farmer | రైతు ఆత్మహత్యల భారతం!

ఎడిటోరియల్ హోమ్
  • ప్రభుత్వాలు వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల్లో కోత – పెరుగుతున్న రుణభారం..
  • పంటల మద్ధతు ధరకు చట్టబద్దతే ఆత్మహత్యల నివారణకు మార్గం..
  • మీడియా పట్టించుకోని (ఎన్ సీ ఆర్ బీ)నివేదిక..
  • భారత్ ఎంత డిజిటల్ అయినా తినే అన్నం మాత్రం డౌన్లోడ్ చేయలేదు..
  • రైతు శోకం జాతికి శాపం..

 

అన్నం తింటుంటే ఎక్కిళ్ళు వచ్చాయి కారణం అమ్మ నీళ్లు ఇవ్వనందుకు కాదు!. ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్టుందనే కవి ఆవేదన నేటి భారత రైతాంగ దుస్థితికి అద్దం పడుతుంది. పాలకులు, టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ పెనవేసుకొని నింగి, నేల తేడా లేకుండా వ్యాపారం చేస్తున్నారు. కానీ రైతు ఆత్మహత్యలను ఆపలేకపోతున్నారు. భారతదేశం ఎంత డిజిటల్ అయినా తినే అన్నం మాత్రం డౌన్లోడ్ చేసుకోలేదన్న వాస్తవాన్ని గ్రహించండి. రైతు శోకం జాతికి శాపం అనే స్పృహతో రైతాంగం కన్నీళ్లను తుడవాలి, కష్టాలను తీర్చాలి..

భారత జాతికి పట్టెడు అన్నం పెట్టి ఆకలి మంటలు చల్లార్చే కిసాన్లకు, సరిహద్దులో శత్రువు దాడుల నుంచి దేశాన్ని రక్షించే జవాన్లకు ఏక వాక్యం(కాలం)లో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై కొట్టారు. రైతు అంటే జాతి ఆహార భద్రత కోసం రేయింబవళ్లు కంటికి రెప్పలా కాచుకునే జవాన్. అలా దేశంలో కర్షక వీరుల ప్రాముఖ్యత ఎంతటిదో ఏనాడో ఘనంగా చాటారు. దేశానికి వెన్నముక, అన్నదాత అనే పాలకుల పల్లకి మోతలే కానీ ఆరుగాలం స్వేదం చిందించి పంట పండించినా.. చేతికందే దాకా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, మార్కెట్ దోపిడీలు, దళారుల మోసాలు, పంట పొలాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ల విజృంభణలతో రైతన్నలపై ముప్పేట దాడులు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాల విధానపరమైన వైఫల్యాలను, ఎన్నో కష్టాలను అన్నదాతలు అనభవిస్తూ, అధిగమిస్తూ ముందుకు సాగుచున్నారు. వాస్తవంగా వ్యవసాయ రంగానికి సముచితమైన ప్రాధాన్యం, పంటకు గిట్టుబాటు(మద్దతు)ధర దక్కకపోవడంతో వ్యవసాయం చేసేవారు నానాటికి తగ్గిపోతున్నారు. వ్యవసాయం లేనిదే మనుగడ లేదన్న సోయి, సేద్యం చేసి పంటలు పండించే వారు లేకపోతే చక్రం తిప్పి దేశాన్ని పాలించే వారికి, పాలితులకు తిండి దొరకదు అన్న భావన ప్రస్తుత, భవిష్యత్ తరాలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. రైతు పచ్చగా ఉంటేనే దేశానికి సౌభాగ్యం అనే వాస్తవం నేటికీ విధాన నిర్ణేతల్లో కొరవడడం దురదృష్టకరం.

సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత మూడు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో సుమారు మూడున్నర లక్షల రైతుల హత్యలు చోటు చేసుకున్నాయి. శాస్త్రీయ పద్ధతుల్లో పంటల ప్రణాళికల లేమి, సేద్య ఉత్పత్తుల్లో పతనానికి దారితీస్తున్న పరిస్థితులు ఏమిటి?. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఎండమావైన ఉదంతాలతో రుణాల్లో చిక్కుకున్న రైతులు మరో దారి లేక అర్ధాంతరంగా జీవితాలు చాలిస్తున్నారు. వ్యవసాయంలో స్థానిక అనుకూలతలు, ఎగుమతి అవకాశాల ప్రాతిపదికన ఏ ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో ఏమేమి పంటలు సాగు చేపట్టగల వీలుందో! రైతాంగానికి సరైన మార్గ నిర్దేశం చేసే పకడ్బందీ (శాస్త్ర సాంకేతిక) వ్యవస్థలు నేటికీ లేవు. పాలకులు ఎన్నికల వేళ రుణమాఫీ, రైతుబంధు, పనిముట్లు, పంటల మార్పిడి లాంటి ఉత్తుత్తి వాగ్దానాలు తప్ప రైతులకు నికరంగా ఆదాయం పెంచేలా భరోసా లేదు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు చట్టాలు వెనక్కి తీసుకున్న సందర్భంలో రైతు పంటలకు కనీస మద్దతు ధర వ్యవస్థ బలోపేతానికి 29 మంది సభ్యుల ప్రత్యేక కమిటీ కొలువు దీరిన తర్వాత కూడా మన దేశంలో పంటలకు మద్దతు(గిట్టుబాటు)ధరల తీరుతెన్నులు మారనే లేదు. వాస్తవిక వ్యయాలన్నింటిని పరిగణనలోకి తీసుకోకుండా అరకొర మద్దతును ప్రకటిస్తూ, రైతాంగాన్ని యాచకులుగా భావిస్తూ పాలకులు క్రూర పరిహాసమాడడం భావ్యమా!. వ్యవసాయ ప్రధాన దేశమైన భారత్ లో పంటలకు మద్దతు ధరల ఖరారులోని అశాస్త్రీయ విధానాలను ప్రక్షాళన చేయాలని ఎన్నో కమిటీలు ఏనాడో చెప్పాయి. అంతేకాదు ఇప్పుడిస్తున్న మద్దతు ధరను నిర్ధారించే పద్ధతిని తీవ్రంగా తప్పు పట్టినాయి.

వ్యవసాయ రంగంలో డాక్టర్ స్వామినాథన్ సిఫారసుల్లో ప్రధానంగా.. రైతాంగ వాస్తవిక వ్యయానికి అదనంగా 50 శాతం జోడించి గిట్టుబాటు ధరను ప్రతి రైతుకు వర్తింపజేయాలన్న సిఫారసులను ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. దీనికి తోడు విపణి శక్తుల మాయాజాలానికి రైతుల ప్రయోజనాల సంగతి కాదు కదా! వారి కుటుంబాలకు భరోసా లేకపోవడంతో జీవనం గడపలేక రోడ్డున పడుచున్నారు. నానాటకి రుణభారం పెరిగిపోతుంది. ఎవరినీ మోసం(దగా)చేయలేని అన్నదాతలు ఆత్మాభిమానం మెండుగా ఉండడంతో కలత చెంది ఆత్మహత్యల పాలవుతున్నారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్ సీ ఆర్ బీ) రైతాంగ ఆత్మహత్యల వివరాలను ఈమధ్య విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత తొమ్మిదేళ్లుగా రోజుకు సగటున సుమారు 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపింది. మాటలకు, చేతలకు పోలిక లేని ఘనమైన పాలకుల విధానాలే ఇందుకు నిదర్శనం. రైతుల ఉసురుతీస్తున్న ప్రభుత్వ విధానాలు, పెరుగుతున్న రుణ భారం, వ్యవసాయ పథకాలకు తగ్గుతున్న బడ్జెట్ కేటాయింపులకు తోడు ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. కీలక పరిశ్రమల ప్రైవేటీకరణ, విదేశీ వాణిజ్యాన్ని అనుమతించడం, ప్రభుత్వ సబ్సిడీలు తగ్గడం ఇలా ఇవన్నీ రైతులకు ఇబ్బందులను మరింత పెంచాయి. ప్రభుత్వము నుండి ఉన్న కష్టాలు చాలవన్నట్టు ఖరీదైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, రైతులకు ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు, ఇటు మార్కెట్ లో చోటుచేసుకున్న పరిస్థితులను ఎదుర్కోలేక సతమతమవుచున్నారు. ప్రభుత్వం ఎన్నికల వేళ అన్నదాతలపై అంతులేని ప్రేమను కురిపించింది. కానీ ఆ మాటలన్నీ నీటి మూటలేనని రైతులకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అంతే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. రైతు సంక్షేమానికి కేటాయింపుల సంగతి చెప్పనక్కర్లేదు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు గత సంవత్సరం కంటే 33% తగ్గిపోయి, మొత్తం జీడీపీలో ఈ కేటాయింపులు కేవలం 0.198 శాతం మాత్రమే. అటు వ్యవసాయ కార్మికులు ఇటు రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఎన్ సీ ఆర్ బీ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ నివేదికను మీడియా ఎంత మాత్రం పట్టించుకోలేదు. అంతేకాదు ఈ రైతు ఆత్మహత్యల పై వార్తా చానల్లలో చర్చలు కూడా జరపలేదు. ఈ భావోద్వేగాల మరణాలపై ప్రభుత్వాలను నిలదీసి, ప్రజల వైపు నిలవాల్సిన మీడియా తప్పించుకోవడం దురదృష్టంగా భావించాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఓట్లు దండుకునే హామీలు, ఆచరణలో విఫలమవుతున్న పథకాలు, అరకొర కేటాయింపులు ఇవన్నీ దేశంలోని అన్నదాతలను ఆర్థిక సుడిగుండంలోకి, రుణభారంలోకి నెట్టివేసినాయి. ఇలా ఓ పద్ధతి ప్రకారం వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

భారత దేశంలో గత ఏడాది స్వాతంత్ర్య అమృత్యోత్సవాల సందర్భంగా అభివృద్ధి గొప్పలు చెప్పుకున్నప్పటికీ, రైతాంగం స్థితిగతులు మారకపాయే. దీనికి పాలకులు బాధ్యులు కాదా!. ఇన్నాళ్ల నిర్లక్ష్యం వీడి రైతాంగాన్ని ఆత్మహత్యల బారి నుండి కాపాడాలంటే? ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యకు మూల కారణాన్ని అన్వేషించి దానిని పరిష్కరించడానికి బదులు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం వంటి పైపై పూతల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలతో జాతి ఆహార భద్రతకే పెనుముప్పు పరిణమిస్తుంది. ప్రభుత్వాల లోపభూయిష్ట విధానాలు, ప్రణాళికలు రైతాంగాన్ని, ప్రజానీకాన్ని, దేశ ఆర్థికాన్ని సుడిగుండములోకి నెట్టివేస్తుంది. ప్రపంచంలోనే అధిక జనభాగా ఎదిగిన భారతావని ఆకలి తీర్చేది ఎవరు? అన్నదాతకు సరైన గిట్టుబాటు కల్పించనంతవరకు దేశ ఆహార భద్రత గాలిలో దీపమే. అన్నం తినే ముందు దేవుడిని మొక్కుకుంటారు.. కానీ అవి పండించే రైతన్నను మొక్కుకోవాలి. అలాగే ఓ కవి మాటల్లో.. అన్నం తింటుంటే ఎక్కిళ్ళు వచ్చాయి కారణం అమ్మ నీళ్లు ఇవ్వనందుకు కాదు!. ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్టుందనే కవి ఆవేదన నేటి భారత రైతాంగ దుస్థితికి అద్దం పడుతుంది. పాలకులు, టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ పెనవేసుకొని నింగి, నేల తేడా లేకుండా వ్యాపారం చేస్తున్నారు. కానీ రైతు ఆత్మహత్యలను ఆపలేకపోతున్నారు. భారతదేశం ఎంత డిజిటల్ అయినా తినే అన్నం మాత్రం డౌన్లోడ్ చేసుకోలేదన్న వాస్తవాన్ని గ్రహించండి. రైతు శోకం జాతికి శాపం అనే స్పృహతో రైతాంగం కన్నీళ్లను తుడవాలి, కష్టాలను తీర్చాలి..

– మేకిరి దామోదర్,
సామాజిక విశ్లేషకులు,
జిల్లా: వరంగల్,
ఫోన్:9573666650

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *