వాళ్లిద్దరూ ఒకటే. వాళ్ళిద్దరి శ్రమా ఒకటే. ఒకరు నడుముకు వంకతాడు కట్టుకుని తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తారు. మరొకరు నడుముకు చేంతాడు కట్టుకుని లోయల్లో ఎక్కడో బండ గుట్టలకు వేలాడే తేనెపట్టునుండి తేనె తీస్తారు. కల్లు మైకాన్ని కలిగిస్తుంది. తేనె మనిషికి బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది. సామాజిక చట్రంలో ఇద్దరూ కింది తరగతి వాళ్ళే! కానీ తాటికల్లు తీసిన వాడికి వుండే సామాజిక గుర్తింపు తేనెకల్లు తీసేవాడికి ఉండదు? ఎందుకని? ఇదే సందేహం వచ్చింది తేనెకల్లులో ఈసప్పకి.
“ఇద్దరిదీ యుద్ధమే! వాడిది పైకెగబాకే యుద్ధం. తాటిచెట్లతో యుద్ధం. మాది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పాతాళానికి జారి, తిరిగి పైకి పాకే బతుకు పోరాటం. తాటిచెట్టు మట్టలకాడ దుత్తలు వేలాడగట్టి తీసిన కల్లు మత్తును, అనారోగ్యాన్ని ఇస్తుంది. కోనల్లోకి దిగి తీసే ఈ తేనె మనిషికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తుంది. అయినా ఎద్దిగొన్ని గౌరవించినట్టుగా మమ్మల్ని, మా కష్టాన్ని, మా తేనె మంచిని మనుషులు గుర్తించరెందుకో. అయినా నిత్యమూ ఈ తేనెకల్లుతో పోరాటం చేస్తా ఉండాల్సిందే!” అని అనుకుంటాడు ఈసప్ప అనే యానాది కులస్థుడు.
________________
పాఠకుడిని ఒక కొత్త అనుభవంలోకి తీసుకుని వెళ్లి ఉక్కిరిబిక్కిరి చేసి, ఆ అనుభవంలో నుండి ఒక సామాజిక సంవేదనను బలంగా, లోతుగా చూపిస్తూ, సజీవ భాషాసౌందర్యంలో ఓలలాడిస్తూ ఏక కాలంలో అనుభూతినీ, ఆలోచనను కలిగించడం ఉత్తమ కథా లక్షణం అని చెప్పే మాట నిజమే అయితే ‘తేనెకల్లు’ కచ్చితంగా మంచి కథ. గొప్ప కథ.
________________
ఖమ్మం ఈస్తటిక్స్ వారు నిర్వహించిన కథల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు సాధారణ ప్రచురణకు తీసుకున్న మరో తొమ్మిది కథలతో ప్రచురించిన ‘ఖమ్మం ఈస్తటిక్స్ కథలు 2025’ ఉత్తమ కథా పాఠకులకు ఉత్తమోత్తమ కథా విందు. ప్రథమ బహుమతి పొందిన ‘తేనెకల్లు’ రాసింది వి. ఆర్. రాసాని. యానాదుల జీవితం మీద వచ్చిన అతి తక్కువ కథా సాహిత్యంలో ‘తేనెకల్లు’ ఎన్నదగిన రచన. చిత్తూరు జిల్లా మంగళంపల్లి అడవులు, ఉడుముల గుట్ట నేపథ్యంగా వి.ఆర్.రాసాని ఒక సజీవ జీవన పోరాటాన్ని పాఠకుడి కళ్ళముందు ఊపిరి సలపనివ్వని ఉత్కంఠతతో దృశ్యమానం చేసారు. ఎక్కడా వంక పెట్ట వీలు లేని కథనం (నేరేషన్) వి.ఆర్.రాసానిది. పాఠకుడిని తన వెంట అడవిలోకి తీసుకుని వెళ్లి ఈసప్ప కష్టాన్ని స్వయంగా తన కళ్లతో చూసేలా చేసి, చివరకు ఈసప్ప లాగే సామాజిక దుర్నీతికి పాఠకుడి చేత కన్నీళ్లు పెట్టిస్తాడు. ఈసప్ప దుఃఖంతో సహానుభూతి పొందుతాడు.
“అన్నా, కోతులు నిర్భయంగా (బేఫికర్ గ) బతికే అడవులను మనిషి నరికేసుకుంటా పైసలు సంపాదిస్తుండు. మళ్ళా అవి ఊళ్లకు వస్తున్నాయని పరేషానైతున్నడు. అయితే అడవులనన్న కాపాడాల లేకపోతే వాటిని ఇండ్లకన్న రానియ్యల” అంటాడు చందు ద్వితీయ బహుమతి పొందిన ‘అంజమ్మ’ కథలో. కథా రచయిత ఆలూరి అరుణ్ కుమార్. పర్యావరణం కాపాడటమంటే అడవులను, ప్రకృతినీ కాపాడటం మాత్రమే అని మనం అనుకుంటాము కానీ, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి పర్యావరణంలో భాగమేనని అనుకోము. హరితహారంలో పెట్టిన మొక్కలు తినేస్తున్నాయి అని మేకలను నిర్మూలించమంటాడు ఒక ముఖ్యమంత్రి. స్వైన్ ఫ్లూ వస్తుందని పందులను చంపేయమంటాడు ఒక ముఖ్యమంత్రి. ఆస్ట్రేలియాలో కరోనా సమయంలో ఒంటెలు వూళ్లలోకి వస్తున్నాయని చంపేయమన్నాడు ఆస్ట్రేలియా ప్రధాని. కోతులకు, వీధికుక్కలకు స్టెరిలైజేషన్ చేసి వాటి వ్యాప్తిని అరికట్టమని చెపుతుందొక న్యాయస్థానం. ఏ జీవినైనా చంపే హక్కు, వాటి సంతాన వ్యాప్తిని అడ్డుకునే హక్కు మనిషికి ఎక్కడ వున్నది అసలు. పర్యావరణాన్ని కాపాడటం అంటే సృష్టిలో ప్రతి జీవినీ తన మానాన తాను బతికేలా సంరక్షించడం కదా! ప్రతి దాన్ని చంపుకుని పోయి, అవి తగ్గిపోయాక అభయారణ్యాలు పెట్టడం ఒక విరోధాభాస, కోతులకు స్టెరిలైజేషన్ అనే నెపముగా పర్యావరణం పట్ల మనకున్న దృష్టి మరింత విశాలం కావాలని చెపుతుంది, మనలని ఆలోచనలో పడేస్తుంది ‘అంజమ్మ’ కథ. ప్లెయిన్ నేరేషన్ లో ఎక్కడా పాఠకుడి దృష్టి పక్కకు మరలకుండా సూటిగా చెప్పిన కథ ‘అంజమ్మ’. అంజమ్మ అంటే స్టెరిలైజేషన్ చేసిన ఒక కోతి.
పంటకొచ్చిన చెనక్కాయ పొలాలను అడవిపందుల బారిన పడకుండా కావలి కాయడం ఎంత ముఖ్యమో వయసొచ్చిన ఆడపిల్లను జాగ్రత్తగా అడవి పందుల బారిన పడకుండా కాపాడటం కూడా అంతే ముఖ్యమని చెపుతుంది ‘కావలి’ అనే మూడవ బహుమతి పొందిన కథ. రచయిత యాములపల్లి నరసిరెడ్డి. అనంతపురం జిల్లా భాషలో కథను రక్తి కట్టించాడు. కథంతా ఒక ఆర్ట్ ఫిలిమ్ చూస్తున్నట్టు సాగుతుంది. చెనక్కాయల పంట కావలికి అర్ధరాత్రి పొలానికి వెళ్లిన భీమప్ప, శివప్ప అర్ధరాత్రి పూట బెంగళూరు నుండి ఒక రౌడీ విద్యార్థుల గుంపు మత్తిచ్చి కిడ్నాప్ చేసుకుని వచ్చిన అనన్య అనే ఒక యువతి మాన ప్రాణాలను కాపాడతారు. కథంతా చదివిన తరువాత ఇంత కాలం గడచినా “స్త్రీ కి పురుషుడు కావలి కాయవలసిందేనా?” అని పాఠకుడు ఎక్కడ సందేహ పడతాడు అనుకున్నాడో ఏమో కానీ రచయిత నరసిరెడ్డి “బెంగళూరుకు పోయిన అనన్య ఆలస్యం చేయకుండా హై లెవెల్లో కార్యాచరణకు పూనుకున్నది” అని ఒక మాట రాయడం ద్వారా కథకు బలాన్ని, బతుకును ఇచ్చాడు. “నాలుగు నెలల పంట పోతే పోయింది కానీ, ఒక ఆడపిల్ల నూరేళ్ళ పంట మిగిలించినాడు ఇంకేం కావాల” అని భీమప్ప భార్య, భీమక్క తో అనిపించడం రచయిత సాధించిన పొయిటిక్ జస్టిస్.
ఒక మంచి కథ చదివితే జీవితంలో ఒక భాగం అర్ధం అయినట్టు ఉండాలి అంటారు తిలక్. ఈ సంపుటిలో ‘ఇష అసంతం’ కథ చదివితే అలాగే అనిపిస్తుంది. అసలు ఎవరి జీవితానికైనా ఏం కావాలి? నాలుగు వేళ్ళు లోపలికి పోవడము, రెండు కళ్ళ మీద ప్రశాంతమైన నిద్ర పట్టడమూ, మనసులో ఏ అలజడీ లేకుండా వుండటమూనూ. పుట్టిన ఊరిలో పొట్ట గడవడమే కష్టం అయినప్పుడు ఉన్న ఊరును కాదని ఎక్కడికో కువైట్ లాంటి సుదూర ప్రదేశంలో ఆయమ్మలకు గిరాకీ ఉందని భార్యను పంపిన మల్లేష్ రెండేళ్లు తిరగకుండానే మళ్ళీ భార్యను ఎందుకు తెచ్చుకున్నాడో తెలుసుకోవాలంటే బి. కళాగోపాల్ ‘ఇష అసంతం’ కథ చదవాలి.
యాటిట్యూడ్, అందులోనూ పాజిటివ్ యాటిట్యూడ్ జీవితాన్ని గెలవడానికి ఎంత దోహదం చేస్తుందో, ఆ యాటిట్యూడ్ ను అర్ధం చేసుకునే సమాజం లేనప్పుడు అసూయకి అక్షర రూపంగా మారి ఎంత బాధపడుతుందో చెప్పాలి అంటే ఆర్.వి. రమణ శాస్త్రి కథ చదవాలి. ఆకాశంలోకి ఉపగ్రహాలను పంపిస్తున్నప్పడు కూడా కర్ణాటకలోని కొన్ని గిరిజన గ్రామాలలో ఋతుక్రమం కలిగినప్పుడు ఆడవాళ్లను మూడు రోజులపాటు దూరంగా ఐసోలేషన్ లో ఉంచే ఆచారం కొనసాగుతున్నది అంటే నాగరికులుగా మనం సిగ్గుపడవలసిందే. ఆ ఆచారాన్ని, గిరిజనుల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని దోచుకునే ముఖియా అరాచకాన్ని ఒక ఆడపిల్ల భాగ్యమతి ఎలా ఎదిరించి గ్రామంలోకి కొత్త వసంతాన్ని తీసుకుని వచ్చిందో ‘భాగ్యమతి’ కథలో తిరుమలశ్రీ వివరిస్తారు.
దేవుడు ఎక్కడ ఉంటాడు? రాతిబొమ్మల్లో కొలువై ఉంటాడా? వైద్యో నారాయణో హరి అన్న వైద్యశాలలో కొలువై ఉంటాడా? లేక జ్ఞానాన్ని ప్రసాదించే విద్యాలయాలలో కొలువై ఉంటాడా? అన్న ప్రశ్న వేసుకుని అన్నమయ్య డ్యామ్ తెగిపోయిన నేపథ్యంలో నీటి పాలైన శివుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం కంటే ఆ లక్షల డబ్బుతో ఒక హాస్పిటల్, ఒక స్కూల్ కట్టడమే మేలని నిర్ణయించుకున్న కథ ‘శివుడాజ్ఞ’. సుంకోజి దేవేంద్రాచారి చేయి తిరిగినతనం ఈ కథా కథనంలో కనపడుతుంది. హాస్పిటల్, స్కూల్ కట్టాలి అని రెండు గ్రామాల ప్రజలు అనుకోవడం కూడా శివుడాజ్ఞ వల్ల జరిగిందని అన్యాపదేశంగా దేవేంద్రాచారి చెప్పడం అతడి కథన చాతుర్యానికి ఒక మచ్చుతునక.
కాని కాలం వచ్చినపుడు ఒక స్త్రీకి మరొక స్త్రీ అండగా నిలబడే సిస్టర్‌హుడ్ కు ఉదాహరణగా అత్త అమ్మలా మారి రాక్షసుడి లాంటి తన కొడుకు బారినుండి కాపాడిన మంచి కథ డాక్టర్ ఎమ్.ప్రగతి రాసిన ‘ఉంకువ’ కథ. కథ ప్రయోజనం నెరవేరింది కానీ ‘ఉంకువ’ అంటే ఏమిటో పాఠకుడికి అర్ధం కాలేదు. ఆ మాండలిక పదానికి ఫుట్‌నోట్స్ లో అర్ధం ఇచ్చి ఉంటే బావుండేది. ఎక్కడో మస్కట్ లో ఉండి కూడా భార్య పట్ల ప్రేమ అనే నెపంతో ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించి ఎప్పటికప్పుడు యాప్ లో మానిటర్ చేస్తూ అజమాయిషీ చేసే భర్త దౌష్ట్యానికి బలి అయిన జరీనా పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ కు గురి అయితే సరైన వైద్యం చేయించకుండా దర్గాలో పీర్ సాహెబ్ చేత తావీజు కట్టించే అజ్ఞానాన్నీ ‘మూడో కన్ను’ లో సంజయ్ ఖాన్ బలంగా చెప్పాడు.
‘నేల రాలిన పువ్వు’ అంటూ స్త్రీ వేదన ఏ మూల యుగాల కాలనాళికలో దాగివున్నదో జి.వి. శ్రీనివాస్ చారిత్రక దృక్పథంతో వివరిస్తే “అప్ప దీపోభవ” అన్న బుద్దుడి వాక్యాన్ని సమకాలీన రాజకీయాలకు అన్వయించి ఆలోచన రేకెత్తించారు డాక్టర్ ఎమ్. సుగుణారావు. ప్రకృతితో మమేకమై జీవించడం అంటే ఆ ప్రకృతిలోనే వుండే కొన్ని వైరుధ్యాలను కూడా ఏ వైమనస్యం లేకుండా ఆహ్వానించడం అనే ఎరుక కలిగిస్తుంది గుమ్మడి రవీంద్రనాధ్ కథ ‘అనగనగా ఒక హంస’.
________________
ఈ కథలన్నీ మానవ జీవితంలోని భిన్న పార్శ్వాలకు అద్దం పడతాయి. ఈ పన్నెండు కథలలో ఉన్న సుగుణం ఏమిటంటే రచయితలు ఏ పక్షమూ వహించకుండా జీవితాన్ని యధాతథంగా అక్షరాల్లోకి మలచారు. ఏ పాత్ర పక్కనా నిలబడకుండా, ఏ సంఘటననీ న్యాయమూర్తి స్థానంలో నిలబడి తీర్పు చేయకుండా వాటి మానాన వాటిని వదిలేశారు. కథ చదివిన తరువాత పాఠకుడికి కావలసిన స్పేస్ ను అలాగే ఉంచేశారు. అందుకనే పాఠకుడు కథతో పాటు ప్రయాణం చేసి, కథతో మమేకం అయి తన సూత్రీకరణలు ఏవో తానే చేసుకుంటాడు.
________________
ఒక ఉత్తమ కథ “ఇదుగో నీ చుట్టూ వున్న జీవితం ఇలా వుంది అని మానవ జీవితం మీద కాస్త వెలుగును ప్రసరించాలి. ఆ వెలుగులో పాఠకుడు జీవితాన్ని నిర్మించుకోవాలి.” అదుగో అలా వెలుగు ప్రసరించే ఉత్తమ కథలు ఖమ్మం ఈస్తటిక్స్ కథలు 2025.

-వంశీకృష్ణ
95734 27422
