ఆధునిక తెలుగు సాహిత్యంలో విశేషమైన ఆదరణ పొందిన రచయితల, కవుల రచనల గురించి అవగాహన పెంచుకోవడానికి తప్పనిసరిగా చదవాల్సిన ఒక ఉత్తమ గ్రంథం ‘ సబ్బని సాహిత్య వ్యాసములు’. మొక్కుబడిగా కాకుండా ఒక పరిశోధనాత్మకమైన విద్యార్థిలాగా, ఎంపిక చేసుకున్న రచనల నేపథ్యాలను, ఇతివృత్తాలను విశ్లేషణాత్మకంగా లిఖించారు సబ్బని లక్ష్మీనారాయణ. గత రెండు దశాబ్దాల్లో రాసిన ఈ 24 సాహితీ వ్యాసాలు ఆయన పాండిత్యానికి నిదర్శనం. ఈ వ్యాసాల సంపుటిని ఆయన తెలుగు సాహిత్యానికి, తెలంగాణ తెలుగు సాహిత్యానికి కూడా బహుమతిగా అందించారు. సాహితీ విద్యార్ధులే కాకుండా, తెలుగు సాహిత్యంతో పరిచయమున్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన గ్రంధమిది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని లబ్ద ప్రతిష్టులైన కవుల,రచయితల అమూల్యమైన కృతులపైన, తనదైన స్పష్టమైన దృక్పథంతో రాసిన ఈ సాహితీ వ్యాసాల మాలికను ఒక దగ్గరగా చదువుకోవడం నేటి తరానికి అవసరమైనవి.
యుగకర్త గురజాడ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆధునిక తెలుగు భాషా సాహిత్యాలలో విశేషమైన కృషి చేసిన గురజాడ అప్పారావు (1862-1915) గారి గురించి రాసిన వ్యాసంలో ఇలా అంటారు. “గురజాడ ప్రధానంగా సంఘ సంస్కరణాభిలాషి. అందుకు ఆయన రచనను ఒక ఆయుధంగా చేసుకున్నారు. భాషను కూడా ఒక సులభ సాధనంగా చేయాలనుకున్నారు. వాడాలనుకున్నారు. అందుకే వ్యవహారిక భాష కోసం గిడుగు రామ్మూర్తి పంతులు లాంటి వారితో కలిసి ఉద్యమంలో పనిచేసి, తన రచనలన్నీ వ్యవహారిక భాషలో రాసి తెలుగు భాషకు ఎనలేని సేవ చేసి చిరస్థాయిగా నిలిచిపోయారు”. గురజాడ కథలు, నాటకాలు, గేయాలను గురించి వివరించారు. శాసన పరిశోధకులుగా, సంఘ సంస్కరణ వాదిగా, వ్యవహారిక భాషోద్యమకారులుగా, సవర భాషకు చేసిన సేవ అంటూ గిడుగు రామ్మూర్తి పంతులుగారు జీవిత ప్రస్థానాన్ని గురించి పరిశోధనాత్మకమైన వ్యాసాన్ని రాశారు. వాచకాల్లో పుస్తకాల్లో సాహిత్యంలో వ్యవహారిక భాష ఉండాలని పట్టుబట్టి ఉద్యమంలా పనిచేసే దాని అమలుకు కృషి చేసిన ఆద్యులు గిడుగు వారు. వారు సమాజ సేవలో పాల్గొంటూ ముఖ్యంగా లిపిలేని సవర భాషకు లిపిని, భాషను, వాచకాలను, నిఘంటువులు ఇచ్చిన ఘనుడు గిడుగు వారు అని కొనియాడారు. ఆయన పేరిట ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకొని, ఆయన సేవలను స్మరించుకోవడం మన బాధ్యతని విశదీకరించారు.
దుర్భరమైన నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన ప్రజల వీరోచిత పోరాటాల గురించి ఆనాటి మహా కవులు రాసిన కవిత్వంలో పొందుపర్చారు. ఈ నేపథ్యంతో ప్రసిద్ధి చెందిన కవుల కవితా సంపుటాల గురించి వివరించారు. వచన కవితా పితామహుడు కుందుర్తి ‘తెలంగాణ’ దీర్ఘకావ్యం, ఆవంత్స సోమసుందర్ ‘వజ్రాయుధం’, ఆరుద్ర రాసిన ‘త్వమేవాహం’, దాశరధి ‘పునర్నవం’కవితా సంపుటిలో ‘తెలంగాణం’ కవితను గురించి విపులంగా రాశారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా తమ కవిత్వంలో రికార్డు చేసిన విధానం గురించి సందర్భానుసారంగా వివరించారు వ్యాసకర్త.
కందుకూరి వీరేశలింగం గారు రచించిన తొలి తెలుగు నవల ‘రాజశేఖర చరిత్రం’ ను గూర్చి , అప్పటి సామాజిక పరిస్థితులను, ఈ నవలలోని కథాంశాన్ని గూర్చి విపులంగా చెప్పారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ‘మ్రోయు తుమ్మెద’ నవల మీద మంచి వ్యాఖ్యానం రాసారు. ‘కరీంనగర్ కు సమీపంలో ఉన్న ఒక నది పేరు తుమ్మెద అంటే మన అందరికీ తెలిసిన జుమ్మని నాదం చేస్తూ విహరించే తుమ్మెద. అలాంటి ‘మ్రోయు తుమ్మెద’ లాంటి ఒక సంగీత కారునిపై రాసిన నవలనే ‘మ్రోయు తుమ్మెద’. ఒక అనాథగా పుట్టి, కాల ప్రవాహంలో కాపాడబడి పెరిగి పెద్దవాడై హిందూస్థాని సంగీతంలో విశేషమైన పరిణతిని, తృప్తిని పేరును, కీర్తిని గడించిన ఒక మహనీయుని జీవిత కథనే ఈ ‘మ్రోయు తుమ్మెద’. ఆ ‘మ్రోయు తుమ్మెద’ పేరు పి.నారాయణరావు. సాక్షాత్తు సంగీత సరస్వతి మానస పుత్రుడు. అతని జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని రాసిన నవల ఇది. నాటి కరీంనగర్ జీవన స్థితిగతుల్ని, హిందూస్తానీ సంగీతం యొక్క గొప్పతనాన్ని విశ్వనాథ గారు అద్భుతంగా చిత్రీకరించారని వ్యాసంలో రాసారు. సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములు బీడీ కార్మికుల జీవితాన్ని అక్షరబద్ధం చేసిన ‘బతుకు పోరు’ నవల గురించి, తెలుగు నవలా సాహిత్యంలో విశేషమైన గుర్తింపును పొందిన వడ్డెర చండీదాస్ ‘అనుక్షణికం, హిమబిందు’ నవలల గురించి ఆకట్టుకునేలా విశ్లేషించారు. కాళ్ళకూరి నారాయణరావు సాంఘిక నాటకం ‘వరవిక్రయం’ గూర్చి ఆసక్తికరంగా రాసారు.
మహాకవి శ్రీశ్రీ కవిత్వం, ‘నా దేశం నా ప్రజలు’ అనే ఆధునిక ఇతిహాసం రాసిన శేషేంద్ర శర్మ, నవయుగ వైతాళికుడు జాషువా పద్య కావ్యాలు, కవితామృతాన్ని కురిపించిన దేవరకొండ బాలగంగాధర్ తిలక్, జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన సి నా రె ‘విశ్వంభర’ కావ్యం, ద్వా నా శాస్త్రి రాసిన కుసుమ ధర్మన్న కవిత్వం, అలిశెట్టి ప్రభాకర్ మినీ కవితలు, కె.శివారెడ్డి గారి ‘మోహనా! ఓ మోహనా!’, ఎన్ గోపి గారి ‘జల గీతం’, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి ‘పొలి’, రాధేయ గారి ‘మగ్గం బతుకు’దీర్ఘకావ్యాలు, ఏనుగు నరసింహారెడ్డి గారి ‘తెలంగాణ రూబాయిలు’ వంటి వ్యాసాల్లో చేసిన ప్రతిపాదనలు, ఉటంకించిన కవితా పంక్తులు మనల్ని హత్తుకుంటాయి. సరళమైన ఆయన శైలికి ముగ్దులమైతాము.
‘మంచి సాహిత్యం ఒక దివ్య ఔషధం మనిషికి. సాహిత్యమే కవిత్వమే ప్రాణంగా బతికిన వాన్ని. స్వతహాగా సాహిత్య సృజన చేయడంతో పాటు నా కాలం రచయితలతో పాటు నాకన్నా ముందున్న రచయితల రచనలపై కూడా అప్పుడప్పుడు నా అభీష్టం మేరకు రాస్తూ పోయాను. రాయడం ఒక సామాజిక బాధ్యత. స్వతహాగా కవిని కాని కవితతో పాటు నవల, వ్యాసం, సమీక్ష, విమర్శ, గేయం, పేరడీ అనువాదం లాంటి ప్రక్రియలో కూడా రచనలు చేశాను’అని సబ్బని లక్ష్మీనారాయణ గారు తన మాటలో చెప్పుకున్నట్లుగా ఈ వ్యాసాలన్నీ బాధ్యతతోనే రాసినట్లుగానే మనం భావిస్తాము.
ఈ వ్యాస సంపుటికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు ఆత్మీయంగా రాసిన ముందుమాటలో తన అభిప్రాయాన్ని చెబుతూ.. ‘కవి లేదా రచయితను పరిచయం చేసి ఒకటి లేదా రెండు రచనలు వారి జీవితంతో ఆ సాహిత్యంతో సమన్వయం చేస్తూ కొనసాగిన వ్యాసాలు ఈ పుస్తకంలో కనిపించే ఒక ప్రత్యేకత. దీనివల్ల కవి గురించి తెలుసుకుంటాం. ఆ రచన గురించి తెలుసుకుంటాం. ఆ కవి లేదా రచయిత రచనను పరిచయం చేసుకోవడం వల్ల ఇతర రచనలన్నీ చదవాలనే ఒక గొప్ప ప్రేరణ కలుగుతుంది’ అంటారు. కందుకూరి వారి భాషను వ్యాఖ్యానిస్తూ సబ్బని వారు అది ఆనాటికి వ్యవహారిక భాషగానే భావించవచ్చునని చెప్పడం ఒక గొప్ప పరిశీలన. ఆ రచయిత శైలి కూడా వ్యవహారికంగా, సరళ గ్రాంథికం కలగాల్సిన వాక్యాలు కనిపిస్తాయి. మూల గ్రంథాలలోని భావాలను యథాతధంగా మనకు అందించడం వలన ఆ మూల గ్రంథాన్ని చదివిన అనుభూతి కలుగుతుంది. ఆ తర్వాత ఆయన ఏం రాశారనే ఉత్సుకతతో మూల గ్రంథాన్ని చదవాలనే ప్రేరణ కలుగుతుంది’.
ఈ వ్యాసాల సంపుటిని ‘నేటి నిజం’ దినపత్రిక సంపాదకులు, సహృదయులు శ్రీ బైస దేవదాసు గారికి అంకితమిచ్చారు. రెండు శతాబ్దాల తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసే వారికి, బోధించే వారికి, పరిశోధించే వారందరికీ కరదీపికలా ఉపయోగపడుతుంది. తెలుగు సాహిత్య చరిత్రకు కొత్త చేర్పు ఈ సాహితీ వ్యాసాలు. సాహిత్యాన్ని ఒక క్రమమైన పద్ధతిలో అధ్యయనం చేయడమే కాక దాన్ని రాయడంలో కూడా అదే విధానాన్ని పాటించారు సబ్బని వారు. అవిశ్రాంతమైన సాహితీ సేద్యం చేస్తున్న ఆయనకు అభినందనలు.
– గోపగాని రవీందర్
94409 79882