‘ఆత్మనిర్భర్‌’లో భాగంగా డేటా సెంటర్లు

జాతీయం

దేశీయంగా డేటా భద్రంగానే ఉంటుంది
టెలీకమ్యూనికేషన్‌ స్టాండరైజేషన్‌ అసెంబ్లీని ప్రారంభించిన మోడీ
న్యూఢల్లీి : నాలుగేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్‌ టెలీకమ్యూనికేషన్‌ స్టాండరైజేషన్‌ అసెంబ్లీ`2024 ఈవెంట్‌ ఈ ఏడాది దిల్లీలో అట్టహాసంగా మొదలైంది. ఈ ఈవెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఎగ్జిబిషన్‌లోని స్టాళ్లను పరిశీలించారు. దేశీయ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు నిర్వహించే ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ ఈవెంట్‌ 8వ ఎడిషన్‌ను కూడా ఈ కార్యక్రమంలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా డేటా సెంటర్ల గురించి రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ ప్రస్తావించారు. ’ఆత్మనిర్భర్‌’లో భాగంగా.. డేటా సెంటర్లను భారత్‌లో నెలకొల్పే సామర్థ్యం ఉన్నందున అవి దేశంలోనే ఉండాలని ఆకాశ్‌ అన్నారు. డేటా సెంటర్‌ పాలసీ 2020 ముసాయిదాను నవీకరించే పక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో భారత్‌లోని డేటా మొత్తం ఇక్కడి డేటా సెంటర్‌లోనే ఉంటుందన్నారు. భారత్‌ ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆకాశ్‌ అంబానీ అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా ప్రతి రంగంలోనూ ముందుకెళ్లేందుకు ఏఐ ఓ విప్లవాత్మక సాధనమని పేర్కొన్నారు. అందుకే ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ డేటా సెంటర్‌లు ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. మొదటిసారి భారత్‌లో జరుగుతున్న డబ్ల్యూటీఎస్‌ఏ కార్యక్రమంలో పాల్గొనేందుకు 190 దేశాల నుంచి 3,000 మంది పారిశ్రామిక, సాంకేతికత నిపుణులు హాజరయ్యారు. ’ది ఫ్యూచర్‌ ఈ నౌ’ థీమ్‌తో నిర్వహిస్తున్న ఈవెంట్‌లో 120కి పైగా దేశాల నుంచి 400కు పైగా ఎగ్జిబిషన్లు, 900కు పైగా స్టార్టప్‌లు ప్రదర్శించారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి సింధియా దేశీయ టెలికాం గురించి మాట్లాడారు. భారత్‌లో టెలికాం అనేది కేవలం వినోద మాధ్యమం కాదని బ్యాంకింగ్‌ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కీలకమైన సమాచారం, గ్లోబల్‌ కమ్యూనిటీతో కనెక్ట్‌ అయ్యే సదుపాయాల కోసం వేగంగా విస్తరించిందన్నారు. 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోందన్నారు. స్పామ్‌ కాల్స్‌ పెరుగుతున్న తరుణంలో వీటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రముఖ వ్యాపారవేత్త కుమార్‌ మంగళం బిర్లా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *