అనుభవాల సరసిలో అనుభూతి అలలు

సాహిత్యం

బాణాల శ్రీనివాసరావు కవిత్వం ‘ఆచూకీ’ ని బాగా పట్టుకున్న చింతనాపరుడు. కవిత్వానికి ‘పర్యాయపదం’ ని కూర్చిన అచ్చమైన సాహితీకృషీవలుడు. ‘కుంపటి’ పొగ, సెగ గుండెల్లో ఆరని వెతల్ని రగిల్చి ఉసురు తీసే వైనాన్ని ఆర్తితో కవిత్వీకరించిన జీవితానుభవశాలి. తన కవిత్వం ఏమిటో సాహితీలోకానికి వెల్లడించి ప్రశంసల్నీ, ప్రథితనూ గడించిన కవి. ప్రాథమికంగా శ్రీనివాసరావు అధ్యయనశీలి, అక్షర కృషీవలుడు. రాసేది రాశికంటే వాసిలో మిన్నగా రావాలనే చిత్తశుద్ధిగల కవి. శ్రీనివాసరావు 2023లో తెచ్చిన కవితా సంపుటి ‘రాత్రి సింఫనీ’. దీనిలో 40 కవితలు ఉన్నాయి.

‘కవిత్వం కాలాతీత కాంతిరేఖ’ అన్నారు సోమసుందర్. ‘లుప్తమై పోవాలి /లిప్తకాలం/ కవిత్వం చదివిం తర్వాత’ అన్నారు శ్రీనివాసరావు. అంతేగాక, ‘నిన్ను కదిలించే / కవిత్వపాదాల్ని కనుపాపల కద్దుకొని /నాటుకోవాలి/ మనోమైదానంలో’ అని ప్రగాఢమైన వాంఛితాన్నీ, కవిత్వ ప్రయోజనాన్నీ ప్రసరణ చేశారు. ముందు అనుభూతిమయమై, ‘లుప్తమై’ తర్వాత ‘కదిలించి’, ‘అనిర్వచనీయతని’, ‘మనోమైదానం’ లో ఆచరణాత్మకంగా ‘మొక్కయి’ విరియవేయాలి, కాయజేయాలి. ఫలాన్ని ఇవ్వాలి. అప్పుడే అది ‘కాలాతీత కాంతిరేఖ’ గా వెలుగుతుంది. సోమసుందర్ నిర్వచనానికి శ్రీనివాసరావు ఒక ‘ప్రాసెస్’ ని కూర్చారు! ‘బాధలోంచి వచ్చే భావమే కవిత్వం, వేదనలోంచి వచ్చే నాదం కవిత్వం’ అని నినదించారు. దీనికి ఉదాహరణగా ‘రాత్రి సింఫనీ’ సంపుటిలోని ఖండికల్లో కవిత్వం వెలిగి నిలిచిన లక్షణం పుష్కలంగా కనిపిస్తున్నది. దీనికి కారణం ఆయన వ్యక్తిత్వంలో, సాహిత్య వ్యక్తిత్వంలో నిలుపుకుంటున్న ప్రాపంచిక దృక్పథం.

శ్రీనివాసరావు లోకం పోకడని నిశితంగా పరిశీలిస్తున్న ఆధునికుడు, సమాజంతో మనిషి అనివార్యంగా చేస్తున్న బాహ్యంతర సంఘర్షణల్నీ ‘లో-చూపు’ తో ఆలోచనం చేస్తున్న సంవేదకుడు. మొదటి కవిత ‘వ్యూహగామి’ లో అంటున్నారు-

భూమిని చీల్చే నాగలి కర్పునడుగు
చెమట చుక్కలతో సేద్యం చేస్తున్న
రైతు విషాద జీవితాన్ని
ఎన్ని కథలుగా చెబుతుందో!’ అని.

‘పురాజ్ఞాపకం’ కవితలో :

రోజులో ఒక్క క్షణమైనా
కష్టజీవుల కథ్ని వినలేనప్పుడు
వాళ్ళ కన్నీళ్ళ బాధల బరువుల్ని
మోయలేనప్పుడు’…
ఆ భుజకీర్తులెందుకు
ప్రిఫిక్సులెందుకు
సఫిక్సులెందుకు’ అనీ స్పష్టంచేశారు.

మొదటి ఉటంకింపులో సమాజం మనిషీ దృశ్యీకరణం జరిగితే, రెండవ ఉటంకింపులో మనుషుల్లోనే ఇద్దరి మధ్య ఘర్షణని నిలదీయటం జరిగింది. ఇదే సంక్లిష్టత! ఒక వేదన శ్రుతిగా వెన్నుని మేకుతో గీరుతున్న తెలివిడి. ఎచ్చరిక! ఇలా చాలా కవితల్లో ఈ విషాదం లయ వినిపిస్తున్నది!

‘సింఫనీ’ లో అన్నీ మెట్లూ- ఆనందాన్ని మాత్రమే అందించవు. కొన్ని నోట్స్ లో కలతరాగమూ ధ్వనిస్తుంది!! ‘భయం ఊబిలో’ కవితలో

విశ్వాన్ని జయించాలనుకొని
పాతాళంలో పడిపోయి
ఆశల మబ్బులపై ఎగిరే
ఆకాశవిహంగాలు
స్వార్థం ఊబిలో
కూరుకుపోతున్న
అత్యంతాధునిక మానవయంత్రాలు
మనిషికి మనిషే తోడు మరుగై
మనిషిని చూసి మనిషి
భయపడటమే చారిత్రక విషాదం’ అన్నారు.

లోకరీతిలో మనిషి బతుకు గిరికీలు కొడుతున్న వాస్తవానికి అక్షరీకరణం. ఈ కావ్యగుణానికి సాంద్రతరమైన ఉదాహరణలు ఇంకా చాలా ఉన్నాయి సంపుటిలో.

ఈనాటి కవిగా శ్రీనివాసరావు కాలపరిణామ జాలాన్నీ, మనుషులు చిక్కుకుపోయే రంగుల వలల్నీ ఆలోచనా ప్రేరకంగా చెప్పుకుపోయారు. దీనికి ఒక్క ‘కనుమరుగైన చిరునామాలు’ కవిత నిదర్శనం. కవితాత్మకమైన శీర్షికే శతకోటి జవాబులేని ప్రశ్నల్ని పఠితమేథలో మొలకెత్తింపజేస్తున్నది కదా! ఇందులో కవి అంటారు. ‘చెట్టు కొమ్మల్లో పిట్టల్లా/ సంస్కృతి నిలయాల్లో పిల్లలు’ అని. ఖండిక అంతా మన విద్యావిధానంలోని రొచ్చునే నర్మగర్భంగా కవిత్వీకరించింది.

గాయపడిన తెలంగాణ గురించి విభిన్న పార్శ్వాల చిత్రణతో నాలుగు పోయెమ్స్ ఆర్తిజనకంగా రాశారు శ్రీనివాసరావు. అలాగే కరోనా వెతల్ని ‘ఐసోలేషన్’, ‘చివరి ఎలిజీ’, ‘వలసజీవులు’ ఖండికలు చిత్రించాయి.

‘అమ్మొక సముద్రం’ ఆమె కనుమరుగయిన ర్వాత వెంటాడి వేధించే జ్ఞాపకాల దృశ్యాదృశ్య చిత్రణ. అవన్నీ ‘తీపి చేదు అనుభూతుల మంచుబిందువులు’ అంటూ ఆర్ద్రంగా పలవరించారు. విభిన్న పాత్రల్లో స్త్రీ- ‘గృహకవచం’ లా జాతి సంస్కృతికీ, మానవ మనుగడనీ పరిరక్షిస్తున్నదో విశదం చేసిన పోయెమ్-చివరికి ఆమె ‘ఎప్పటికి ఎర్రకోటపై రెపరెపలాడే జాతీయజెండాలా’ తలయెత్తి నిలుస్తుందని సందేశించారు. మంచి కవితల్లో మరీ మంచి కవిత ఇది. ‘కొన్ని బాణాలు’.. ‘ఆవిరౌతున్న కాలం’ భావనాశ్రయంగా వచ్చిన అణుగీతాలు!

రోజువారీ వేధించే భౌతిక వాస్తవాల చిత్రణ, దృశ్యీకరణ, ప్రసరణ ఎంత అనివార్యంగా కవితామయమవుతున్నా, నిఖార్సయిన మానవీయతని తనలో నిక్షిప్తం చేసుకున్న ‘కవి’ ని తాత్త్విక స్పృహ కూడా వేధిస్తూనే ఉంటుంది. బతుకు అర్థం, పరమార్థం గురించిన ఆలోచన అనివార్యంగా మనసును తట్టిలేపుతూనే వుంటుంది. శ్రీనివాసరావు తనలోని ఈ స్పందననీ అక్షరీకరించారు. ‘పాదం కదిలినంతవరకే/ ప్రాణం వున్నంతవరకే/ జీవితం’ వంటి ఆలోచనీయమైన పంక్తులు చాలా చోట్ల చదువరిని నిలవేస్తాయి.

శ్రీనివాసరావు అభివ్యక్తి ఎంత గాఢమైన అనుభూతి ప్రదమో అంత సహజ సరళంగానూ వున్నది. ‘గగనం పగిలిన శబ్దం/ ఎక్కడో… దూరంగా…’, ‘నిరంతరం ఆకాశాన్నీ / భూమినీ కలిపి కుడుతూ/ గాలి తెరచాప’, ‘నడిచి నడిచి అరికాళ్ళకు/ మొలిచిన కంకర్రాళ్ళు’ వంటి వ్యక్తీకరణల్లో వున్న మెరుపులు రసహృదయులకు అలరింపులే!

శ్రీనివాసరావు వద్ద వాక్య నిర్మాణంలో వాడుకోవలసిన కవిత్వం సామాగ్రి చాలా వున్నది. సంపుటి నిండా అతను గుప్పించిన రూపకాల్ని ఏరుకుంటున్నప్పుడు నాకు ముచ్చటవేసింది. అలంకార ప్రయోగం అభివ్యక్తికి భూషణ మాత్రమే కాదు. అది కవిత్వానికి అనిర్వచనీయమైన గాఢతని కూర్చే వాహిక కూడా. ‘కవిత్వశంఖం, అవమానాల పలుగురాళ్ళు, చూపుల లేపనం, గతంగూడు,ఆకాశం కొలను, నక్షత్రాల చేపపిల్లలు, నిద్రమేఘాలు, ఔషధాయుధం,వెలుగుమొగ్గలు, భూమిపెనం, అనుభవాల సంచులు, ఆశలకొమ్మలు, మనసుకిటికీ’… వంటివన్నీ సాభిప్రాయంగా దుమికి కవితలకు చదువరిని వశం చేసుకొనే శక్తినిచ్చాయి. ‘సూదిమొనదారి’ అంటాడు, నా మనసు విలవిల్లాడింది!! శబ్దశక్తిలోంచీ అనే కవితలో పదచిత్రం అచ్చుపోసుకునేది! ఆ శక్తిమంతుడు ఈ కవి!

శ్రీనివాసరావు కవిత్వం ఎక్కడా ఆక్రోశాన్ని వరించదు. ఆయన కవిత్వానిది- హనుమంతుని భాషణలా అనుద్వేగకరమైన స్పష్ట సంభాషణం. అదే ఆయన రచనకు అసలైన భూషణం!

 

 

-విహారి
98480 25600