కొండరాళ్ళని కోమలమైన శిల్పాలుగా మలిచే విద్య తెలిసిన వాళ్ళు కొందరే ఉంటారు. రక్షణ వ్యూహంతో శత్రుదుర్భేద్యమైన కోటను నిర్మించే చాతుర్యం ఉన్నవాళ్ళు కొందరే ఉంటారు. ఈ కోవకు చెందినవారే మహమూద్ పాషా. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ప్రముఖ కవి దేవిప్రియ గారు మహమూద్ పాషా ‘ఉనికి’ కవితా సంపుటి గురించి రాస్తూ ‘రేపటికవి’గా ప్రకటించారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ నలబైయేండ్లుగా తనలోని నిప్పు ఆరిపోకుండా నిరంతరం రాజేసుకుంటూ జ్వాలగా ప్రజ్వరిల్లుతున్న మూడు తరాల వారధి మహమూద్ పాషా.
____________________
మహమూద్ పాషా కవిత్వం చదువుతుంటే వినసొంపుగా ఉంటుంది. ఉపాధ్యాయుడికి విద్యార్థి పద్యం అప్పజెప్పుతున్నంత శ్రద్దగా, సభికులు మంత్రముగ్ధులయ్యేలా సాగుతుంది. అతను చదివే తీరును బట్టి, కవిత్వం పట్ల అతని చిత్తశుద్ది, క్రమశిక్షణ, మమకారం ఇట్లే తెలిసిపోతుంది. ఇప్పటికీ కవి సమ్మేళనాలు జరిగినప్పుడు పాషాగారి కవిత్వ పఠనం వినేందుకు ఎదురుచూసే మాలాంటి వాళ్ళు ఎందరో వున్నారు. వస్తువు ఎంపికలో శ్రద్ధ, శిల్పంలో నిబద్ధత, రూపం, సారం, ఎక్కడా తగ్గకుండా జాగరూకత వహిస్తూ గాఢత కలిగిన కవిత్వాన్ని సృజించడం మహమూద్ పాషాగారి ప్రత్యేకత,
______________________
మహమూద్ పాషా వృత్తిరీత్యా అగ్నిమాపక శాఖలో ఫైర్మెన్ గా విధులు నిర్వహిస్తూ, ఉద్యోగ విరమణ చేశారు. మాతృభాష ఉర్దూ అయినప్పటికీ, తెలుగు మీద మమకారం౼ గొప్ప కవిగా మార్చింది. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అనేక ప్రాంతాలు తిరుగుతున్న క్రమంలో, అక్కడి ప్రజల జీవనవిధానం, సంస్కృతి,సాంప్రదాయాలు కళలు, సాహిత్యంపట్ల అధ్యయనం చేయడం ఆసక్తిగా ఉండేది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్, జోగిపేట ప్రాంతంలో పనిచేస్తునప్పుడు ఒక కూలీతల్లి చేతిలోని పనిముట్టు పాషాగారిని ఆకర్షించింది. పంట చేనులో కలుపు మొక్కల్ని పెకిలిస్తూ ఏరివేస్తున్న పనిముట్టును గమనిస్తూ మాట కలిపారు. కొడవలి ఆకారంలో ఉండి చివరి అంచు కొంచెం మొనదేలి కలుపు తీయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ పనిముట్టును ‘కలవార’ అంటారని తెలుసుకున్నారు. ఆ పదాన్ని తన కవితా సంపుటికి శీర్షికగా పెట్టుకున్నారు.
సమాజంలో పంటమొక్కల కంటే ఏపుగా ఎదుగుతూ, అణువణువు విస్తరిస్తూ,ఆందోళనకు గురిచేస్తున్న అవినీతి, అన్యాయం, అక్రమాల కలుపు మొక్కల్ని పెకిలించడానికి ‘కలం-కలవార’తో బయలుదేరారు.
సమాజ సస్యక్షేత్రంలో/ ఎదుగుతున్న దోపిడీ దౌర్జన్యాల గడ్డి, కలుపు మొక్కలను/ అసాంఘీక గంజాయి మొక్కలను చేనును మేస్తున్న కంచెలను/ మాటువేసి కాటువేసే విష పురుగులను నిర్మూలించే కవి కలమే “కలవార” అంటూ ప్రకటిస్తారు.
మహమూద్ పాషా కల్లోల కాలాన్ని దాటివచ్చిన కవి, ఎనభైయవ దశకంలో తెలుగునేలపై జరిగిన అనేక అలజడులను కళ్ళారా చూసినవారు. అనాటి నిర్బంధాలను పెత్తందారీ దౌర్జనాలను వాటి సామాజిక స్థితిగతుల్ని దగ్గర్నుండి గమనించినవారు. ప్రజల పక్షం నిలబడ్డ కవిగా ఎంతో నిబద్ధతతో తన పాత్ర నిర్వహించినవారు. భారత చరిత్రలోనే ‘మరో జలియన్ వాలాబాగ్’ గా అభివర్ణించే “ఇంద్రవెళ్లి సంఘటన” గుర్తుకువస్తే ఇప్పటికీ గుండె కలుక్కుమనక మానదు. ఆనాటి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో, అమాయక ఆదివాసీలపై జరిగిన మారణకాండకు చలించని హృదయముండదు. ‘తెలంగాణ రచయితల వేదిక’ ఆధ్వర్వంలో సాహిత్య, సాంస్కృతిక పర్యటనలో భాగంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తూ ఇంద్రవెల్లి ఘటన బాధిత గ్రామమైన ‘పిట్టబొంగరం’ గ్రామాన్ని సందర్శించినప్పుడు, అక్కడి ప్రజలను కలిసి, నాటి చేదు జ్ఞాపకాలతో పాటు, సంఘటనలో కాల్పుల అనంతరం పక్కనే పారుతున్న కాలువ ఎరుపెక్కడాన్ని వారి మాటల్లో వింటూ చలించి పోయిన పాషాగారు పిట్టబొంగరాన్ని కవిత్వంగా మలిచిన తీరు అనిర్వచనీయం.
“అవనిపై జరిగేటి అవకతవకలు జూసి / ఎందుకో నా హృదిని/ ఇన్ని వేదనలు” అని కాళోజిగారు తన గొడవను ఎల్లబోసుకున్నట్టు ఏ పీడితున్ని చూసినా, ఎక్కడ అన్యాయాన్ని చూసినా, తన కంటిలోంచి నీరు కారుస్తారు పాషా గారు,
వాళ్ళు ఎవరైతేనేం/ ఆ కన్నీళ్ళు నావే / ఆ బాధ నాదే/ సుఖం కొందరిదే కావచ్చు/ కనుకొలుకుల్లో నిలచిన కన్నీటి చుక్కల్లో / దుఃఖిత భూగోళం స్పష్టంగా కనబడుతుంది అంటారు ‘దుఃఖనది’ కవితలో.. సమస్త జనుల బాధలను తన బాధలుగా ఎంతో ఆర్ద్రంగా అక్షరీకరిస్తారు.
రైతులన్నా, వ్యవసాయమన్నా దానిపై ఆధారపడ్డ వృత్తులన్నా ఈ కవికి వల్లమాలిన ప్రేమ. రైతు మెడకు గుదిబండగా మారి మరింత అగాధంలోకి పడదోసే రైతు వ్యతిరేక నల్లచట్టాల రద్దుకై నెలల తరబడి, గడ్డకట్టే చలిలో, కుటుంబాలతో సహా జలఫిరంగుల్ని ముండ్ల కంచెల అడ్డంకుల్ని, భాష్పవాయుగోళాల్ని, పోలీసుకాల్పుల్నీ, ఎదుర్కొంటూ, ఢిల్లీ, టిక్రీ, లఖింపూర్ ఖేరీ ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్ని నిర్భందించి నిరసన ప్రకటించిన రైతులకు యావద్భారతం అండగా నిలబడి పాలకులు తోక ముడిచేలా చేసింది. హైదరాబాద్ లో జరిగిన ‘హలాలకు కలాల మద్దతు’ కవిసమ్మేళనంలో పాషా చదివిన ‘రైతు ప్రతిఘటన’ కవిత అందరినీ ఆలోచింపజేసింది.
“మెతుకు బతుకును నిలబెట్టలేనప్పుడు
ఆకలి కేకలు ఉద్యమ జెండాలవుతాయి
నెత్తుటి బువ్వకు ఆశపడే
సిండికేట్ బ్రోకర్ మాఫియాలపై
తిరుగుబాటు పిడికిళ్ళు బిగుస్తాయి
రైతు సైన్యం కదంకదం కలుపుతూ
కవాతు చేస్తుంది.” అంటూ హెచ్చరిక జారీ చేస్తారు.
సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ ప్రభావంతో, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న క్రమంలో అనేక వృత్తులు, కళలు, సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోతున్న పరిస్థితి, మానవ సంబంధాలు బీటలు వారి విచ్ఛిన్నమై పోతున్న సందర్భం, డబ్బు, వస్తు వ్యామోహంలో పడి, అపురూపంగా చూసుకోవాల్సిన మనుషుల్ని బయటకు విసిరేసి, బయట ఉండాల్సిన వస్తువుల్ని లోపల నింపుతూ ఇరుకుగా మారిపోతున్న మానవ సంబంధాలపై ఆందోళన చెందుతూ, మానవీయ విలువలకై తపించే మనిషిగా ‘మనిషికాటు’ కవితలో వివరిస్తారు.
అలాగే ‘పున్నమి నిండు చంద్రునిలా/ నిండు విలువతో ఒకప్పుడు దినదినం క్షీణించే చంద్ర బింబంలా / రూపాయి బక్కచిక్కిన పాపాయి’.. అంటూ చమత్కరిస్తారు.
అమెరికా అగ్రరాజ్య అధికార దాహంతో కునారిల్లుతున్న వివిధ దేశాల ఆర్థిక పరిస్థితుల నేపథ్యాన్ని చిత్రీకరించిన కవిత “రూపాయి బక్కచిక్కిన పాపాయి” కవితలో వ్యంగ్యాస్త్రాల్ని సంధిస్తారు మహమూద్ పాషా.
మండుటెండల్లో బండల్నికొట్టి/ దేహవస్త్రంలా చెమటపట్టిన శరీరాలను పిండి ఆరేసినట్టు/బండల్ని కొట్టి పొట్టపోసుకునే “కాశతురక” ల జీవితాల్లో గునపం దింపిన ‘స్టోన్ క్రషర్’ మాఫియాల విధ్వంసంపై…దూదిని ఏకి పరుపులు కుట్టే ‘దూదేకుల’ గురించి రాసిన కవితలు హృద్యంగా ఉన్నాయి. అంతరించి పోతున్న కులవృత్తులు, కళలు, సంస్కృతులు, కాలగర్భంలో కలిసిపోతున్న తీరును తన కవితల్లో ప్రస్తావిస్తారీకవి.
___________________
కనుమరుగైపోతున్న “అరుగుల” గురించి మరొక మంచి కవిత ఈ సంపుటిలో ఉంది. అరుగుల్ని మానవ వికాస కేంద్రాలుగా పేర్కొన్నారు. ఒకప్పుడు అరుగులపై జరిగిన చర్చలు, పంచాదులు, తప్షాలు, కలిపిన సంబంధాలు, ఉత్సవాలు, ఊరేగింపులు, వీధిభాగోతాలు, కూర్చోవడానికి, నిలుచోవడానికి ఎలా ఉపకరించాయో జ్ఞాపకాల పొరల్లోంచి తవ్విపోస్తూ, అందర్నీ మళ్ళొక్కసారి బాల్యంలోకి తీసుకెళ్తారు. మాస్టర్ ప్లాన్ నెపంతో తమ ఇంటి అరుగుల్ని ప్రొక్లెయినర్లతో కూలుస్తుంటే చిన్న పిల్లాడిలా తల్లడిల్లిపోతూ ‘అరుగులు’ కవితని రాశారు.
______________________
ఇవ్వాళ తెలుగు కవి కేవలం ప్రాంతీయానికే పరిమితమై పోలేదు. విశ్వవ్యాపితమై స్పందిస్తాడు. సామాజిక స్పృహ మెండుగా కలిగిన మహమూద్ పాషా పొలిమేర ఆవలవున్న పీడనను అన్యాయాన్ని ధిక్కరిస్తారు. అధికార దాహంతో, ఆయుధ వ్యాపారాన్ని చేస్తూ దేశాల మధ్య యుద్ధాల్ని రాజేస్తు, అక్కడి వనరుల్ని చెరబట్టి విధ్వంసాన్ని సృష్టిస్తున్న అగ్రరాజ్య ఆధిపత్య భావజాలాన్ని నిరసిస్తారు. అగ్రరాజ్యం సృష్టిస్తున్న యుద్ధాల్లో ప్రధానంగా బలైపోతున్న సగటు మనిషి ఆక్రందనను, చిద్రమైపోతున్న బాల్యాన్ని, సర్వస్వం కోల్పోయి నిర్వాసితులుగా మారుతున్న సందర్భాన్ని, అమానవీయ ఘటనల్ని, మనం నిత్యం చూస్తున్న గాజా సంక్షోభం గూర్చి మానవీయ కోణంలో రాసిన కవిత “యుద్ధభయం” కంటతడి పెట్టించక మానదు.
మహమూద్ పాషా గారి భావుకతకు మరో రెండు కవితలు మచ్చుతునకలుగా నిలుస్తాయి. ఆగ్రహంతో ఆధిపత్య భావజాలాన్ని నిరసించడమే కాదు, సున్నితమైన హృదయంతో ప్రకృతిని ఆరాధించడమూ ఈ కవికి తెలుసు. “శబ్ద పుష్పాలు”, “జలతీగలనాదం”. ఈ రెండు కవితలను అద్భుతమైన ప్రతీకలతో అభివర్ణిస్తారు. ‘పన్నెండు మెట్లకిన్నెరను’ శబ్ద పుష్పాలుగా కవిత్వీకరించారు. “ప్రకృతి పచ్చగా నవ్వినట్లు /గోగుపూల వనం ఎర్రబారినట్లు వసంత కోకిలలు గొంతును సవరించుకున్నట్లు/ కవుల కలాలు, గళాలు అలుగుదుంకినట్టు”.. అంటూ కిన్నెర సోయగాలను వర్ణిస్తారు. “ఆకాశంలో గాలికెరటాలకు/ నల్లమేఘం కదిలి/ వర్షపు జల్లు కురుస్తుంది/ సూదులవలె జలతీగలనాదం మార్మోగుతుంది. నేలపై విత్తనం పగిలి/ ఆకుపచ్చని జెండా ఎత్తుకుంది. జీవకోటికి జలం జీవం/ జలతీగల రాగంతో జీవన గానం అలపించబడుతుంది”..అంటూ వర్షాన్ని వినూత్నంగా ఆవిష్కరిస్తారు.
సాహిత్యాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి, నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంలో తనదైన శైలితో అసమాన సాహిత్య సృజన చేస్తున్న ప్రతిభాశీలి మహమూద్ పాషా. కవిత్వం నిరంతరం ప్రజల పక్షాన నిలబడాల్సిందేనంటూ మూడు తరాలకు వారధిగా నిలుస్తున్న ఆయన, నిఖార్సైన తెలుగుదనం మరియు నిటారైన శైలీ సంవిధానంతో సాహితీ ప్రపంచంలో వెలుగులు విరజిమ్ముతున్నారు. అక్షరాల పూదోట వంటి ఆయన కలం నుండి వెలువడాల్సిన కవిత్వం ఇంకా ఎంతో ఉంది.
-కొండి మల్లారెడ్డి
96521 99182
