ఊరితో పెనవేసుకున్న పేగుబంధం రఘువీర్ ప్రతాప్ సాహిత్యం

సాహిత్యం

“If poetry and the arts do anything, they can fortify your inner life, your inwardness.”- Seamus Heaney

ప్రకృతిలో ఎంత పెద్ద వృక్షమైనా రెండాకులతో మొలకెత్తి చిన్ని చిన్ని చిగుర్లతో తర్వాత్తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమౌతుంది. అయితే సాహితీ క్షేత్రంలో కూడా అలా చిన్న కవితలతో తన సాహితీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఎన్.వి.రఘువీర్ ప్రతాప్ కవిగానే కాకుండా రచయితగా, వక్తగా, ధర్మకేతనం సాహిత్య కళాపీఠం స్థాపకుడుగా అనేకానేక సాహిత్య కార్యక్రమాల్ని నిర్వహిస్తూ సాహిత్యకారులకు పురస్కారాలు ఇస్తూ అనతికాలంలోనే వచన కవిత్వంతో పాటు రెక్కలు, రుబాయిలు, నానీలు, గజళ్ళు, హైకూల మీద పట్టు సంపాదించి అద్బుతమైన కావ్యఖండికల్ని సృజియించిన బహుముఖ సాహిత్యకారునిగా కవిత్వ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకొన్న మృదుస్వభావి, సృజనశీలి.
__________

అటవీశాఖలో అధికారి హోదాలో ఉండి కూడా కవిత్వం మీద ఉన్న మక్కువతో సాహిత్యానికి చేస్తున్న సేవను గుర్తించిన ఎన్నో సాహితీ సంస్థలు ఆయనను అవార్డులు రివార్డుల్తో సన్మానించాయి, సన్మానిస్తూనే ఉన్నాయి. రఘువీర్ గారు ఇప్పటివరకు అన్ని ప్రక్రియల్ని కలిపి దాదాపు 10 గ్రంథాల్ని వెలువరించి 60 బిరుదులు, సన్మానాలు, పురస్కారాలు వివిధ సంస్థల నుంచి అందుకున్నారు. ఆయన సాహిత్య ప్రస్థానం విషయానికొస్తే 2006లో ‘కవితాంజలి’ అనే కవిత్వసంపుటితో మొదలైన ఈకవి సాహిత్య ప్రయాణం.. అమ్మంటే,విశ్వరహస్య విశేషము, అంతర్వాహిని,చిగురాశల ఊహాలలో, మహోన్నత వృక్షాలు, సుధాఝరులు, నిశ్శబ్దలయ, సమీక్షాతోరణం, Mother (మదర్), నానీముత్యాలు, అవ్యక్త, అపురూపం, అమృతధార, (సంపాదకుడు).
__________

రఘువీర్ కవిత్వాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రకృతిని, సమాజాన్ని మేళవించి తనదైన తాత్విక దృక్పథంతో రాసిన కవిత్వ తండ్లాటగా కన్పిస్తుంది. తన ఊర్లోని చిన్నప్పటి అనుభవాల్ని, నోస్టాల్జియాను తనదైన కవిత్వ పరిభాషలో కవిత్వీకరించిన తీరు పాఠకుల్ని ఆకట్టుకొని వారు ఆ కవిత్వానుభూతుల తోటి మమేకమయ్యేలా చేస్తుంది. చెట్టుకొమ్మలు ఆకాశాన్నంటినా, వేర్లు భూమిలో ఉన్నట్లు మనుషులు ఉద్యోగరీత్యా ఎన్ని ప్రదేశాలు తిరిగినా కన్నతల్లిని, సొంత ఊరిని మరువలేరు. అందులో కవులైతే వాళ్ళు సొంత ఊరికి ఎంతదూరంలో ఉన్నా తమ ఊరితో పెనవేసుకున్న పేగుబంధాన్ని తమ కవిత్వపాదాల్లో నెమరేసుకుంటూనే ఉంటారు. రఘువీర్ కూడా తన ఊరు కలువకోలు గురించి “ఆ కొమ్మకు పూచిన పువ్వునై” అనే గొప్ప అనుభూతించే కవిత రాశాడు చూడండి:

‘ఆ ఊరే మాకు జన్మనిచ్చిన అమ్మ/ మళ్ళీ అవకాశమంటూ వస్తే/ ఆ మట్టితీగకే పువ్వునవ్వాలని/క్షణమైనా చిరునవ్వులు చిందించి/ తిరిగి ఆ మట్టిలోనే/ మమేకమవ్వాలని కోరుకుంటాను’ అంటారు

ఈ కవికి తన ఊరిమీద ఎంత అవ్యాజమైన ప్రేమ ఉందో పై వాక్యాలే అందుకు సాక్ష్యం. మట్టితీగ అనే అద్భుతమైన పదబంధాన్ని వాడి ఆ మన్నులోనే పువ్వై విరియాలనుకోవడం, ‘మట్టిని ముద్దాడాలని ..ఊపిరిపోసిన ఈ భూమికి హృదయమద్దాలని ఉందని’ అనుటలో కవికి తన ఊరి మట్టిమీదున్న మమకారం అర్ధమౌతుంది.

తన ఊరినేకాదు తాను అభిమానించే సీనియర్ కవులైన కాళోజి గురించి(అమరుడే కాళన్న) సినారె గురించి రెండు కవితలు (సాహితీమూర్తి, అక్షరతపస్వి) మహాత్మా గాంధీ గురించి (బోసినవ్వులారబోసి) గురజాడ గురించి (నవకవితావికాసం) జ్యోతిబా ఫూలే గురించి (ఆశాజ్యోతి) అనే కవితల్ని రాసి ఆ మహానుభావుల గొప్పతనాన్ని వాళ్ళ కవిత్వంలోని సామాజిక స్పృహను తన పదాల ప్రయోగంతో వాళ్ళ వ్యక్తిత్వాన్ని immortalise చేశాడు.

ఈనాటి ఆధునిక సమాజంలో జరిగే కొన్ని సంఘటనల గురించి ఆలోచిస్తే… కొన్ని కామం కళ్ళకెక్కిన మానవమృగాలు పసిపిల్లల్ని కూడా మానభంగం చేసి చంపుతున్న సమాజంలో బతుకుతున్నందుకు సిగ్గుపడే పరిస్థితి. “సంస్కారబీజం”, “అమ్మా క్షమించు” అనే కవితల్లో మానవత్వం మచ్చుకైనా లేని సమాజంలో జన్మించనంటున్న శిశువుల ఆక్రందనల్ని, అమానవీయ చర్యలకు పాల్పడే మగమృగాల అఘాయిత్యాలకు స్పందించిన మనసున్న కవిగా మనుషుల హృదయాల్లో సంస్కార బీజాల్ని నాటి ప్రతి ఇంటిని సంస్కృతి నేర్పే పాఠశాలగా మార్చాలంటాడు. తన వేదనలోంచి వచ్చిన ఈ పదాల్ని చదవండి రఘువీర్ గారు ఎన్నో సంఘటనలతో మమేకమై మానవీయ కోణంలో సామాజిక స్పృహతో ఈ కవితలు రాశారో తెలుస్తుంది:

‘ఆ మెదడు పొదళ్ళలో/ ఇంద్రుని ఆలోచనలు/ వాడి శ్వాసలో/ కుళ్లిన శవాల వాసనలు/ తొమ్మిదినెలల పసితనం/ తొంబైఏళ్ల ముసలితనం/ కావేమీ కామానికనర్హం అంటున్న/ దౌర్భాగ్యకాలం’

తోడు నడిచే నీడలు సైతం తోడేళ్లవుతుంటే సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిందే నాకు తెలిసి ఏ కవైనా తన మాతృమూర్తి గురించి కవిత్వం రాయకుండా ఉండరు. రఘువీర్ కూడా అందుకు మినహాయింపు కాదు. తన తల్లి గురించి “అమ్మలేని దీపావళి”, “అజరామరం” అనే కవితలు అమ్మ జ్ఞాపకాల్ని,ఆమె ప్రేమని, ఆమె మోసిన కుటుంబ బాధ్యతల్ని నెమరేసుకుంటూ..ఆమె గురించి ఎంతో ఆర్ధ్రతతో కవితలు రాసి మన అందరి అమ్మల్ని గుర్తుచేసిన రఘువీర్ అక్షరాల అభినందనీయుడు.

ఇప్పుడు అమ్మ మాకు/ అందని సందమామ/ చేజారిన దివ్యవరాల చిరునామా/ అంతుచిక్కని అంతర్వాహిని/ అమ్మనవ్వునే పులుముకున్నది/ఆకాశంవెలుగు దివ్వే…. అంటూ …. “అజరామరం” కవితలో …. ఎన్నెన్ని జన్మల పుణ్యఫలమో/ ఏ యుగాల ఆత్మీయ బంధమో/మా అమ్మ మమతల పొత్తిళ్ళల్లో/ నే చిరు విత్తునై మొలకెత్తాను…. అని అనుకుంటూ… అమ్మ తలపుల్ని గుర్తు చేసుకుంటూ తనను ఈ ప్రపంచానికి పరిచయంచేసి జ్ఞాపకాల్లో మిగిలిపోయిన అమ్మ అనుభూతుల్ని మననం చేసుకుంటూ అక్షరాల క్షీర బిందువులతో అమ్మ స్మృతికి కవితార్చన చేసి ఆమెను అజరామరం చేస్తాడు.

ఈనాటి ఆధునిక ప్రపంచంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడింది. చెరువుల్ని పూడ్చి, గుట్టల్ని తొలగించి వ్యవసాయ భూముల్ని ఎక్కువ ధరకు కొని ఆ భూముల్ని వ్యాపారంగా మార్చుతున్నందువల్ల భూమిలోని జలాలూ అడుగంటిపోతున్నవి. ఇటువంటి పరిస్థితిలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతివ్యక్తి మీద ఉన్నదని గ్రహించాలి లేకుంటే భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసిన వాళ్ళమవుతాము. ఆ ప్రమాదాన్ని పసిగట్టిన నిబద్ధకవిగా రఘువీర్ “జలజీవం” అనే ఒక ఆలోచనాత్మకమైన కవితకు ప్రాణం పోశాడు చూడండి:

రాజుకున్న నిప్పురవ్వ/ నిన్నంటుకోక మునుపే/ కాచుకున్న పెనుచీకట్లు/ నీ కంటిమీద వాలకముందే/ ఇకనైనా మేలుకో/ నిజమన్నది తెలుసుకో/ నీ కుటిలనీతి మానుకో/ రాలే ప్రతి చినుకు/ మట్టి గుండెను తడమాలి/ ఎదిగే ప్రతి మొలక/ పచ్చదనమై మెరవాలి…. అంటూ పర్యావరణం యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతూ ప్రకృతి మీద తనకున్న ప్రేమను ఆవిష్కరిస్తారు.

ఈ బహుముఖీన కవి.. ముందు చెప్పుకున్నట్లు కవిత్వంలోని అన్ని ప్రక్రియలమీద తన సృజన ప్రతిభను చాటుకున్నాడనటానికి అల్పపదాల్లో అనల్పార్ధాన్ని వ్యక్తపరిచే ఈ హైకూలను చూస్తే కొండను అద్దంలో చూపినట్లు అర్థం అవుతుంది.
1.కాయపండినా
ఆయమంతా నిండినా
రాలడం ఖాయం.

2.పాడైతే తప్ప
ఆగదు లోలకం
బ్రతుకు అంతే
ఈ రెండు హైకూలు చాలా విలక్షణమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ జపాను హైకూ ప్రక్రియ చిన్నచిన్న పదాలతో చాలా క్లుప్తంగా ప్రకృతిలోని అందాల్ని మానవ జీవితంలోని తాత్వికతను వర్ణించి చదివే పాఠకునికి ఒక అనిర్వచనీయమైన అనుభూతినిస్తూ ఆలోచింపచేస్తుంది.
గమ్య మెరుగని దారిలోన/సాగిపోవుట దేనికి?/ మనస్సు నిండుగా నవ్వలేక/ బ్రతుకుట దేనికి…
మానవ జీవితానికి ఒక లక్ష్యమంటూ ఉండాలని అటువంటి లక్ష్యం లేకుంటే ఆ జీవితం గమ్యం లేని ప్రయాణంలాగా సంతోషం లేని విషాద జీవితం అవుతుందని ఆ గజల్ అంతరార్థం.
అనుభవం/పాఠం నేర్పితే/ పరాభవం/ గుణపాఠం నేర్పుతుంది/ జీవితమే/ పాఠశాల
ఈ జీవిత పాఠశాల ప్రతిమనిషికి అనుభవాల పాఠాలతో పాటు పరాభవాల గుణపాఠాలు కూడా నేర్పుతుందని పాఠకుల్ని తన రెక్కలపై ఊరేగిస్తాడు.
ఈనాటి సమాజంలో మనిషి కంటే మాటకే విలువెక్కువని మాట యొక్క ప్రాధాన్యాన్ని ..నోరు మంచిదయితే ఊరుమంచిదన్న జీవనసత్యాన్ని… మాటే మనిషికి ప్రాణం..మాట్లాడేవాడే మనిషి.. మాట్లాడుతాను మనిషిగా (రుంజ) అనే నా కవితా వాక్యాల్ని గుర్తుకు తెచ్చే రుబాయీ…
పల్లవి లేకున్నా పాట నిలబడాలి
నడక లేకున్నా నడత నిలబడాలి
మౌనం లేకుండా మాటకు పుట్టుకేది
మనిషి లేకున్నా మాట వినబడాలి
ప్రతి మనిషి సామాజం గురించి ఆలోచిస్తూ ఎంతోకొంత సమాజసేవ చేసి చరిత్రపుటల్లో నిలిచిపోవాలని తన రుబాయీ ద్వారా మనకు ఎరుక చేస్తున్నాడు ఈ కవి.
‘నన్ను చంపగలరేమో గాని/ నా అక్షరాల్ని/
చంపలేవు/ నిజం నిజం’.కవి సృజించే కవిత్వానికున్న శక్తిని, ఆ కవిత్వాక్షరాలు మనుషులని ఎలా చైతన్యవంతం చేస్తాయో తెలియచేస్తూ సామాజిక స్పృహతో కవిత్వం రాసే నిబద్ధకవుల్ని అంతం చేసే దుర్మార్గపు అలోచనలకు చంపపెట్టు లాంటి ‘నాని’ ఇది. కవితల్లోనే కాకుండా నానీల్లో కూడా తనకు పర్యావరణం మీదున్న ప్రేమను వ్యక్తపరిచాడు రఘువీర్.’చెట్టుకొమ్మలు/ చేతులూపుతున్నాయి/ వద్దు వద్దు/ మమ్ములనరకొద్దంటూ’ పర్యావరణానికి పట్టుకొమ్మలాంటి నాని రాసిన ఈ కవిది తెలుగు సాహిత్యంలో చెరపలేని సంతకం.
రఘువీర్ మొత్తం సాహిత్యప్రయాణాన్ని పరిశీలిస్తే వస్తుపరంగా, భాషపరంగా తనదైన సున్నితమైన పరిభాషను చాలా సరళమైన వ్యక్తీకరణతో ఎటువంటి obscurity కి తావులేకుండా అలవోకగా కవిత్వం చేసే విభిన్నమైన సృజనకారుడు. ఇంకా మిగతా సాహిత్య ప్రక్రియల్లో కూడా తన సృజనను కొనసాగించాలని కోరుకుంటూ పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు.

 

-డాక్టర్ బాణాల శ్రీనివాసరావు
94404 71423

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *