సుకవితా పరిమళాల పలకరింత ‘అనల్పం ‘

సాహిత్యం హోమ్

మనిషి తనతో తాను అంతర్యుద్ధం చేస్తూనే సమాజంలో పాతుకపోయిన వ్యవస్థలతో కూడా నిర్విరామంగా యుద్ధం చేస్తుంటాడు. సమాజంలో జరుగుతున్న అమానవీయమైన సంఘటనలు అతన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఇతరుల అభిప్రాయాలతో కవికి ఒక పట్టాన సమన్వయం కుదరకపోయినా, ఒక నిరంతరాన్వేషిలా, ఋషిలా, జ్ఞానపిపాసిలా దర్శనమవుతుంటాడు. కవి చేసే ప్రతిపాదనలతో మనం అంగీకరించినా అంగీకరించకపోయినా తాననుకున్న దారిని మాత్రమెప్పుడూ వదలడు.
_______
అత్యాధునిక తెలుగు సాహిత్యంలో రాగద్వేషాలకు అతీతంగా, అచ్చమైన మానవీయ కోణంలో కవిత్వం రాస్తున్న అతికొద్దిమంది తెలుగు కవుల్లో శేషభట్టర్ రఘు ఒకరు. ఇటీవల ఆయన వెలువరించిన తన ఎనిమిదో కవితా సంపుటి ‘అనల్పం’. ఈ సంపుటిలో చోటు చేసుకున్న 54 కవితల్లోని వస్తువైవిధ్యం, అభివ్యక్తులు, భావచిత్రాలు మనల్ని కట్టిపడేస్తాయి.
_______

జీవించడం అంటే నిన్ను నువ్వు నిరూపించుకోవడం. నీదైన ఒక ప్రత్యేకతను చాటుకోవడం. వచ్చామా.. పోయామా.. అన్నట్టుగా కాకుండా ఏదో ఒక రంగంలో నీవొక విశేషమైన కృషిని చేస్తూ అభిమానాన్ని సంపాదించుకోవడం. అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మునుముందుకు సాగడం. కష్టాల కొలిమి నుండి రాటుదేలుతూ నువ్వొక తారకలా వెలుగుతూ ఉండాలని,నీలోని నీతివంతమైన సున్నితత్వాన్ని కోల్పోకుండా గుణాన్ని పెంచుకోవాలని, ఈ లోకాన్ని మెరుగు పరచడానికి నిన్ను నువ్వు మెరుపులా దానం చేసుకోవాలని కవి ‘మగత’ కవితలో కాంక్షిస్తున్నాడు. ఈ కవితాత్మకమైన పాదాలు జీవితం పట్ల సరికొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.

‘జీవించటం అంటే
రాత్రిందివాలు సంచారుల్లా తిరిగి
మన ప్రాపంచిక లోకంలో అనుభవాలు
గాలిలాగో నీటిలో లేదంటే
ఎండలాగో కనీసం చలి జ్వాల లాగో పాకటం
వాటి రాకపోకల తుంపరలో
నువ్వు ఒక తారకలా చేరడం
నీ లోలోపటి పొరల్లో
చిరపుంజి జల్లులేవో రాల్చుకుని
నిన్ను నువ్వు లోకానికి మెరుపులా
దానం చేసుకోవడం’

దేని గురించైనా రాయాలనుకున్నప్పుడు, చెప్పాలనుకున్నప్పుడు స్పష్టమైన అవగాహన అవసరం. అది లేకపోతే పాఠకుడు అయోమయానికి గురవుతాడు. ఒక సానుకూలమైన దృక్పథంతో, జీవనోత్సాహాన్ని నింపుకున్న కవి రఘు. తన సృజనాత్మక వ్యక్తీకరణకు ఈ కవితా సంపుటొక మచ్చుతునక. ఇందులో చోటు చేసుకున్న ప్రతి కవిత మన హృదయాన్ని ద్రవింపజేస్తుంది. ఈ కవిత్వం చదివాక ఒక అవ్యక్తానుభూతికి లోనవుతుంటాము. శిల్పాన్ని చెక్కినంత దీక్షతో కవిత్వాన్ని చిత్రీకరించారు. వాక్యాన్ని కవిత్వీకరించడమే కాదు చదువరిని ఒక మార్మిక లోకంలోకి తీసుకెళ్తుంటాడు. దారి తప్పవద్దని హెచ్చరిస్తుంటాడు. సున్నితమైన మందలింపులు కూడా ఉంటాయి. ‘ఇలానే ఉండాలి’ కవితలో క్షణం క్షణం కొత్త జీవిలా బతుకుతుండాలని ఉద్బోధిస్తున్నారు. ఈ లోకంలో జ్ఞానధారను పెంచుకుంటూ, ఉదార స్వప్నాలతో కొత్త ఉదయాన్ని సృష్టించుకోవాలని కోరుకుంటున్నారు కవి.

‘రాయటం ఒక అలవాటుగా ఉన్నప్పుడు
పలుచటి నీటి అలల కింద
ఈదుతున్న చేపల్ని చూసినట్టు
లోకాన్ని చూడాలి
మిగతా జీవితాన్ని
కొన్ని ఉద్గారాల దారాలతో
కొన్ని ఉదార స్వప్నాలతో నింపాలి’

_______
కవిత్వమే కాదు సాహిత్యంలోని ఏ ప్రక్రియలోనైన రచనలు చేయడం సులువైనదైతే కాదు. సృజనోత్సాహం ఒక తీరని దాహం. కళ్ళ ముందు దృశ్యమానవుతున్న అనుభవాల అనుభూతులను చిత్రీకరించడానికి ప్రతి కవికి రచయితకు తనదైన వ్యూహరచన ఉంటుంది.శరీరంలోని నరాలను పిండి పిప్పి చేసుకుంటే తప్ప అర్థవంతమైన అక్షరాలు ఉబికి రావు. మనసులోని ఆలోచనలే కాదు రక్తం కూడా సలసలా మరుగుతుండాలి. ట్రిగ్గర్ నొక్కగానే బుల్లెట్లు అతివేగంగా పయనించినట్లుగా కలం పట్టుకోగానే కాగితం పైన అక్షరాలు జలపాతంలా దూకుతుండాలి. తనను తాను దహనం చేసుకుంటే తప్ప ఒక మెరుపు లాంటి కవిత బయటకి రాదు. ఇది ప్రతి కవికి వర్తిస్తుంది.
_______

కవిత్వానికి ఊపిరిపోస్తున్న తీరును వ్యక్తం చేసిన కవిత ‘కొత్త మెదడు ‘. కాలానికి నిలబడే కవిత్వం యెుక్క నాడీ చప్పుడు ఒకసారి వినండి…ఈ కవితా పాదాలను హృదయంతో స్పృశించండి.

‘అసలు చురచురలాడే ఎండలో
కవనాలు పుడతాయా అని
అడుగుతారు మీరు
కవిత రాసే ముందు
ఒక కొత్త మెదడు పుడుతుందని
ఒక వినమ్ర పద్యమేదో రాసి వెళ్తుందని అంటాను నేను
అయినా నమ్మకాలతో పనేముంది?
ఈ చివరి పంక్తి ముగిసేలోగా
దాని నాడి చప్పుడు మీకు వినబడుతుంది’.

ప్రకృతిలోని కాలాలు మారినప్పుడల్లా మానవ జీవితం అతలాకుతలమవుతుంది. రోజూ పనులతో గడిపే సామాన్యుల జీవనం సమస్యల మయమవుతుంది. కూలి పనులు చేసుకునే వాళ్ళు,కూరగాయలు అమ్ము కునేవాళ్లు, రోడ్ సైడ్ చిన్న చిన్న దుకాణాలతో కుటుంబాలను పోషించుకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు లోనవుతుంటారు. వర్షాకాలమైతే మరీ కష్టంగా ఉంటుంది. ఇతర కాలాలతో పోల్చినప్పుడు వర్షాకాలం సామాన్యుల బతుకుల మీద గణనీయమైన ప్రభావం చూపుతుంది. ముసురు పట్టిన రోజుల్లోని దయనీయమైన స్థితికి అడ్డం పడుతున్న కవిత ‘చిందర వందర’. కవికి మాత్రం కొత్త మేఘాన్ని చూస్తే పుస్తకాన్ని చూసినట్టుగా ఉంటుందని, ప్రపంచమంతా శుభ్రపడుతుందని అనుకుంటుంటారు. కవి చూపు వేరు. రోజు వారీ కూరగాయలమ్మేవారి చూపు వేరు. అన్ని కాలాలు అవసరమే. వాటిని తట్టుకొని మనుగడ సాగించటమే

‘ఏం వానో ఇది/భూతంలా పట్టిందని కూరలు అమ్మేవాడు వినబడనట్టు తిడతాడు /ఆవలిస్తూ లేచిన నాలాంటి కవి ఒకడు /మేఘాన్ని కొత్త పుస్తకం చూసినట్టు చూస్తాడు /జల్లెడేదో తిరిగేసి దులిపినట్టు/ శుభ్రపడిన ప్రపంచం/ తేరుకొని కదులుతుంది’

మృగ్యమైపోతున్న మానవ సంబంధాల పట్ల కవి కలత చెందుతున్నారు. ప్రపంచమంతా ప్రేమమయం కావాలని, శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని అభిలషిస్తున్నారు. మనిషిపైన మనిషి దయతో ఉండాలని, స్త్రీ పురుషులుగా విడిపోయిన ఈ ప్రపంచంలో స్త్రీలందరూ ప్రేమమూర్తులని కొనియాడుతున్నారు. ‘ప్రేమ లేని ప్రపంచం తుప్పు పట్టిన తాళం కప్ప’ అనే కవితా వాక్యం ఆయన అంతరంగానికి అద్దం పడుతున్నది. ఆ తుప్పు పట్టిన తాళంలో నేనొక ‘నూనె చుక్క’ గా మారాలని, దానిని సరిచేసి ప్రపంచానికి అంత ప్రేమను పంచాలని తపిస్తున్నారు. విశ్వ శ్రేయస్సు కోసం కృషి చేస్తానని మనకు వాగ్దానం చేస్తున్నారు ఈ కవి.

‘ప్రేమించే మనిషి ముందున్నప్పుడు/ స్త్రీలు వాళ్ళ ముగ్ద లోకాల్లో దొరికే మూలికలేవో/ ఊపిరిలో చిదిపి ఊదుతారేమో
గారడివాడి చేతుల్లో రూళ్ళకర్రలు పావురాళ్ళై ఎగిరినట్టు/నసపెట్టే సంగతులప్పుడు మెత్తబడి మాయమౌతాయి/ప్రేమ లేని ప్రపంచం తుప్పుపట్టిన తాళం కప్పని/ దాన్ని తెరిచేందుకు తనలాంటి నూనె చుక్క దొరకాలని అర్థమౌతుంది’.

ఈ కవితా సంపుటి నిండా కుటుంబ బంధాలను కవి గాఢంగా ప్రేమిస్తున్నాడని మనకు అర్థమైపోతుంది. ‘ మేనత్త నవ్వు’ లో ‘బడికి వెళ్లే వరకు అమ్మ కన్నా అత్త వెంటే ఉన్నానేమో/రక్త బంధాలేవో ఇవాళ / మలితవ్వకాల్లో మట్టి గోడల్లా తుళ్ళిపడ్డాయ్ ‘ అంటారు.

వారసత్వంగా వచ్చిన ఇంటిపైనున్న ఆత్మీయ అనుబంధాన్ని ‘పరంపర’ లో ‘ పాత ఇంటికి వారాంతపు సంతకెళ్ళినట్టు వెళ్తారెందుకని/అమ్మ విసుక్కున్నా/నాన్న మాత్రం/నెలనెలా బూజు దులిపి, వానకాలం వాతలకు పెంకు కదిపి/దీపావళి వేళలకు రంగులదిమి ఈ వదిలిన ఇంటికి/అపర పరిచారికుడై బతికాడు’ అని అంటారు. మేము మాత్రం ‘గజాలను పెళ్ళాల నగల్లో చూసి మురిసిపోయాం’ అని విచారం వ్యక్తం చేస్తారు.

పిల్లల పట్ల తండ్రి ప్రేమ ఎప్పటికీ చెరిగిపోనిది. పిల్లలతో ఉన్న జ్ఞాపకాలను తలుచుకుంటూ కాలాన్ని గడుపుతున్న ఒక తండ్రి మనోవేదనకు అద్దం పట్టే కవిత ‘ ఉగ్ర ప్రేమ’ . ఈ కవిత వాక్యాలు చదువుతున్నప్పుడు మన కళ్ళల్లో నీటిపొర కమ్ముకుంటుంది. ‘ ఒక పొడవాటి నీడ లాంటి ఎదురుచూపు తర్వాత/ఒకానొక సాయంత్రం/ ఉన్నట్టుండి వాడి ముందు వాలాలనే కానీ పని నీలో / ఉవ్విళ్ళూరుతుంది/ఉగ్ర ప్రేమ మందారం ఏదో పేగుల్లో ఊగుతుంది/ చిక్కబడిన గాలుల్ని మజ్జిగలా తాగుతుంది’.

తన చిన్నతనంలో తాతతో గడిపిన క్షణాలను గురించి ‘ లోటు’ కవితలో ఇలా అంటారు. ‘ ఒక్క అనాచారం ఛాయ కూడా లేని బతుకు కదా/మామిడి పళ్ళ మోజుతో తను వడదెబ్బకు కూలకపోతే/నీ డొక్క కూడా శుద్ధి పడేదని బామ్మ అంటున్నప్పుడు/జీవితం నాకు చేసిన లోటేదో తెలిసింది’.

ఊరు వదిలి పోతున్న పిల్లల గురించి ‘అవిసె గింజలు’ కవితలో ‘చివరికి ఉన్న ఒక్కడైనా ఊరు వదలకుండా ఉండి ఉంటే బాగుండని/అయినా ఎవరి జీవితానికి ఎవరు పూచి అని గోడలన్నీ ఉమ్మడిగా/ అడిగినట్టుంటుంది/విరామ సంగీతం ఏదో గదుల్లో పొర్లినట్టుంటుంది’. ‘బెంగ ‘ కవితలో ‘ పిల్లల్ని వాళ్ళ ఋతువుల్ని ఆపడం/మబ్బు పట్టిన చీకటిలో వసంతాన్ని వెతకడం అని’ దిగులుతో విస్తు పోతారు.

ప్రకృతిమయమైన భావ కవిత్వానికి చిరునామాలా నిలిచిన కృష్ణశాస్త్రి, ఇస్మాయిల్ కవితలతో పోల్చదగిన అనుభూతి వాద కవిత్వాన్ని సృజిస్తున్న రఘు.. ఈ తరానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతినిధి.ఈ సంపుటిలోని ప్రతి కవిత వెనుక కవి పెనుగులాట మన దృష్టికి వస్తూనే ఉంటుంది.

– గోపగాని రవీందర్
94409 79882

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *