నేలమీద నిలబడే కవిత్వం

సాహిత్యం హోమ్

సాహిత్యం పట్ల అభిరుచితోపాటు సృజనాత్మకతనూ అలవరుచుకున్న సున్నిత మనస్కుడు అవధానుల మణిబాబు. విశ్లేషణ నుంచి విమర్శనాత్మకంగా ఆలోచించేటందుకు బహుగ్రంథ పఠనం అవసరం. అలా చదవడంతో పాటు తులనాత్మక పరిశీలన కూడా మణిబాబు సొంతం చేసుకున్నారు. పిన్నవయసు నుండే ప్రసిద్ధ రచయితల సామీప్యంలో, సాన్నిహిత్యంలో తనను తాను మలచుకున్నారు. చదువరి సృజనాత్మకతను పరిరక్షించేది స్పందించే హృదయమే అనడంలో అతిశయోక్తి లేదు కదా! అలా మణిబాబు తనతో తాను, తనలో తాను నిరంతరం సంభాషించే సంపూర్ణ సాహిత్య పిపాసి.

సముద్రంతో నేను ఇలా – నువ్వు అలా అని “నేనిలా, తానలా” (దీర్ఘకవిత)లో మాట్లాడి, తన కూతురు చిన్నారి పొన్నారి కబుర్లలోని తీయందనాలను ‘నాన్న…పాప…’ అనే కవిత్వ సంపుటిగా ఇప్పటికే సాహితీ సమాజానికి అందించారు. తాజాగా తన అస్తిత్వాన్ని ‘నింగికి దూరంగా… నేలకు దగ్గరగా..’ ఉందని ప్రకటిస్తూ కొత్త కవిత్వ సంపుటిని తెచ్చారు. ఎరుక, భావుకత అనే ‘రెండు రాటల మధ్య’ బహు జాగరూకతతో మణిబాబు నడిచినట్టు గమనించవచ్చు. ఎన్ని అంశాలు ఏకాగ్రతను చెదరగొట్టినా, మరెన్నో విషయాలు దృష్టిని మళ్లించినా, సుఖదుఃఖాలు నిత్యం మనసును చలింపచేసినా తదేక దృష్టితో “అడుగు అడుగూ పరీక్ష /ప్రతి ఆటా గుణపాఠం” గా తీగ మీద నడిచేదే బ్రతుకు పయనం అంటారు.

____________

మణిబాబు కవితాదృష్టి తను సాగే దారివెంటే సాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని నేను ‘సహేతుక సహానుభూతి’ అంటాను. సాధారణ మానవుల్లో ఉండే సహజమైన ఋజువర్తన, దైనందిన సందర్భాల్లో మన మీద వర్షించే నవ్వులు, కన్నీళ్లు ఇవన్నీ ఈయన కవిత్వ వస్తువులే.

________________

కాలాన్ని దొర్లిపోయే చక్రంగా, మరలిరాని వాహనంగా కాకుండా “రంగులు, రూపాలతో నిమిత్తం లేకుండా సమరసతతో మనగల సహజాతం” సాధనచేసే ‘చేపలతొట్టె’గా అభివర్ణిస్తారు. పైగా దాన్ని శుభ్రం చేసుకుంటూ “స్వచ్ఛ తరళ జలంలో ప్రాణవాయువు నింపుకునే” బాధ్యత మనదే అని మృదువుగా చెబుతారు.

దీపావళి పండుగ కోసం బాల్యంలో ఎదురుచూసిన ఆతృతలోంచి “వత్తిని నలిపి వెలిగించడం / ఆరిపోకుండా కాచుకోవడం” లాంటి జీవన నైపుణ్యాలు నేర్చుకున్నానని ఆప్యాయంగా నెమరు వేసుకుంటారు. సీమచింతకాయలు ఏరుకుంటూ, ఓ పక్క పెద్దవాళ్ళు ఊరగాయ పెడుతుంటే చూస్తూ, తాటి ముంజెలు, చెరుకుగడలు ఆస్వాదించే చిన్ననాటి వేసవి సెలవుల వ్యాపకాల్లోంచి తలా ఒక పాఠం బోధపడిందని చెప్తారు.

______________

ఈ కవి పక్క గదిలోకి వెళ్లినంత యధాలాపంగా గతంలోకి వెళ్లి ఒకానొక అంతఃపరిశీలనతో ఒక్కో కవితనూ చిత్రిక పడతారు. లేకపోతే, “చీకటి వేళంతా నిలిచి వెలిగే దీపంలా /అయిపోయింది ఇక పారేద్దామనుకున్నాక ఓ సారైనా వెలుగు ముద్దలు రాల్చే మతాబులా /బతికి చూపాలనే తపన నేర్పింది దీపావళి” అనే వాక్యాలు ఎలా వ్రాయగలరు?

_______________

అంతటి స్పృహను పెంపొందించుకున్నారు కనుకనే “సాగులోనే కాదు / సాహిత్యంలోనూ /మొలకెత్తగల గింజలు /ఓ రెండు మిగలాలి కదా!” అని వ్రాసి, అలాంటి కవితలు ముమ్మారు ఏరి, ఎంచి ఒక కవిత్వ సంపుటిగా తీసుకువచ్చారు.

మణిబాబు దేన్నైనా కొత్తగా అనుభూతిస్తారు. కాకినాడ నుంచి అమలాపురం దాకా ఇయర్ ఫోన్స్ తో పాటలు ఆస్వాదిస్తూ, రోజూ చేసే‌ ప్రయాణంలో ఒకే టికెట్ మీద కే.జే.జేసుదాసు, శంకర్ మహదేవన్, రెహమాన్ ఇలా బోలెడుమంది సంగీతకారులను, గాయకులను తనతో పాటు తీసుకెళ్లిన ‘అపరాధ భావన’ కవితగా మలచడం ఎంత కొత్తగా ఉంటుంది???!!! తటాలున మన పెదవుల మీద ఒక చిరునవ్వు విరబూసినట్టు ఉంటుంది.

పిల్లల చేతుల్లో మామూలు వస్తువులు ఎంత అందగిస్తాయో ఆయన మాటల్లో చదివితే మళ్ళీ మరోసారి ఆనంద వీచిక కదులాడుతుందిలా – “పిల్లలు ఊపుతున్నంత సేపూ వీధిగేటు రంగులరాట్నం అయిపోతుంది”. ఒక మంచి కవితగా మిగలడానికి స్వప్నం, సత్యం మధ్య నిత్యం వారధి నిర్మించే పనిలో ఉంటారీ కవి.

“ఉదయాన్నే తలుచుకునేట్లు / హృదయాల్లో నిలిచిపోయేట్లు” ఓ కవిత వ్రాయాలన్న సంకల్పానికి పునరంకితమౌతున్న కవి ఇతడు. ‘ఇంకా ఎంత దూరం వెళ్ళాలి?’ అంటూ లక్ష్య నిర్దేశం ఒక్కటే కాకుండా ఏ మేరకు పయనించాననో తిరిగి చూసుకునే ఆత్మావలోకనం అలవాటుగా చేసుకున్న వ్యక్తి ఈయన.

నినాదాలు, నిరసనలు ఎలా ఉన్నా విభేదాలు, వైషమ్యాలు ఎంత పెచ్చరిల్లినా ప్రతి మనిషి తనకు తాను “ఓ అనంత సమూహంలో అంతర్లీనం కావడం” అభ్యసించాలని, “అలంకారాలు ఆర్భాటాలు లేకుండా /అందంగా ఒదిగిపోవాలని” అంటారు. అక్షరంతో అక్షయమైన అంతర్యానం చేస్తూ, నడిచినంత మేరా సుతిమెత్తని భావనలను తాను అనుభూతించి మనకు అందిస్తూ సాహిత్య సరోవరంలో ఈదుతున్న హంస మణిబాబు.

వైజ్ఞానిక శాస్త్రంతో ఎంత ముడిపడి ఉన్నా, ఆలోచనను మరికొంచెం మార్మిక సౌందర్యంతో చెక్కుతూ, ఈ కవి అభివ్యక్తి పట్ల ఇంకొంచెం శ్రద్ధతో మరిన్ని కొత్త కవిత్వ పుస్తకాలు తీసుకువస్తారని ఆశిద్దాం.

డా. కాళ్ళకూరి శైలజ.

98854 01882

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *