‘విశ్వకవి’ – ‘మహాకవి’ ఇద్దరూ ఇద్దరే..!

విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ 1901లో వెలువరించిన నైబేద్య (నొయిబేద్య) లోని ప్రార్థనాగీతం ‘భారతేర్ సేయీ స్వర్గే కొరొ జాగరిత’. దానిని ఆయనే ఆంగ్లంలోకి అనువదించి 1912లో ఇంగ్లీషు గీతాంజలిలో పొందుపరిచారు. రవీంద్రుని గీతాంజలి రచన ఆయనను విశ్వకవిగా చేసింది. 1913లో స్వీడిష్ అకాడమీ రవీంద్రుని ప్రతిష్టాత్మకమైన నోబుల్ బహుమతితో గౌరవించింది.

కొరొ జాగరిత (బెంగాలీ కవితలో కొన్ని పంక్తులు)

ప్రార్థన

చిత్త జెథా భోయ శూన్, ఉచ్చజెథా శిర్
జ్ఞాన జెథా ముక్తా, జెథాగృహేర్ ప్రాచీర్
అపనొ ప్రాంగణతలే, దిబస శర్వరీ
వసుధేర్ రాఖేనాయ్, ఖండక్షుద్ర కోరి,
…… ….. …..
భారతేర్ సేయీ స్వర్గ కొరొ జాగరిత’

ఆంగ్లం:
Where the mind is without fear and
the head is held high
Where knowledge is free
Where the world has not been
broken up in to fragments by narrow
domestic walls
Where words come out from the
depth of truth
Where tireless striving stretches its
arms towards perfection

Where the clear stream of reason
has not lost its way into the dreary
desert sand of dead habit
Where the mind is led forward by
thee into ever widening thought and action
Into that heaven of freedom, my
father let my Country awake.

ఈ ప్రార్థన గీతానికి శ్రీ బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం చేసిన తెలుగు అనువాదంలో కొన్ని పంక్తులు.

“ఎచట మనస్సు నిర్భయంగా ఉండగలదో/ ఎచట మనిషి ఆత్మవిశ్వాసంతో తలయెత్తుకు తిరుగగలడో/ ఎచట జ్ఞానానికి ఎటువంటి ఆటంకము లేదో/ ఎచట లోకము ఇరుకైన అడ్డుగోడలవల్ల చిన్న చిన్న గదులుగా చీలిపోలేదో/ అటువంటి స్వేచ్ఛాధామమైన భూతల స్వర్గములో/ మనదేశాన్ని మేల్కొననిమ్ము తండ్రీ”
——————-
రవీంద్రుడు స్వేచ్ఛా భారతంలోని సమాజాన్ని గూర్చి కలలు కన్నాడు. ఆ సమాజం మనిషి మనిషిని గౌరవించే పథాన నడిపిస్తుంది. మనిషిని ఆత్మవిశ్వాసంతో తల ఎత్తుకు తిరిగేటట్లు చేస్తుంది. స్వేచ్ఛా భారతంలో ప్రజ..సంకుచిత భావాలు లేనివారే నిర్మల మనస్కులై సత్యవాక్కులై ఉంటారు. అది ఒక భయంలేని ప్రపంచం, మూఢాచారాలు లేని సమాజం, కష్టించి పనిచేసే సమాజం, మనుషులు తమపనిలో పరిపూర్ణతను సాధించే దిశగా అడుగులు వేసే సమాజం. అటువంటి భూతల స్వర్గంగా మనదేశం మారాలని టాగోర్ కల !
———————–
***

ఆధునికాంధ్ర సాహిత్య యుగకర్త, మహాకవి గురజాడ అప్పారావు రాసిన “ముత్యాలసరాలు” గేయం 1910వ సంవత్సరంలో ఆంధ్రభారతిలో ప్రచురణ అయింది. 1910లో రాసిన “దేశభక్తి” గేయం 1913లో కృష్ణాపత్రికలో వెలువడింది. ఈ కవితలలో గురజాడ భవిష్యత్ ప్రపంచ పటాన్ని ఆవిష్కరించాడు. ఒక కొత్త బంగారులోకం కోసం ఆయన కలలు కన్నాడు.

“చూడు, మును మును మేటివారల
మాటలనియెడు మంత్ర మహిమను,
జాతి బంధములన్న గొలుసులు జారి
సంపదలుబ్బెడున్”

యెల్లలోకము వొక యిల్లై వర్ణభేదము లెల్ల కలై వేల నెరుగని ప్రేమబంధము వేడుకలు కురియ మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అంత స్వర్గ సుఖంబులన్నవి యవని విలసిల్లున్” (ముత్యాల సరములు)

గురజాడ దర్శించింది – ప్రకటించింది విశ్వమానవ ప్రేమ. ఆ ప్రేమ అన్ని దేశాలను కలుపుతుంది. మతాలు, మతశాఖలు, జాతులు, కులాలు, వర్గాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. మానవుడు వివేకంతో జ్ఞానంతో నడుస్తూ ఉంటే అపుడు లోకం అంతా స్వర్గంలాగ, సుఖమయంగా ఉంటుంది.

గురజాడ దేశభక్తి గేయం – కేవలం ఒక్క భారతజాతిని, దేశాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినది కాదు. ప్రపంచ మానవజాతిని ప్రబోధిస్తూ, మార్గనిర్దేశనం చేస్తూ రాసిన గేయం. దేశభక్తి గేయంలో ప్రధానంగా మనిషినే ప్రస్తావించాడు గురజాడ. ఆ మనిషి జాతి, మతం, దేశం- ఏదైనా కావచ్చు. గేయంలో ఎక్కడా భారతదేశ చరిత్ర గానీ, ఈ దేశానికి చెందిన నదీ నదాలు – కొండల ప్రస్తావనలు గానీ కనిపించవు.

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా !
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్…
పాడిపంటలు పొంగిపొర్లే దారిలో
నువు పాటుపడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్
కండకలవాడేను మనిషోయ్

ఓర్వలేమి పిశాచిదేశం
మూలుగులు పీల్చేసెనొయి,
ఒరులమేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయి
స్వంతలాభం కొంతమానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్.
చెట్టపట్టాల్ పట్టుకుని
దేశస్థులంతా నడువవలెనోయి,
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయి !
మతం వేరైతేను యేమోయి ?
మనసులొకటై మనుషులుంటే
జాతియన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్.
దేశమనియెడు దొడ్డవృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయి
నరుల చెమటను తడిసి
మూలం ధనం పంటలు పండవలెనోయి !”
_____________
గురజాడ కవితాపంక్తులు మానవతా సందేశాన్ని, విశాలార్థంలో విశ్వమానవ ప్రేమగీతిని ఆలపిస్తున్నాయి. ప్రేమమంత్రాన్ని సమాజానికి అందించాయి. పేదరికంలేని ప్రపంచం, భయం తెలీని ప్రపంచం, ఈర్ష్య, ద్వేషాలు మటుమాయమైన సమాజం, మూఢ విశ్వాస ప్రవర్తనలేని ప్రపంచం,వెరసి ఒక మరోప్రపంచాన్ని కవి కోరుతున్నాడు. సమస్త మానవాళిని తన రచనలతో మేల్కొలుపుతున్నాడు.
_______________

Scotland దేశానికి చెందిన తత్త్వవేత్త థామస్ కార్లైల్ 1840వ సంవత్సరంలో తన Hero as a poet అనే వ్యాసంలో కవిని ఒక నాయకుడిగా, ప్రవక్తగా అభివర్ణిస్తాడు. ప్రజాగణానికి నాయకుడైన కవి.. తన కవితాశక్తితో సమాజంలో స్ఫూర్తిని రగిలించగలడని ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించగలడని చెప్పాడు. లోకాన్ని దర్శించటంలో ఉండే ప్రత్యేకమైన దృష్టిని గురించి కార్లైల్ మాట్లాడాడు. ఎంత గొప్ప దృష్టి ఉంటే కవి అంత గొప్ప నాయకుడూ, నడిపించేవాడూ కాగలడు. అతడు ప్రజలు నడవవలసిన దారి, వచ్చే మజిలీ, గమ్యస్థానమూ కూడా నిర్ణయించగలడు. ఇదే విషయాన్ని గురజాడ తన ‘సౌదామిని’లో కూడా రాసుకోవటం గమనించవలసిన విషయం. “కవీ, ప్రవక్తా ఎల్లప్పుడూ కాలం కంటే ముందే ఉంటారు”. (సౌదామిని)

ఇరుకైన అడ్డుగోడలు, వ్యర్థ కలహాలు, స్వంతలాభం చూసుకునే స్వార్థపరులు ప్రజల జీవనాలని సంక్షుభితం చేస్తున్నా సుమారు నూట ఇరవై ఏళ్ల క్రింద విశ్వకవి రవీంద్రుడు, మహాకవి గురజాడ చూపిన దివిటీ వెలుగుల్లో నవ సమాజం మెల్ల మెల్లగా రెక్కలు విప్పుకుంటోంది. ప్రజకు భావి బాటను నిర్దేశించటంలో ‘విశ్వకవి’- ‘ప్రజాకవి’ ఇద్దరూ ఇద్దరే !

 

 

-డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి
90787 43851