నిదుర పో… నిదుర పో… నిదుర పో.. నిదురపోరా తమ్ముడా!’ ఆపాత ఆ పాత మధురమైన పాటను వినని, గుర్తుంచుకోని తెలుగు సినీ సాహిత్య ప్రియులుండరు. ‘‘సంతానం’’ చిత్రంలోని ‘నిదురపోరా తమ్ముడా!’ అనే పాటను లతా మంగేష్కర్ పాడిన మొదటి తెలుగు సినిమా పాటగా చాలా మందికి పరిచితమే. అయితే ఈ పాటను అనిసెట్టి రాశారని మాత్రం అందరికీ తెలియకపోవచ్చు. అనిసెట్టి పూర్తి పేరు అనిసెట్టి సుబ్బారావు శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, డా.సి.నారాయణరెడ్డి వంటి సినీ కవుల లాగే సినీరంగ ప్రవేశానికి ముందే అనిసెట్టి అభ్యుదయ కవిగా ప్రసిద్ధుడు. ‘అగ్నివీణ’, ‘బిచ్చగాళ్ల పదాలు’ వంటి కావ్యాలు, ‘గాలిమేడలు’, ‘మాఊరు’ వంటి నాటకాలు, ‘చెప్పు కింద పూలు’, ‘చరమాంకం’ వంటి నాటికలు మొదలైనవి అనిసెట్టి పేరు చెప్పగానే చప్పున స్ఫురించే రచనలు. అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడక ముందే నవ్య కళాపరిషత్తు ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత అ.ర.సం కార్యవర్గ సభ్యుడిగా 1973లో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శిగా, అభ్యుదయ కవిత్వంతో పరిచయమున్న వాళ్లెవరూ అనిసెట్టిని మర్చిపోరు.
అనిసెట్టి మానవతా వాది. ఆయనను మానవతా వాది అనడంకంటే జీవ కారుణ్యవాది అనడం సబబు అని కె.వి.రమణారెడ్డి అనేవాడు. అనిసెట్టి కవితల్లో కరుణ శాస్త్రీయ మానవతావాదమని సోమసుందర్ అన్నాడు. ‘బిచ్చగాళ్ళ పదాలు ‘ కవిత చదివిన చేకూరి రామారావు ‘‘అసలు ఈ అనిసెట్టి అభ్యుదయ కవేనా?’ అని శంకించాడు. అభ్యుదయ కవి అంటే ఒక చట్రంలో ఉండిపోవడమే కాదని, పార్టీ పాలసీలని, సంఘ నియమావళికి వ్యతిరేకమని భావించని అనిసెట్టి గాంధీజీ హత్య చేయబడ్డప్పుడు, స్టాలిన్ మరణించినప్పుడు ఆయన రాసిన విషాద గీతాలే అందుకు సాక్ష్యం. కవిగా స్పందించ వలసిన సమయంలో స్పందించని కవి కవేనా? అని లోకానికి చాటిన కవి. డా.పి.వి.సుబ్బారావు తన సిద్ధాంత వ్యాసంలో ‘‘ప్రత్యేకించి చిరునామాలేని చిన్నారి అనాథ బాలలు, బిచ్చగాళ్ళు, వేశ్యలు, శ్రామికులు, కార్మికులు. తినడానికి తిండిలేక అలమటించే దీనులు అనిసెట్టి కవిత్వంలో సాక్షాత్కరిస్తారు’’ అని వ్యాఖ్యానించడం గమనిస్తే, ఆయన ‘అనిసెట్టి సాహిత్యానుశీలనం’ మాత్రమే కాకుండా ‘అనిసెట్టి హృదయానుశీలనం’’ కూడా చేశాడనిపిస్తుంది. నవ్యాంధ్ర సాహిత్య వీధులు సంకలన కర్తలు చతుర్ధ భాగంలో అగ్నివీణ కావ్యాన్ని సమీక్షించి అనిసెట్టి కవితా రీతులను లోకానికి ఎరుకపరచారు. నాగభైరవ కోటేశ్వరరావు అభ్యుదయ కవిత్వంలో అనిసెట్టి స్థానాన్ని తెలియజేస్తూ ‘‘అభ్యుదయ కవిత్వం ఒక తాజ్‌మహల్ అనుకుంటే, దానికి రాళ్ళెత్తిన ఐదుగురు కూలీలలో అనిసెట్టి ఒకరౌతారు’’ అన్నాడు. శ్రీశ్రీ ‘‘అభ్యుదయ కవిత్వోద్యమానికి ‘అ-ఆ’ లు ‘అనిసెట్టి-ఆరుద్రలు’ అన్నాడు.
తెలంగాణ ఉద్యమంలో నిజాం నిరంకుశ చర్యలను నిరసిస్తూ కాళోజీ, దాశరధి, వట్టికోట ఆళ్వారు స్వామి వంటి తెలంగాణ ప్రాంత కవులు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని తమ కవితలతో ప్రజలను ప్రేరేపించి జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. నవాబు దారుణాలను నిరసిస్తూ పరోక్షంగా ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనకుండానే ఆంధ్ర ప్రాంత అభ్యుదయ కవులయిన సోమసుందర్ ‘వజ్రాయుధం’, ఆరుద్ర ‘త్వమేవాహం’, అనిసెట్టి ‘అగ్నివీణ’, గంగినేని ‘ఉదయిని’, రెంటాల గోపాలకృష్ణ ‘సంఘర్షణ’, ‘సర్పయాగం’ వంటి కవితా సంపుటాలు వెలువరించి, నిజాం నిరంకుశ చర్యలను నిరసిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించారు.
అనిసెట్టి సుబ్బారావు అక్టోబరు 23 వ తేదీన 1922 లో నరసరావుపేటలో సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ, కోటిలింగం గార్లు. ఆయన విద్యాభ్యాసం నరసరావుపేట మునిసిపల్ ఉన్నత పాఠశాలలో సాగింది. కుందుర్తి, రెంటాల, మాచిరాజు దేవి ప్రసాదులు ఆయన సహాధ్యాయులు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం, స్వామి కేశవతీర్థలు ఆయన సీనియర్ విద్యార్థులు. అనిసెట్టి 1941 లో గుంటూరు ఏ.సి కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. 1941 నుండి 1947 వరకు అనిసెట్టి వివిధ పత్రికల్లో ప్రచురించిన కవితా ఖండికల్లో కొన్నింటిని ‘అగ్నివీణ’ కవితాసంపుటిగా 1949 సం.లో ప్రచురించాడు. అప్పటికి ఇంకా శ్రీ శ్రీ మహాప్రస్థానం పుస్తక రూపంలో రాలేదు.
అగ్నివీణ కావ్యంలోని కొన్ని కవితలను చూద్దాం. పీఠిక లాంటి ఒక ఆరంభ గీతంలో ‘‘నరబలిలో చిరపీడనలో/ గుడిలో యంత్రపు దోపిడిలో/ హతులౌ పతితుల ప్రాణజ్వాలలతో/ లోకపు చీకటి కన్ను తెరుస్తూ/ నూత్న మానవునికూపిరి పోస్తూ/ అసత్య హింసల ద్వేషిస్తూ/ సమధర్మం పాటిస్తూ’’ అంటాడు. అనంత కాలంగా సాగుతున్న పీడన అనే హేయమైన నరబలులలో గుడిలోను యంత్రపు దోపిడిలోను మరణించిన వాళ్ళను పతితులైన వారి ప్రాణ జ్వాలలను వెలికిదీసి లోకంలో పరుచుకున్న చిమ్మచీకటిని పారద్రోలాలని ఆకాంక్షించాడు అనిసెట్టి. ఎందరో ప్రాణత్యాగం చేసిన అజ్ఞాత వీరుల అభినందన సందేశమే అగ్నివీణ అంటాడు.
అలాగే ‘‘రంపమెత్తి రాళ్ళు కొట్టి/ ఊరుకట్టి దారివేసి/ కొమ్మలేని చెట్టుక్రింద కుమిలిపోకు లెమ్ము సఖా లేచి రమ్ము’’ అని పిలుపునిస్తాడు. కూలీలు ధనమదాంధులకు ఆకాశ హర్మ్యాలు నిర్మించడమే కాకుండా, ఆ భవనాలకు రహదార్లు నిర్మించి, వారు మాత్రం ఏ చెట్టుకొమ్మల నీడనో కాలం వెళ్ళబుచ్చడం సహించలేక ఇంకా ఎందుకు ఈ దుఃఖం లే! లేచిరా! అని పిలుపునిస్తాడు. ఇంకా మీకు సంశయం వలదంటూ ‘‘నా రక్తం ధారవోసి/ నవలోకం స్థాపిస్తా’’ ధైర్యంగా రా! రమ్మంటాడు. ఆశావహ దృక్పధం వ్యక్తం చేస్తూ ‘‘మన త్యాగాలు వృధా కావని/ ముందు తరాలు ఋణవదన/ మృదుహాసం చేస్తున్నవి’’ అంటూ రాబోయే తరాలు హాయిగా చిరునవ్వులు చిందించే రోజు వస్తుందని ఆకాక్షిస్తాడు.
పీడిత మానవులకు భరోసానిస్తూ నిలబడ్డానని, వారికి శాంతిని, క్రాంతిని ప్రసాదిస్తానని హామీ ఇచ్చే కవితలో ‘‘నా కపాల గోళంలో లైట్ హవుసులున్నాయి/ కాంతి రేఖ నా దృష్టి/ మానవులకు శాంతి, క్రాంతి మర్మాలకు ప్రసరిస్తా/ అలజడి, ఆకలి, ఇష్టం, ఈర్ష్య ఇలా అకారాదిగా/ సంఘర్షించే నిర్మించే/ మానవుణ్ణి చూస్తాను, గ్రహిస్తాను’’ అంటాడు. క్రాంతిని శాంతిని మర్మాలకు అంటే ఎవరూ తాకని చోట్లకు కూడా ప్రసరింపజేసే దీపం తనలో ఉందని బడుగు జీవులకు భరోసానిస్తూ సరిక్రొత్త వినూత్న సమాజాన్ని దర్సిస్తాను అంటాడు.
తెలంగాణా పోరాటంలో సైనికుల హింసాత్మక కాండను నిరసిస్తూ ఆవేశంగా ‘‘ఒక్క శిశువేడ్చినా ఒక గింజ దోచినా/ ఉరిమి పిడుగుల్లాగ విరుచుక పడండి’’ అంటాడు. నవాబు పండిరచిన పంటలన్నీ శిస్తు రూపంలో దోచుకుంటున్నాడని ఆవేదన చెందుతూ ‘‘బంగారు పంట రైలెక్కి పోయెను నాడు/ కడుపు మంట కన్నీరు మిగిలె’’ అంటాడు. రైతు, శ్రీరాముడు ఒకే విధమైన వారని ప్రస్తుతిస్తూ ‘‘రండి రాముల్లారా! రండి రైతుల్లారా!’’ అంటూ ‘‘రాక్షసుడు రావణుడు పీడిరచక జానకీ యోగమ్ము లేనె లేదు రండి’’ అంటాడు. అంటే ఇక్కడ జానకి అంటే భూమాత, భూమి నుండి పుట్టినది. పంటలు సైతం భూమి నుండి వచ్చేవే! రావణుడనే నైజాము పిశాచి భూములను దోచుకున్నాడని, దాన్ని విడిపించే శక్తి రాముడు అంటే రైతన్నలకే ఉందని అన్యాపదేశంగా చెప్తాడు అనిసెట్టి.
అనిసెట్టి స్త్రీలపై జరిగే దారుణ మారణ కాండలను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తాడు. ‘‘ఇంటింటా ఒక దీపం/ ఎందుకారిపోయిందో/ ఏ పిశాచి నిశ్వాసం/ శపించింది దీపాన్ని/ కొడిగట్టిన వత్తిలాగా పడి ఉందే’’ అంటాడు. ఆ సమయంలో ప్రతి ఇంటిలోనూ స్త్రీలు కొడిగట్టిన దీపాలై బ్రతుకుతున్నారని, ఈ దీపం అలా ఉండడానికి కారణం నైజాము పిశాచి అని నిరసిస్తాడు. అలాగే నవాబుకు ఇంక ఆఖరి దశ సంప్రాప్తమైందన్న సందేశమిస్తూ ‘‘వనిత నంటిన మదాంధునకు గతిలేదింక/ గమిడి తొక్కిన నియంతలకు గతిలేదింక’’ అంటూ నవాబుకు అధోగతే మిగిలిందని ధైర్యం చెప్తాడు. ఇలా అనిసెట్టి అగ్నివీణ కావ్యంలొ సామ్యవాద ధోరణులను, అభ్యుదయ భావనలను పుష్కలంగా క్రుమ్మరించాడు.
చివరిగా ఒక్క మాట అనిసెట్టి కష్టజీవుల పక్షపాతి. పుట్టింది ఆగర్భ శ్రీమంతుల ఇంట్లోనే గాని అతడు తన చుట్టూ వున్న ఆగర్భ దరిద్రుల ఆర్తనాదాలనే విన్నాడు. తండ్రి కోటి లింగం శ్రీమంతుడు. నరసరావుపేటలోనూ, చిలకలూరిపేటలోనూ ఆయిల్ మిల్లులు, అనేక స్వంత లారీలు ఉండేవి. ఆ మిల్లులోని పనివాళ్ళు ఒకసారి సమ్మె చేస్తే అనిసెట్టి తండ్రిని కాదని కార్మికుల పఖం తరఫున మాట్లాడి తండ్రికి కోపం తెప్పించాడు. అనిసెట్టికి రావలసినంత కీర్తి ప్రతిష్టలు రాలేదంటే అతనికి ప్రతిభ లేక కాదు. కొన్ని స్వయంకృతాపరాధాలు. అగ్నివీణ అనిసెట్టి రాసిన కవిత్వ సంపుటి అని చెబితే గానీ ఎవరూ తెలుసుకోలేనంత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దాన్ని గమనించే డా.సోమసుందర్ ‘‘అగ్నివీణ ఆలపించి అణుసంగీతం వినిపించిన కవి’’ అనే విశ్లేషణాత్మక వ్యాసం రాయడం, రాజమండ్రి సన్మాన సభలో కంటతడి పెట్టడం కూడా జరిగింది. రాబోయే తరాల రచయితలు అనిసెట్టి తొలిదశను ఆదర్శంగాను, మలిదశను గుణపాఠంగాను తీసుకోవాల్సి ఉందన్న సోమసుందర్ మాటలు సత్యం. అభ్యుదయ జ్యొతి అనిసెట్టి సుబ్బారావు గారు 27 డిసంబర్ 1979 న స్వర్గస్తులయి, అందరికీ అక్షరవియోగం కల్పించారు.
(23 అక్టోబర్ అనిసెట్టి సుబ్బారావు జయంతి)
– డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య
