కరీముల్లా వృత్తిపరంగా ఉపాధ్యాయుడు. ప్రవృత్తి పరంగా కవి.బాల్యం నుండే తెలుగు భాషపై మక్కువ పెంచుకున్న కరీముల్లా విద్యార్థి దశలోనే కవిత్వం రాయడం మొదలుపెట్టారు. వామపక్ష విద్యార్థి సంఘ నాయకుడిగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.యం.ఏ,బి.యిడి చదివిన కరీముల్లా సాహిత్య ప్రస్థానం తొలుత అభ్యుదయ కవిగా ప్రారంభమైంది. అలా దశాబ్దకాలం సాగిన ప్రయాణం బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ లో ముస్లింలపై మారణకాండ జరిగిన దరిమిలా పీడితులైన ముస్లింల పక్షం వహిస్తూ మైనార్టీ సాహిత్యంలో అడుగు పెట్టారు.ఈ క్రమంలోనే “గాయ సముద్రం,థూ…,నా రక్తం కారుచౌక” మొ.కవితా సంపుటాలు వెలువరించారు..ఆ తదుపరి ఏ తాత్విక దృక్పథం లేక సాగుతున్న మైనార్టీ సాహిత్యానికి ఇస్లాంను సైద్ధాంతిక, తాత్విక భూమికగా ప్రకటిస్తూ 2004 లో “సాయిబు” దీర్ఘ కవితను రాశారు. ఈ దీర్ఘకవిత మొత్తం మైనార్టీ సాహిత్యంలోనే తొలి దీర్ఘకవితగా చరిత్రలో నమోదు చేసుకుని తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించింది.అభ్యుదయ, విప్లవ ఉద్యమాలకు ‘మహాప్రస్థానం’, దళిత సాహిత్యానికి ‘గబ్బిలం’ ఎలాగో మొత్తం మైనార్టీ సాహిత్యానికి ‘సాయిబు’ అలాగని సాహితీ విమర్శకుల మన్నన పొందింది.
ఇక అక్కడి నుండి తెలుగు సాహిత్యంలో ఇస్లాంవాద ఆదికవిగా,ఆవిష్కర్తగా చరిత్రకెక్కిన కరీముల్లా మొదలు పెట్టిన ఇస్లాంవాద సాహిత్యోద్యమం బలమైన ఉద్యమంగా తయారైంది.ఎందరో కవులు ఇస్లాంవాద కవులుగా,కథారచయితలుగా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.2006వ సంవత్సరంలో “ముస్లిం రచయితల సంఘం”స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.మురసం బాధ్యతలు యువతకు అప్పజెప్పారు. ఇప్పుడు ముస్లిం రచయితల సంఘం.. బలమైన సాహిత్య సంఘంగా ముస్లిం సమాజ సాహిత్య స్వరంగా పనిచేస్తుంది. అంతేగాక మారుతున్న కవిత్వ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని “అబాబీలు” అనే నూతన వచన కవితా ప్రక్రియను సృష్టించి తెలుగు సాహిత్యానికి అందించారు.ఇప్పుడు దాదాపు వంద మందికి పైగా కవులు ఈ ప్రక్రియలో రాస్తున్నారు.ఇలా ఇస్లాంవాద ఆదికవిగా, ఆవిష్కర్తగా, ముస్లిం రచయితల సంఘం వ్యవస్థాపకునిగా, అబాబీలు సృష్టికర్తగా ప్రతిభావంతమైన పాత్రను పోషించి అనేకమంది కవుల్ని ప్రభావితం చేసిన కరీముల్లా గొప్ప ప్రజాస్వామ్యవాది, లౌకిక వాది.
గడిచిన మూడు దశాబ్దాలుగా సామాజిక స్పృహ, శ్రామిక వర్గ చైతన్యం,మత సామరస్యానికి కట్టుబడి రచనలు చేస్తున్నారు. ముస్లింల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనానికి కవిత్వ రూపం ఇస్తూ దేశీయ మతతత్వ ఫాసిజానికి, అంతర్జాతీయ యూరోపియన్ సామ్రాజ్యవాదానికి, ఇజ్రాయెల్ జియోనిజానికి వ్యతిరేకంగా తన కలంతో గళమెత్తారు. అలాగని కరీముల్లా మత పక్షపాతి కాదు.పీడితుల పక్షం వహిస్తాడు. ఇస్లాం ప్రగతిశీలం అంటాడు. మత ఛాందసాన్ని,మత ఉగ్రవాదాలను వ్యతిరేకిస్తాడు.
దీనికి కట్టుబడి “కవాతు” కవితా సంకలనం తెచ్చారు.మత సామరస్య, లౌకిక విలువలకు కట్టుబడి తన రచనలు సాగిస్తాడు. కవిగా, విమర్శకునిగా, తాత్వికుడిగా కరీముల్లా చేసిన రచనలు అనేక నూతన భావాలకు ఊపిరి పోశాయి. అందుకే ప్రసిద్ధ కవి శివసాగర్ ‘ఈ దేశ కల్లోల సముద్రంలో కరీముల్లా కవిత్వం పోరాడే యుద్ధనౌక’ అంటాడు.కరీముల్లా రాసిన సాహిత్య వ్యాసాలు తెలుగునాట అనేక చర్చలకు, వాదోపవాదాలకు, ఆలోచనలకు దారి తీశాయి.ఇప్పటివరకూ ఇరవై ఆరుకు పైగా పుస్తకాలు రాశారు.అందులో పదహారు వరకూ ప్రచురితమయ్యాయి.కరీముల్లా పుస్తకాలను అనేక విశ్వవిద్యాలయాలలో యం.ఏ. వారికి పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టారు.
కరీముల్లా కవిత్వంపై నాగార్జున యూనివర్సిటీ నందు అందుగులపాటి శ్రీనివాసరావు పరిశోధన సాగించి పి.హెచ్.డి.పట్టా పొందారు. “సాయిబు” దీర్ఘకవిత, “కవాతు” ఇస్లాంవాద కవితా సంకలనంపై అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నందు డా.గుమ్మా సాంబశివరావు, డా.సుహాసిని పాండే, డా.సుభాని పరిశోధన పత్రాలు సమర్పించారు. వీరే గాక కరీముల్లా కవిత్వంపై డా.ఇబ్రహీం షా కూడా పరిశోధన పత్రం సమర్పించారు.పలు పత్రికల్లో కరీముల్లా కవిత్వంపై అనేక విశ్లేషణలు వెలువడ్డాయి.
ఇప్పటివరకు కరీముల్లా ప్రచురిత రచనలు పదహారు.ప్రచురణకు సిద్ధంగా ఉన్నవి పది.అనేక పురస్కారాలు పొందిన కరీముల్లా కవిత్వం.. ఆంగ్ల, హింది, ఒరియా, కన్నడ, ఉర్దూ భాషల్లో అనువదించబడి దేశీయంగా, అంతర్జాతీయంగా కరీముల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశాయి.ఎక్కడ ముస్లింల జీవనంపై, సంస్కృతిపై, అస్థిత్వంపై దాడులుంటాయో వాటిని ఎదుర్కొనేందుకు అక్కడ కరీముల్లా కలం సిద్ధంగా ఉంటుంది. పీడితులు ఏ కులానికీ,మతానికీ,ప్రాంతానికీ చెందిన వారైనాసరే వారి పక్షం వహిస్తూ కరీముల్లా కవిత్వం నిలబడుతుంది. తనెప్పుడూ రాజ్యం పక్షం వహించడు.ప్రజల పక్షం వహిస్తాడు.కవిగా వినుకొండ వాడైనా కవిత్వ పరంగా ప్రపంచం వాడు.ఈ దేశ ముస్లింగా ఒక కంట్లో రణాన్ని,మరో కంట్లో వ్రణాల్ని మోస్తూ ఈ దేశ మట్టిని మనసారా ప్రేమించిన కవి కరీముల్లా పల్నాడు జిల్లా, వినుకొండలో 1964 జూన్ 1 న జన్మించారు.వీరి తల్లిదండ్రులు షేక్ మహబూబ్,షంషున్నిసా.
-డా.అందుగులపాటి శ్రీనివాసరావు
94904 97316