ఆధునిక క్రైస్తవ వాగ్గేయకారుడు డా॥ కె.మహర్షి

సాహిత్యం

తెలుగు సినీ సంగీత ధ్వయం రాజ్-కోటి లకు సహాయకుడిగా 12 సంవత్సరాలు పనిచేసి ఎన్నో జనరంజక పాటలకు ప్రాణంపోశారు మహర్షి గారు. వీరు శివ నాగేశ్వరరావు గారి దర్శకత్వంలో ‘రమణ’, ‘యేసు మహిమలు’ అనే చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసారు. మద్రాసు నుండి చిత్ర పరిశ్రమ మారుతున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం వారి నుండి వీరికి ప్రొఫెసర్ గా అవకాశం వచ్చింది.అలా క్రైస్తవ సాహిత్యంలో ఎన్నో కృతులు రాశారు. విశాఖపట్నంలో క్రైస్తవ శాస్త్రీయ సంగీత కళాశాల ఏర్పాటు చేసారు. కరోనా సమయంలో వెయ్యిరోజులు నిరంతరం సంగీత సాధన చేస్తూ ఎందరో క్రైస్తవులకు ఆన్ లైన్ లో క్రైస్తవ శాస్త్రీయ సంగీతం బోధించారు. శాస్త్రీయ సంగీతంతో కీర్తనలకు స్వరాలు చేర్చి గ్రంథంగా ముద్రించారు. నేడు హైదరాబాదులో శాస్త్రీయ క్రైస్తవ సంగీత కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా మరియు క్రైస్తవ కవి సార్వభౌముడు పురుషోత్తమ చౌదరి 222వ జన్మదిన సందర్భంగా జాన్ క్రిస్టఫర్ కొమ్మలపూడి గారితో ఊటుకూరు వరప్రసాద్ గారు నిర్వహించిన ముఖాముఖి సృజనక్రాంతి పాఠకులకు ప్రత్యేకం.

1. మీ కుటుంబ నేపథ్యం
నా పేరు జాన్ క్రిస్టఫర్ కొమ్మలపూడి. రామచంద్రపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కొనసీమ జిల్లా. నా తల్లిదండ్రులు కొమ్మలపూడి దీవెనమ్మ,జాన్ విక్టర్ గార్లు. వీరిద్దరూ ఉపాధ్యాయులే. నేను మంచి క్రైస్తవ వాతావరణంలోనూ, క్రైస్తవ క్రమశిక్షణలోనూ పెరిగినవాడిని.

2. మీకు సంగీతం పట్ల ఆసక్తి ఎలా కలిగింది.
చిన్నప్పటినుండి సంగీతంలో అభిరుచి ఉండడంతో గురువు ఎవరూ లేకపోయినా ఎవరి దగ్గరా నేర్చుకొనక పోయినా అది సహజంగానే వచ్చిందని చెప్పాలి. చదువుకునే రోజుల్లో అనేక క్రైస్తవ భక్తి పాటలు రాస్తూ స్వరపరుస్తూ వివిధ సంఘాలలో పాడిస్తూ ఉండేవాడిని. అదే సమయంలో నేను గిటార్ వాయించడం మొదలు పెట్టి చాలా ఆర్కెస్ట్రా ప్రోగ్రేమ్స్ చేసేవాడిని. కాకినాడలో ప్రాణలింగం అనే మాస్టారు గారికి ఆర్కెస్ట్రా ఉండేది. వారు నన్ను గిటార్ వాయించడానికి వారి దగ్గర గిటారిస్ట్ గా పిలిచి స్వరాలలో రాసి ఇచ్చేవారు. అలా నేను నెమ్మదిగా స్వరాలు రాయడం నేర్చుకున్నాను. ప్రతీ ట్యూన్ కి స్వరాలు రాయడం అలవాటయింది.

3. సినిమా పరిశ్రమకు ఎలా వెళ్లారు. రాజ్-కోటి గార్లతో మీ అనుబంధం తెలియచేయండి.
రామచంద్రపురంలో డిగ్రీ పూర్తి చేసి విశాఖపట్టణం ఆంధ్ర యూనివర్సిటీలో ఫిలాసఫిలో చేరాను. అక్కడ ఎన్నో ఆర్కెస్ట్రా ప్రోగ్రేమ్స్ చేసేవాడిని. గిటారిస్ట్ గా మంచి పేరుతో పాటు విశాఖపట్టణం ఆల్ ఇండియా రేడియోలో కూడా లలితసంగీతంలో మరియు క్రిస్మస్ పండుగకు ఈస్టర్ పండుగకు నేను స్వరపరచిన పాటలు ప్రసారమవుతూ ఉండేవి. అప్పటిలో సినిమా పరిశ్రమలో చేరాలనే అభిలాష ఉండేది నాకు. ఆ సమయంలో పి.హెచ్.డి. పూర్తి చేసిన తరువాత, అనుకోనివిధంగా చెన్నై (అప్పుడు మద్రాస్) వెళ్లినప్పుడు ఒక సందర్భంలో ప్రముఖ సంగీత దర్శకులు రాజ్-కోటి గారిని కలవడం జరిగింది. వారు నాకు మంచి స్వరజ్ఞానం ఉందని గమనించి, వారి అసిస్టెంట్ గా ఉండటానికి సమ్మతించారు. ఇంక వారితో నా ప్రయాణం దాదాపు 12 సంవత్సరాలు నడిచింది.ఆ సమయంలోనే ఏ.ఆర్.రెహమాన్, మణిశర్మ, హరీష్ జయరాజు మొదలైనవారు కీబోర్డ్ ప్లేయర్ గా ఉండేవారు.వారితో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.
దాదాపు 12 సంవత్సరములు సహాయ సంగీత దర్శకునిగా రాజ్-కోటి గారల దగ్గర 300 సినిమాలకు పనిచేసి, తరువాత దర్శకులు శివనాగేశ్వరరావు గారి “రమణ” అనే చిత్రంద్వారా సినీ సంగీత దర్శకుడనయ్యాను. సినిమా ఇండస్ట్రీ లో నన్ను “మహర్షి” అని పిలుస్తారు. నేను సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలో మురళీ మోహన్ గారు నటించి సమర్పించిన “యేసు మహిమలు” చిత్రం బహుళ ప్రేక్షకాదరణ పొందినది. తరువాత “హాయిహాయిగా”, “ స్టూడెంట్స్”అనే చిత్రాలకు సంగీతం అందించాను.

4. మహర్షి అనే పేరు ఎలా వచ్చింది.
నేను డిగ్రీ చదివే రోజుల్లో పత్రికలకు “కవితలు” రాసేవాడిని. ఆంధ్రజ్యోతి,ప్రగతి, విశాలాంధ్ర,ఆంధ్రప్రభ మొదలగు పత్రికల్లో నా కవితలు వచ్చేవి. ఆ సమయంలో నేను పెట్టుకున్న కలం పేరు “మహర్షి”. ఇంక అందరూ ఆ పేరుతో నన్ను పిలవడం మొదలు పెట్టారు. సినిమాలలో కూడా అదే పేరుతో నా ప్రయాణం సాగింది.

5. సినిమా ప్రపంచాన్ని ఎందుకు వదిలేశారు. మళ్ళీ ఆంధ్రా యూనివర్సీటీ కి ప్రొఫెసర్ గా ఎలా వచ్చారు.
తెలుగు చిత్ర ప్రరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ కి తరలి వెళ్ళడంతో ఒక సందర్భంలో నేను విశాఖపట్టణం రావడం జరిగింది. ఆ సమయంలో ఆంధ్ర యూనివర్సిటీ, ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో స్థిరపడిన నా క్లాస్ మేట్స్ ని కలిశాను. వాళ్ళు ప్రొఫెసర్స్ గా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. వారు నన్ను చూసి చాలా సంతోషించి, నాకు ఫిలాసఫీ లో పి.హెచ్.డి ఉండడం వలన అక్కడ జాయిన్ అవ్వమని చెప్పి, వెంటనే డిపార్ట్మెంట్ లో పేకల్టీ గా తీసుకున్నారు. అలా అధ్యాపకునిగా నా కొత్త జీవితం మొదలయ్యింది.

6. క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ పెట్టాలనే అభిప్రాయం మీకు ఎందుకు కలిగింది
నేను సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు మ్యుజీషియన్ కు, సింగర్ కు అందరికీ స్వరం రాయడం తెలుసు. సంగీత జ్ఞానం అంటే ఒక ట్యూన్ కి స్వరం రాయడం. అలా అందరూ స్వరం రాసుకొని రికార్డింగ్స్ చేస్తారు. అప్పుడు అనుకోని విధంగా నాకొక తలంపు వచ్చింది. క్రైస్తవులకు శాస్త్రీయ సంగీతం తెలియదు. దానికి కారణం ఆ శాస్త్రం అంతా హిందూ మత సాంప్రదాయంలో ఉండడం. అందుకే క్రైస్తవులు ఆ శాస్త్రాన్ని అభ్యసించడానికి ఇష్టపడక దానికి దశాబ్దాలుగా దూరం అయ్యారు.ఆ సమయంలో నేను ఆ సిలబస్ ని క్రిస్టియన్ లిరిక్స్ లోనికి మార్చినట్లయితే అది ముందు తరాలవారికి ఉపయోగంగా ఉంటుందని తలంచి, “క్రైస్తవ శాస్త్రీయ సంగీత దర్పణం” అని ఒక పుస్తకాన్ని రచించాను.
ఆ సమయంలోనే జీవజలములు సంస్థ అధినేత పాస్టర్ షాలేమ్ ఇశ్రాయేల్ అరసవల్లి గారి సహకారంతో ఇంకా చాలా మంది క్రైస్తవ సంఘ కాపరులు, మరియు పెద్దల, యౌవనస్థుల ప్రోత్సాహంతో డిసెంబర్ 6, 2003న విశాఖపట్టణంలో ట్రినిటీ లూధరన్ చర్చ్ లో “క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్” ను స్థాపించటం జరిగింది.
క్రైస్తవులకు శాస్త్రీయ సంగీతం అందుబాటులో లేదనే బాధతో దైవానుగ్రహం వలనను, మరిము దర్శనానుభవము వలనను నేను రచించిన “క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణము” ను పాఠ్యాంశముగా చేసి “క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్” ద్వారా పూర్తి శాస్త్రీయ సంగీతమును ఒక క్రమబద్ధంగా నేర్పించడం జరుగుతున్నది.

7. “క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్”.. “క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఇంటర్నేషనల్” గా ఎలా రూపాంతరం జరిగింది.
2016 లో “ఇథియోపియన్ సివిల్ సర్వీస్ యూనివర్సిటీ” కి “పబ్లిక్ పోలసి” ప్రొఫెసర్ గా ఇథియోపియన్ కేపిటల్ అయిన “అడిస్ అబాబా” కు వెళ్ళడం జరిగినది. అక్కడ ప్రొఫెసర్ గా 4 సంవత్సరాలు ఉద్యోగంచేసి 2020లో ఇండియాకు వచ్చాను. నేను ఇండియాకు వచ్చిన కొద్దిరోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా “కరోనా” వ్యాపించి అందరూ ఎవరిళ్ళల్లో వాళ్ళు బందీలుగా ఉన్న రోజులవి. నా క్రైస్తవ సంగీత విద్యార్థులంతా నాకు ఫోన్ చేసి ఆన్ లైన్ లో సంగీత క్లాసులు నిర్వహించమని బతిమాలారు. జూమ్ ఆన్ లైన్ లో ఏప్రిల్ 14, 2020న కేవలం క్రైస్తవ చిన్నలకు పెద్దలకు ఆన్ లైన్ లో తరగతులు ప్రారంభించాను. ఆన్ లైన్ తరగతులలో కేవలం మన తెలుగు రాష్ట్రాలే కాకుండా యు.ఎస్, యు.కె, కెనడా, సింగపూర్, దుబాయ్, మొదలగు దేశాల నుండి అనేకమంది విద్యార్ధులు ఈ ఆన్ లైన్ తరగతుల్లో చేరడంతో సంస్థ పేరును “క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఇంటర్నేషనల్” గా మార్చడం జరిగినది. 1000 రోజులుపాటు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ఇంట్లో నుండే ఆన్లైన్ క్లాసులు నిర్వహించినందుకు “ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్” లో నా పేరు నమోదయ్యింది.

8.“ఆంధ్ర క్రైస్తవ కీర్తన” లకు ఇటు ఇండియన్ మరియు వెస్ట్రన్ స్వరాలు సమకూర్చాలని మీకు ఎందుకు ఆలోచన కలిగింది.
నా చిన్న తనము నుండి క్రైస్తవ ఆరాధనలలో పాల్గొంటూ,మహానుభావులు, ప్రముఖ క్రైస్తవ వాగ్గేయకారులు రచించి స్వరపరచిన “ఆంధ్ర క్రైస్తవ కీర్తన” లను పాడుకుంటూ పెరిగినవాడిని. ఆ కీర్తనలను ఏదో సమయంలో పాడుకోకుండా వుండలేను. ఈ కీర్తనలు అన్నీ క్రైస్తవ డినామినేషన్స్ లో కూడా పాడుకుంటారు. 200 సంవత్సరాలుగా ఎంతో బహుళాదరణ పొందిన క్రైస్తవ కీర్తనలు ఇవి. అంతేకాకుండా ఆ కీర్తనలను రచించి, స్వరపరచి, పాడినవారిని క్రైస్తవ వాగ్గేయకారులు అంటారు. వీరిలో రెవ. పురుషోత్తమ చౌదరి గారు ఎంతో ప్రసిద్ధులు. వీరు తమతమ కీర్తనలకు రాగం, తాళం శాస్త్రబద్ధంగా తెలియచేసారు. అయితే వాటికి స్వరాలు ఇవ్వలేదు. ఈ కీర్తనలు సాహిత్యపరంగా సంగీతపరంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
ఇప్పటికీ ఆ కీర్తనలలో ఉన్న అద్భుతమైన సాహిత్యం,పదాల పొందిక,మాధుర్యము,భక్తి భావము,ధ్యానము గ్రహిస్తూ..మన పరిశుద్ధ గ్రంధమైన బైబిల్ లోని సారాంశముతో ఎంతో ఉన్నతంగా మనకు అందించిన ఆ మహానుభావులకు చేతులెత్తి నమస్కరించాలి. వాళ్ళు పురుషోత్తమ చౌదరి గారు, పులిపాక జగన్నాధం గారు, మిక్కిలి సమూయేలు గారు, పంతగాని పరదేశి గారు, మల్లెల దావీదు గారు, బేతాళ జాన్ గారు, గొల్లపల్లి నతానియేలు గారు, బొంతా సమూయేలు గారు, అల్లారి పెద్ద వీరాస్వామి గారు,పసుపులేటి దావీదు గారు, చెట్టి భానుమూర్తి గారు, మోచర్ల రాఘవయ్య గారు, కడియం గాబ్రియేలు గారు, ఏ బి. మాసిలామణి గారు ఇలా ఎందరో మహానుభావులు.
అందుచేత వాటికి ఇటు ఇండియన్ మరియు వెస్ట్రన్ స్వరాలు సమకూర్చి ఒక గ్రంధంగా చేయాలని ఆశించి ఆ పని చేయగలిగాను. ఆ గ్రంధాన్ని, “శాస్త్రీయ సంగీత తెలుగు క్రైస్తవ కీర్తనలు” గా ఓ.ఎం. ప్రచురణ ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అంతే కాకుండా ఆ గ్రంధాన్ని ఒక సిలబస్ గా ఈ కాలేజ్ లో భోధించడం జరుగుతున్నది. విద్యార్ధులు ఈ కీర్తనలను స్వరాలతో పాడతారు. అనేక ఇంగ్లీస్ కేరల్స్ ను మనం ఆ వెస్ట్రన్ నోట్స్ చూసి పాడుతున్నాము. అలాగే విదేశాలలో ఉన్న క్రైస్తవులు కూడా మన తెలుగు పాటలు నేర్చుకోవాలనీ, పాడుకోవాలనీ ఒక పట్టుదలతో ఈ కార్యం తలపెట్టాను.

9. ఈ కాలేజ్ కు అకడమిక్ గా సర్టిఫికేట్ కోర్స్ ను తీసుకొని రావడం కోసం మీరు ఈ సంస్థను హైదారాబాద్ లో కూడా స్థాపించాలని ఆలోచనకు కారణం.
ప్రభుత్వ పరిధిలో రెండు తెలుగు రాష్ట్రాలలో “సంగీత కళాశాలలు” ఉన్నాయి. వారిచ్చే సర్టిఫికేట్ కు విద్యాపరంగా గుర్తింపు ఉంది. అయితే క్రైస్తవులు ఈ అవకాశం కోల్పోతున్నారు. కేవలం ఆ శాస్త్రం మరియు సిలబస్ హిందూ సాంప్రదాయాలలో ఉండడం వలన క్రైస్తవులే ఆ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి ఇష్టత చూపించడం లేదు. దానివలన సంగీత అభిరుచి ఉన్న అనేక మంది క్రైస్తవులు ఈ అవకాశాన్ని ముఖ్యంగా ఈ శాస్త్రీయ విద్యను కోల్పోతున్నారు. అందుకే ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి ఒక యూనివర్సిటీకి అనుబంధ సంస్థగా చేయాలనే ఉద్దేశ్యంతో క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్న హైదరాబాద్ నగరంలో వివిధ డినామినేషన్స్ కు చెందిన బిషప్స్, సంఘ కాపరులు మరియు పెద్దల సహకారంతో ప్రారంభించాలని అనుకుంటున్నాను.
దానికి సంబంధించి అందరినీ ఒక సమావేశంగా తీసుకొని రావాలని వారందరి సహాయ సహకారంతో సెప్టెంబర్ 5న పురుషోత్తమ చౌదరి గారి జయంతి సందర్భంగా “ఆంధ్ర క్రైస్తవ కీర్తనల” పోటీని జంట నగరాలలో రెవ. డా॥ జీవన్ కుమార్ పాస్టర్ గారు మరియు పెద్దల సహకారంతో, వారి ఆధ్వర్యంలో “లూథరన్ చర్చ్, లక్దికపూల్, హైదరాబాద్ లో నిర్వహిస్తున్నాము.

10.మీరు చేసిన ఈ సేవ నిమిత్తము మీకు దక్కిన గౌరవాలు
నేను చేసిన ఈ కృషిని గుర్తించి జీవజలములు రేడియో & మీడియా పరిచర్యలు, విశాఖపట్టణం వారు నాకు ఆనరరీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు. సెయింట్ పాల్ థియలాజికల్ కాలేజ్ లో మాస్టర్ ఆఫ్ థియాలజీ మరియు మాస్టర్ ఆఫ్ డివినిటీ విద్యార్ధులకు క్రైస్తవ సంగీతం బోధించినందుకు గాను బెంగళూర్ ఏ.సి.టి. ఎస్. హయ్యర్ ఎడ్యుకేషన్ వారు “రెవరెండ్” గా నన్ను గౌరవించారు.

11. మీరు సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు ప్రసిద్ధ గాయకులతో క్రైస్తవ గీతాలు పాడించి చాలా ఆల్బమ్స్ చేయించినట్లుగా తెలిసింది. అది ఎవరెవరితో.
నేను సినిమా సంగీతం చేపట్టినప్పుడు అనేక క్రైస్తవ ఆల్బమ్స్ రిలీజ్ చేసాను. వాటిలో ఒక ఆల్బమ్ “మన చర్చ్ పాటలు” (ఇంగ్లీష్ పాటలు తెలుగులో అనువాదం) నాలుగు భాషలలో ఆ పాటలను ప్రసిద్ధ సినీ సంగీత నేపధ్య గాయకులు శ్రీ యస్.పి.బాల సుబ్రహ్మణ్యం గారితో పాటు అనేక మంది గాయకులు పాడారు.

12. మీరు రచించిన ఇతర అకడమిక్ బుక్స్ గురించి.
నేను గూగుల్ స్కాలర్ ని కూడా. ఫిలాసఫీకి సంబంధించి కొన్ని బుక్స్ రాశాను. కొన్ని జనరల్స్ కి బోర్డ్ మెంబర్ గా ఉన్నాను. గూగుల్ లో డా॥ జాన్ క్రిస్టొఫర్ కొమ్మలపూడి అని సెర్చ్ చేస్తే నా గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయి.

డా.కె. మహర్షి (డా. జాన్ క్రిస్టఫర్ కొమ్మలపూడి) ఫౌండర్ & డైరెక్టర్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఇంటర్నేషనల్, విశాఖపట్టణం వారితో మాట్లాడాలనుకుంటే 94936 36057 కు ఫోన్ చేసి మీ స్పందన తెలియజేయవచ్చు.

 

 

ఇంటర్వ్యూ: డా. ఊటుకూరు వరప్రసాద్
99121 31327

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *