పఠనానుభవానికి అక్షర రూపం ‘మధుశ్రీలు చదివాక…’

సాహిత్యం

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్ఫూర్తితో కలం పట్టి, తన అనుభవాలకి, ఆలోచనలకి, పరిశీలనలకి అక్షర రూపం ఇస్తూ కథలు, వ్యాసాలు రాసినప్పటికీ, తెలుగు సాహితీ లోకంలో అంతగా వినిపించని పేరు మధునాపంతుల వెంకటేశ్వర్లు (1935-2019). ‘మధుశ్రీ’ కలం పేరుతో ఈయన రాసిన 58 కథల్ని ‘మధుశ్రీలు’ అనే సంకలనంగా ప్రకటించారు, 2011లో. ఈ కథలన్నీ 1950-72 మధ్య రాసినవే. ఎందుకంటే, 1972 తర్వాత ‘మధుశ్రీ’ మరి కలం పట్టలేదు!

కవిగా సాహితీ ప్రయాణాన్ని మొదలు పెట్టి, విశ్లేషకుడిగా, విమర్శకుడిగా,విస్తరిస్తూ వస్తున్న అవధానులు మణిబాబు, ఈ మధుశ్రీలు చదివాకా తనకి కలిగిన పఠనానుభవాన్ని సాహిత్యాభిమానులు అందరితోనూ పంచుకోడానికి చేసిన ప్రయత్నమే ‘మధుశ్రీలు చదివాక…’యాభై నుంచి డెబ్బై ఏళ్ళు పైబడి వయసున్న కథల్ని, ఎక్కడా ఏ సాహితీ విమర్శకీ, పరామర్శకీ లోనుకాని కథల్ని, ఒక యువ సాహిత్యాభిమాని చదివిన దృష్టి కోణాన్ని తెలుసుకోగలగడం ఆసక్తిని కలిగిస్తుంది.

ఉపమేయం మధుశ్రీలు, మరి ఉపమానం? నాటి కథల్ని నేడు కొలవాలంటే ఏ పరికరాలు ఉపయోగించాలి?? మణిబాబు తాను చదివిన కథలు, కవితల్లో తనకి గుర్తొచ్చిన వాటిని ఉపమేయాలుగా స్వీకరించారు. వాటిలో కొన్ని మధుశ్రీలు రాసిన కాలంలోనే వెలువడినవి కాగా, చాలా కథలు, కవితలు గత రెండు మూడు దశాబ్దాల్లో ప్రచురణ పొందినవి. తెలుగు, ఇంగ్లీష్, సంస్కృత సాహిత్యం మాత్రమే కాక, కొన్ని సినిమాలూ, సినిమా పాటలూ కూడా ఉపమానాలు అయ్యాయి.

ఈ కృషి కారణంగా ‘మధుశ్రీలు చదివాక …’ పుస్తకాన్ని చదివే పాఠకులకి కలిగే ప్రయోజనాలు స్థూలంగా రెండు. మొదటిది, మధుశ్రీలు చదవకపోయినా ప్రస్తావించిన ఉదాహహరణల ఆధారంగా ఆయా కథల్ని ఊహించుకోవచ్చు. రెండవది, మధుశ్రీలు తో పాటు ఉదాహరణలు కూడా తెలియనివే అయితే అనేక కథలు, కవితలు, విమర్శ వ్యాసాలని గురించి రేఖామాత్రపు అవగాహనని సాధించవచ్చు.

‘కవి నిరంకుశుడు’ అంటారు కానీ, నిజానికి పాఠకుడు నిరంకుశుడు. ఒక రచన మీద తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేది పాఠకుడే. ఎందుకంటే తన విలువైన డబ్బుని, సమయాన్నీ, రచనని కొని చదవడం కోసం ఖర్చు చేశాడు కాబట్టి. ‘మధుశ్రీలు చదివాక…’ ఆసాంతమూ మణిబాబు మనకి నిరంకుశ పాఠకుడిగానే కనబడతారు. తనకి నచ్చిన కథల్ని ఎంతగా నెత్తిన పెట్టుకున్నారో, నచ్చని వాటిని బాగోలేదని చెప్పడానికి ఎక్కడా మొహమాట పడలేదు. అంతేకాదు, అవి తనకి ఎందుకు నచ్చలేదో సాదోహరణంగా చెప్పారు కూడా. ఈ నిర్మొహమాటం, పుస్తకం విలువని పెంచింది.

కొన్ని కథలకి ఐదారు ఉదాహరణల వరకూ ఇచ్చుకుంటూ వెళ్లి, మరికొన్నింటికి ఒకటి రెండుతోనే సరిపెట్టేయడం, ఇంకొన్నింటికి ఉదాహరణలే లేకపోవడం కనిపిస్తుంది. ఈ పాఠకుడి దృష్టిలో ఆయా కథల తాలూకు ప్రాప్తి అంతే కావచ్చు, బహుశా. ‘ఏముందీ పుస్తకంలో’ అనే ఆసక్తిని కలిగించే శీర్షికతో అధ్యాయాన్ని పారంభించి, పాఠకులకి మధుశ్రీని పరిచయం చేసి, వెంటనే ‘చిన్నగా కొన్ని కథలు చెప్పుకుందాం’ అంటూ నేరుగా విషయంలోకి తీసుకుపోవడం, అటు పైని ‘కట్నం కథలు’, ‘కలలు- భ్రమలు’, ‘గుమస్తా కథలు’, ‘దెయ్యాల కథలు’, ‘స్వీయ అభిప్రాయ ప్రకటన కోసం రాసిన కథలు’, ‘పురాణాలు-ప్రాచీన సాహిత్యం’, ‘కొన్ని సాధారణ కథలు’ అధ్యాయాల మీదుగా ‘శీర్షికలు, ఎత్తుగడలు, పలుకుబడులు’ పరిచయం చేసి ‘చివరికి ఏమంటానంటే’ అంటూ పుస్తకాన్ని ముగించారు. ఈ అధ్యాయాల తాలూకు విషయసూచిక ఇచ్చి ఉంటే బాగుండేది.

____________

అనేక కథల చుట్టూ కొమ్మచ్చులాడినా, ఉదాహరణని ఎక్కడ ఆపాలో కచ్చితంగా అక్కడే ఆపి పాఠకులని మళ్ళీ మధుశ్రీలు లోకి తీసుకు రావడం మెచ్చుకోవాల్సిన విషయం. ఈ తూకం కారణంగా పాఠకులు ఎక్కడా విసుగు చెందే ప్రమాదం లేదు. మణిబాబు పుస్తకం ఆసాంతమూ ‘ఈ కథని గురించి నాకు ఇలా అనిపించింది. ఇది చదివినప్పుడు ఫలానా రచన గుర్తొచ్చింది. ఇది నా అనుభవం, అనుభూతి’ అని చెబుతారే తప్ప, ‘ఈ కథని గురించి మీరూ ఇలాగే ఆలోచించాలి’ అని పాఠకులని నిర్బంధించరు. ఇది చాలా హాయైన విషయం.
_____________

పరిశోధన, సమీక్ష, విమర్శ, విశ్లేషణ, పరామర్శ, ఇలా ఏ చట్రంలో ఇముడుతుందో ఇదమిద్దంగా చెప్పేందుకు వీలుకాని రచన ఇది. “ఒక సాహితీ ప్రకియలో ఇమడ్చాలి” అన్న ఆలోచన కన్నా, “పఠనానుభవాన్నీ, అనుభూతినీ అందరితోనూ పంచుకోవాలి” అన్న తపనతో రాసిన పుస్తకమని చదవడం పూర్తి చేశాక మనకి అర్ధమవుతుంది. ఈ కోవలో మరిన్ని రచనలు రావడానికి ఈ ‘మధుశ్రీలు చదివాక…’ ఒక మార్గదర్శి కాగలదు.

-కె.ఎన్. మురళీ శంకర్
94401 34256

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *