విమర్శ….. విమర్శకుడు

లహరి

ఒక అక్షర సృజనలోని గుణదోషాలను తెలియచేస్తూ సహేతుకంగా, ఆలోచనాత్మకంగా చేసే వ్యాఖ్యానమే విమర్శ. ఆ వ్యాఖ్యాతే విమర్శ కుడు. మంచి రచనలో అంతర్భాగమై, నిగూఢంగా ఉండే భావాలను వెలుగులోకి తెచ్చేవాడే విమర్శకుడు.ఆ భావసంపత్తి గొప్పదనాన్ని తన శోధనానేత్రంతో గుర్తించి, దాని సాంద్రతను అంచనా వేసి, వివరించే వాడు. వాటి లోతుల్లోకి తన సునిశితదృష్టిని ప్రసరింప చేసి, దర్శించగలిగే వాడు. తాను దర్శించిన వాటిని విశదపరిచే వాడు. ఆ విధంగా చదువరుల దృష్టిని అటువైపు సారింప చేసే మార్గదర్శి. వారినాలోచింపచేసి, వారి నయనాలకు ఒక నైశిత్యం, నవ్యత్వం, ఆలోచనకు ఒక కుశాగ్రతను ఇచ్చేవాడే విమర్శకుడు.

ఆ రచనలోని అందచందాలను, సొబగులను పాఠకులకు అనుభూతం చేసే బుద్ధిజీవి. ఆ రచనలోని మంచిభావాల స్థాయికి అసలు చేరుకోలేని, లేదా పూర్తిగా చేరుకోలేని పాఠకకులకు వాటిని తెలియచెప్పేవాడు. పాఠకులు ఒక రచనను చదివేటప్పుడు ఏర్పడే అస్పష్టతను తొలగించేవాడు. వారి పరిశీలనా వగాహనాశక్తులను పెంచేవాడు. రచనకు, పాఠకులకు మధ్య వారధి లాంటివాడు. అలాగే ఆ రచనలోని దోషాలను కూడ వారి దృష్టికితెస్తూ, సాహిత్యాభిరుచిని ప్రోది చేస్తూ, రచనను ఆస్వాదించటం నేర్పగలవాడు. ఆ విధంగా విమర్శకుడు పాఠకులకు, రచయితలకు, వెరసి సాహిత్యానికి గొప్ప మేలు చేసే వివేచనాపరుడు.

రచయిత మనోయవనికపై విస్తరించిన భావసామ్రాజ్యానికి అక్షర రూపమే ఒక రచన. రచయిత అద్భుతమైన ఊహలు చేస్తాడు. ఊహకు ఆవలి వైపే అతని ఆలోచన అంతా. ఇతరులకవి అనూహ్యంగా ఉంటాయి. అతడు ఆ భావాలను, ఆ ఊహలను వ్యక్తపరచేటందుకు భాషలోనిపదాలను, పదబంధాలను ఎంపిక చేసుకుంటాడు. ప్రతి రచయిత వాటిని సులభ శైలిలో పాఠకులకు అందచేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అవి పాఠకులకు అర్ధం కావాలి. అపుడే రచయితకు పేరు, వాటికి ప్రాచుర్యం లభించేది. అలా చేరని రచన వృథా కదా ! పాఠకులకు ఆకట్టుకునేటట్టు రాయటమే ఏ రచయిత లక్ష్యమైనా. ఒక్కొక్కసారి అక్షరసృజనలోని భావసంచయం, వాటి అర్ధం పాఠకులకు చేరదు.

దానికి రెండు కారణాలు :
1.భావక్లిష్టత
2.భాషా క్లిష్టత
రచనలోని కొన్ని భావాలు ఎంతో లోతుగా ఉంటాయి. కొన్ని శాస్త్రాల ప్రాథమిక అవగాహన ఉంటే గాని అవి అర్ధం కావు. మరికొన్ని భావాలు మన అనుభవంలోకి రావటానికి వాటితో విశేష పరిచయం కావాలి. అంతేకాదు ! దానిని,చదువుతున్న రచనలోని భావాలకు అన్వయించుకోవాలి. అపుడే ఆ భావాలలోని చిక్కు ముడులు విడివడి వడివడిగా వాటి అర్ధం, లోతు చదువరులకు చిక్కు తాయి. ఆ రచనలోని భావరస గంగాప్రవాహపు జోరు, హోరు, గలగలలు, సౌందర్య ధ్వనులను విని ఆనందిస్తారు. రసానుభూతి కలిగేదపుడే. ఇంతటి అద్భుత రసావిష్కరణం పఠితుల మనస్సుల్లో జరగాలి. అది జరిగిన ఉత్తరక్షణం రచయిత భావసామ్రాజ్యంలోకి పాఠకులు ప్రవేశించినట్టే. ఆ రచన మీద పట్టు దొరికినట్టే.

ఒక రచనను చదివిన వారందరకు ఈ గొప్ప అనుభూతి కలుగుతుందా? ఇది సాధ్యమవుతుందా? అని ప్రశ్నకు కలగదనే చెప్పాలి. రసజ్ఞులైన పాఠకులకే ఆ శక్తిసామర్ధ్యాలు ఉంటాయి. అపుడే ఆ సాహితీమర్మాలు, లోతులు అర్ధమవుతాయి. మరి అవిలేని సామాన్య చదువరుల సంగతి ఏమిటి? సరిగ్గా ఇక్కడ ఉత్తమ విమర్శకుని పాత్ర ఆవశ్యకమై అతడి ప్రతిభ ప్రస్ఫుటమయ్యేది. రచనలోని ఈ అద్భుత విషయాలను పట్టుకోలేని వారికి గొప్ప విమర్శకుడు వాటిని తేట చేస్తాడు. అపుడు ఆ గొప్ప భావాలు వారికి అనుభవైకవేద్యమవుతుంది. ఇది నిజమైన విమర్శ. ఒక అక్షర సృజనలోని భావక్లిష్టతను సుస్పష్టం చేసి వాటిని సాహిత్యలోకానికి అందచేసేవాడు. అతడే నిజమైన, ఉత్తమమైన విమర్శకుడు.

రెండో అవరోధం భాషా క్లిష్టత. కొన్ని సందర్భాలలో భావాలను చెప్పేటం దుకు రచయిత ఎంపిక చేసుకున్న భాషాస్థాయి ఎక్కువగా ఉండి, అవి పాఠకలోకానికి చేరకపోవచ్చు. అప్పుడు ఆ ఇబ్బందిని తొలగించేవాడు కూడ విమర్శకుడే.

విమర్శకుడు రచనకు… పాఠకులకు ఒక సేతువు. విమర్శకుడు ఒక అద్భుత భాష్యకారుడు. ప్రతిభావ్యుత్పత్తులలో రచయితకు ఏ మాత్రం తీసిపోనివాడు. అతడి ఆలోచనాస్రవంతిలో చొచ్చుకుని వెళ్ళగలిగే వాడు. వాటి అర్ధాన్ని పాఠకులకు అందచేయగలిగే ప్రజ్ఞాపాటవాలు ఉన్నవాడు. పాఠకులలో ఉత్తమాభిరుచిని పెంపొందిస్తాడు. అతడే ఉత్తమ విమర్శకుడు.

బొడ్డపాటి చంద్రశేఖర్‌
ఆంగ్లోపన్యాసకులు
63003 46501