నాటక సాహిత్యానికి చెరగని సంతకం శ్రీశ్రీ

సాహిత్యం

 శ్రీశ్రీ మహాకవి మాత్రమే కాదు..గొప్ప నాటకకర్త కూడా. నాటక శాస్త్రాన్ని, నాటక తత్వాన్ని, నాటక ప్రయోజనాన్ని సంపూర్ణంగా ఆకలింపుచేసుకొని, నాటక అస్తిత్వాన్ని అపూర్వంగా ఆవిష్కరించిన గొప్ప మేథావి శ్రీశ్రీ. ఆయన కలంనుంచి జాలువారిన అన్ని నాటికలు ఆణిముత్యాలే. ఆ నాటికలలోని ఇతివృత్తాలన్నీ సాధారణ ప్రజల జీవితాలతో ముడిపడివున్న కథాంశాలు మాత్రమే. కథ, కథనం, శిల్పం, సన్నివేశాలు, సంభాషణలు, సందేశాలు.. ఏవీకూడా కృత్రిమంగా కనిపించవు… అన్నీ సజీవ స్వరూపాలే.. మెదళ్లకు కదలిక కలిగించే మేనుపర్వతాలే. ఆసక్తికరమైన సన్నివేశాలతో, శ్రోతలను మైమరపించే మాటలతో, రచనకు సాంకేతిక విలువలు జోడించి ఆయన జరిపిన ప్రయోగాలన్నీ, ఒక జీవనది ప్రవాహంలా సాగిపోతాయి. ఈ నాటికల అవసరం అప్పటికే కాదు, ఇప్పటికీ వుందనిపిస్తూ వుంటుంది.

       నాటికల ప్రారంభమే గొప్ప ఆసక్తిని, సరిక్రొత్త ఆలోచనల్ని మనకు కలిగిస్తాయి. ‘బలి’ నాటిక ప్రారంభంలోనే రాక్షసరాజు ‘బలిచక్రవర్తి’.. దేవతలరాజు ‘ఇంద్రుడు’… వీరిద్దరి మధ్యనున్న పోలికల మీద ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. బలిచక్రవర్తి రాక్షసుల రాజు అయినప్పటికీ అతడు ఎంతో ధర్మమూర్తి, దానపరాయణుడు, ప్రజలు మెచ్చిన పాలకుడు, సర్వ శాస్త్రాల నియమాలను ఎపుడూ ఉల్లంఘించిన దాఖలాలు లేని స్వచ్ఛమైన జీవితాన్ని సొంతం చేసుకున్న చరిత్ర ప్రసిద్ధుడు. తన్ను అర్థింప వచ్చిన వామనుడికి తన సర్వస్వం అర్పించి పురాణ, ఇతిహాసాలలో ‘తనకు తానే సాటి’ అని నిరూపించుకున్న మేటి చక్రవర్తి అతడు. మరి ఇంద్రుడు అందుకు పూర్తిగా విరుద్ధం. దేవతల రాజయిన ఈయన దుష్టులలో దుష్టుడు. తన పదవి నిలుపుకోవటానికి ఎంతటి నీచమైన పద్ధతులైనా అవలంభిస్తాడు. ఇంద్రుడు భోగలాలసుడు. మునిపత్ని అహల్యను చెరచటానికి సైతం సంకోచింపని వాడు. వెరసి ఇంద్రుడు మహా పాపాత్ముడు. అయినా అతడు స్వర్గానికి రాజు.ఇదేం నీతి?. ఇలాంటి వాడికి రాజు పదవి ఎలా దక్కింది?..అంటూ నాటికలో ఒక పాత్ర ప్రశ్నిస్తుంది. ఈ నాటిక చదివిన తరువాత ఈ దేశంలో పాలకులంతా ఇంద్రుడి వారసులేమోననిపిస్తుంది.

       వ్యంగ్యానికి పెద్దపీట వేసిన నాటిక ‘జడభరతుడు’. నాటకరంగంలో ‘స్వగతం’ అన్న ప్రక్రియ అతి ప్రాచీనమైన ఒక సాంప్రదాయం. దశవిధ రూపకాలలో ప్రముఖ స్థానం పొందిన స్వగతంతో పాటు, ‘విష్కంభం’, ఈహమృగం’ లాంటి వాటి ప్రస్తావనలు కూడా ఈ నాటికలో చోటుచేసుకున్నాయి. దీనిద్వారా భరతముని నాట్యశాస్త్రాన్ని శ్రీశ్రీ ఎంతలోతుగా అధ్యయనం చేశారో అర్థమవుతుంది. రాజ్యాలు ఏవైనా, పాలించే రాజులు ఎవరైనా కష్టజీవికి కష్టాలు మాత్రం నిరంతరం వెంట తరుముతూ బాధిస్తూనే వుంటాయన్న సత్యాన్ని ఒక సన్నివేశం ద్వారా వివరిస్తాడు శ్రీశ్రీ. రామాయణ కాలంలో కూడా వెట్టిచాకిరి ఎంత భయంకరంగా వుందో, గస్తీ తిరిగే ఒక కాపలావాడి పాత్ర ద్వారా తెలియజేస్తాడు. “పదేళ్లుగా రాత్రి, పగలు కాపలా కాస్తున్నాను. నాలుగేళ్లయింది పెళ్లి చేసుకొని, భార్యని సంసారానికి తీసికెళ్లమని నా అత్తమామలు పోరు పెడుతున్నారు… నేనేఁమి చేసేది?…” అంటూ బాధపడుతాడు కాపలావాడు.

     పాశ్చాత్య నాటకరంగ రీతుల్ని సంపూర్ణంగా జీర్ణించుకున్న మహామేథావి శ్రీశ్రీ. నాటికలో ఒక పాత్రకు సంభాషణలేవీ లేకుండా, ఆ పాత్రను అతిముఖ్య పాత్రగా మలిచి నాటిక నిండా నడిపించటం ఒక గొప్ప టెక్నిక్. దీనిని మొదట ప్రవేశపెట్టిన వాడు ‘స్ప్రింగ్ బర్గ్’ నాటక రచయిత. ఇదే టెక్నిక్ ను శ్రీశ్రీ కూడా ‘జడభరతుడు’ పాత్రలో ప్రవేశపెట్టి సఫలీకృతుడయ్యాడు. ఈ నాటికలో కాలగమనానికి శ్రీశ్రీ వాడిన టెక్నిక్ కూడా చాలా గొప్పది. కావలివాడు అరిచే అరుపును బట్టి ఆ రాతిరి ఎన్ని జాములు గడిచిందో తెలుస్తుంది.

     యుద్ధం ఎపుడు జరిగినా అది సర్వనాశనాన్నే కోరుకుంటుంది. ఇదే విషయాన్ని చాలా సూటిగా ఆవిష్కరిస్తూ రాసిన నాటిక “యుద్ధం…యుద్ధం… యుద్ధం…”. మహాభారత సంగ్రామాన్ని నేపథ్యంగా తీసుకొని మరణించిన వీరుల రక్తాన్ని త్రాగుతున్న రాక్షసులు, శవాల మాంసాలను ఇష్టంగా భోంచేస్తున్న రాబందుల సంభాషణల ద్వారా యుద్ధాన్ని కోరుకుంటున్న సామ్రాజ్యవాదుల నైజాలను బట్టబయలు చేస్తాడు ఈ నాటికలో శ్రీశ్రీ. సమాజ శ్రేయస్సుకోసం కనిపెట్టినయంత్రం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళుతోంది. దీనివలన ప్రజాస్వామ్యానికి విజ్ఞానం కలిగించటం బదులు వారిని దోచుకోవటానికి ఈ యంత్రం ఒక ఆయుధంగా ఎలా పనిచేస్తుందో వివరించిన నాటిక “చెప్పని సందేశం”.

     1945 లోనే రైతుల కడగండ్లను గురించి కన్నీరు కార్చిన ప్రజారచయిత శ్రీశ్రీ. “భాగ్యలక్ష్మి” అనే నాటికలో ప్రాచీన కళారూపమైన యక్షగానాన్ని సైతం సమర్థనీయంగా సమన్వయ పరచిన శ్రీశ్రీ, తెలుగు నాటక చరిత్రలో చిరస్థాయిగా నిలచి పోతాడు. ఈ యక్షగానంలో అద్భుతమైన భావసంపద తొణికిసలాడుతుంది. “బక్కచిక్కిన దుక్కిటెద్దుల ప్రాణములు కనుగొనల దాగెను” / “ఆకసము రక్తాన్ని కుండము, భూమి నల్లని బొగ్గుకుంపటి మండు గాడుపు టెండవేడికి…” అంటూ “మరిగి కాలం ఖణేల్మన్నది, ఇనుప గంటలు నవ్వినట్లుగా, దిగుడు బావి దిగాలుగానున్నది…” అంటూ యక్షగానాన్ని కొనసాగిస్తూ చివరగా పేదలపట్ల భాగ్యవంతులు నిర్ణయాన్ని ఇలా ప్రకటిస్తాడు. “పేదవాళ్లందరూ సుఖంగానే వున్నారని, భాగ్యవంతులు ఏకగ్రీవంగా నిర్ణయం చేశారు. గొప్ప గొప్ప వారందరికి జయం..వారి చుట్టూతిరిగే వారికందరికి జయం.. పేద వాళ్లకెందుకు భయం! ప్రాణమున్నన్నాళ్లు బ్రతుకుతారు నయం…” అంటూ యక్షగానం పూర్తవుతుంది. Rudyard Kipling రాసిన “ The Masque of plenty” కి శ్రీశ్రీ చేసిన యథాశక్తి తర్జుమా ఈ నాటిక.

     విషయాన్ని నేరుగా చెప్పకుండా పాఠకుడిలో ఆసక్తిని రేపుతూ సన్నివేశాల రూపంలో అందించే టెక్నిక్ శ్రీశ్రీ నాటికల్లో చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. “ఒంటరి బావి” నాటికలో బావిలో శవమై పోయిన అసిరిగాడి బిడ్డను గురించి చెబుతూ “అమాయకురాలి భయంకరపు అరుపు ఆఖరిసారి విన్నారు ప్రజలు, బిడ్డను ఎవరు చంపేశారు, ఎంతో అందమైన పిల్ల, ఎందుకు చంపేశారు?…అంటూ పేదలంతా ప్రశ్నిస్తారు. ఒక కూలీవాడి అందమైన కూతురు అప్పటికీ, ఇప్పటికీ ఎందుకు చంపబడుతుందో, ఎవరిచేత చంపబడుతుందో, ధనమదం ఇనుప రెక్కల డేగల కామం ఎందరి కన్నెపిల్లలను నాశనం చేస్తుందో పొరలు, పొరలుగా వర్తమాన నిజాలు ఈ నాటిక చదువుతున్న పాఠకుడి కళ్లముందు నిలుస్తాయి.

     అనన్యసామాన్యంగా సాగిన నాటిక “ముట్టడి’. ఇందులో విశేషమేమిటంటే నాటకకర్త సృష్టించిన పాత్రలే నాటకకర్తని ముట్టడిస్తాయ్. ఇలాంటి క్రొత్త ప్రయోగాలను ఏ నాటక రచయిత చేపట్టలేదు. ఈ నాటికలో అంతర్నాటకమైన “కాలేజీ కనకతార” మనల్ని చాలా ఆలోచింప చేస్తుంది. ఒక దృశ్యం పగలుకు, మరో దృశ్యం రాత్రికి కేటాయించి నాటికను నడిపించిన తీరు నాటకరంగానికి ఒక పెద్ద సిలబస్ గా నిలిచి పోతుంది. సామాన్య నాటకాల్లో కనిపించే అవాస్తవిక ధోరణుల్ని ఎండకడుతాడు ఈ నాటికలో శ్రీశ్రీ. ఆయన నాటికల్లో పాఠకుడి మెదడులో వేడి పుట్టించే నాటిక “శిరస్సు చెప్పిన రహస్యం”. ఈ రచన నిండా ఎన్నో కళాత్మక విలువలు చోటు చేసుకున్నాయి. ఇందులోని పాత్రలన్నీ ప్రయోగాత్మకంగా వుంటాయి. మరికొన్ని సింబాలిక్ గా కొనసాగుతాయి. సన్నివేశాలన్నీ మనిషి ఆలోచనలకు ప్రతిరూపాలుగా నిలుస్తాయి. ఈ నాటికలో ఒక శిల్పి అసంపూర్ణంగా మలిచిన శిరస్సు చెప్పిన రహస్యాలు ఎన్నో వాస్తవికతలకు అద్దం పడుతాయి. నిద్రకు, చావుకు మధ్యనున్న తేడాను ఈ నాటికలో గొప్పగా చర్చించ బడుతుంది. ఈ నాటికలో “నగ్న దరిద్రం” అన్న తైలవర్ణ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తాడు ఒక చిత్రకారుడు. కాని చిత్రకళా ప్రదర్శనలో ఆ చిత్రాన్ని ప్రదర్శించటానికి ప్రదర్శన నిర్వాహకులు వొప్పుకోరు. కారణం ఆ చిత్రాన్ని ప్రజలు చూస్తే, ఉత్తేజితులై ప్రభుత్వం మీద తిరగబడుతారని భయపడుతారు. ధన దాహానికి దాసోహమైపోతే కళ ఎలా భ్రస్టుపడి పోతుందో చాలా దృశ్యాలలో శ్రీశ్రీ వివరిస్తాడు. ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా వుండే వివిధ రకాల భయాలను, ఆశలను, సమగ్రంగా, ఆసక్తికరంగా చిత్రీకరించిన నాటిక “గుమాస్తా కల”. కోనేటి రాత్రి కథనే ఈ నాటికగా మలిచాడు శ్రీశ్రీ. జీవితంలో అతి సామాన్య కోరికలను సైతం తీర్చుకోలేని దుర్భర పరిస్థితుల్లో సగటు మనిషి ఎలా జీవిస్తున్నాడో ఈ నాటిక తెలియజేస్తుంది.

     శ్రీశ్రీకి నాటకరంగ విజ్ఞానం ఎంత ఉన్నత స్థాయిలో వుందో తెలియజేసే నాటిక “గవేషణ”. “స్వర్గమనీ, నరకమనీ మరో లోకంలో లేవు… నీ పాపమే నీ నరకం, నీ పుణ్యమే నీ స్వర్గం…” అని ఒక పాత్ర చేత చెప్పిస్తాడు. న్యాయస్థానాలలో జరిగే పొరపాట్లను, పోలీసు వ్యవస్థలో పునరావృతమవుతున్న అన్యాయాలను, అమాయకుల ఆర్తనాదాలను హృదయాలను కదిలించేలా ఈ నాటికలో చిత్రీకరిస్తారు.

  వ్యంగ్య హాస్య ధోరణి కదంత్రొక్కిన నాటిక “కొక్కొరోకో”. ఇందులో పాస్ పోర్టుల జారీ సన్నివేశం ప్రభుత్వ వైఖరిని బట్టబయలు చేస్తుంది. సేవకుడు వచ్చి “పాసుపోర్టు దరఖాస్తులు ఇవి దొర! ..” అంటాడు. అధికారి వాటిని చూసి ఉళిక్కిపడతాడు. “విప్లవాన్ని బోధించే దేశాలకు పాస్ పోర్టులు ఇవ్వటం అస్సలు వీల్లేదంటాడు. ఆ దేశాలను సందర్శిస్తే మన దేశానికి వచ్చే ముప్పేమిటో ఏకరువు పెడతాడు. అదే సమయంలో ఒక కుబేర దేశానికి సంబంధించిన అన్ని పాస్ పోర్టుల మీద సంతకం పెట్టేస్తాడు. పైగా ఆ దేశం గొప్పతనం గురించి కథలు, కథలుగా చెప్తాడు. “జాగ్రఫీ ప్రకారం చూస్తే సరిగ్గా మన కాళ్ల క్రింద వుంటుంది ఆ దేశం…” అంటాడు అధికారి. అందుకు స్పందించిన సేవకుడు “వుండేది మన కాళ్ల క్రిందనే… కానీ కూచోడం మన నెత్తిమీద…” అంటూ చురక అంటిస్తాడు.

     ప్రస్తావించవలసిన ఆయన  నాటికలు ఇంకా చాలా వున్నాయి. కవిగా శ్రీశ్రీ ఎన్ని శిఖరాలు అధిరోహించారో.. .అందుకు సమానంగా శ్రీశ్రీని నాటకకర్తగా నిలబెట్టిన నాటికలు ఆయన వెలువరించిన 1+1=1 నాటిక సంపుటిలో చాలా వున్నాయి. సామాన్య రచయితలు ఇలాంటి నాటికలను రాయలేరు. ఈ నాటికలలో శ్రీశ్రీ ఒక గొప్ప ఆలోచనాపరుడిగా, ఒక గొప్ప తత్వవేత్తగా, ఒక నాటక శాస్త్రవేత్తగా కనిపిస్తాడు. అంతుపట్టని కాలం, దూరం, స్వర్గం, నరకంల గురించి ఆసక్తికరమైన చర్చ ఈ నాటికల్లో మనకు దొరుకుతుంది. ఈ నాటికల మీద సమగ్రమైన పరిశోధనలే కాదు, ఈ నాటికల ప్రదర్శనలు కూడా వూరూర జరగవలసిన అవసరం ఎంతోవుంది.

     కవిత్వానికే కాదు, నాటకరంగానికి సైతం యుగకర్త శ్రీశ్రీ.

(జూన్ 15, శ్రీశ్రీ వర్ధంతి)

-డా. కె.జి. వేణు,

9848070085

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *