ఇంటర్ బోర్డ్ ను మోసం చేస్తున్న విజ్ఞాన్ వేదాంత్ కళాశాలను సీజ్ చేయాలి

తెలంగాణ

అనధికారికంగా నడుస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలి
ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి డిమాండ్

ఇంటర్ బోర్డ్ ను మోసం చేస్తున్న విజ్ఞాన్ వేదాంత్ కళాశాలను సీజ్ చేయాలని, మల్టీ ఆక్యుపెన్సీ వ్యాపార భవన సముదాయాలలో అనధికారికంగా నడుస్తున్న విజ్ఞాన్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏఎస్ రావు నగర్ లోని తాతా ఆసుపత్రి పక్కన ఇంటర్ బోర్డ్ అఫిలియేషన్ లేకుండా అనధికారికంగా అడ్మిషన్లు నిర్వహించి,తరగతులు నిర్వహిస్తున్న విజ్ఞాన్ వేదాంత్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించడం జరిగింది.

అనంతరం మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాకాధికారి (డీఐఈఓ) కిషన్ ఫిర్యాదు మేరకు కళాశాలకు వచ్చి నిబంధనలకు విరుద్ధంగా తరగతులను బహిష్కరించి బయటకి పంపడం జరిగింది.సదరు కళాశాలకు బోర్డ్ నుండి ఎటువంటి అనుమతులు లేవని అడ్మిషన్లు నిర్వహించడం చట్ట విరుద్ధమన్నారు.

ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ లు సంయుక్తంగా మాట్లాడుతూ 2024 విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే కార్పొరేట్ కళాశాలల ఆగడాలు హెచ్చుమీరిందని ధ్వజమెత్తారు. ఇంటర్మీడియట్ బోర్డ్ ను మోసం చేయడంలో, విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేయడంలో కార్పొరేట్ కళాశాలలు కొత్త పంథాను ఎంచుకుంటున్నారని పూర్తి స్థాయి అఫిలియేషన్ పొందకుండానే బిల్డింగ్ లు తీసుకోవడం, అరకొర సదుపాయాలు కల్పించడం, లక్షల రూపాయల ఫీజులు చేసి అడ్మిషన్లు నిర్వహించడం, అర్హత లేని బోధనా సిబ్బందితో పాఠాలు చెప్పడం ద్వారా విద్యార్థులు నష్టపోతున్నారని వారు వాపోయారు. అదే విధంగా ఇంటర్ బోర్డ్ రాష్ట్ర వ్యాప్తంగా 432 మల్టీ ఆక్యుపెన్సీ వ్యాపార భవన సముదాయాలలో నడుస్తున్న కళాశాలలకు అనుమతులు ఇవ్వలేదని, మరి ఈ విజ్ఞాన్ కళాశాల కూడా బహుళ వ్యాపార సముదాయంలో, ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండానే అక్రమంగా నడుస్తున్నదని వారు ఆరోపించారు. కాబట్టి ఇంటర్ బోర్డ్ అధికారులు తక్షణమే విజ్ఞాన్ కళాశాలను సీజ్ చేసి, విద్యార్థులు కళాశాల యాజమాన్యం కు కట్టిన ఫీజులను వాపసు చేయాలని ఏ ఐ వై ఎఫ్ యువజన సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్, మురళి, కిరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *