తెలుగు సాహిత్యంలో కుప్పిలి పద్మ పరిచయం అవసరం లేని పేరు. ఆరు కాలాలపాటు నిలిచే ఎన్నో అద్భుతమైన కథలను ఆమె అందించారు. ‘ముకుల’ ఆమె పదవ కథా సంపుటి, మొత్తంగా ఇరవయ్యో పుస్తకం. 2019 నుండి 2024 వరకు ఆమె రాసిన 12 కథలు ఇందులో ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి కాలపు సామాజిక, మానసిక విచ్ఛిన్నతను, స్త్రీల అభద్రతను, వలసల దుర్భరతను, జాతి ఘర్షణలను ఆవిష్కరించే అరుదైన సంపుటి ఇది.
____________________
‘ముకుల’ అంటే విరిసీ విరియని నునులేత మొగ్గ అని అర్థం. ఈ సంపుటిలోని కథలన్నీ ఈ భావన చుట్టూనే తిరుగుతాయి. భయం, అభద్రతల మధ్య కూడా మానవత్వం ఒక చిన్న మొగ్గలా మిగిలి ఉండటాన్ని ఇది సూచిస్తుంది. సమాజం ఎంత దగా చేసినా, రాబోయే కాలం బాగుంటుందనే నమ్మకానికి, మనుషుల్లోని విశ్వాసానికి ‘ముకుల’ అనే శీర్షిక ఒక ప్రతీకగా నిలుస్తుంది.
_____________________
పద్మ గారు తన ముందుమాటలో “కాలం స్పర్శను నిషేధించగలిగింది కానీ, మనుషుల హృదయాల్లోని ప్రేమను నిషేధించలేకపోయింది” అని చెబుతూ, “ఆ ప్రేమే ఆక్సిజన్ అయింది, ఆ ప్రేమే భోజనం అయింది, ఆ ప్రేమే పాదమై నడిపించింది” అని ముగిస్తారు. మనకు రోజూ అనుభవంలోకి వచ్చే సంఘటనలే ఆమె కథావస్తువులు. ‘ముకుల’ కథలో నిర్భయ, దిశ ఉదంతాలు; ‘మెట్రోకావల’లో వలస కూలీల కష్టాలు; ‘మళ్ళీ తేయాకు తోటల్లోకి’ కథలో అస్సాం కూలీల జీవితం; ‘పరిమళ కలలది ఏ పరిమళం’లో లాక్‌డౌన్ సమయంలో నిరుపేద బ్రాహ్మణ మహిళల యాతన; ‘నా స్నేహితురాలు మణిపూర్ ఎక్స్’లో జాతి ఘర్షణల వల్ల చిన్నాభిన్నమైన సామాన్య జీవితం.. ఇలా ప్రతి కథా మన కళ్ళముందు జరుగుతున్న వాస్తవాలకు దర్పణం పడుతుంది.
పద్మ గారి కథా వస్తువులతో ఎవరికీ విభేదాలు ఉండవు. కానీ, ఆమె శైలిపైనే నా అభ్యంతరం. నిజానికి ఆమెకు గుర్తింపు తెచ్చింది కూడా ఆ శైలియే. ఆమె వాక్యాలను శిల్పంలా చెక్కుతారు. సాదాసీదా భావానికి తన వచన రచనా నైపుణ్యంతో అపురూప సౌందర్యాన్ని అద్దుతారు. ఆమె కథలు చదువుతుంటే తెలుగు భాష ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. సూర్యోదయం, సాగర తీరం, కోకిల గానం వంటి దృశ్యాలను ఆమె వర్ణించే తీరు మనలోని సౌందర్య దాహాన్ని తృప్తిపరుస్తుంది.
కుప్పిలి పద్మ స్త్రీ అంతరంగాన్ని చిత్రించడంలో దిట్ట. అయితే, ఒక బాధితురాలి గొంతులో కవిత్వం కంటే ఆక్రందన ఎక్కువగా ఉండాలి; వర్ణన కంటే వాస్తవం బలంగా ఉండాలి. భాష కథలోని ఆత్మను కప్పివేసే ముసుగు కాకూడదు. అలంకారాల బరువుతో కథ కుంచించుకు పోయినప్పుడు, అది ఒక అందమైన చిత్రపటంలా మిగిలిపోతుందే తప్ప, ఆలోచింపజేసే ‘అస్త్రం’ కాలేదు. రచనలో శైలి అనేది వస్తువును అనుసరించి ఉండాలి. యుద్ధం, ఆకలి, మరణం వంటి కఠినమైన అంశాలను ఎంచుకున్నప్పుడు భాషలో ‘కరుకుదనం’ ఉండాలి. కానీ పద్మ గారి కథల్లో వస్తువు ఎంత భయంకరమైనదైనా, భాష మాత్రం పట్టు వస్త్రంలా మృదువుగా ఉంటుంది.
ఉదాహరణకు, ‘తేయాకు తోటల్లోకి’ కథలో ఒక చిన్నారి దేహం వేలాడుతున్న దృశ్యాన్ని వర్ణిస్తూ— “కొండచిలువ మింగేసిన చందమామలా ఉంది” అనడం సాహిత్యపరంగా బాగున్నా, ఆ దృశ్యం కలిగించాల్సిన భయానకతను (Horror) తగ్గించేస్తోంది. ఇక్కడ అలంకారం వస్తువుకు ‘మేకప్’ వేసి అసలు నొప్పిని మరుగున పరుస్తోంది.
‘నా స్నేహితురాలు మణిపూర్ ఎక్స్’ కథలో యుద్ధ బీభత్సం మధ్య ఉన్న స్నేహితురాలు రాసిన ఉత్తరం కూడా మితిమీరిన భావుకతతో సాగుతుంది. “మై డియర్ రెడ్ బటర్‌ఫ్లై” అంటూ మొదలయ్యే ఆ ఉత్తరంలో యుద్ధ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి ఉండాల్సిన ఆవేదన కంటే, శైలీ విన్యాసమే ఎక్కువగా కనిపిస్తుంది. సాహిత్యం సమాజానికి దర్పణం పట్టాలి, కానీ ఆ దర్పణానికి మరీ ఎక్కువ అలంకారాలు అద్దితే ప్రతిబింబం తన అసలు రూపాన్ని కోల్పోతుంది.
కథా పాత్రల స్వభావం వారి సామాజిక, ఆర్థిక నేపథ్యం నుండి పుట్టాలి. కానీ పద్మ గారి పాత్రలన్నీ ఆమె మేధో సంపత్తికి ప్రతిరూపాల్లాగే కనిపిస్తాయి. మణిపూర్ బాధితురాలు, తేయాకు తోట కూలీ, అగరువత్తులు చేసే పేద అమ్మాయి.. వీరంతా ఒకే రకమైన తాత్వికతతో, ఒకే రకమైన పదజాలంతో మాట్లాడటం పాత్రల సహజత్వాన్ని దెబ్బతీస్తుంది. పాత్రలు రచయిత్రి భావాలను మోసే ‘తోలుబొమ్మలు’ (Mouthpieces) గా మారిపోయాయి. బాధను అందంగా వర్ణించాలనే తాపత్రయం ఈ కథల్లో పరాకాష్ఠకు చేరుతుంది.
___________________
పసిబిడ్డ మరణాన్ని వర్ణించేటప్పుడు వరుస ఉపమానాలు (Metaphors) వాడటం కవిత్వంలో బాగుండవచ్చు కానీ, కథలో ఆ తల్లి పడే శోకాన్ని చదువరికి నేరుగా తాకనివ్వదు. హింసను మృదువుగా చెప్పడం ‘Sufferings’ని గ్లామరైజ్ చేసినట్లు (Aestheticization of suffering) అనిపిస్తుంది. ఇది పాఠకుడికి సమాచారాన్ని ఇస్తుందే తప్ప, భావోద్వేగ పరంగా కదిలించదు. నిజమైన బాధలో ఉన్న మనిషికి ఇన్ని ఉపమానాలు స్ఫురించవు. ఇక్కడ రచయిత్రి హృదయం కంటే మేధస్సు ఎక్కువగా పనిచేస్తోంది. దీన్నే “Sanitizing Reality” అంటారు. అంటే నిష్టూర సత్యాన్ని పాఠకుడికి నేరుగా తాకనివ్వకుండా, అందమైన పదాలతో శుద్ధి చేయడం.
____________________
రష్యన్ విమర్శకుడు బాఖ్తిన్ చెప్పినట్లు, రచనలో ఉండాల్సిన బహుళ గొంతుకలు (Polyphony) లోపించి, రచయిత్రి ఏకైక గొంతుక (Monophony) మాత్రమే వినిపిస్తోంది. భావుకత్వం మితిమీరినప్పుడు అది ‘మెలోడ్రామా’గా మారి, సాహిత్యానికి ఉండాల్సిన సామాజిక బాధ్యత పక్కదారి పడుతుంది. ఆస్కార్ వైల్డ్ అన్నట్లు, ఈ కథల్లో ఉపరితలం (Surface) మెరుస్తోంది కానీ, ఆ మెరుపులో అసలైన సత్యం మసకబారిపోతోంది.
– ఎ. మేఘన
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad












