“ఎన్నాళ్లు రాస్తారయ్యా
పొలాల మీద కవిత్వం”
“నేలను రైతన్న
దున్నినంత కాలం
మెతుకు మీద మనిషి
బతికినంత కాలం”
తెలుగు కవిత్వంతో పరిచయమున్నవారికి ఈ కవిత్వ పాదాలు నినాదాలుగా గుర్తుండి పోయాయి. కవిత్వంలో కొత్త ప్రయోగాలు చేస్తున్న ప్రగతిశీల కవి దర్భశయనం శ్రీనివాసాచార్య. నిర్విరామంగా కవిత్వంతో కరచాలనం చేస్తూ మనందరినీ పలకరిస్తుంటారు. కళ్ళ ముందు జరిగే ప్రతి అన్యాయాన్ని, అధర్మాన్ని ప్రశ్నించకుండా ఉండలేరు. కాలానికి నిలబడిన కవిత్వాన్ని రాస్తున్న అతి కొద్దిమంది ఆధునిక తెలుగు కవుల్లో ఆయన ఒకరు. మూడు దశాబ్దాలుగా రైతుల వెతల గురించి రాసిన 60 కవితలను ‘మట్టి మట్టి’ వ్యవసాయ కవిత్వం (1987- 2023) శీర్షికతో అనంత కవుల వేదిక ‘స్పందన’ వారు ఆయన కవితా సంపుటిని ప్రచురించారు.
______________________
ఈ విశాల ప్రపంచంలో మనమంతా కడుపునిండా తింటున్నామంటే దాని వెనుక అవిశ్రాంతంగా శ్రమిస్తున్న కోట్లాదిమంది రైతుల చెమట చుక్కల సేద్యముందని మరువకూడదు. వేకువ నుండి అర్ధరాత్రి దాకా పొలాల గట్ల మీద కాయకష్టం చేస్తున్న ఆ రైతులందరి స్వేదానికి ప్రతి రూపమే ధాన్యం రాశులు. రకరకాల వృత్తులను చేస్తూ డబ్బులు సంపాదిస్తూ మార్కెట్లో దొరికే తిండి గింజలను సునాయాసంగా మనం కొనుక్కుంటున్నమంటే ఆ రైతుల రుధిరం చెమట చుక్కల ధారలుగా మారితేనే సాధ్యమైంది. కాలంతో పోటీ పడుతూ పంటలను పండిస్తున్న ఆ రైతులకు ఏదో ఒక విధంగా కృతజ్ఞతలను మనమే తెలపాలి.
_______________________
గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల జీవనయానాన్ని తలుచుకుంటే చాలు తనువంతా దుఃఖంతో తల్లడిల్లుతుంది. పని గంటల లెక్కలేదు. రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. పంట పొలాలను కంటికి రెప్పల్లా కాపాడుతూనే ఉంటారు. మట్టితో అనుబంధాన్ని, మట్టితో కూడిన బతుకు చిత్రాన్ని ‘మట్టి మట్టి’(పే.106) కవితలో దృశ్యమానం చేస్తారు కవి. ప్రతి వాక్యం మనల్ని నీడలా వెంటాడుతుంది. మనం కూడా రైతు వెంట సేద్యంలోకి దిగినట్టుగా అనిపిస్తుంది. ఆ మట్టితో మమేకమైపోతాం. ఈ కవితా వాక్యాలను ఒక్కసారి చదివితే చాలు మనల్ని మనం రైతుల్లోనే చూసుకుంటాం.
“ఒకానొక పొద్దుటిపూట
మట్టెంత అని ఊహించబోయాడు
వాకిలిని చూశాడు,
మట్టి వాకిలంత అనిపించింది
బాటను చూశాడు – బాటంత అనిపించింది
పొలాన్ని చూశాడు -పొలమంత అనిపించింది
చూపునింకా పెంచుతూ పోయాడు
మట్టి విస్తారంగా కన్పడింది
అంతా ఇంతా కాదు
మట్టి అనంతమని తెలుసుకున్నాడు
అనంతమే గానీ అందేదని అర్థమైంది
అందడమే కాదు, పిలిస్తే వచ్చి
అంతరంగమూ అవుతుందని
బోధపడింది.”
ఈ భూ ప్రపంచంలో అత్యంత విషాదకరమైనది మనకు ఆహారాన్ని అందిస్తున్న అన్నదాతలు తమను తాము మృత్యువుకు సమర్పించుకోవడం. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా బతకాలని కోరుకుంటాం. ఎవరూ మృత్యువును కౌగిలించుకోవాలని కోరుకోరు. అట్లాంటిది పండిన పంటకు గిట్టుబాటు ధర రాక, చేసిన అప్పులను తీర్చలేక, వీధిలో పడ్డ పరువును కాపాడుకోవడానికి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం శోచనీయమైన విషయం. వాళ్లను కాపాడుకోలేని రాజ్య వ్యవస్థ వున్నా ఒకటే లేకున్నా ఒకటే అనిపిస్తుంది. కష్టకాలంలో మనిషికి మనిషి తోడుగా నిలవని సమాజం వున్నా ఒకటే లేకున్నా ఒకటే. ఒంటరితనంతో కుమిలిపోయి పురుగు డబ్బాలకు, ఉరితాళ్ళకు బలైపోతున్న హాలికులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది.
‘నడిచే చెట్టు కూలి’(పే.28) కవితలో పత్తి రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో రాసినప్పటికీ వాస్తవ స్థితికి నిదర్శనంగా నిలిచింది. అందుకనే ఈ ప్రపంచంలో రైతు బతకాలి. బతకడానికి మనమంతా తోడ్పడాలి. ఈ విశ్వజనీనమైన సత్యాన్ని మనం బతికినంత కాలం చాటుతూనే ఉండాలి. రైతుల బతుకులకు భరోసానివ్వాలి. మనమున్నామనే ధైర్యాన్ని నింపాలి. ఈ కవితా పాదాలు అందుకు తోడ్పాటును అందిస్తున్నాయి.
“ఎవరైనా నేలమీదే కాళ్ళు ఆన్చేది/ ఎవరైనా మట్టిచేవ మీదే బతికేది/ ఎవరైనా పొలాలు వీచే గాలితోనే/ రోజురోజూ పునర్జన్మనెత్తేది/మరి ఇవాళ చూశారా/ పొలాల్ని శ్మశానాలుగా, రైతును పగిలిన శోకంగా/ ఇంక మనం/ఏ నిజాయితీతో నేలమీద పాదం మోపగలమో చెప్పండి.”
పల్లెలు పచ్చని ప్రకృతితో ప్రశాంతంగా ఉంటాయని మనం వర్ణించుకున్నా, క్షేత్రస్థాయిలో రైతు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వర్షాభావం, కల్తీ మందులు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి సమస్యల వల్ల రైతు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఈ వాస్తవాన్ని రైతు పక్షపాతిగా దర్భశయనం గారు తన ‘నిద్రాభంగం’(పే.37) కవితలో అద్భుతంగా చిత్రించారు. గ్రామీణ నేపథ్యం ఉన్న కవిగా పల్లెల కష్టాలను, రైతు ఉద్యమాలకు మద్దతును ఈ కవిత ద్వారా కవి ఎలా ఆవిష్కరించారో చూడండి:
“పల్లె రాత్రి నిద్రిస్తేనే కదా/పగలు పొలాలు మేల్కొంటాయి/నాగళ్ళూ కొడవళ్ళూ ధాన్యం బళ్ళు మేల్కొంటాయి/జాతి కళ్ళల్లో జవజీవాలు మేల్కొంటాయి/ఎంతమందికి తెలుసు/పల్లె నిద్రను కరువు కాటేస్తుందని/పురుగు కాటేస్తుందని/వర్షం వచ్చీ రాకా కాటేస్తుందని/ఆఖరికి అంగడీ కాటేస్తుందని.”
బోధన అనేది ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం అవసరమైన ఒక గొప్ప కళ. తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తూ రేపటి పౌరులను తీర్చిదిద్దితే, రైతు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిరంతరం ప్రయోగాలు చేస్తూ సమాజానికి ఆహారాన్ని అందిస్తాడు. తన అనుభవాల ద్వారా నిబ్బరంగా సాగు చేస్తూ లోకానికి అన్నం పెట్టే రైతు కూడా ఒక ఉపాధ్యాయుడే అనే ఉదాత్తమైన భావనను ‘రైతన్నా! నువ్వు ఉపాధ్యాయుడివి’(పే.101) అనే కవిత తెలియజేస్తుంది.”
“ఎన్ని మంచి పాఠాలు చెప్పినా/ ఒకోసారి పిల్లలు బాగుపడనట్లు/ నువ్వెన్ని సవరింపులు చేసినా/ ఒకోసారి చాళ్ళు పూయనే పూయవు/ పూసినా ఫలాలు గల్లంతవుతాయి/ మోసగించింది కాలమా మనిషా/ కాలానిదేముంది/ మనిషిదే నేరమని నీకు తెలుసు/ అయినా బోధన మానవు.”
ఈ కవితా సంపుటికి ప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ పాపినేని శివశంకర్ ‘మట్టి మనిషికోసం’ అంటూ దర్భశయనం గారి కవిత్వం మీద విశ్లేషణాత్మకమైన ముందు మాటలు రాశారు. అందులోని ఈ వాక్యాలు ఆయన కవిత్వానికి మచ్చుతునకలు. “దర్భశయనం వ్యక్తిత్వంలోని సారళ్యమే తన కవిత్వంలోనూ ప్రతిఫలించింది. ఈ సంపుటిలోని ఆరుపదుల కవితల్లో ఏ ఒక్క దానిలోను అస్పష్టత కనిపించదు. తన భావాలను సరళ సుందరంగా ప్రతిపాదించడం అతని ప్రత్యేకత. ‘భూమిక’ అనే ఒక కవిత చాలు ఆ ప్రత్యేకత నిరూపించడానికి. అప్పుడప్పుడు కొన్ని పాత సంగతులు, కొన్ని ప్రస్తుత విషయాలు, కొన్ని రేపటి కదలికలు ప్రస్తావిస్తాను’ అంటూ త్రికాలాలలోనూ ‘బతుకును బతికించే, నిలబెట్టే, కదిలించే కీలక మూలకమైన భూమి గురించి’ తలపోశాడు. రైతు కవిగా అతని దృష్టిలో ఉన్నది సాధారణ పాఠకులే. కనుక ఆ కవితల్లో అర్థం కాని అంశాలేమి ఉండవు. అద్దం మీద పెసర గింజకు మల్లే ప్రతి విషయం సరళంగా, సూటిగా, శుభోదకంగా ఆవిష్కృతమవుతుంది. అయితే అక్కడక్కడ కొన్ని కవితలు నెరవు తగ్గి అల్లిక బిగువు పెరిగితే బాగుండును.”
కలం బట్టి కవితలల్లిన కవి.. సముద్రాల గురించి, నదుల గురించి, అడవుల గురించి, రహదారుల గురించి, ఆకాశంలోని నక్షత్రాల గురించి, వెన్నెల గురించి, మేఘాల గురించి, మనుషుల్లోని మమతానురాగాల గురించి, జీవన్మరణ సమస్యల గురించి రాయకుండా ఉండలేరు.
అట్లాగే రైతు సేద్యం గురించి కూడా రాయకుండా కవులు ఉండలేరు. కాకపోతే ఇన్ని కవితలు రాయకపోవచ్చు. సందర్భానుసారంగా స్పందించి సంఘీభావ కవిత్వాన్ని తప్పకుండా రాస్తుంటారు. చాలా కవితా సంకలనాల్లో రైతుకు సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ కవి మాత్రం ప్రపంచంలో ఏ మూల కర్షకుని కష్టం కనబడినా, వినబడిన అక్షరమై ఆగ్రహిస్తారు. అందుకే మనమంతా ఆయన కవిత్వాన్ని ఇష్టపడతాము.
_____________________
గ్లోబలీకరణ మార్కెట్ మాయాజాలంలో కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక అవస్థలు పడుతున్న రైతులు, ‘ఇక పంటలు పండించలేము’ అని ప్రకటించినప్పుడు..కవి హృదయం స్పందించి ‘పొలాలకు తాళాలేసాం’(పే.123) అని ఎలా ఆవేదన వ్యక్తం చేశారో ఈ క్రింది వాక్యాలలో గమనించవచ్చు.
_____________________
“మీకివాళ విడ్డూరంగా ఉండొచ్చు, పొలాలకు తాళాలంటే-/మా బతుకు తలుపులు ఒకటొకటిగా మూసుకుపోతుంటే/పొలాల్ని మాత్రం ఎలా తెరిచి ఉంచగలం?/మనసు పడి కాదు, మా మనుగడే మసకబారుతున్నందుకు/మహాఘోషతో, పుక్కిట పట్టిన దుఃఖంతో,ఆగ్రహంతో/ తాళాలేసాం మా ప్రాణ ప్రదాలైన పొలాలకు-”
బాల్యం నుండి రైతు కుటుంబాలతో ఉన్న అనుబంధాన్ని, గ్రామాలతో ఉన్న మమకారాన్ని ఈ కవిత్వం నిండా చిత్రీకరించారు కవి. అగ్రికల్చర్ లో ఉన్నత చదువులు చదివి బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడినా గానీ, రైతును తన కవిత్వానికి ప్రధాన వస్తువుగా స్వీకరించారు. ఆ ప్రేమతో కర్షకుల జీవనయానంపై కవితాగానం చేస్తున్నారు. మనం కూడా ఆయన కవితా క్షేత్రంలో పయనిస్తూ అండగా నిలబడుదాం. “మట్టి బిడ్డలారా… మరువదెన్నడు మిమ్మల్ని ఈ గడ్డ…!” అని చాటుదాం..!

– గోపగాని రవీందర్
94409 79882
