భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025 షెడ్యూల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిగే ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. వన్డే వరల్డ్ కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు అర్హత సాధించాయి. టాప్-8లో లేనప్పటికీ పాకిస్థాన్ ఆతిథ్య హోదాలోనూ అర్హత సాధించే అవకాశం ఉంది. కాగా, ఈ మెగాటోర్నీ పూర్తి షెడ్యూల్, గ్రూప్ విభజన దాదాపు ఖరారైంది. జాతీయ మీడియా సమాచారం ప్రకారం, ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అలాగే గ్రూప్-బీలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.
గ్రూప్ దశలో టాప్-లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 5, 6వ తేదీల్లో సెమీస్ జరగనున్నాయి. అనంతరం సెమీస్ విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్‌లో తలపడతాయి. కాగా, గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న న్యూజిలాండ్‌తో, మార్చి 1న పాకిస్థాన్‌తో ఆడనుంది. టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ లాహోర్ వేదికగా ఆడనుంది. భారత్ నాకౌట్స్ దశకు చేరితే సెమీస్, ఫైనల్స్ కూడా లాహోర్‌లోనే ఆడనుంది. కాగా, 2008 అనంతరం పాకిస్థాన్ పర్యటనకు భారత్ ఇప్పటివరకు వెళ్లలేదు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో టీమిండియా పాక్‌కు వెళ్లలేదు. అయితే ఈ సారి టీమిండియా పాక్ గడ్డపై అడుగుపెట్టనుండటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు పాకిస్థాన్ మాత్రం 2011 వన్డే ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్ కోసం భారత్‌లో పర్యటించింది. కాగా, ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు రోహిత్ శర్మనే నాయకత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల బీసీసీఐ సెక్రటరీ జై షా పేర్కొన్న విషయం తెలిసిందే.
భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ (వేదిక: లాహోర్)
ఫిబ్రవరి 20: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్
ఫిబ్రవరి 23: భారత్ వర్సెస్ న్యూజిలాండ్
మార్చి 01: భారత్ వర్సెస్ పాకిస్థాన్