దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

ఆంధ్రప్రదేశ్

ఉచిత ఇసుక సీనరేజ్‌, జీఎస్టీ ఛార్జీల రద్దు
ఇసుక అక్రమంగా విక్రయిస్తే పిడి యాక్ట్‌
కొరత ఉన్న ఐదు జిల్లాలో ఇసుక పాయింట్ల ఏర్పాటు
విశాఖ శారదాపీఠం భూముల కేటాయింపు రద్దు
ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు
ఎపి కేబినేట్‌ భేటీలో కీలక నిర్ణయాలు
అమరావతి : దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు ఎపి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నగదు చెల్లించి సిలిండర్‌ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్‌లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఒకేసారి మూడు సిలిండర్లు తీసుకోకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్‌, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీనరేజ్‌ ఛార్జీల రద్దు వల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారమని అంచనా వేశారు. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు నష్టం భరిద్దామని సీఎం చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుక సరిగా అమలయ్యేలా చూడాలని మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇసుక లేని జిల్లాల్లో మినరల్‌ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించారు. ఇసుక విధానాన్ని అతిక్రమిస్తే … పిడి యాక్ట్‌ పెట్టాలని కూడా ఆదేశించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పార్థసారధి, అనిత, నాదెండ్ల మనోహర్‌, కొల్లు రవీంద్ర వివరించారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇసుక సీనరేజ్‌, జీఎస్టీ ఛార్జీలు రద్దుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని అన్నారు. పూర్తిగా ఉచితంగా ఇసుకను అందజేస్తున్నామని తెలిపారు. ఉచిత ఇసుకతో వ్యాపారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉచిత ఇసుకను అక్రమంగా రవాణా చేసినా, విక్రయించిన వారిపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇసుక కొరత ఉన్న ఐదు జిల్లాలో ప్రత్యామ్నయ్య పాయింట్లు ఏర్పాట్లు చేయనున్నా మని వివరించారు. ఉచిత ఇసుకను ఇతర సరిహద్దు రాష్టాల్రకు తరలించకుండా చెక్‌పోస్టులను బలోపేతం చేస్తామని, నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలన్నింటినీ ఈ పోర్టల్‌ గెజిట్‌లో పొందుపరిచేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. రూ. 20 కోట్ల ఆదాయం వచ్చే దేవాలయాల కమిటీల్లో ఇదివరకు ఉన్న 15 మంది గల సభ్యుల సంఖ్యను 17 కు పెంచేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుల్లో బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు. విశాఖ నర్సింగ్‌ కళాశాలలో ప్రస్తుతమున్న సీట్లను 25 నుంచి 100 సీట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని పార్థసారథి తెలిపారు. ఇందులో 25 టీచింగ్‌ పోస్టులకు, 58 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు చేసిందన్నారు. మంగళగిరిలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తూ మంత్రి వర్గం తెలిపిందని మంత్రి వివరించారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ తెలిపిందని వెల్లడించారు. ముఖ్యంగా సూపర్‌ సిక్స్‌లో ఇచ్చిన హావిూల మేరకు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని ఈనెల 31 దీపావళి రోజు నుంచి పండుగ వాతావరణంలో ప్రారంభి స్తున్నట్లు మంత్రి మనోహర్‌ వెల్లడించారు. మూడు సిలిండర్ల పంపిణీ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి జులైలో మొదటి గ్యాస్‌ సిలిండర్‌, ఆగస్టు నుంచి నవంబర్‌ వరకు రెండో గ్యాస్‌ సిలిండర్‌, డిసెంబర్‌ నుంచి మార్చి మధ్య వదకు మూడో గ్యాస్‌ సిలిండర్‌ను పొందవచ్చని పేర్కొన్నారు. సిలిండర్‌ డెలివరీ అయిన 48 గంటల్లో డీబీటీ పద్ధతిలో వినియోగదారుడి అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయని వివరించారు. గ్యాస్‌ సిలిండర్‌ సమస్యలను పరిష్కరించేందుకు గాను గ్రామ, వార్డు సచివాలయంలో ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పథకానికి ప్రతి యేడాది రూ. 2, 684 కోట్లు వ్యయం అవుతుందని, పేద మహిళలకు దీపావళి కానుకగా ప్రకటించింనందుకు మహిళల తరుఫున మంత్రి అనిత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించేందుకు, సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విశాఖకు చెందిన వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి జగన్‌ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన 15 ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌ తన గురువు, అత్యంత సన్నిహితుడైన స్వరూపానందేంద్ర కోరిందే తడవుగా.. భీమిలి పట్టణాన్ని ఆనుకుని కొత్తవలస గ్రామ పరిధిలో, సముద్ర తీరానికి దగ్గర్లో రూ.కోట్ల విలువ చేసే భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున అడ్డగోలుగా ఇచ్చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ భూ కేటాయింపులపై సవిూక్షలో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం దీన్ని గుర్తించింది. శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయించింది.