“కాళ్ళు రెండూ రెండు చెట్లయితే బావుండేది.. ఏటా ఒక వసంతమైనా వచ్చేది” అన్నారు శేషేంద్ర తన ‘నా దేశం – నా ప్రజలు’లో. కానీ “వసంతం ఏటా వచ్చినా జీవన వసంతం మాత్రం మనిషి బుద్ధుడయ్యే వేళకే” అంటున్నారు కాళ్ళకూరి శైలజ గారు తన “నేలపాట”లో. శైలజ గారి మొదటి కవిత్వ సంపుటి ‘కొంగలు గూటికి చేరే వేళ’ 2022లో వచ్చింది. ఈ రెండవ సంపుటి ‘నేలపాట’ 2025లో వచ్చింది. మధ్యలో ఉన్న సమయం మూడేళ్లే! కేవలం మూడేళ్లే! కానీ మనముంటున్న సమాజంలో అదేమీ చిన్న సమయం కాదు. రోజురోజుకూ సమాజం, మనుషుల సామాజిక వర్తన అనూహ్యంగా మారిపోతున్నప్పుడు క్షణం కూడా ఒక యుగంగా తోచడం సహజం. బయటి సామాజిక స్థితిగతులకు అనుగుణంగా శైలజ గారు కూడా లోపల అనూహ్యంగా మారారు.
__________________
ఆమె మొదటి కవిత్వ సంపుటి చదివినప్పుడు ‘అనుభూతి చుట్టిన పూల పొట్లం ఆమె కవిత్వం’ అనిపించింది. ఎన్నుకున్న వస్తువు ఏదైనా దాన్ని ఆత్మీయంగా సొంతం చేసుకోవడం శైలజ గారికి తెలుసు. వస్తువును సొంతం చేసుకోవడమంటే దానితో మమేకం కావడం. తాదాత్మ్యం చెందటం. ఆ వస్తువుకు తన భాషను ఇవ్వడం. ‘నిజానికి ఇప్పుడొస్తున్న కవిత్వం చదువుతున్నప్పుడు అందరి భాషా ఒకేలా కనిపిస్తుంది. అందరి భావమూ లేదా వస్తువు ఒకేలా వినిపిస్తుంది. ఇలా ఒకేలా మూసలో నిలవడానికి శైలజ గారు మాత్రం ఒక మినహాయింపు’ అని ‘కొంగలు గూటికి చేరే వేళ’ గురించి రాశాను.
____________________
ఈ రెండవ సంపుటికి వచ్చేసరికి శైలజ గారు వస్తువుతో తాదాత్మ్యం చెందటానికి బదులుగా, వస్తువుతో మమేకమై తానే వస్తువుగా మారడానికి బదులుగా వస్తువును ఒడ్డున ఉండి చూస్తూ, విశ్లేషిస్తూ, ఆ వస్తువు తాత్వికతను Uncover చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రోగ నిర్ధారణ చేసే సుశిక్షితుడైన డాక్టర్ లాగా వస్తువును Dissect చేసి దాని మూలాలలోకి వెళుతున్నారు. అందువలన ఈ రెండవ కవిత్వ సంపుటి పాఠకుడికి హృదయాన్ని తాకడం కంటే మేధకు పదును పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేసింది.
“కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే
శివేతరక్షతయే | సద్యః పరనిర్వృతయే
కాంతాసమ్మితతయోపదేశయుజే ||” — మమ్మటుడు (కావ్యప్రకాశం).
మమ్మటుడు కావ్యం వల్ల కలిగే ఆరు ప్రయోజనాలను వివరించారు. అందులో “వ్యవహారవిదే” (లోక జ్ఞానాన్ని, వ్యవహార దక్షతను నేర్పడం) మరియు “ఉపదేశయుజే” (ఒక హితబోధ చేయడం) అనేవి మేధస్సుకు సంబంధించినవి. అంటే కవిత్వం కేవలం ఆనందాన్ని ఇవ్వడమే కాదు, మనిషికి తెలివితేటలను, లోకజ్ఞానాన్ని నేర్పాలని దీని అర్థం. ఈ ఆలోచననే “A thought to Donne was an experience; it modified his sensibility.” అని T.S. Eliot తన Influential essay titled “The Metaphysical Poets”, published in 1921లో అన్నాడు. ఆ మెటామార్ఫసిస్ (Metamorphosis) శైలజ గారిలో కలగడం వలననే “వసంతం ఏటా వచ్చినా జీవన వసంతం మాత్రం మనిషి బుద్ధుడయ్యే వేళకే” అనగలిగారు.
ఇంతకుముందు ఇస్మాయిల్ కరుణ ముఖ్యం అన్నారు. అంతకుముందు చలం జీవితాదర్శం శాంతి అన్నారు. శాంతి, కరుణ ఈ పదాల మూలం ప్రేమలో వుంది. ప్రేమ మంద్రస్థాయి అయితే కరుణ మధ్యమ, శాంతి తారాస్థాయి. నిజానికి బుద్ధుడిని మించిన శాంతిమూర్తి ఎవరు వున్నారు? భౌతిక వసంతాలు వచ్చిపోతూ ఉంటాయి. ఏడాదికి ఒక మారు. జీవితంలో వచ్చే వసంతం శాశ్వతం కావాలంటే ఏమి చేయాలో శైలజ గారికి తెలుసు.
“యుద్ధం కాదు బుద్ధం శరణం గచ్ఛామి
స్వార్ధం వలదు సంఘం శరణం గచ్ఛామి
గర్వం వద్దు ధమ్మం శరణం గచ్ఛామి
అనుశృత సత్య బోధయే బౌద్ధం”
అంటూ మనిషినో మనసునో హింసించే నిత్య మారణకాండ ఆపడానికి మరో బుద్ధుడు రావాలి అంటున్నారు. నిజానికి ఈ భూమి మీద మనిషే అత్యంత క్రూరమైన మృగం. సింహాలు గుంపులు గుంపులుగా సంచరిస్తాయి. సింహం అడవిలో బయటకు వచ్చింది అంటే జింకలు ఎక్కడున్నా సంకేతాలు ఇచ్చుకుంటాయి. మబ్బుపట్టి గాలి వీస్తే కుందేళ్లు ఎక్కడున్నా పక్కనే వున్న బొరియల్లోకి దూరిపోతాయి. వాటికేమీ మనుషులకు ఉన్నట్టు ఆలోచనాశక్తీ, తార్కిక జ్ఞానమూ లేవు. కానీ తన జాతిని సంరక్షించుకోవడానికి తాపత్రయపడతాయి. వాటికీ ఒకదానితో మరొకదానికి పరిచయం అవసరం లేదు. కానీ మనిషికి అన్నీ తెలుసు. తనకున్న ఆలోచనతో సకల చరాచర సృష్టినీ తన గుప్పిటిలో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ విజయపథంలో వున్నాడు. అయినా అపరిచితునితో మాట కలిపే వీలు మాయమై మానవ సమూహం తానూ వేసుకున్న నిర్బంధ కారాగార శిక్ష తోటి వారిపై అపనమ్మకం. ఈ విషయం శైలజ గారికి బాగా తెలుసు కనుకనే:
“మనిషి మెదడు
కృత్రిమ మేధ సాక్షిగా
అంతరించిన జాతికి ప్రతీక” అంటున్నారు.
ఒకవేళ ఈ భూమి మీద మానవుడు అనే ఒక ద్విపాద జంతువు లేకపోతే ఏమవుతుంది? అడవే మేలు. ఆకలైతేనే వేట. మనిషి ఉంటే నిరంతరం మరొక మనిషిని వేటాడుతూనే ఉంటాడు. మరొక జీవిపైన ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉంటాడు. మనిషి లేకపోతే:
మానవుడు లేని చోట
యుద్ధం రాదు
కాలుష్యం లేదు. అంతేనా? కాదు ఇంకా చాలావుంది. పులి, జింక ఒకే అడవిలో భయం లేకుండా జీవిస్తాయి. ఋతువులు స్వక్రమంగా నడుస్తూ విశ్వం మళ్ళీ కలకలలాడుతుంది.
కానీ మనుషులు లేని ఈ సృష్టి, ఈ విశ్వం ఏం బావుంటుంది? సాయంత్రం షికారులో నాలుగు రోడ్ల అవతల వున్న ఒకనాటి మాస్టారి ఇంటి తలుపు తడితే ఒంటరి జంట చేటంత ముఖం చేసుకుని చెప్పే క్షేమ సమాచారం ఎవరు వినాలి? ఎన్నిసార్లు మనిషితో ప్రేమలో పడితే అన్నిసార్లు మనసు భారం దింపుకున్న తేటగీతిని ఎవరు చూడాలి? అప్పుడు కనిపించే నింగి నీలం భలే వుంటుంది అని ఎవరు అనుకోవాలి? అమ్మ కడుపులో రూపుకట్టే చమత్కారం తెలుసుకున్నట్టు సాయం చీకటి కాటుకద్ధి పెనిమిటికి ప్రేమ కావ్యం రాసినట్టు ఒక అవ్యక్తానంద గీతం ఊపిరి పాట అయితే ఎవరి ఎద నిండాలి? ఎవరు ఈ భూమికి తన జ్ఞాన జ్యోతులతో హారతి పట్టాలి.
_____________________
అందుకే మనుషులు ఉండాలి. నిజమైన మనుషులు ఉండాలి. మానవత్వం మూర్తీభవించిన మనుషులు ఉండాలి. ప్రేమ, దయ, కరుణ, అనుకంపతో అలరారే మనుషులు ఉండాలి. అలా ఉండాలి అంటే మనుషులు నేలపాడే పాట వినాలి. అసలైన నేలపాట వినాలి అంటే పాదాలు చెవులవ్వాలి. పగుళ్ల లోంచి పచ్చగా నవ్వే భూమి గురించి తెలియాలి. కంచంలో అన్నం చవులు ఊరేది మరో నలుగురు తిన్నాకనే అంటున్నారు శైలజ గారు.
_____________________
‘చవులూరు’ అనే పదం ఎంత గొప్పగా వుంది. కంచంలోని అన్నాన్ని నలుగురుతో పంచుకుంటే అది చవులూరుతుందట. చవులూరడం అంటే మరింత రుచికరంగా తయారు అవడమే కదా! పంచుకుంటే ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంటుంది? ఎంత అద్భుతంగా ఉంటుంది? ఎంత నివాసయోగ్యంగా ఉంటుంది?
శైలజ గారి “నేలపాట” కేవలం ఒక కవితా సంపుటి కాదు, అది ఆధునిక మానవ వికృతత్వానికి ఒక ‘రోగ నిర్ధారణ పత్రం’ (Diagnostic Report). శైలజ గారి కవిత్వం ద్వారా మనం గ్రహించాల్సింది—మనిషి భౌతికంగా అంతరించడం కాదు, మనిషిలోని ‘మృగ స్వభావం’ అంతరించి, ‘బుద్ధ స్వభావం’ మేల్కొనాలి. అప్పుడే మనిషి ఉండి కూడా యుద్ధం లేని, కాలుష్యం లేని, అపనమ్మకం లేని లోకాన్ని చూడగలం.

◆ వంశీకృష్ణ
95734 27422
