ముకుంద రామారావుగారు నిరంతర అధ్యయనశీలి. సమాజ పరిశీలనలో, సాహిత్య పరిశోధనలో నిర్విరామ కృషీవలుడు. అనువాద రచనల గురించి తలచుకోగానే ముందుగా స్ఫురించే పేరు ముకుంద రామారావు గారిదే. ఆ రంగంలో వారిది అపూర్వమైన విజయం. ‘అదే ఆకాశం’, ‘అదే గాలి’, ‘అదే నేల’, ‘అదే కాంతి’, ‘అదే నీరు’ పేర్లతో వారు వెలువరించిన దేశదేశాల కవిత అనువాదాలు అనన్య ప్రాచుర్యాన్నీ, ప్రసిద్ధినీ వహించాయి. అవన్నీ వందల పేజీల ఉద్గ్రంథాలు. ఇలా 16 అనువాద గ్రంథాలు కాక, స్వీయకవిత్వం ఇప్పటికే 8 సంపుటాల్లో వచ్చింది. ఇప్పుడు ఇదిగో ‘రాత్రి వీస్తున్న గాలి’ సంపుటం వెలువడింది.
____________
ఈనాటి కవిగా, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ, సమూహాల్నీ, మనుషుల్నీ ‘అనుభవించటం’లో తనదైన ‘ముద్ర’ కలిగినవారు రావుగారు. ‘మేమూ మా భోజనపు బల్లలు’ సామాజిక పరిణామాల కారణంగా నలుగురు కూచుని భోజనం చేసే ఆ నాటి ఆనందాలు కనుమరుగయ్యాయి. దానికి అనుగుణంగా భౌతిక వస్తువులూ, పదార్థాలూ కూడా వాటి ప్రాథమ్యాన్నీ, ప్రాధాన్యాన్నీ కోల్పోతున్నాయి. రావుగారి కవిత్వం ఈ ‘స్థితి’నీ, ‘గతి’నీ మాత్రమే వింగడించి ఊరుకోదు. ఆ ‘పరిస్థితి’లోని మనుషుల్ని అక్కున చేర్చుకుంటుంది.
______________
‘ఈ సారి వచ్చినప్పుడు/ పెద్దది చిన్నదిగా/ చిన్నది పెద్దదిగా చేసుకోగలిగే బల్లలేవో తెస్తామన్నారు పిల్లలు/ అవునా అని ఆశ్చర్యపోయాం’… ఇక్కడి వరకూ సరే యథాస్థితి, పరిణామ స్పృహ వచ్చింది. ఆ తర్వాతి పాదాలు- ‘అవసరానికి అనుగుణంగా / ప్రాణమున్న మనం కూడా / అలా మారిపోగలుగుతే / ఎంత బాగుండును నిజంగా !’ అంటూ ఒక ఆర్ద్ర స్పర్శ నిచ్చి చదువరిని అంతర్ముఖీనుని చేస్తుంది కవిత. అతి నిరాడంబరంగా, సున్నితమైన మానసిక పరిచర్యని అక్షరీకరించే కవిత్వ లక్షణానికి ఇది ఉదాహరణ!
‘వర్షాభినయా’న్ని ఆస్వాదించగలిగిన కవి ‘మేఘాల మధ్య ప్రేమ/ అందరికీ తెలిసేలా తళతళ మెరుపులై/ ఉరుములై ప్రకటిస్తాయి’ అనగలిగారు. ‘అతను- ఆమె’ లోని నిజస్వరూపాల్ని ఆవిష్కరించగలిగారు. ‘ఆదివారం నాటి జంతు ప్రదర్శనశాల విలక్షణతనీ అందించగలిగారు. అలాగే తమ ‘లో’ చూపుతో ‘ఆదివాసీలు’ని చూసి, పలకరించి, చివరికి ‘వారు ఏది మాటాడినా/ వారికి తెలియకుండా/ మాటాడేది/ మాటాడించేది / వారిలోపలి భాషే’ అని ఒక రహస్యతంత్రీ నినాదాన్ని వినిపించగలరు. విశేషమేమంటే అతి సాధారణ చూపరులకు అతి సామాన్యంగా కనిపించే ‘ఇల్లు’-ఈ కవికి మనిషి ధ్యాసనూ, శ్వాసనూ కవితాత్మకం చేస్తూ కనిపిస్తుంది. ‘మట్టి చర్మం/ నీటి చర్మం/రాయి చర్మం/ చెట్టు చర్మం/ అంతా కలిసి / ఇంటి శరీరాన్ని’ నిలబెట్టిన వైనాన్నీ, ఆ ఇంటివాళ్ల రహస్యాల్ని తనలో దాచుకొనే వైనాన్నీ, బయటికి మాత్రం దర్జాగా, దర్పంగా కనిపించే నిజస్వరూపాన్నీ తెలుపుకుంటుంది!
రావుగారి సమాజ పరిశీలనం చాలా దిక్కుల్నీ, రెక్కల్నీ చూస్తుంది. ఆ పరిశీలన ఆత్మ మాత్రం కవిత్వాన్ని వెలారుస్తూనే బయల్వెడలుతుంది. ఎలా అంటే ‘అతిక్రమణల భయం లేకుండా / పిల్లల పెన్సిల్ కింద /ఎన్నెన్ని దేశాలు తయారవుతున్నాయో’ అన్నట్టు.. చదవగానే వెన్ను జలదరిస్తుంది. సాహిత్య విజ్ఞత కలిగిన చదువరికి కవిత్వ సామగ్రిలో ఉత్ప్రేక్షలూ, అతిశయోక్తులూ వాటి మధ్యవిరిసే సహజోక్తులూ, ఉపమాలూ వంటి చాలా అంశాలు ఠక్కున మనసున ముసురుతాయి. రావుగారు నిఖార్సయిన కవిత్వాన్ని ఎంత క్లుప్త సుందరంగా శిల్పీకరించగలరో చూపటానికి ఇలాంటి ముక్తకాలు కొన్ని నిదర్శనాలుగా నిలుస్తాయి. ఇలాంటి ‘ఏవేవో ఆలోచనలూ’ మరికొన్ని ఉన్నాయి.
ఈ అనుభవ చిత్రణకు సాక్షీభూతంగా నిలిచే ఒక అపూర్వ కవిత- ‘దుకాణంలో…’ – ఈ సంపుటిలో వున్నది.
‘చేతి మేజోళ్ళలో వేళ్ళు లేవు
చెప్పుల్లో కాళ్ళు లేవు
వేలాడదీసిన చొక్కా నిక్కర్లకు శరీరాలులేవు
అవన్నీ ఆయా భాగాల కోసం
ఎదురుచూస్తూనే ఉన్నాయి
ఏవి అందులో దిగి చూసుకుని
వదిలేస్తాయో ఏవి వాటిని తీసుకుపోతాయో
వాటిని అమ్మేవాడికి కొనేవాడికీ
ఎవరికీ తెలియదు
అంతంత స్వామి భక్తిలో
ఒద్దికగా పడున్న
ఆ విభిన్న అందాలు
రోజుకొక జాతరలో
ఎవరి పరమవుతాయో’ !
కవి చూపులోని నిశితదృక్కు సరే, సామాజికమైన అమ్మకం కొనుగోలు స్పృహ కూడా సరేసరి. మొదటి నాలుగు వాక్యాల్లో వొదిగిన ఊహ, దానికి కవి పొదిగిన అభివ్యక్తీ మన మేధలో దృశ్యాదృశ్యాల అలజడిని రేపి సంభ్రమింపజేస్తుది. ‘రవి గాననిచో కవి గాంచునే గదా’ కి పరమోదాహరణ ఈ కవిత! ఇంకా రావుగారు సాండియాగో కొండల్నీ అనుభవైకవేద్య దృశ్యాల్ని చేశారు. కొడుకుని జాలరిని చేయరాదని వేడుకొనే జాలరి తల్లినీ మన కళ్లముందు నిలిపారు. యాభై వసంతాల తమ దాంపత్య సరళిలో సతీమతల్లి పాత్రనీ ఆరాధించారు.
‘రాత్రి వీస్తున్న గాలి’ అనగానే సహజంగానే ఒక అనుభూతి స్పర్శ చదువరిని పులకరింపజేస్తుది. ఆ శీర్షిక గల కవితే కాక సంపుటిలోని చాలా కవితల్లో రావుగారి వ్యక్తిత్వ సౌమ్యత అక్షర పవనాల్ని వీచింది. ఆహ్లాదకరమైన ఆత్మీయానుభూతిని అందించింది. సంపుటిలో మొదటి కవితే ‘అనుభూతి-అనుభవం’. కవి కలవరింతల పంక్తిరథంలా చరణాలు సాగుతాయి. ‘కిటికీమీద కన్నీరులా జారుతున్న చినుకులతో మొదలై… ‘శరీరానికి నిద్రలా / శబ్దాల డొల్లతనాన్ని మోసుకొస్తున్న నిశ్శబ్దం’ అంటూ ముగుస్తుంది. ఈ నిశ్శబ్ద శబ్ద సంచలనం, అదృశ్య దృశ్య తారట్లాట – ‘ఎవరికీ తెలియకుండా/చురుకుగా గమనిస్తూ యోచిస్తున్నది- ‘తలలోని మరో కన్ను!’ ఇదీ కవిత్వభాష, సాధారణ జనానికి ఒక అలభ్యమైన అంతర్లోక వీక్షణం. ‘స్పర్శరేఖ’ అని ఒక ఖండిక – ‘నువ్వూ నేనూ’ మధ్య మంద్రస్థాయిలో సాగే ఒక రహస్తంత్రీ నాదాన్ని అనుభూతి సాంద్రంగా ఆవిష్కరిస్తుంది.
మనిషిగా కవి ఎప్పుడూ పురాస్మృతుల్లో బందీయే. విడిపించుకోలేని శృంఖలాల గతాన్ని కవితామయం చేసి ఊపిరి పీల్చుకుంటాడు. నిరామయంగా, నిస్పృహని మీటుతాడు. అందుకనే రావుగారు కూడా ‘గత జీవితం ఎప్పుడూ, జ్ఞాపకాల సమాహారం కదా’ అనేసి, ‘ఎవరికైనా అసంపూర్ణమైన నిర్మాణమే కదా గతం’ అని నిట్టూర్పు విడిచారు.
_____________
కవిత్వం గురించి రాయని కవి ఎవరున్నారు కనుక! సంపుటిలో కవిత్వం గురించీ, కవి మననధారలోని అనేక పార్శ్వాల పట్టకం గురించి నాలుగు పద్యాలున్నాయి. ‘కవితగా వెలుగు చూపించడడానికి మొలకెత్తిన విత్తనం కవి’ అని నిర్వచించి, ‘మంటలా కవిత్వానికి ఎన్ని నాలుకలో అయినా పల్లపు నీరులా జారిపోతుంటుంది’ అని ‘కవిత ప్రభావం’ని ఉపమించారు.
______________
జీవిలో చైతన్యకీల నిలిచినంతకాలం ఎప్పుడో అప్పుడు ‘కోహం’ స్పృహ పొటమరించక తప్పదు. కవి దాని వెలుగుని చదువరులకీ పంచుతాడు. అందుకనే ‘కవి’ ఈ తాత్త్విక సంవేదనను తప్పించుకోలేడు. అందునా ఆ ‘కవి’ రావుగారి లాంటి చింతనాపరుడైతే దాని వ్యక్తీకరణ – అనివార్యమై అక్షరాల కెక్కుతుంది.
‘రాలుతున్న ఆకుల్ని చూసి
రాలని ఆకులు నవ్వుకుంటాయి
రాలుతున్న ఆకులూ నవ్వుకుంటాయి
మీరూ మా వెనుకే రాబోతున్నారని
రాబోయే ఆకులకు
రాలిపోయిన ఆకులకు
అవేవీ వినిపించవు’
-ఇదీ ఏడు పాదాల జీవన లీలాహేల! దాదాపు 15 ఖండికల్లో ప్రస్ఫుటంగా కనిపించే ఈ విచికిత్స, సత్యాన్వేషణా దృష్టి- కవిగా ముకుంద రామారావుగారి సాహిత్యోన్నతిని చూపుతుంటే, వ్యక్తిగా వారి గంభీర స్థితప్రజ్ఞను నిరూపణ చేస్తున్నది.
అచ్చమైన కవి అక్షరాల్లో అసలైన ‘కవిత్వం’- ప్రాణహ్లాదనంగా అవతరిస్తుంది! అదే జరిగింది ఈ ‘రాత్రి వీస్తున్న గాలి’లో! కొని చదివి ఆనందించండి!
-విహారి
98480 25600