మెలోడీ, రిథమ్ ఒక జుగల్బందీలాగా సాగే లాస్లో క్రాస్జ్నాహోర్కై రచనలు

“నా గొంతు చాలా బలహీనంగా ఉంది, దాదాపు మీరేమీ వినకపోవచ్చు” అని అన్నాడట లాస్లో క్రాస్జ్నాహోర్కై..జేమ్స్ హాప్కిన్ ఇచ్చిన రెండుగంటల సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ప్రారంభంలో. బలహీనమైనది అని తాననుకున్న గొంతు తనకు నోబెల్ బహుమతి సాధించిపెట్టి అది బలహీనమైనది కాదు చాలా బలమైనది, విస్మరించలేనిది అని నిరూపించింది. 2025వ సంవత్సరపు సాహిత్య నోబెల్ తనను వరించిందని తెలియగానే క్రాస్జ్నాహోర్కై అన్న మాట ‘ఇది ప్రళయాన్ని మించింది’ అని. ఆ మాట శామ్యూల్ బెకెట్ ను తల్చుకుంటూ క్రాస్జ్నాహోర్కై అన్నా..ఈ బహుమతి అతడికి ఎప్పుడో రావలసింది అంటారు అతడి అభిమానులు.
_________________

స్వీడిష్ అకాడమీ అతని రచనలు “అపోకలిప్టిక్ భయం మధ్య కళా శక్తిని పునరుద్ధరించే దూరదృష్టితో కూడిన రచనలు” అని ప్రశంసించింది. అతడికి మాత్రమే పరిమితమైన, సాధ్యమైన ఊపిరి బిగపట్టించి మరీ చదివించే శైలి “పేజీలకొద్దీ సాగే వాక్యాలు, మానవ జీవన అస్తిత్వ బాధను చిత్రించే డిస్టోపియన్ థీమ్స్” అతన్ని సాహిత్య ప్రపంచంలో అసామాన్యుడిగా నిలిపాయి. ఊపిరి బిగపట్టించి చదివించే శైలి లేదా శ్వాస తీసుకోవడాన్ని కూడా మరచిపోయేలా చేసే అతడి శైలీ సంవిధానాన్ని Breathlessness అన్నది స్వీడిష్ అకాడమీ.
___________________

క్రాస్జ్నాహోర్కై..హంగేరీ విప్లవానికి రెండేళ్ల ముందు 1954 జనవరి 5న హంగేరిలోని గ్యులా అనే చిన్న పట్టణంలో ఒక మధ్య తరగతి జ్యుయిష్ కుటుంబంలో జన్మించాడు. తండ్రి జార్జ్ క్రాస్జ్నాహోర్కై లాయరు. తల్లి జూలియా పాలింకస్ సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్. చదువు పూర్తి అయిన తరువాత కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పనిచేసాడు. తన మొదటి నవల satantango 1985లో ప్రచురించిన వెంటనే హంగేరీ లో రాత్రికి రాత్రి క్రాస్జ్నాహోర్కై ప్రసిద్దుడై పోయాడు.

హంగేరీ విప్లవాన్ని సోవియట్ యూనియన్ దారుణంగా, హింసాత్మకంగా అణచివేసిన తరువాత హంగేరీ గ్రామీణ ప్రాంతాలలో అలుముకున్న నాగరిక జీవన విధ్వంసకర పరిస్థితులు, ప్రజలంతా ఒక మెస్సయా వస్తాడని ఎదురుచూడటం లాంటి ఒక ఉద్విగ్న స్థితీ క్రాస్జ్నాహోర్కై రచనలలో బలంగా దృశ్యమానం అవుతాయి. పిచ్చితనంలోనూ (madness) వాస్తవికతను (reality)ని రక్షించడమే తన రచనా లక్ష్యం అని చెప్పే క్రాస్జ్నాహోర్కై..యూరప్ అంతా విస్తృతంగా పర్యటించాడు. మన ఆర్.కె.నారాయణ ఒక ఊహాత్మక పట్టణం మాల్గుడి సృష్టించినట్టుగానే క్రాస్జ్నాహోర్కై కూడా తన కథలను అనామక, ఊహాత్మక ప్రదేశాలలో నడిపిస్తాడు.

ఒక విధ్వంసం తరువాత మానవ జీవితంలో కమ్ముకునే నిరాశ, నిస్పృహ, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడటం, వచ్చిన ప్రతివాడినీ ఒక మెస్సయ అనుకోవడం, చివరకు మళ్ళీ విధ్వసం, మరణం అంచుకు వెళ్లడం క్రాస్జ్నాహోర్కై రచనలో చూస్తాము. satantangoలో ఇర్మాస్కీ The Melancholy of Resistanceలో ప్రిన్స్ నడిపించే భారీ తిమింగలం అవధులు లేని అధికారం ఒక సామాజిక క్రమాన్ని ఎలా పతనం వైపుకు నెట్టేస్తాయో మెటాఫరికల్ గా వివరిస్తాయి.

క్రాస్జ్నాహోర్కై శైలిలోని మెలోడీ, రిథమ్ ఒక జుగల్బందీ లాగా సాగి పాఠకుడిని తన లయలో లీనం చేసుకుంటాయి. సుదీర్ఘమైన వాక్యాలు, ఊపిరి బిగపట్టించి చదివించే శైలి ఒక రాగంలా సాగుతూ, మనసుని ఆకర్షిస్తాయి. Satantango,The Melancholy of Resistance రెండింటిలోనూ అన్వేషణ, అస్తిత్వ శూన్యత (existential void) పాఠకుడిని కట్టిపడేస్తాయి. ఈ రెండు నవలలు మానవ స్వభావం, సమాజం, అధికార డైనమిక్స్‌ ని అన్వేషిస్తూ, ఒక తాత్విక, ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి.

క్రాస్జ్నాహోర్కై దీర్ఘ వాక్యాలకు, కవితాత్మక వచనానికి పెట్టింది పేరు. The melancholy of resistanceలో ఒక తిమింగలాన్ని ఎలా వర్ణిస్తున్నాడో చూడండి: ‘తిమింగలం, సముద్ర లోతుల గంభీర జీవి, సముద్ర సంధ్యా కాంతిలో తేలియాడుతూ, వ్యక్తం కాని దుఃఖ భారంతో దాని భారీ రూపం కప్పబడి ఉంది. ఒకప్పుడు జీవశక్తితో నిండిన దాని గీతాలు, ఇప్పుడు విషాదభరితమైన రాగాలుగా, మృదువుగా, వణుకుతూ, అనంత నీలిమలో మాయమవుతున్నాయి. తిమింగలం యొక్క కళ్ళు లోతైనవి, అగమ్యమైనవి, నిశ్శబ్ద దుఃఖంతో మిరుమిట్లు గొలుపుతూ, లోతుల్లోకి చొచ్చుకుని రాని సూర్యకాంతిని ప్రతిబింబిస్తాయి. దాని తోక నెమ్మదిగా, ఉద్దేశపూర్వక కదలికలతో నీటిని కలిచివేస్తుంది, అదృశ్య భారాన్ని తొలగించే ప్రయత్నంలా. చేపల గుంపులు దాని ఒంటరితనాన్ని పట్టించుకోకుండా చుట్టూ తిరుగుతాయి, అయితే తిమింగలం ఒంటరిగా సాగుతుంది, దాని హృదయం వెచ్చని ప్రవాహాలు, కోల్పోయిన సహచరుల జ్ఞాపకాలతో భారంగా ఉంది. ఒకప్పుడు స్వేచ్ఛా వేదికగా ఉన్న విశాల సముద్రం, ఇప్పుడు నిశ్శబ్ద బంధనంలా అనిపిస్తుంది, అక్కడ తిమింగలం విషాదం సముద్ర తలం మీద నీడలా అలుముకుంటుంది.’ ఇలాంటి వాక్యాలు చదువుతున్నప్పుడు హృదయానికీ, మేధకీ ఒకేసారి పని కల్పించాలి.

ప్రస్తుతం భారత దేశం ఉన్న రాజకీయ సందిగ్ధ సంధ్యలో క్రాస్జ్నాహోర్కై నవలలకి మరీ ముఖ్యంగా The melancholy of resistanceకి అత్యంత ప్రాసంగికత వున్నదని నాకు అనిపిస్తున్నది, కనిపిస్తుంది.

క్రాస్జ్నాహోర్కై నవలలు అధికార డైనమిక్స్, సామాజిక వ్యవస్థలు కుప్పకూలడం, ఆశ-నిరాశల మధ్య సంఘర్షణను అపోకలిప్టిక్ దృష్టితో చిత్రీకరిస్తాయి. ఆయన రచనలు ఆర్థిక, రాజకీయ, మరియు సాంస్కృతిక సంక్షోభాల నేపథ్యంలో మానవ అనుభవాలను, కళ మరియు ఆధ్యాత్మికతను విస్తృతంగా అధ్యయనం చేస్తాయి. ఇవి హంగరీలోని కమ్యూనిజం తర్వాత అస్థిరతను మెటాఫరికల్ గా చిత్రించినా, సార్వత్రికంగా ఏ సమాజంలోనైనా రాజకీయ అస్థిరతలకు అద్దం పడతాయి.

ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, మే 2025లో ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ దానికి దారితీసిన పహల్గావ్ దాడులు The melancholy of resistanceలోని అలజడి, భయం, రాజ్యం ఆడే హైడ్ అండ్ సీక్ గేమ్ ను గుర్తు చేస్తాయి. బీహార్ లో సర్ నిర్వహణ, మరాఠా-ఓ.బి.సి కోటా డిమాండ్ల వల్ల సామాజిక సామరస్యం కుప్పకూలుతున్నట్టు కనిపిస్తోంది. క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌ చుక్ అరెస్ట్, మణిపూర్ ఘటనలు అన్నీ క్రాస్జ్నాహోర్కై రచనల్లోని ‘The Prince’, ఇర్మాస్కీ లాంటి రహస్యమైన నాయకులను గుర్తుచేస్తాయి. ఎక్కడ సమాజం అరాచకం వైపు జారుకుంటుందో అనే ఒక భయం ఇవాళ కలుగుతూ ఉండటం ఇప్పటి సజీవ అనుభవం.

భారతదేశం నాన్-అలైన్‌మెంట్ నుండి మల్టీ-అలైన్‌మెంట్ వైపు మారుతున్నట్టు (అక్టోబర్ 2025లో ఇండియా-యూకే జాయింట్ స్టేట్‌మెంట్) కనిపిస్తోంది. ఇది అతని నవలల్లోని అధికార డైనమిక్స్‌ ని ప్రతిబింబిస్తుంది. మరోవైపు, ఫ్రీడమ్ హౌస్ మరియు హ్యూమన్ రైట్స్ వాచ్ రిపోర్ట్‌ లు అకడమిక్ ప్రెషర్, సెన్సిటివ్ టాపిక్స్ (పాకిస్తాన్, కాశ్మీర్)పై ఆంక్షలు గురించి పేర్కొన్నాయి, ఇది నవలల్లోని మెలంకాలిక్, ప్రతిఘాతను సూచిస్తుంది. అందుకేనేమో The melancholy of resistance బాగా ఆకట్టుకుంది. ఇది మనకాలపు మన రాజకీయ నవల అని కూడా అనిపిస్తుంది.

Destruction and sorrow beneath the heavens ను తన చైనా పర్యటన అనుభవాల ఆధారంగా క్రాస్జ్నాహోర్కై రాశారు. చైనాలో పర్యటిస్తున్నప్పుడు తనను తాను లాస్జ్లో డాంటే అని పిలుచుకున్నాడు. ఒక వ్యాఖ్యాతతో కలసి జియూహుయేషన్ పర్వతం లోని బౌద్ధ ఆరామాల మీదుగా నాన్జింగ్, షాంఘై నగరాలకు ప్రయాణం చేస్తూ “Monuments restored in the most dreadful and coarse ignorance,” “forgeries” in place of temples, and holy sites where “everything reeks from money.” అని కనుక్కుంటాడు. ఈ నవల కూడా క్రాస్జ్నాహోర్కై శైలిలో పాఠకుడిని ఆకట్టుకుంటుంది.
___________________

క్రాస్జ్నాహోర్కై తన అభిప్రాయాలను ఎక్కడా దాచుకోడు. 2025లో ది యేల్ రివ్యూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఉక్రెయిన్‌ పై రష్యా దాడిని ప్రస్తావిస్తూ : “నా కళ్ళ ముందు ఒక మురికి, కుళ్ళిన యుద్ధం జరుగుతోంది. ప్రపంచం దానికి అలవాటు పడటం ప్రారంభించింది. నేను దానికి అలవాటు పడలేకపోతున్నాను. ప్రజలు ప్రజలను చంపుతున్నారని నేను అంగీకరించలేక పోతున్నాను.” అన్నాడు. అంతేకాదు హంగేరియన్ ప్రసిడెంట్ ఆ యుద్దాన్ని తప్పు పట్టకపోవడాన్ని కూడా బలంగా ఎత్తి చూపాడు.
_________________

క్రాస్జ్నాహోర్కై రచన హింస, వాస్తవికతగా మారిందని పలుకోణాలలో పట్టి చూపుతుంది.

“నేను ఇక్కడే ప్రతిదీ వదిలివేస్తాను. లోయలు, కొండలు, దారులు, తోటల నుండి వచ్చే జేబర్డ్స్, పెట్ కాక్స్, పాడ్రేస్, స్వర్గం, భూమి, వసంతకాలం మరియు శరదృతువులను అన్నిటినీ ఇక్కడ వదిలివేస్తాను. నిష్క్రమణ మార్గాలు, వంటగదిలోని సాయంత్రాలు, చివరి ప్రేమ చూపులు, మిమ్మల్ని వణికిపోయేలా చేసే నగరానికి సంబంధించిన అన్ని దిశలను నేను ఇక్కడ వదిలివేస్తాను. భూమిపై పడే దట్టమైన సంధ్య, గురుత్వాకర్షణ, ఆశ, మంత్రముగ్ధత, ప్రశాంతతను వదిలివేస్తాను. ప్రియమైన వారిని నాకు దగ్గరగా ఉన్నవారిని, నన్ను తాకిన ప్రతిదాన్ని, నన్ను ఆశ్చర్యపరిచిన, ఆకర్షించిన ఉద్ధరించిన ప్రతిదాన్ని ఇక్కడ వదిలివేస్తాను. గొప్ప, దయగల, ఆహ్లాదకరమైన అందమైనదాన్ని వదిలివేస్తాను. మొగ్గ మొలకను, ప్రతి పుట్టుకను ఉనికిని వదిలివేస్తాను, మంత్రం, రహస్యం, దూరాలు, అక్షయత శాశ్వతత్వ మత్తును వదిలివేస్తాను; భూమిని నక్షత్రాలను వదిలివేస్తాను, ఎందుకంటే నేను ఇక్కడ నుండి నాతో ఏమీ తీసుకెళ్లను.”

నిజమే ఎవరు మాత్రం ఏమి తీసుకుని వెళతారు. జ్ఞాపకం అంటే మరచిపోయే కళ అని కళాత్మకంగా చెప్పిన క్రాస్జ్నాహోర్కైకి 2015లో మాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ కూడా లభించింది. క్లాసిక్ హంగేరియన్ సాహిత్యంలో లాస్లో ప్రాముఖ్యత గొప్పది. తన రచనలు..ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు పొందాయి.

 

 

-వంశీకృష్ణ
95734 27422