తిరుగులేని నేతగా నిరూపణ
హైదరాబాద్ : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఓ రకంగా సిఎం రేవంత్ రెడ్డికి బూస్ట్ లాంటివే. మూడు స్థానాలు ఉన్న పార్టీని 8కి చేర్చిన ఘనత రేవంత్‌దే. ఇపపుడు పార్టీలోనూ, ప్రబుత్వంలోనూ ఇక రేవంత్ రెడ్డికి తిరుగు లేనట్లే. అలాగే మున్ముందు ఆయన తీసుకోబోయే నిర్ణయాలు అతడి స్థాయిని మరింత పెంచగలవు. లోక్‌సబ ఫలితాలను బట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వ మనుగడ ఉంటుందని రాజకీయవర్గాలు అంచనాకు వేశాయి. కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించకపోయినా 8 సీట్లు సాధించడం గొప్ప విషయంగానే చూడాలి. దీంతో ఆ పార్టీ ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం బీజేపీతో సమానంగా సీట్లు తెచ్చుకోవడమే కాదు కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం కూడా ఓ కారణమని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కారణంగా మోడీ దూకుడు రాజకీయాలు ఇక పనిచేయవు. రాష్టాల్రను ఇక్కట్లకు గురిచేసే చర్యలకు దిగకపోవచ్చు. చెరో ఎనిమిది సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్, బీజేపీలు బిఆర్‌ఎస్‌ను ఉనికిలో లేకుండా చేశాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా జంప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు అనుకున్నట్లుగానే బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటాగా సాగాయి. చివరికి రెండు పార్టీలు చెరో ఎనిమిది సీట్లను గెల్చుకున్నాయి. మజ్లిస్ పార్టీ తన హైదరాబాద్ సీటును నిలబెట్టుకుంది. బీఆర్‌ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. రెండు, మూడు చోట్ల మినహా అన్ని చోట్ల మూడో స్థానంలో ఉంది. చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అంటే.. కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే యాడ్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ కు అధికారికంగా అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటారు. బీఆర్‌ఎస్ నుంచి వచ్చి చేరిన వారు అదనం. బీజేపీ కాంగ్రెస్ కన్నా ఒకటి , రెండు సీట్లలో ఎక్కువ సాధించి ఉన్నట్లయితే..ఆ పార్టీ నుంచి కాపాడుకోవడం కష్టమయ్యేది. ఇప్పుడు కేంద్రంలోనూ బీజేపీ బలహీన ప్రభుత్వమే ఏర్పడుతోంది. మిత్రపక్షాల విూద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. అందుకే వారు తెలంగాణ ప్రభుత్వం జోలికి వచ్చే అవకాశం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి ఆ ప్రభుత్వం ఉండదని పదే పదే అభిప్రాయం చెప్పేవారే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ నేతలు ఇదే పాట పాడుతూ వచ్చారు. ఎలా జరుగుతుందో కూడా విశ్లేషించేవారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరిమితంగా సీట్లు వస్తాయని.. బీజేపీకి ఎక్కువ వస్తాయని ఆ తర్వాత బీజేపీ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తుందని అంచనాలు వేస్తూ వచ్చారు. కేసీఆర్ కూడా తమ పార్టీ సమావేశాల్లో ఇవే చెబుతూ వచ్చారు. వందకుపైగా ఎమ్మెల్యేలు ఉన్న తన ప్రభుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని కాంగ్రెస్ కు సహించే ప్రశ్నే ఉండదని ఆయన అభిప్రాయం. ఈ పరిస్థితి తీసుకు రావడానికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కేసీఆర్ బీజేపీకి సహకరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని తేల్చేందుకు బీజేపీకి సైలెంట్ గా సపోర్టు చేశారు. అది లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమయింది. అయితే తెలంగాణలో బీజేపీ .. ఎనిమిది సీట్లు సాధించింది కానీ… దేశంలో అంత ప్రోత్సాహకర ఫలితాలు లేవు. అందుకే బీజేపీ సంయమనం పాటించే అవకాశం ఉంది. అయితే బీజేపీ బలపడే ప్రయత్నాలు మాత్రం ఆపదు. బీఆర్‌ఎస్ ఉనికిని వీలైనంతంగా పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తుంది. బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్ ను కాపాడుకోలేకపోయింది. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన క్యాడర్ ను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పంచుకుంటాయి. ఎక్కువగా బీజేపీ పంచన చేరిపోతారు. ఎందుకంటే.. మరో రెండు, మూడేళ్ల తర్వాత అయినా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిలబడే పార్టీగా బీజేపీనే చూస్తారు. అందుకే ఆ పార్టీలో చేరిపోతారు. బీఆర్‌ఎస్ క్రమంగా బలహీనపడుతుంది. బీఆర్‌ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తుంది. ఎమ్మెల్యేల చేరికలతో అసెంబ్లీలోనూ ప్రతిపక్ష స్థానానికి బీజేపీ చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే సొంత జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో గట్టిగా పోరాడినా ఓడిపోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచినా పార్టీ ఓడిపోయింది. డీకే అరుణకు.. బీఆర్‌ఎస్ పార్టీ సహకరించడమే కారణం అని విశ్లేషిస్తున్నారు. అలాగే తన సిట్టింగ్ సీటు మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల భారీ మెజారిటీతో గెలిచారు.