‘కాలాన్ని నిద్రపో’నివ్వని ఈ నాటి మహాకవి, ‘నానీ’ సృజనకర్త. ‘జలగీతం’ కావ్యకర్త డా౹౹ ఎన్.గోపిగారి గురించి పరిచయ వాక్యాలన్నీ – ఒక గ్రంథ పరిచ్ఛేదం అవుతుంది. అందుకనే, స్పష్టాతిస్పష్టంగా – ‘నన్ను తెలుసుకోవాలంటే/ నా కవిత్వంతోనే / బయోడేటా వేస్ట్’ అనేశారు ‘పెహ్చెన్’ కవితలో. డా౹౹గోపిగారి 31వ కవితా సంపుటి- ‘మగ్న సంగీతం’ ఈ ఏటి కవిత్వ ఫలసాయం.
_________________
కవి నిమగ్నం కావటమంటే, సమష్టి తత్త్వంలో లీనమవుతూ ఆ సమష్టికి కవిత్వంలో ప్రాణప్రతిష్ట చేయటమే. ‘మగ్న సంగీతం’ పద్యంలో మొదటి నాలుగు పాదాలే ఈ విషయానికి నిదర్శనం. కవి అంటున్నారు- ‘నేను కవితలో వున్నాను/ వెలుపల కాదు/ చీమలా పాకుతూ/ మనిషిని వెతుకుతున్నాను’ అని. ఇదే మగ్నత. ఆ తర్వాతి చరణాలు సంగీతాన్ని వినిపిస్తాయి. వెలుపల వుండి లోపలతో మమేకంగా కూడా వుండటమే మగ్నత. ‘మనిషి’ని వెతకటమే ‘కవిః క్రాంత దర్శీ’ అంటే! అదీ గోపిగారి కవిత్వ పరిపుష్టి!.
___________________
మనుషుల్ని వెతుకుతున్న మహాకవికి, మహామనీషికి ముందుగా ‘చేతులు’ కనిపించాయి. ఏమా చేతుల రూపం? చూడండి:
‘పని తప్ప మరేమీ తెలియని చేతులు, రాళ్ళు కొట్టి బీటలు వారిన చేతులు/ భూమిలో విత్తనాలు నాటి/ పైరును పైకి లాగే పసిడి చేతులు/ కన్నీరు తుడిచే ఆర్ధ్రమైన చేతులు/ ఆ భవనాలను శ్రద్ధగా వీక్షించండి/ చీల్చుకొని పోయే / ఆ పడవల్ని గమనించండి / వాహనాలను నడుపుతూ, దూరాలను మడతపెడ్తూ/ గమ్యాలకు చేర్చే/ అనుబంధాల చేతులు/ హృదయాలను పెనవేసే చేతులు/ సంస్కృతిని సృష్టించే చేతులు / సృజనాత్మకమైన చేతులు/ నిజానికి భూగోళానికి / చేతిబొమ్మను అతికించాలి/ విశ్వాంతరాళంల /దాని చిరునామా ఈ చేతులే…’…. /ఇవాళ/ ఈ చేతులకే చెయ్యెత్తి నమస్కరిస్తాను/ ఈ కవితను రాస్తున్న/ నా చేతిని కూడా/ వీటికి అంకితం చేస్తున్నాను.’
ఈ చివరి వాక్యాల్ని చదివితే నిమగ్నత కవితామయం కావటం, సమూహంతో కవి మమేకం కావటం ఆలోచనీయంగా వెంటాడుతుంది. అందుకనే ‘పరంపర’ లో ‘అంతరంగ ప్రయాణానికి /వాహనం అక్కర్లేదు’ అనీ ‘కన్నీళ్ళను వేరు చేసి చూడకు/ ఉద్వేగానికి విశ్లేషణ అక్కర్లేదు’ అనీ కవి అభివ్యక్తి తీవ్రతతో హితోక్తినిస్తున్నారు. సంపుటి నిండా పరచుకున్న ఈ మగ్నసంగీతరవళి చివరిపద్యం ‘మానవభాష’లో తారాస్థాయికి వెళ్లింది. ‘జీవితం నిడివి/ చిన్నదే కావచ్చుగాని/ దాని వైశాల్యం పెద్దది’ అని ‘ఏ వ్యక్తీ మరో వ్యక్తిలా ఉండడు / కాని లోపలికి తొంగిచూస్తే / సకల నరాల్లోని /స్పందన ఒకటే / ఇదే మానవ భాష!’ అని సందేశాన్ని స్ఫూర్తిమంతం చేశారు.
‘విరామం’ అంటూ ఒక తేజోరేఖ వుంది ఈ సంపుటిలో. ‘జనంతో సంబంధం/ ఒక తవ్వకం పని లాంటిది/ గుండెలోంచి రాళ్ళొస్తాయో, రత్నాలొస్తాయో వేచి చూడాలి’ అంటూ సామాజిక నిమగ్నతలోని కష్టాన్ని ధ్వనించారు. చివరికి ‘తీరిక / జీవన వస్త్రంపైన ఒక చారిక/ ఉతికేసుకోవడమే ఉత్తమం/ మరణం అంటే/ ఊపిరి ఆగిపోవటం కాదు/ నిర్వ్యాపారతీరమే/ ఒక మృత్యుద్వారం’ అన్నారు. బతుకు అర్థాన్ని విడమరుస్తూనే తత్త్వబోధసారాన్ని కవిత్వం గుళిక చేసి అందించారు.
పరిణామశీలమైన కాలతత్త్వాన్ని అవగాహన చేసుకోవటమే కాక, కాలికస్పృహనీ స్పర్శించే దర్శనాన్నీ, ఆదర్శనాన్నీ కూడా ప్రోది చేసుకున్న కవి- గోపిగారు. ‘మానవుని మౌలిక సంవేదన మారుతుందా?’ అని సూటిప్రశ్న!!
ఈ మౌలిక సంవేదనని దృశ్యమయంచేస్తూ వర్తమాన సమాజ చిత్రణని, అనుద్వేగకరంగా కవితామయం చేశారు గోపిగారు.
‘అతడు వీరుడు/ అతణ్ణి బతికించండి…. పలు ప్రజా ఉద్యమాలకు / ప్రాణం పోసినవాడు /ఎందరికో దారి చూపిన వాడు / ఇప్పుడతని కనులు / మూతపడనీయకండి…’ అని జనాన్ని వేడుకుంటున్నాడు కవి. ‘అంబులెన్స్’కి దారి ఇవ్వమని అభ్యర్ధన. ‘తరం తరం’ అంతరం చూపుతూ ‘వద్దువద్దంటూనే / జారిపోతున్నాం / కొత్తబూట్లలో పాతకాళ్లు, ఎన్నడూ లేనంత వేగంతో / సగటు మనిషి ఆగమాగం’ అంటూ కొద్ది అక్షరాల్లోనే వర్తమాన, సామాజిక సంక్షుఙ్ఞతకు అద్దం పడుతున్నారు కవి. ఈ కవిత ముగింపు- ‘యుద్ధం లేకుండానే / శిథిలమవుతున్న ఊళ్లు/ నెక్స్ట్ షాట్లోనే/మంటల మధ్య మానవుడు’ వాక్యాలు ప్రపంచాన్ని నిలువనీయని అశాంతిని ఆవిష్కరిస్తున్నాయి.
‘డెలివరీ బాయ్’ అని పద్యం. మీకూ నాకూ బాగా పరిచితమైన యువకుడే. కవి గోపిగారికి అనంత సంవేదనను పంచుతూ వచ్చిపోతున్నాడు. ‘తండ్రికన్న కలల ఫలం/ ఇవాళ వీధుల పాలయ్యింది/ఇది నిరుద్యోగ ఉద్యోగం/ నిరాశ పడని వీరుడతడు’…. ‘పని ఏదైనా కానీ/ గ్లోబలైజేషన్, ఇవాళ వీధిలో సంచరిస్తుంది/ దేశాన్ని శాసించగల యువతను / బానిసలుగా మార్చేసింది’ అనేది కవి అశాంత చిత్తం నిశ్శబ్ద ఆక్రోశం! ‘మార్పు/ నిజానికి నిట్టూర్పు/ కానీ అది/ కదిలే కాలం అని చెప్పే కల్లోల తీర్పు’ అని సమస్యా చిహ్నాలకు పరిష్కారం లేని జవాబుని ఈనాటి రీతీ రివాజుకు అనుసంధానం చేస్తారు. ‘కలాయివాలా’ లు కాలంలో కలిసిపోయినా, ‘అతని మనుమడు మా అమ్మను చూడటానికొచ్చినట్టున్నాడు’ అని పరిణామహేలకు ఆశ్చర్యార్థకాన్నే చూపుతారు.
గోపిగారు ‘పేషంట్’ గురించి రాసినా ‘జాతర’ లో ‘జీవితాన్ని జీవించడమే మంచిది/ అది యాంత్రికత కాదు/ అలజడుల మాంత్రికత’ అని వాస్తవికతా దృశ్యాన్ని చిత్రీకరించినా, ‘క్షురకార్మికుడు’ స్మరణకొచ్చి నిలవేసిన ‘యాంటిక్ గా మారని’ కుండని చూపించినా, సంస్కృతి పరిమళాన్నే పర్యాప్తి చేస్తారు.
మెట్టిన నగరం, చుట్టివచ్చిన దేశాలు ఎలా వున్నాయో ఎన్నిరీతుల వర్ణించినా, గోపిగారి హృదయస్పందన, కవితాత్మ-పుట్టిన ఊరు ‘భోనగిరి గుట్ట’ చుట్టూ పరిభ్రమిస్తూనే వుంటుంది.
‘నేను ఎలా భావిస్తే/అలాగే కనిపిస్తుందది/ ముఖ్యంగా ఏనుగులాగ/ పైన ఖిల్లా దాని వీపుమీద/అంబారీలా అమిరింది/ వర్షం కురిసిన చారలు/ దాని మదజలంలా స్రవిస్తాయి.
‘గుట్ట మా ఊరు నుంచి/ పక్క ఊరి దాకా వ్యాపించి వుంది/….ఆ గుట్ట ఔన్నత్యం/ తల పైకెత్తి తిరగడం నేర్పింది నాకు/ గుట్ట పైకెక్కి చూస్తే దూరంగా హైదరాబాద్ లైట్లు మిణుక్కుమంటాయి.’….నమ్మండి/ గుట్ట రాతికి చెవిపెట్టి వింటే/ ఏవో పురా సంభాషణలు వినిపిస్తాయి/ ఏదైనా దుఃఖం వాటిల్లినప్పుడు / దానిముందు నిల్చొని చెప్పుకునే వాణ్ణి/ గుట్టలేకుండా/ జీవితాన్ని ఊహించలేన్నేను/ ప్రపంచంలో పలు దేశాలు తిరిగాను/ అయినా ఇప్పటికీ / భోనగిరి గుట్టే నా చిరునామా.
‘అమ్మ’ గురించి రాయని కవి ఎవరున్నారు? ‘అమ్మ అనే రెండక్షరాలు / అదే ఒక బృహత్కావ్యం’ అంటూ ‘అవసరమున్నంతవరకే అమ్మ/ తీరినంక మమకారానికి డుమ్మా… పాపం అమ్మ/ ఇవాళ విరిగిపోతున్న కొమ్మ’ అని వాస్తవం కదలికలోని జారుడుమెట్ల ఇక్కట్లని వ్యక్తీకరించారు. గోపిగారి సామాజిక దృష్టి-ఆ సమాజ పోకడల విభిన్న చిత్రాల్నే చూస్తుంది. అయితే ఆ చూపు అనుద్వేగకరమైన, భావగర్భితమైన కవితాభివ్యక్తికి వాహిక అవుతుంది. గాఢమైన, సాంద్రతరమైన కవి భావనలకు ‘మానవ సంవేదనే / జీవితంలో పేరిన తేట’ అనే వ్యక్తిత్వంలోని చిత్తశుద్ధి, సాహిత్య వ్యక్తిత్వంలోని నిబద్ధతా శుద్ధి మూలబలం!
______________
డా౹౹ గోపిగారి కవిత్వ శిల్పం ఒక ప్రత్యేకముద్రని సంతరించుకుని వుంటుంది. పద్యాలన్నీ చరణాలు చరణాలుగా సాగుతాయి. ఎత్తుగడ చదువరికి స్వాగతం పలుకుతూ, ఉత్కంఠ ప్రేరకంగా వుంటుంది.
_________________
‘విజ్ఞానం పెరిగే కొద్దీ / అశాంతి కూడా పెరుగుతుంది’ అని మొదలవుతుంది ‘తీర్పు’. ఈ రెండు వాస్తవాల వివరణ ఆ తర్వాతి చరణాల్లో కవితామయం అవుతుంది. ‘ఏడుపువేరు/ దుఃఖం వేరు/ మొదటిది రెండోదానికి / మాధ్యమం మాత్రమే’ అనేది ‘దుఃఖం’ ఖండిక మొదలు!.
కవిత్వంలో దృశ్యీకరణం ఒక శిల్ప విశేషం. ‘అదే మా యిల్లు అని/ దూరం నుంచి చూపించాడు’ అనగానే పరిచితమైన దృశ్యాలూ, పరిచితం కాని ఉత్సుకత రెండూ మనసున ముసురుతాయి. ‘ఉపాధ్యాయుడు బదిలీ అయ్యాడు / స్కూలు స్కూలంతా ఘొల్లుమంది/ ఆవరణలోని / గాలి కూడా చిన్నబోయింది’ అనగానే మొదటి రెండు పాదాల్లోని సంభవం ఆర్తిజనకంగా చదువరిని కుదుపుతుంది. ఆ తర్వాతి రెండుపాదాల్లోని అభివ్యక్తి – కవిత్వాన్ని మౌనంగా అనుభూతి ప్రవాహాన్ని చేస్తుంది. సాధారణ సంఘటనే – కానీ కవిత్వభాషలో మానవీయ స్పందనను ప్రచోదనం చేస్తున్నది. భావగర్భితంగా జీవిత సంక్లిష్టతని నిబిడీకృతం చేస్తున్నది.
డా౹౹ గోపిగారి కవిత్వానికి వారి ఆత్మీయతాముద్ర పునాది. అన్ని పద్యాల్లోనూ అంతో ఇంతో-ఎడనెడ-అంతా-ఆ వైయక్తిక అనుభవాల వ్యక్తీకరణం ఉంటుంది. కంఠస్వరంలో వారి వ్యక్తిత్వం సాధించుకున్న సత్త్వశక్తీ, సౌమ్యతారక్తీ ధ్వనిస్తూ వుంటాయి. ఈ సంపుటిలోని ‘సాహిత్య అకాడెమీ’, ‘51వ పెళ్ళిరోజు’ వంటివి మరీ ప్రధాన నిదర్శనాలు.
‘మగ్న సంగీతం’ సంవేదకుని ఉద్విగ్నమనస్కతకు దర్పణం. అలాగే, వర్తమాన సామాజిక కల్లోలాల తీరుపట్ల ఒక చింతనాత్మకుని భావలహరి!!

-విహారి,
98480 25600
