నేడు దేశ వ్యాప్తంగా యువత అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధానంగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో ఉపాధి రంగానికి కేటాయించాల్సిన నిధుల మంజూరులో అలసత్వం వహించింది. యువజన రంగానికి దేశ స్థూల ఉత్పత్తిలో కొద్ది పాటి నిధులను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు.మే 3వ తేదీన అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధనే లక్ష్యంగా దేశంలోని కోట్లాది మంది యువత పక్షాన నిలబడి పోరాటాలకు సన్నద్ధం అవుతున్నది.ఈ వ్యాసం ద్వారా దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం కారణంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడం జరిగింది.
సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) నిరుద్యోగానికి సంబంధించి విడుదల చేసిన గణాంకాలు భయంకర పరిస్థితిని సూచిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా నిరుద్యోగం పెరుగుతూనే ఉంది. కరోనా కాలానికన్నా ముందు నుంచీ ఇదే పరిస్థితి. ఇక కరోనా కాలంలో అది అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ మళ్లీ కొంత పుంజుకున్న తర్వాత కూడా పెద్దగా తగ్గలేదు. కనీసం జీడీపీలో ఏ మేరకు కోలుకోవడం జరిగిందో, ఆ మేరకైనా నిరుద్యోగం తగ్గింది లేదు.
2017-18లో నిరుద్యోగం రేటు 4.7గా నమోదైంది. 2018-19 నాటికి ఇది 6.3కి పెరిగింది. ఇక కరోనా కాలంలో లాక్డౌన్ విధించాక, డిసెంబర్ 2020 నాటికి అమాంతం 9.1కి చేరింది. ఆ తర్వాత ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థ కోలుకుందని, మళ్లీ వేగంగా ముందుకు దూసుకుపోతోందని తెగ ప్రచారం చేసుకోవడం జరుగుతోంది. కానీ నిరుద్యోగం మాత్రం కనీసం పాత పరిస్థితికైనా చేరుకోలేదు. డిసెంబర్ 2022 నాటికి అది 8.3శాతం ఉంది. జనవరి 2023లో కొంత తగ్గి 7.4కి చేరింది. కానీ మళ్లీ మార్చి 2023లో 7.8కి పెరిగింది.
2022-23లో మన జీడీపీ 2019-20 నాటి కన్నా 8.4శాతం ఎక్కువ అని, 2018-19 కన్నా 12.95శాతం ఎక్కువ అని అంచనాలు చెపుతున్నాయి. జీడీపీ చూస్తే 12.95శాతం ఎక్కువ ఉన్నా నిరుద్యోగం మాత్రం తగ్గకపోగా 2018-19 కన్నా 1.5శాతం ఎక్కువగా ఉంది. అంటే జీడీపీ పెరుగుదల వల్ల కలుగుతున్న కొత్త ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఇదేదో ఈ నాలుగేండ్ల స్వల్ప కాల వ్యవధిలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినందువల్ల వచ్చిన పరిణామం కాదు. ఆ విధంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏదీ చెప్పుకోదగ్గది రాలేదు.
మరి నిరుద్యోగంలో ఈ కాలంలో కనిపిస్తున్న అదనపు పెరుగుదలకు కారణం ఏమిటి? మొదటిది: ఏయే రంగాల్లో ఆర్థిక వ్యవస్థ కోలుకుందో ఆ రంగాలు ఉపాధిని కల్పించే రంగాలు కావు. ఉదాహరణకు చిన్న, మధ్య తరహా వస్తూత్పత్తి రంగాలు (మాన్యుఫాక్చరింగ్ రంగం) కరోనా అనంతరం పెద్దగా కోలుకోలేదు. మరోవైపు మార్కెట్లో డిమాండ్ పడిపోయిన కారణంగా గణనీయంగా లే ఆఫ్‌లు పెరిగాయి. ఆయా యజమానులు గాని, ప్రభుత్వాలు గాని తీసుకున్న ‘పొదుపు చర్యలు’ కూడా ఈ లే ఆఫ్‌లు పెరగడానికి కొంతవరకూ కారణం.
సిఎంఐఇ ఇచ్చిన వివరాలు దీనికి రుజువుగా ఉన్నాయి. జనవరి 2024లో 40కోట్ల 99లక్షల మంది మొత్తం ఉద్యోగులు, కార్మికులు పనుల్లో ఉంటే ఏప్రిల్ 2024 నాటికి 40కోట్ల 70లక్షల మంది మాత్రమే ఉన్నారు. (రెండు నెలల్లో 29లక్షల మేరకు ఉద్యోగాలు తగ్గిపోయాయి) 2018-19లో దేశంలో ఉద్యోగులు, కార్మికుల సంఖ్య 40కోట్ల 89లక్షలు. అంటే నాలుగేండ్ల తర్వాత దేశంలో ఉద్యోగాల సంఖ్య నికరంగా తగ్గిపోయింది. కొత్తగా ఉద్యోగాలు కల్పించడం మాట అటుంచి నాలుగేండ్ల క్రితం ఉన్న ఉద్యోగాలు కూడా ఇప్పుడు లేవు. ఇది భయంకర వాస్తవం.
కానీ ప్రభుత్వ అధికార ప్రతినిధులు మాత్రం దేశంలో ఉపాధి కల్పన పెరిగిపోతోందని చెప్పుకుంటున్నారు. సిఎంఐఇ విడుదల చేసే గణాంకాలను నమ్మవద్దని, అధికారికంగా ప్రభుత్వం నిర్వహించే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని వాళ్లు చెపుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ కింద పనులు కావాలని కోరేవారి సంఖ్య తగ్గిపోతోందని, అటువంటప్పుడు నిరుద్యోగం పెరిగిందని నిర్థారించడం ఏ విధంగా సబబు అని వాళ్లు అడుగుతున్నారు కూడా.
ప్రభుత్వం చేసే వాదనలో పస లేదు. ప్రభుత్వం చేపట్టే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఇండ్ల వద్ద జరిగే పనులను (హౌం బేస్డ్ వర్క్)ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అటువంటి పనులకు కూలీ చెల్లించడం అనేది ఉండదు. అటువంటి పనులను సిఎంఐఇ లెక్కలోకి తీసుకోదు. కుటుంబానికి వెలుపల లే-ఆఫ్‌ల ఫలితంగా పనులు తగ్గిపోయినప్పుడు ఆ కారణంగా పనులు కోల్పోయినవాళ్లు ఇండ్ల వద్ద జరిగే పనుల్లో పాలు పంచుకుంటారు. అప్పుడు వాళ్లని నిరుద్యోగులుగా ప్రభుత్వ సర్వే పరిగణించదు. అందువల్ల ప్రభుత్వ సర్వేలో నిరుద్యోగం పెరిగినట్టు కనపడదు. ఒకవైపు లే-ఆఫ్‌లు పెరిగినా, ఇంకోవైపు నిరుద్యోగం పెరిగినట్టు ప్రభుత్వ సర్వే చెప్పదు.
సిఎంఐఇ సర్వేతో ఇటువంటి సమస్య లేదు. ఆ సర్వే హౌం బేస్డ్ వర్క్‌ను పరిగణనలోకి తీసుకోదు. ఇండ్ల వద్దే పనులు చేసుకుంటూ బతుకుతెరువు కలిగివున్న కొంతమంది సిఎంఐఇ సర్వేలో కవర్ కారు. కానీ వేతనం పొందుతూ పని చేసేవారి పరిస్థితిని యథాతథంగా సిఎంఐఇ సర్వే చూపిస్తుంది. అందువల్ల నిరుద్యోగ పరిస్థితి వాస్తవ స్వరూపాన్ని సిఎంఐఇ సర్వే వెల్లడిస్తుంది.
లాక్డౌన్ కాలంలో పట్టణాలను విడిచి తమ స్వగ్రామాలకు పోయినవారిలో కొందరు తిరిగి పట్టణాలకు తరలి వచ్చిన మాట వాస్తవం. అందువల్ల లాక్డౌన్ కాలంలో ఉపాధి హామీ పనులు కోరుకున్నంతమంది ఇప్పుడు కోరుకోవడం లేదు. కానీ దేశం మొత్తం మీద నిరుద్యోగం పెరిగిన మాట వాస్తవం. కరోనాకు పూర్వం ఉన్న పరిస్థితితో పోల్చుకున్నా నిరుద్యోగం పెరిగింది. లాక్డౌన్ కాలంలో ఎంత పెరిగిందో ఆ మేరకైనా ఇప్పుడు తగ్గలేదు.
పైగా ఉపాధి హామీ కింద పనులు కల్పించమని కోరుతున్నవారి సంఖ్య తగ్గడానికి ఇంకో కారణం కూడా ఉంది. వారికి చెల్లించవలసిన వేతనాల బకాయిలు పేరుకు పోతున్నాయి. ఏరోజుకు ఆ రోజు కూలీ డబ్బులమీద ఆధారపడి బతికే కుటుంబాలు ఇలా కూలీ డబ్బులు బకాయి పడితే అటువంటి పనులకు పోవడానికి ఎందుకు సిద్ధపడతారు? అందుచేత ఉపాధి హామీకింద పనులు కోరేవారు తగ్గిపోయారు కనుక నిరుద్యోగం తగ్గిపోయి నట్టేనన్నది సరైన వాదన అనిపించుకోదు. ఉపాధిహామీ పనులకు చెల్లించవలసిన వేతనాలను బకాయి పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం. దాని కారణంగా ఆ పనుల పట్ల గ్రామాల్లో ఉత్సాహం తగ్గిపోతే దానిని చూపించి నిరుద్యోగం తగ్గిపోయిందని గొప్పగా చెప్పుకుంటున్నదీ ఆ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వానికి ఎంత వెటకారంగా ఉందో చూడండి.
వేతనాలను చెల్లించే పనులు తగ్గిపోతే ఆ పనులు పోగొట్టుకున్నవారు ఇళ్ల వద్ద జరిగే పనుల్లో తక్కిన కుటుంబ సభ్యులతోబాటు భాగస్వాములవుతారు. అప్పుడు ఆ కుటుంబంలో ఇంటిదగ్గర చేసే పనికి ప్రతిఫలంగా లభించే ఆదాయాన్ని పంచుకునేవారు పెరుగుతారు. దాని వల్ల వారి సగటు ఆదాయం తగ్గిపోతుంది. ప్రభుత్వం నిర్వహించే పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే ప్రకారమే ఇండ్ల వద్ద పని చేసుకునే స్వయం ఉపాధి పనుల కార్మికుల ఆదాయాలు తగ్గిపోయాయి. పట్టణాల్లోను, గ్రామాల్లో సైతం స్వయం ఉపాదిపనులు చేసుకునే వారి సగటు ఆదాయం 2019 ఏప్రిల్-జూన్ కాలంతో పోల్చితే 2023 ఏప్రిల్-జూన్ నాటికి తగ్గిపోయినట్టు ప్రభుత్వ లెక్కలే వెల్లడి చేస్తున్నాయి. ఈ వాస్తవం కూడా సిఎంఐఇ గణాంకాలు విశ్వసనీయమైనవేనని ధృవపరుస్తున్నాయి.
భారతదేశంలోని నిరుద్యోగ పరిస్థితికి సంబంధించిన గణాంకాలు ఒక మౌలిక విషయాన్ని వెల్లడిస్తున్నాయి. నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ ఏనాటికీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి తోడ్పడదు. ఈ నయా ఉదారవాద విధానాలను ప్రవేశపెడుతున్నప్పుడు పాలకులు, వారిని సమర్థించే మేధావులు మనకు చెప్పింది ఏమిటి? ఈ విధానాల ఫలితంగా సంపన్న దేశాలనుండి పెట్టుబడి పెద్ద ఎత్తున మూడో ప్రపంచదేశాలకు తరలి వస్తుందని, దాని వల్ల ఇక్కడ చాలా పెద్ద మోతాదులో ఉద్యోగాలు కల్పించ బడతాయని వారు అప్పుడు నమ్మబలికారు. ఆ విధంగా జరగాలంటే ఆ పెట్టుబడుల ప్రవాహాలకు ప్రభుత్వం ఏ విధమైన ఆటంకాలనూ కల్పించకుండా, వాటికి తోడ్పడాలని, విదేశీ పెట్టుబడిదారులు కోరిన సహకారాన్నంతటినీ అందించాలని వాదించారు. ఆ విధంగా చేస్తే దేశంలో నిరుద్యోగమే లేకుండా పోతుందని, దేశం అభివృద్ధి చెందుతుందని ప్రచారం చేశారు.
పెట్టుబడిదారీ వ్యవస్థలో పూర్తిస్థాయిలో అందరికీ ఉపాధి కల్పించడం అనేది ఏ నాటికీ జరగదు. పెట్టుబడిదారులకు ఎంతో కొంత నిరుద్యోగం ఉండడం అవసరం. అప్పుడే వాళ్లు కార్మికుల వేతనాలను తక్కువ స్థాయికి కుదించగలుగుతారు. నయా ఉదారవాద విధానాల వల్ల పూర్తిస్థాయిలో నిరుద్యోగం నిర్మూలించడం జరుగుతుందని ఎవ్వరూ ఆశించలేరు. కానీ ఉన్న నిరుద్యోగం ఎంతో కొంతమేరకు తగ్గి అదనపు ఉద్యోగాలు కల్పించబడతాయని కొందరు అభ్యుదయవాదులు సైతం ఆశపడ్డారు. కానీ నయా ఉదారవాదం వారిని మోసం చేసింది. వలస పాలన నుండి విముక్తి పొంది, ఎంతో కొంతమేరకు స్వతంత్ర ఆర్థిక విధానాలను అమలుచేస్తూ, విదేశీ పెట్టుబడి పట్టును తగ్గించుకోగలిగిన మూడో ప్రపంచదేశాలు మళ్లీ ఆ విదేశీ పెట్టుబడి పెత్తనానికి లోబడిపోయేవిధంగా చేసింది నయా ఉదారవాద విధానం.
విదేశీ పెట్టుబడులు చిన్న చిన్న దేశాల్లోకి వస్తే అక్కడ ఉండే నిరుద్యోగం సంఖ్య రీత్యా తక్కువగా ఉంటుంది గనుక తగ్గుముఖం పట్టడం జరగవచ్చు. కానీ భారతదేశం వంటి ఎక్కువ జనాభా కలిగివున్న దేశంలో నిరుద్యోగం భారీ సంఖ్యలో ఉంటుంది. ఇటువంటి చోట చిన్న చిన్న దేశాలలో (సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా వగైరా) జరిగిన విధంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించబడడం అనేది సాధ్యం కాదు. దానికి తోడు ప్రస్తుతం నయా ఉదారవాద విధానాలే పెద్ద సంక్షోభంలో కూరుకుపోయివున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఈ సంక్షోభాలు అనివార్యంగా వస్తాయి. ఈ సంక్షోభం నుండి బయటపడే మార్గం ఏదీ లేదు. అటువంటప్పుడు ఆ విధానాలను అమలు చేస్తున్న మన దేశంలో శ్రామిక ప్రజలు అనుభవించే కష్టాలకు సైతం అంతం అనేది లేదు.
నయా ఉదారవాద విధానంలో నిరుద్యోగాన్ని పరిష్కరించే మార్గాలు అంటూ ఏవీ లేవు. పెట్టుబడిదారులు నిరుద్యోగాన్ని పరిష్కరించే బాధ్యత తమది అని ఎప్పటికీ అనుకోరు. ప్రభుత్వం పూనుకుని ఆ బాధ్యతను తీసుకోవాలి. అలా జరగాలంటే ముందు ఈ నయా ఉదారవాద విధానాలనుండి విడగొట్టుకోవాలి. అప్పుడే శ్రామిక ప్రజలకు ఏ ప్రభుత్వమైనా తోడుగా నిలవగలుగుతుంది.