ప్రలోభాలా – ప్రజా సమస్యలా!

ఎడిటోరియల్ హోమ్

*రాజకీయ పార్టీలు దేశ పౌరుల ఆకాంక్షలు-ఆశయాలకు ప్రాతినిధ్యం వహిస్తు నైతిక విలువలకు కట్టుబడాలి..
*ఈ ఎన్నికల్లో ఎజెండా భావోద్వేగ ప్రలోభాలు కారాదు? ప్రజా సమస్యలే కావాలి..
*తాజా ఎన్నికల రెండు దశల్లోనూ ఓటింగ్ శాతం నిరాశ జనకంగానే..
*ఈ పరిణామాల దృష్ట్యా సవరించైనా ఓటింగ్ తప్పనిసరి చేయాలి..

భారతదేశంలో రాజకీయ పార్టీలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేం. అవి ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఇవే ఈ వ్యవస్థకు మూల స్తంభాలు. భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం,1951లోని సెక్షన్ 29 (ఏ) ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తింపు, గుర్తులను కేటాయిస్తుంది. రాజకీయ పార్టీలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి 1)జాతీయ పార్టీలు. 2)ప్రాంతీయ(రాష్ట్ర)పార్టీలు. మన దేశ, రాష్ట్ర పౌరుల ఆకాంక్షలు, ఆశయాలకు ప్రాతినిథ్యం వహించే బాధ్యతాయుత ప్రజాస్వామ్య సాధనాలు రాజకీయ పార్టీలు. ఆదేశ సూత్రాలే పాలకవర్గ పార్టీలకు నైతిక విలువలు. ఎన్నికల సంఘం ఓటింగ్ శాతం ఆధారంగా పార్టీలకు గుర్తింపును కొనసాగిస్తుంది. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పాలన వ్యవహారాలు సాగించాలి. కానీ గత కొన్నాళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అప్రజాస్వామ్యంగా, అనైతికంగా వ్యవహరిస్తున్న పాలకులను దారిలోకి తేవడానికి న్యాయస్థానాల మందలించాల్సిన దుస్థితి రావడంతో వీటిని ఏర్పర్చిన ఉద్దేశానికి విఘాతం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మన దేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల అనంతరం ప్రజాస్వామ్య పాలనలో బహుళ పార్టీల విధానాన్ని ఎంచుకున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న వారే నేతలు, పాలకులు. ప్రజలే తమ ఓటు ద్వారా అంతిమ నిర్ణేతలుగా వీరికి పాలనా పగ్గాలను అందిస్తారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో (1951-52)న మనదేశంలో ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు. గడిచిన ఏడున్నర దశాబ్దాలలో ఏకంగా ఐదున్నర రెట్లు పెరిగిపోయి నేడు 97 కోట్ల మంది ఓటర్లుగా నమోదైన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఓటర్లు పెరుగుతున్నా పోలింగ్ శాతం మాత్రం నిరాశాజనకంగానే ఉంటుంది. 2019లో లోకసభ ఎన్నికల్లో దాదాపు 30 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. వారిలో వలస కూలీలు, పట్టణ నగర వాసులు, యువత అధికంగా ఉన్నారు.నచ్చిన హీరో సినిమా ,క్రికెట్ ఆటపై ఉన్న మక్కువ ఓటు హక్కు వినియోగించుకోవాలనే సోయి యువత, బుద్ధి జీవుల్లో (కొంతమందిలో) లేకపోగ నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తున్నాం. దీని మూలంగా గత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 67.40 శాతం మాత్రమే పోలింగ్ అయ్యింది. 50 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జాతీయ సగటు కన్నా తక్కువగా ఓట్లు పోలయ్యాయి. అలా మన రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి అలాగే మహారాష్ట్రలోని పూణే, కళ్యాణ్ వంటి చోట్ల కనీసం 50 శాతం ఓటర్లైనా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కాలేదు. ఇలా గత ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదైన 266 లోకసభ స్థానాలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈ సీ) ఇప్పుడు ప్రత్యేక కార్యాచరణతో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రచారంపై దృష్టి సారించింది. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసినా ఓటింగ్ శాతం తగ్గుతుందంటే లోపం ఎక్కడుంది? బహుళ పార్టీ ప్రజాస్వామ్య విధానంలో అర్థ, అంగ, అధికార బలాలతో రాజకీయ పక్షాలన్నీ కూడబలుక్కొన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలు ఎన్నికల ఎజెండాగా మారడం లేదు. భావోద్వేగాలు, ప్రలోభాల మాటున ప్రజా సమస్యలు కనుమరుగవుతున్నాయి. ఎన్నికల ప్రజాస్వామ్యంలో జయాపజయాలు జనాధీనం అనేది పాత మాట. నేడు ధనాధీనం అనేది సరికొత్త పాటగా మారింది. జనం చైతన్యంతో ప్రలోభాలు, ఉచితాలు, తాయిలాల వలలో పడకుండా ప్రజల ప్రాధాన్యాల ప్రాతిపదికన ఏ పార్టీకి ఓట్లు వేయాలనే విజ్ఞతతో ఓటింగ్ శాతాన్ని పెంచేలా యంత్రాల్లో నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తే గెలుపు ప్రజలది అవుతుంది. లేదా భావోద్వేగాలదో, ప్రలోభాలదో పై చేయైతే ప్రజాస్వామ్యం ఓడిపోతుంది.

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే? బాధ్యతాయుత అధికారపక్షం.. అలాగే ప్రభుత్వాల పెడదోరణులను కట్టడి చేసి ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించగల ప్రతిపక్షం.. ఈ రెండూ ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. ఈ సున్నితమైన సమతూకం దెబ్బతింటే! ప్రజాస్వామ్య విలువలు, ప్రమాణాలు గతి తప్పి అప్రజాస్వామికంగా, అనైతికంగా రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చే రాజకీయ దూషణలతో ఏకస్వామ్యంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. దీనితో ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో క్రమేపి విశ్వసనీయత సన్నగిల్లిపోతుంది. దీనితో ఓటింగ్ కు ప్రజలు దూరం అవుతారు.

ఇప్పుడు జరుగుతున్న లోకసభ తొలి దశ పోలింగ్లో నాగాలాండ్ లోని ఆరు జిల్లాల్లో జీరో శాతం పోలింగ్ నమోదయింది. రెండవ దశలోనూ 64శాతం నమోదైనట్లు తెలుస్తుంది. ఈ రెండు విడుతల ఎన్నికల్లోను ఓటింగ్ శాతం నిరాశాజనకంగానే ఉంది. ఈ పరిణామాల దృష్ట్యా చట్టాలు సవరించైన ఓటింగ్ ప్రతి ఒక్కరూ పాల్గొనేలా తప్పనిసరి చేయాల్సి ఉంది.లేదంటే? ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది భిన్నత్వంలో ఏకత్వం సాధన కోసం ఏర్పడిన మన ప్రజాస్వామ్య దేశానికి క్షేమం కాదు. నేడు ఎన్నికల్లో పరస్పర దూషణలు, తిరస్కారాలు భావోద్వేగాల ప్రలోభాలే ఎన్నికల ప్రచార సరళిగా కాకుండా.. దేశంలో పేదరికం, అవినీతి, అసమానతలు, నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు, వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళ, యువత ఇలా దేశంలో భిన్న వర్గాల ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా మారాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే, సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడే పార్టీల నాయకులకు అండగా నిల్వండి. ఒకవైపు దేశంలో ఆక్స్ ఫామ్ నివేదిక మేరకు దేశ సంపదలో 40శాతం అపార కుబేరులైన ఒక్క శాతం జనాభా వద్దే పోగుబడింది. ఇలా కొందరి జేబులోని సంపద దేశ ప్రజలకు బలిమి ఎలా అవుతుంది?.

దేశంలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై యువతకు సరైన అవగాహన కొరవడుతుంది. పాఠశాల, కళాశాల స్థాయి నుండి ఓటు హక్కు పై అవగాహన పరుస్తూ నవతరాన్ని పోలింగ్ కేంద్రాల వరకు రప్పించాలి. అర్హులైన ఓటర్లను తొలగిస్తున్న రాజకీయ పార్టీల విధానాలను కట్టడి చేయాలి. ఇలా ఎన్నికల్లో అక్రమాలను కట్టడి చేస్తూ రాజకీయ పార్టీలు నైతిక విలువలకు కట్టుబడేలా ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించాలి.

ఈ ఎన్నికల్లో ప్రలోభాలో, భావోద్వేగాలో కాకుండా ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా మారితేనే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకుండా ప్రజలే అంతిమ విజేతలౌతారు. మన్నికైన పార్టీని నాయకున్ని ఎన్నుకున్న నాడే ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటాడు. వారే దేశాన్ని, రాష్ట్రాన్ని బాగు పరుస్తారు. ప్రజల బాధలు తీరుస్తారు. కాదు కూడదంటే? తగ్గేదే లేదని.. మాట తప్పితే ఇంటికి పంపేలా డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు వజ్రాయుధం ఎట్లాగూ ఉండనే ఉంది. నేతలారా మారండి!. ప్రజలారా ఓటింగ్ శాతాన్ని పెంచండి. ఇది ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.

– మేకిరి దామోదర్,
సామాజిక విశ్లేషకులు, వరంగల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *