిపించి, కథన శైలితో మన గుండెల్ని చెమరింపజేస్తాయి.
ఇందులోని ‘శర్వమ్మ మరణం’ కథ ఆధునిక ప్రలోభాలకు లోనైపోయి అయినవాళ్ల మమతానురాగాలకు తిలోదకాలిచ్చే మానవ మనస్తత్వానికి అద్దం పడుతుంది. శర్వమ్మ, సుబ్బయ్య దంపతులకు పిల్లలు లేకపోవడంతో సుబ్బయ్య తన అన్న కొడుకునే కన్నకొడుకుగా పెంచి పెద్దచేస్తాడు. అయితే సుబ్బయ్య మరణించి ఒంటరిదైన శర్వమ్మను కొడుకూ, కోడలు నిర్లక్ష్యం చేస్తే ఆ క్షోభతో ఆమె రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆస్తి కోసం తల్లికి ఘనంగా అంత్యక్రియలు జరిపించిన కొడుకుకు ఆమె తన వీలునామాతో బుద్ధి చెప్పడం ఈ కథలోని మలుపు.
తమ గ్రామంలోని కులవృత్తుల్ని అభివృద్ధి చేయాలని ఒక స్కూలు విద్యార్థినిలో కలిగిన ఆలోచన తోటి విద్యార్థులతో కలిసి ఆ గ్రామాన్ని అభివృద్ధి పథం వైపుకు నడిపించడం, ఆ పల్లెను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం ‘కొత్తతరం’ కథలో చూస్తాం.
తనను చులకన భావంతో చూసే తండ్రికి దూరమై, తన తల్లికి తోడై, చెల్లెళ్ల బాధ్యతల్ని తన భుజస్కంధాలపై వేసుకొని ఎయిర్ హోస్టెస్‌గా తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్న యువతి ఆత్మస్థైర్యం ‘నింగికి మొలిచిన రెక్కలు’ కథలో కనిపిస్తుంది.
కొడుకు ప్రేమకు దూరమై, అయినవాళ్ల ఆత్మీయత ఎండమావి అయిపోయి ఒంటరితనంతో అనారోగ్యానికి గురై మృతిచెందే మహిళ జీవన సంక్షోభం ‘ఎండమావి’ కథలో చోటుచేసుకొని హృదయాల్ని ద్రవింపజేస్తుంది.
అగ్రకుల దురహంకారంతో విర్రవీగే భూస్వామి దగ్గరి పాలేరు, తన పిల్లలకు చదువుసంధ్యలు చెప్పించి ఉన్నత వృత్తులలో రాణించేలా చేసి, ఆ కుల అహంకారానికీ, అది విధించే కట్టుబాట్లకీ అడ్డుకట్ట వేయడం ‘కట్టుబాట్లు’ కథలో చూస్తాం. ‘మోహన్ పెళ్లి బరాత్ అది. గుర్రంపై ఎక్కి కట్టుబాట్లను తెంపేశారు. మొదటి ప్రయత్నం మొదలుపెట్టారు’ అంటూ ముగిసే ఈ చిన్నకథలో చక్కని ప్రారంభం, ముగింపులతో కూడిన ఫ్రేమ్ ఈ రచయిత్రి నైపుణ్యాన్ని తెలియజేస్తుంది.
అయినవాళ్ల స్వార్థం, ప్రలోభాల మధ్య తమకు రావలసిన ఆస్తి పంపకాలు కూడా జరగకుండా బతుకు వెళ్లదీస్తూ, క్రమంగా వారి నిరాదరణకు గురై వారికి పనివాళ్లలా మారిపోయి ఒక కుటుంబం అనుభవించే క్షోభ ‘కబ్జా’ కథలో కనిపిస్తుంది.
తాము నిర్వహించే కంపెనీలో నష్టాలొచ్చి ఒకవైపు కష్టాలు కమ్ముకుంటే, మరోవైపు అనారోగ్యంతో భర్త మరణిస్తే, ఇంకోవైపు అయినవాళ్ల ప్రేమరాహిత్యం ఎదురైతే కంపెనీ నిర్వహణను తన భుజస్కంధాలపై వేసుకొని భర్త ఆశయాలను నెరవేర్చే మహిళ ధీరత్వం ‘తోడు వీడి వెళ్లాక’ కథలో కనిపిస్తుంది.
తన భర్తకు వెన్నెముక ఆపరేషన్ చేయడానికి ఆర్థిక ఆసరా కోసం సరోగసీ గర్భానికి ఒప్పుకొని, తన భర్త ఆరోగ్యాన్ని బాగుచేసుకొని తన తల్లి మనసును చాటుకునే యువతి కథ ‘మాతృస్పర్శ’. ఆడపిల్లలు పుట్టారని నేటికీ మనుషులు సృష్టించుకునే జీవన సంక్షోభం ‘ప్రశ్నాపత్రం’ కథలో కనిపిస్తుంది.
ఈ సంపుటిలోని కొన్ని కథలు కరోనా మిగిల్చిన తీవ్ర విషాదం నేపథ్యంలో వెలువడినవి. ఆ విషాదం తర్వాత మనిషి జీవన వనంలో అల్లుకొని ఉండే అనుబంధాల తీగలు చెల్లాచెదురైపోయి, ఎండిపోయి ఆ వనం ఎంత కళావిహీనమైపోతుందో ఈ కథల్లో చూస్తాం.
___________________
ఈ కథల్లోని కొన్ని పాత్రలు కరోనా విషాదం తర్వాత ఆత్మీయుల్ని పోగొట్టుకున్న జ్ఞాపకాలతో మన హృదయాల్ని ద్రవింపజేస్తాయి. అలాంటి పాత్రల్లో ‘సంభవామి యుగే యుగే’ కథలోని సర్పంచ్ పాత్ర ఒకటి. కోవిడ్ అనంతర విషాదాన్ని ఈ కథ ప్రతిబింబింపజేస్తుంది. తోటివారి కోసం మనుషులు నిర్వర్తించవలసిన కర్తవ్యాల్ని గుర్తుచేస్తుంది. కరోనా కాటుకు పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులతో, తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న పిల్లలతో చిందరవందర అయిన ఆ ఊరును మళ్లీ యథాస్థితికి తేవాలని ఆ ఊరి సర్పంచ్‌తో కలిసి పాఠశాల టీచర్లు ఉపక్రమిస్తారు. ఆ స్కూలు మళ్లీ యథావిధిగా నడవడానికి నడుం కడతారు. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు విద్యార్థుల చదువుసంధ్యలకు, కరోనాలో కుమార్తెను పోగొట్టుకున్న సర్పంచ్ పెద్దదిక్కు అవుతాడు.
______________________
కోవిడ్ సమయంలో మనుషుల్ని పట్టిపీడించిన భయాందోళనలకు అద్దం పట్టిన మరో కథ ‘దిగ్బంధనం’. కోవిడ్‌లో తీవ్ర భయాందోళనలకు లోనై అనారోగ్యానికి గురైన మహిళ తన భర్తతో కలిసి డాక్టర్ల దగ్గర పలు పరీక్షలు చేయించుకుంటుంది. ఆ సమయంలో జరిగిన వైద్య సేవల్లో దోపిడీతో పాటు మానవత్వంతో కూడిన సేవలూ ఉంటాయి. తనకు పాజిటివ్ అని తేలినా చివరికి తన పట్ల మానవత్వంతో ప్రవర్తించే డాక్టర్ సాయంతో ఆ మహిళ కోలుకుంటుంది.
మనుషుల మధ్య అనుబంధాలు ఎన్ని కారణాల వల్ల విచ్ఛిన్నమై తీరని క్షోభను మిగులుస్తాయో ఈ కథలు చెబుతాయి. ముఖ్యంగా స్త్రీ సాధికారత ఎలా ఉండాలో ఇవి వివరిస్తాయి. అనుబంధాల విచ్ఛిత్తి రేపిన సంఘర్షణలే ‘శర్వమ్మ మరణం’ సంపుటిలోని కథలు.
(శర్వమ్మ మరణం – వాసరచెట్ల జయంతి కథాసంపుటి, పేజీలు: 140, వెల: రూ.230/- ప్రతులకు మొబైల్: 99855 25355లో సంప్రదించవచ్చు.)

– డాక్టర్ కొత్వాలు అమరేంద్ర
91777 32414
