మట్టి గుండె సవ్వడితో సంభాషించిన కథలు

సాహిత్యం హోమ్

కథ, కవిత, విమర్శ రంగాల్లో తనకుతానే సాటిగా చాలా బలంగా వినిపించే పేరు డా.పాపినేని శివశంకర్. తెలుగు కథానికల్లో సామాజిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ, వాస్తవికత పునాదిగా, గాఢతను, క్లుప్తతను, సాహితీ సౌందర్యాన్ని ప్రధాన లక్షణాలుగా ఎన్నుకుని పాఠకునితో జీవద్భాషతో సంభాషించగలిగిన కథలను అందించిన కళాసూత్ర జ్ఞానిగా వీరు ప్రసిద్ధులు.
_________________
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారు “డా. పాపినేని శివసంకర్ కథలు” శీర్షికతో కథా సంపుటిని విడుదల చేశారు. ఈ సంపుటిలోని పది కథలు, వస్తువైవిధ్యానికి ఒక సంపదగా, శిల్పరీతులకు శాశ్వత ప్రాతిపదికలుగా, ప్రాపంచిక దృక్పథానికి విలువైన దిక్కులుగా, ఒక ఉత్తమకథా సాహిత్యానికి ఎప్పటికీ కొనసాగే జీవనదుల్లా నిలుస్తున్నాయి. ఈ కథలన్నింటిలోనూ వెన్నెముకగా గ్రామీణ వాతావరణం మనల్ని పలకరిస్తూ, ఆ దారుల్లో మనల్ని నడిపిస్తూ, ప్రతి బాల్యం ఎంతో ఇష్టంగా నమోదు చేసుకున్న అప్పటి సంగతులను తిరిగి మన ఆస్తులుగా అందిస్తోంది.
___________________

‘ఎక్కడ నెలకి మూడు వానలు మట్టిని ముద్దాడుతాయో, ఎక్కడ అడవులు, బీళ్లు అనంతంగా విస్తరిస్తాయో, ఎక్కడ పొలాల్లో విషంలేని గింజలు మొలుస్తాయో, ఎక్కడ భయంకరమైన రెండు చేతుల ప్రాణులకు తావులేదో… ఆ సార్థక లోకానికి ఎగిరిపోయేందుకు సిద్ధపడిన ఒక పిచ్చుక మనోవేదనను వివరించిన కథ ‘చివరి పిచ్చుక’. ‘కిట్టమ్మా! గోపాల కిట్టమ్మా!’ అంటూ బాల్యంలో తనవితీరా ఆ పాటను పాడుకుంటూ చింతలతోపులో ఉయ్యాలలూపుతూ గడిపిన దృశ్యాలకోసం తిరిగి చాలా కాలం తరువాత ఆ ఊరు వచ్చిన కృష్ణమూర్తికి, తన చిన్నతనంలో ఎంతో ఊరించిన చింతలతోపు మాయమై పోయింది. ఊపిన ఊయల లేదు, పాడిన పాటలేదు, మొత్తం ఊరే సడి సప్పుడు లేకుండా మారిపోయింది. ‘చింతల తోపు’ ను కసిగా మింగేసిన పరిస్థితులు ఇప్పుడు కృష్ణమూర్తి కళ్లల్లో సూదులు గుచ్చుతున్నాయి. కారిన ప్రతి కన్నీటిచుక్క అక్షరమై ఈ కథలో కదులుతోంది. ‘బాధలు ప్రపంచమంతటా వున్నాయి. హృదయాలు మాత్రం కొందరికే వుంటాయి’ అంటూ ప్రారంభమై..‘ప్రపంచమంతటా కుక్కపిల్లలున్నాయి, పాపలు మాత్రమే అరుదుగా వున్నారు’ అంటూ ముగిసిన ’వస్తు ప్రపంచంలో’ కథలో తాను ఎంతో ఇష్టపడ్డ కుక్కపిల్లకోసం ఒక చిన్నారి కార్చిన కన్నీళ్ల తడి, ఎప్పటికీ చిత్తడిగానే పాఠకుల్ని తాకుతూ వుంటుంది.

‘ఒక్క వాన కోసం’ కథలో ఎన్నాళ్లనుంచో ఎదురుచూసిన వర్షం కళ్లముందు కాసేపట్లోనే పెద్ద వానగా మొదలైంది. జబ్బుచేసి మంచంలో అచేతనంగా పడివున్న తాతను.. మట్టి తడిచిన వాసన వచ్చి పలకరించింది. అంతే అతనిలో కదలిక, ముఖంలో జీవకళ తొణికిసలాడాయి. ‘పైర్లు ఇక బతుకుతాయ్’ అంటూ లేచి కేకలేస్తున్నాడు. అతడి ఆనందం కన్నీరై కారుతోంది. ఆ దృశ్యానికి మన కనురెప్పలు సైతం తడిని ఆహ్వానిస్తున్నాయి. ‘కదిలే హృదయమున్నవాడు కన్నతల్లిని మరచిపోడు’ వాక్యంతో ‘మట్టి గుండె’ కథ మొదలవుతుంది. మానవసంబంధాలు, మట్టి సంబంధాలు పెనవేసుకుని సంభాషించిన కథ ఇది. ‘మనిషి కేవలం రక్తమాంసాలతో మాత్రమే జీవించలేడు. అతడిలో శ్వాస నిత్యం ఆడాలంటే అనుబంధాల అవసరం తప్పనిసరి..’ అంటూ మరోసారి గర్తుచేస్తున్న కథ ఇది. ఊరు నాశనమైంది. స్వప్నాలన్నీ భగ్నమైపోయాయి. ఎవర్నడిగేది? అక్కడి మనుషుల్నా? లేక వాళ్లను నడిపించిన దుష్టశక్తుల్నా? ఆలోచించండంటూ, ఒక ప్రశ్నగా మనముందు నిలబడ్డ కథ ‘మట్టి గుండె’.

“సముద్రం” కథలో.. ‘తలుపులు తెరిస్తే మొత్తం అది పుస్తకాల సముద్రం. ఈ సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యాలి…’ ఇది అతడి ప్రశ్న. చివరికి జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయిన ఈ కథలో సమాజాన్ని హేతుబద్ధంగా చూడటాన్ని నేర్పిన శ్రీశ్రీ, చలం, తిలక్ రచనలు మరోసారి వాటి పేజీలను తెరచుకుంటున్నాయి. దోస్తాయెవ్ స్కీ ‘క్రైం అండ్ పనిష్మెంట్’, షేక్స్పియర్ నాటకాలు… వాటి తెరలనుంచి బయటికివచ్చి మనతో మాట్లాడుతున్నాయి. మానవ అస్తిత్వ ప్రాతిపదిక మీద భారతం గురించి విశ్లేషణ అందించిన ఐరావతి కర్వే ‘యుగాంత’ వివరాలు చెవుల్లో మారు మ్రోగిపోతున్నాయి. రాహూల్ సాంకృత్యాయన్ ‘ఓల్గా సే గంగా’ ఈ కథలో మరోసారి ప్రవహించి, తన సాహిత్యాన్ని అత్తరులా అందిస్తోంది. శరత్, కిషన్ చందర్, భైరప్ప, తక్కళి శివశంకర పిళ్లె, గోపీనాథ మహంతి, క్రిస్టోఫర్ కాడ్వెల్, పాబ్లో నెరూడ, టి.ఎస్. ఇలియట్ మొదలైన మహామహులంతా ఒకే వేదిక మీద హాజరు కావడానికి కారణమైన కథ ‘సముద్రం’. డా. పాపినేని శివశంకర్ గారి ఎల్లలులేని ఆయన సువిశాల సాహిత్య అధ్యయనానికి ఒక జెండాలా ఎగురుతోంది ఈ కథ.

అది ఒక కార్పొరేట్ ఆసుపత్రి. అక్కడ మృత్యువు కన్పిస్తుంది. బతుకులోని భయంకరత్వం కన్పిస్తుంది. అక్కడ రోగులు ఏ మహాశక్తి చేతుల్లోనో గిజగిజలాడుతున్నట్లు కనపడుతారు. మనిషిని పీడించే సామాజిక వ్యాధిని వొంటినిండా నింపుకుని, దాన్ని డబ్బు వ్యామోహంతో పెంచి పోషిస్తున్న వైద్యుల వికృతరూపాలతో రూపొందిన కథ ‘హింసరచన’. డబ్బులేక వెంకటేశ్వర్లు అనే పేదవాడు ఆసుపత్రిలో చనిపోయిన తన భార్య శవానికి గుడ్డకప్పి భుజాన వేసుకుపోయి, హస్పిటల్ కి దూరంగా పొలాల పక్క గోతిలో పాతిపెడితే, తర్వాత ఆ శవాన్ని పీక్కుతింటున్న కుక్కల ముఖాలనిండా డాక్టర్ల పైశాచికం కనిపించడం పాఠకులను ఎంతగానో కలచివేస్తుంది. కుళ్లిన శవాలకంటే, ఆసుపత్రి వ్యవస్థలోని కుళ్ళు ఎంత దుర్గంధంగా వుంటుందో సంపూర్ణంగా ఆవిష్కరించబడిన కథ ఇది.

‘బహుశా నా రెండో పక్క నీవెప్పుడూ చూచి వుండవు / మనం చూడని మహా లోకమొకటి ఆవతలివైపు వుంటుందని గ్రహించే వుండవు…’ అంటూ గొప్ప ఉద్వేగాన్ని కలిగించే కవి కె. శివారెడ్డి ‘ఆవతలివైపు’ కవితలోని పంక్తులను ‘సగం తెరిచిన తలుపు’ కథలో చదవగానే మనుషుల మధ్య అసంబద్ధం, సామూహిక ఏకాంతం గుర్తుకొచ్చి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకునేలా ఈ వాక్యాలు ముందుకు సాగుతున్నాయి. ఈ కథలో తెరవని సగం తలుపు వెనక ఎన్నో పాత్రలు, ఎన్నో మనోభావాలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో ఆర్ద్రతలు, ఎన్నో బంధాలు… బిక్కుబిక్కుమంటూ అభిమానంగా పిలిచే ఒక పిలుపుకోసం ఎదురుచూస్తున్నాయి. కథ మాత్రం మనల్ని పూర్తిగా తలుపు తెరవమని అడుగుతోంది. తెరిచాక మన మనోఫలకాల మీద రాసిన రాతలు మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే వుంటాయి.

‘మాయాబిల రహస్యం’ నేటి భూ కబ్జాలకు బలమైన ప్రతీకగా నిలిచిన కథ. వెనకటి రాజులు, రాజ్యాల వాతావరణంతో ఈ కథ నడిచినా అందులోని పాత్రలన్నీ సమకాలీన స్వరూపాలే. దుర్మార్గపు భూ స్వాధీనాలు ఎంత మోసపూరితంగా వుంటాయో వివరించిన కథ ఇది. తప్పులు చేసిన వాళ్లు, మరిన్ని పెద్ద తప్పులు చేస్తూ, సమాజంలో శాసనకర్తలుగా చలామణి అవుతున్న దృశ్యాలకు చాలా సజీవంగా ఈ కథ నిలుస్తోంది. రచయిత చేసిన ఉత్తమస్థాయి సామాజిక అధ్యయనం ప్రతి సన్నివేశంలోనూ మనకు కనపడుతుంది. రెండు వేర్వేరు మనస్తత్వాలను మోస్తున్న మనీషా, సుప్రియల మధ్య సాగిన చర్చ ‘వర్చ్యుయల్ రియాలిటి’ కథ. చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి వెతికినా దొరకటం లేదని ఒకరు, చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి వున్నా మరో అంశాల్లో తీవ్ర అసంతృత్తిని ప్రకటిస్తున్న వారు ఇంకొకరు. ఐ.టి. ఉద్యోగమంటే అదొక త్రీ డైమన్షనల్ వరల్డ్. అత్యాధునిక మాయా మాంత్రిక గుహ. కుర్చీలో కూర్చున్నంతసేపు శూన్యంలో ఆస్ట్రానాట్ కూర్చున్నట్లుగా వుంటుంది. ఉద్యోగ భద్రత ఏమాత్రం లేని జీవుల మనోభావాల చిత్రపటాలను అసంఖ్యాకంగా అందించిన కథ ఇది.
_________________
మంచి కథలు రాయడానికి అవసరమైన మౌలిక అర్హతన్నింటిని డా. పాపినేని శివశంకర్ గారి కలంలో మనం చూడవచ్చు. ఆధునిక మానవుడు అనుభవిస్తున్న అశాంతిని, అలజడిని, అందోళనను, అసంతృప్తిని, అభద్రతను తన కథల్లో చాలా సారవంతంగా వీరు చర్చించారు. సామాన్య మనిషి సమస్త అస్తిత్వాలను హరించివేస్తున్న ప్రపంచీకరణ వికృత విధానాలు చాలా కథల్లో కథా వస్తువులుగా కొనసాగాయి. రచయిత ఆ కథలను బహుముఖీనంగా తీర్చిదిద్దిన కారణంగా అవి చాలాకాలం గర్తుండి పోవడానికి ఒక భూమిక ఏర్పడిపోయింది.
__________________

ఈ సంపుటిలోని కథలన్నీ గుండెను కదిలించిన సవ్వడిని మన శ్వాస ప్రాణవాయువు మీద గట్టిగా నమోదు చేయడం విశేషం. ఈ కథలను మనం చదవడమంటే నిత్యం మనం నడిచే మట్టికణాల గుండె చప్పుడును విని తరించడమే. ఈ సందర్భంగా సామాజిక వాతావరణాన్ని లోతుగా వ్యాఖ్యానించిన వేదిక మీదనుంచి గొప్ప కథాసాహిత్యాన్ని అందించిన డా. పాపినేని శివశంకర్ కు హృదయపూర్వక అభినందనలు.

 

 

-సాహిత్య ప్రపూర్ణ డా. కె.జి. వేణు
98480 70084