వ్యాసం ఆధునిక సాహిత్య ప్రక్రియ. ఒక విషయానికి పరిమితమై దానిని చర్చిస్తూ దానికి సంబంధించిన కొత్త కోణాన్ని ఆవిష్కరించడం, కొత్త ఆలోచనలను, కొత్త ప్రతిపాదనలను చేయడాన్ని వ్యాసంగా పేర్కొనవచ్చు.
‘ఓకలం జ్ఞాపకం’ వ్యాస సంపుటిలో ప్రతివ్యాసం అద్భుతమే, అపార విజ్ఞానమే. ఒక్కో ఆణిముత్యముగా కథారచయిత భమిడిపాటి గౌరీశంకర్ తీర్చిదిద్దిన వైనం, అక్షరాలకు వన్నె తెచ్చిన విధానం చదువరులకు ఇంపైన ఆనందాన్ని అందిస్తుంది. ప్రతీకవి యొక్క సమాచారం నేటి పోటీ పరీక్షలన్నింటికి ఉపయోగకరమని చెప్పవచ్చు. కవుల యొక్క జ్ఞాపకాలన్నీ మూటగట్టి, అన్నీ ఒకచోటనే భద్రపరిచినట్టుంది ఈ వ్యాస సంపుటి. జాతీయకవి జాషువా దగ్గర నుండి నార్ల వేంకటేశ్వరరావు వరకు ఈ వ్యాస సంపుటిలో చోటు దక్కించుకున్నాయి. గురజాడ అడుగుజాడలలో నడిచి మానవతావాదిగా ఎదిగిన గిడుగు వైనం, ‘కథలకు మేస్త్రీ మన రావిశాస్త్రి’ అనే శీర్షిక మరింత ఆకర్షణీయముగా సాహితీ ప్రియుల మనసులను దోచుకున్నదని ‘ఈ కలం జ్ఞాపకం’ ద్వారా తెలుస్తున్నది. వ్యాసాలకే వన్నె తెచ్చిన మన కొడవటిగంటి రచనలు వారి జీవిత విధి విధానాలు ఈ సంపుటికి మరింత శోభను తెచ్చాయని చెప్పవచ్చు. ఇలా ఒకటేమిటి ఎందరో సాహితీమూర్తుల వ్యాసాలను తనదైన శైలిలో రచయిత చిత్రించిన విధానం ఎందరికో ఉపయోగకరం. అంతరించిపోతున్న కవితారీతులను తలుపు తట్టినట్టు మదిని తట్టిలేపిన సాహితీ వ్యాస సంపుటిగా ‘ఓ కలం జ్ఞాపకం’ను పేర్కొనవచ్చు. మనకు తెలియని ఎందరో కవుల విషయాలను వారి రచనలు, రచనా విధానాలను తెలపటం సాహిత్యాన్నీ అభిమానించే వారికి చేయూతలా నిలిచింది ఈ జ్ఞాపకం. భమిడిపాటి గౌరీశంకర్ కథా రచయితగా ఎన్నో గొప్ప కథలను రచించి ఉన్నత శిఖరాలను అధిరోహించినా, అంతటితో తన కలాన్ని నిలిపి వేయకుండా మరింత వేగాన్ని పెంచి నిత్య పుస్తక పఠనాభిలాషకుడిగా పేరు పొందుతూ ఈ వ్యాస సంపుటితో మరొక్క మారు అందరి మన్ననలను అందుకున్నారు. “చిరిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో” అన్న వీరేశలింగంగారి మాటలు ఈ పుస్తకానికి వర్తిస్తాయి.
ఎక్కడెక్కడి విషయాలో, ఎన్ని పుస్తకాల సమాచారమో అంతటా శోధించి ఒకేచోటకు తెచ్చిన విజ్ఞానం ‘ఓ కలం జ్ఞాపకం’ పుస్తకాన్ని అందించిన విధానం, అందులో దాగిన ముందుమాటలు, వ్యాసాలకు చక్కని కీర్తిని అందించాయి. సొగసులను చేకూర్చాయి. సాహితీ విజ్ఞానానికి చెరగని చెదిరిపోని ‘ఓ కలం జ్ఞాపకం’.
ఎం. లక్ష్మి,
తెలుగు అధ్యాపకురాలు,
వి.ఏస్.ఎం.కళాశాల,రామచంద్రపురం