చదువు కోసమో, ఉద్యోగం కోసమో ఏదో ఒక పని మీద నగరంలో బతకడం అనేది నేడు అనివార్యత అయ్యింది.చాలామంది అనుకుంటున్నట్టు నగరం విషనాగు కాదు. నగరానికి.. పిలిచి అన్నం పెట్టడం తెలుసు. పని చూపించడం తెలుసు.
సినిమా ఆర్టిస్టుల కన్నీటి జీవితాలకు అద్దం పట్టే హైదరాబాద్ లోని కృష్ణానగర్ లో నివసించే జీవితాల గురించి రావెళ్ళ రవీంద్ర రాసిన ‘కృష్ణానగర్ వీధుల్లో’ కథలు నగరం ఆత్మను కళ్ళకు కట్టి చూపే కథలు. ఆధునిక జీవిత సంక్షోభాలను, ప్రేమరాహిత్యపు క్షణాలను చూపించిన కథలు.
_______
‘కృష్ణానగర్’ అనగానే సినిమా ప్రపంచమే గుర్తొస్తుంది. ఇంట్లో చెప్పకుండా, చెప్పినా ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నామని వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఒక్క సినిమా ఛాన్స్ వస్తే జీవితం మారిపోతుందని సినిమానే నమ్ముకున్న ఆర్టిస్టులకు,గ్లిజరిన్ లేని కన్నీళ్ళకు అడ్డా కృష్ణానగర్. రావెళ్ళ రవీంద్ర రాసిన ఈ కథల్లో సినిమాతో సంబంధం ఉన్న ఆర్టిస్టుల గురించి రాసిన కథలు మూడు కథలతోపాటు మిగిలినవి సినిమాతో సంబంధం లేని కృష్ణానగర్ వీధుల్లో రచయితకు ఎదురైన జీవితాలను అక్షరబద్ధం చేశారు.
_______
కోరికలకు, ప్రేమలకు మధ్యనుండే పల్చటి తెరను తొలగించి విడమరిచి చెబుతున్న కథలివి.ఒక వైపు ప్రేమకు దూరమైన బాధను అనుభవిస్తూనే, పరిస్థితులను అర్థం చేసుకుంటూ దూరంగా జరిగి జీవితాన్ని జీవించే ప్రేమికులు మనకు కనబడుతారు ఈ కథల్లో.
చూడడానికి బాగానే ఉన్నారు. నిగనిగలాగే ఒత్తైన గడ్డం. స్టైలిష్ గా కనబడే కళ్ళద్దాలు. వీళ్ళకేం బాధలుంటాయిలే అన్నట్టుగా కనబడే గుండె పగిలిన యువకుల కథలు ఈ సంపుటిలో చదవవచ్చు. ఇవి కేవలం ‘కృష్ణా నగర్’ కే పరిమితమైన కథలు కావు. అనేక నగరాల్లో దర్శనమిస్తున్న మెట్రో కథలు.
ఈ సంపుటిలోని కథల్లో సిగరెట్ లాగ సగంసగం కాలిపోతున్న ప్రేమికుల ఆశలు ఉన్నాయి. వెన్నెల రాత్రులు, వెన్నెలలు లేని రాత్రులూ -రెండూ ఉన్నాయి. కథల్లోని పాత్రలు గుర్తుండవు కానీ పాత్రలు అనుభవించిన పెయిన్ వెంటాడుతూ ఉంటుంది. ఐ లవ్ యు నుంచి ఐ మిస్ యు దాక తొలిప్రేమలోని ఉద్వేగాలను, ప్రేమికుల మధ్య మౌనాన్ని అనువదిస్తే ఈ కథల్లా ఉంటాయి. మనో వైజ్ఞానిక శాస్త్ర పరికరాలతో ఈ కథలను విశ్లేషించగలితే ఇప్పటి తరాన్ని,ఇప్పటి ప్రేమలను,ఇప్పటి మానవ సంబంధాలను సులభంగా అర్ధం చేసుకోగలుగుతాము.
ప్రాంతీయ అస్తిత్వం,మాండలిక జీవ భాషలతో ఇప్పటి తరం నుంచి కథలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో నగర జీవితాన్ని కథా వస్తువుగా ఎన్నుకోవడం,అందులోనూ అత్యంత సంక్లిష్టమైన లైంగిక సంబంధాల మీద మాట్లాడడం రవీంద్ర కథల్లోని వైవిధ్యం. వాస్తవిక జీవితం నుంచే ఈ కథలు పుట్టాయి అని చెప్పడానికి ఈ కథల్లో ‘కృష్ణకాంత్ పార్కు’ సాక్షి సంతకం పెడుతుంది. భార్యాభర్తలైనా, స్నేహితులైనా, ఇంకా ఏ బంధమైనా ఎందుకు తెగిపోతుంది? అసలు చిక్కంతా ఎక్కడుంది?మనుషులు అవసరాలకు ఉపయోగపడే వ్యక్తులు -అని అనుకోవడంలోనే ఉందని తేల్చి చెబుతున్నాడు ఈ కథకుడు.
***
నిజానికి ఇరవై ఐదేళ్ళ యువ కథకుడు రాస్తున్న ప్రేమ కథలో ఏముంటాయి? బాల్యం, తొలిప్రేమల నాటి అనుభవాలు అని అనుకుంటాం సాధారణంగా. కానీ రవీంద్ర కథల్లో సున్నితమైన అంశాలను నేపథ్యంగా తీసుకొని కథలుగా మలిచిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు. కథలలో సంభాషణలు, వాడిన భాష కథకు రక్తమాంసాలిస్తాయి. యువతరం మాట్లాడుకునే సహజమైన భాషను, బ్యాచిలర్ లైఫ్ ను తన కథల్లోకి తీసుకొచ్చాడు. “కృష్ణానగర్ వీధుల్లో”. కథలన్నీ ప్రేమనే ఇతివృత్తంలాగ అనిపించినా వేటికవే భిన్నమైనవి.
“వెన్నెల కురిసిన కాలం” కథలో రవీంద్ర తీసుకున్న ఇతివృత్తం మిగతా ప్రేమకథలకు భిన్నంగా ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ.ఈ కథలో శరీరంతో వ్యాపారం చేస్తూ నచ్చినట్టు బతికేస్తున్న అమ్మాయి నిత్య. నమ్మిన వాళ్ళే తన శరీరంతో ఆటలాడుతుంటే పూర్తిగా మోసపోయి రాయిలాగా బతుకుతున్న అమ్మాయి. పదహారేళ్ళకే తల్లిదండ్రులు,ఎవరికో కట్టబెడితే ఆ పశువుతో వేగలేక కృష్ణానగర్ వచ్చిన గతం తనది. ఆమెతో ఒకసారి అవసరం తీర్చుకోవడం కోసం పోయినవాడు వీర. వీర తనను కేవలం ఒక సెక్స్ డాల్ గానే చూడడు. తనను ప్రేమిస్తాడు.తనే లోకంగా బతుకుతాడు.ఇది వరకులా ఎవరి దగ్గరకు పోవద్దని ప్రేమతోనే చెబుతాడు. కానీ, డబ్బు అవసరం నిత్యను గీత దాటిస్తుంది. అయినా ప్రేమిస్తాడు. ఇంత దాక తన శరీరంతో ఆడుకున్న మగాళ్ళను చూసిన నిత్య,వీర దగ్గర తనలాగ జీవించింది. వెన్నెల కురిసింది. జీవితాంతం గుర్తుండిపోయే వెన్నెల రాత్రులు. వెన్నెల రాత్రులే కాదు అమావాస్య చీకటి కూడా ఉంటుందని గుర్తు చేస్తుంది కాలం. వెన్నెల కురిసిన కాలం షార్ట్ ఫిల్మ్ తీయదగిన గొప్ప కథ. ఈ కథ చదివితేనే గానీ నిత్య-వీర.. జీవితాంతం కలిసుంటారా లేదా అనేది తెలుస్తుంది.
ఎంతో ప్రేమించి, కుటుంబాన్ని ఎదిరించి పెళ్ళి చేసుకున్న ప్రేమజంట -మూడు నెలలయిన గడవక ముందే ఎందుకు విడిపోయారో చెప్పే కథ “తీరం దాటి వెళ్ళి పోయాక”. ఒకప్పుడు తానే సర్వస్వం అనుకున్న మనిషి, రోజురోజుకు ఎందుకు దూరం పెడుతున్నాడో అర్థం కాని మానసిక క్షోభ ఈ కథలోని కాన్ ఫ్లిక్ట్. ఈ సంఘర్షణే కథను ఇష్టంగా చదివిస్తుంది.
“లూప్” మరొక విషాద ప్రేమకథ. కులం ఒకటి కాదని ఆమె ‘నో’ చెబుతుంది. ఆమెకు వేరొకడితో పెళ్ళవుతుంది. పెళ్ళాయ్యాక మళ్ళీ తన మాజీ ప్రియుడితో రిలేషన్ షిప్ కొనసాగించాలని అనుకుంటుంది. అపుడు అతడి నిర్ణయం ఎలా ఉంటుందనేది ఈ కథలోని ఇతివృత్తం. అపార్టుమెంట్లో జరుగుతున్న కొన్ని గొడవలను చూసి, తనకు దూరంగా ఉండాలనుకుంటాడు అరుణ్. ఈ కథలోని అరుణ్ చాలా పరిణతి చెందిన పాత్ర.
ప్రేమ లేకుండా జీవించడం – కుటుంబంలో ఎంత పెద్ద తుఫాన్ కు దారి తీస్తుందో ‘సెకండ్ మ్యారేజ్’ కథ ద్వారా వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు కథకుడు. కథ మొత్తం ఇద్దరు స్త్రీలు మాట్లాడుకునే సంభాషణలతోనే సాగటం కథలోని శిల్పపరమైన ప్రయోగం. మొదట ‘శారీరక సుఖం కోసం లేచిపోయి వచ్చింది’ అనుకున్న మనిషే ‘మంచి పని చేశావు’ అని చివరికి అనుకోవడం వెనుక స్త్రీ ఎలాంటి పీడనకు గురవుతుందో,అసలు స్త్రీ తన జీవితమంతా ఏం కోరుకుంటుందో ఈ కథలో చెప్పాడు.
***
ఒంటరిగా ఉన్నప్పుడు మనిషి లోపల సుడులు తిరిగే ఆలోచనలే కథను నడిపించిన సందర్భాలు ఉన్నాయి. ‘స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్’(చైతన్య స్రవంతి ) రూపంలో తన కథనం ఉంటుంది. రవీంద్ర కథల్లో ఎక్కువగా కనబడేది ‘ఫ్లాష్ బ్యాక్’ కథనం. మన ముందు ఉన్నట్టే ఉండి,ఆలోచనలు- వేల కిలోమీటర్ల దూరాలను దాటివస్తాయి. ఏ ప్రేమ ఎక్కడి దాక వస్తుందో, ఏ ప్రేమ ఏ మలుపులో ఏ దారి తీసుకుంటుందో తెల్వదు. గాయం ఒకటే నిజమని మాట్లాడుతాయి.
మైట్రో వేగంతో కదిలిపోయే కథాకథనం రవీంద్ర కథల్లోని ప్రత్యేకత. వెన్నెల కురిసిన కాలం, కృష్ణానగర్ పిల్లర్ నెంబర్ 1550, లూప్ మొదలైన కథలను ఉత్తమ పురుషలో రాయడం రవీంద్ర చేసిన సాహసమనే చెప్పాలి.
ఒక పాత్రను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనుకున్నట్లు కనపడదు. తనలాగ తాను, స్వేచ్ఛగా జీవించే పాత్రలు, ఉన్నదున్నట్టు చెప్పుకునే పాత్రలు కనబడుతాయి. కొన్ని విషయాల మీద ఉన్నదున్నట్లు మాట్లాడితే ఏమనుకుందో అనే భయాలను దాటి రాసిన కథలివి. ‘వెన్నెల కురిసిన కాలం’ కథలోని వీర పాత్ర,’లూప్’ కథలోని అరుణ్ పాత్రలు మనకు బాగా గుర్తుండిపోవడం వెనుక ఆ పాత్రల్లోని సహజత్వం కారణం.
_____________
రవీంద్ర కవి కావడం వలన కొన్ని సంభాషణలు చదువుతుంటే కవిత్వం చదివిన ఉద్వేగం, అనుభూతి కలుగుతుంది. కొన్ని కథల్లో కవిత్వం ఓదార్చిన క్షణాలు కనబడుతాయి. ఎప్పుడో రాసిపెట్టుకున్న కవిత్వ పాదాలు ఈ కథల్లో ప్రత్యక్షమై కథకు ప్రాణశక్తినిస్తాయి. కవితాత్మకంగా వాక్యాన్ని అల్లిన నేర్పు, అలవోకగా జీవిత సత్యాలను మాట్లాడడం చూసినప్పుడు ఇవి పరిణతి చెందిన గొప్ప కథకుడు రాసిన కథల్లా కనబడుతాయి.
_____________
“కోరుకున్న వాళ్ళ నుండి ప్రేమ దొరకకపోతే జీవించడమూ మరణించడమూ ఒకేలా ఉంటుంది.” ప్రేమకు సంబంధించిన ఇలాంటి వాక్యాలు ప్రతీ కథలోనూ పాఠకుడికి దర్శనమిస్తాయి. ఇవి కథకుడి తాత్త్వికమైన చూపును పరిచయం చేసే వాక్యాలుగానే పరిగణించాలి.
ఈ కథలు చదువుతుంటే..మనల్ని ప్రాణంగా ప్రేమించిన ఎంతోమంది మనుషులు, మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన మనుషులు,మన చుట్టుపక్కల ఉండే మనుషులు గుర్తొస్తారు. అలాంటి మనుషులను చూసినప్పుడల్లా ఈ కథలూ గుర్తొస్తుంటాయి. మంచి కథలను అందించిన రావెళ్ల రవీంద్రకు శుభాకాంక్షలు.
-తగుళ్ళ గోపాల్,
95050 56316