ప్రభాస్ ’కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ మూవీ రూ.900 కోట్లకు (గ్రాస్) పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పుడు మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉంది. ఇదే హవా కొనసాగితే ఒకట్రెండు రోజుల్లో రూ.1000 కోట్లు మార్కును అందుకోవడం ఇక లాంఛనమే. అప్పుడు ఈ ఘనత సాధించిన ఏడో భారతీయ చిత్రంగా ’కల్కి’ నిలుస్తుంది. మరోవైపు హిందీ ప్రేక్షకులు ’కల్కి’ మూవీకి ఫిదా అవుతున్నారు. ప్రభాస్, అమితాబ్ యాక్షన్ సీక్వెన్స్, నాగ్ అశ్విన్ టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ తదితర సన్నివేశాలు అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌లో రూ.200 కోట్లు (గ్రాస్) వసూలు చేసిన మూవీగా ’కల్కి’ నిలిచింది. ’బాహుబలి’, ’ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత హిందీలో రూ.200 కోట్లు వసూలు చేసిన మూవీ ఇదే కావడం గమనార్హం. ఇక ప్రభాస్ సినిమాల పరంగా చూస్తే ఇదే రెండో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రం. ఇక నార్త్ అమెరికాలో ఇప్పటివరకూ ఏ దక్షిణాది చిత్రమూ సాధించని అరుదైన ఫీట్‌ను కల్కి సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ 16 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడిరగ్ వర్గాలు అంచనా వేశాయి. అంతేకాదు, బుక్ మై షోలో కోటికి పైగా టికెట్ల విక్రయమైన చిత్రంగానూ రికార్డు సృష్టించింది. అలాగే, హైదరాబాద్‌లోని ఎంబిఎం సినిమాస్‌లో అతి తక్కువ సమయంలో రూ.3కోట్లు కలెక్ట్ చేసిన చిత్రంగా కల్కి నిలిచింది.