ఈతకోట సుబ్బారావుగారు అంటే ‘విశాలాక్షి’ సాహిత్య మాసపత్రిక సంపాదకులు. ఇదొక బ్రాండ్ నేమ్. తెలుగు సాహితీలోకానికి కవిగా, కథకులుగా కూడా సుపరిచితులు. 8 కవితా సంపుటాలు, ఒక కథా సంపుటి కాక, 7 స్థానిక చరిత్ర రచనలతో పాఠకలోకాన్ని అలరించినవారు. అవిగాక, 5 గ్రంథాల సంపాదకత్వం వారి విస్తృత సాహితీకృషికి దర్పణంగా నిలుస్తోంది. తొలి కథాసంపుటి ‘కాశీబుగ్గ’ వెలువడిన 11 ఏళ్ల తర్వాత వచ్చింది ఈ ‘పోడుగాలి’ సంపుటి.
_____
ఒక రచయిత రాసిన కథల్లోని వస్తువైవిధ్యాన్ని నిశితంగా గమనిస్తే-ఆ రచయిత వ్యక్తిత్వం, అధ్యయనశీలం, సమాజ పరిశీలనాశక్తీ, జీవితానుభవాల గాఢత, సామాజిక బాధ్యత స్థాయి, మనోధర్మం-వంటి అంశాలు అవగతమవుతాయి. సుబ్బారావుగారి ‘పోడుగాలి’ సంపుటిలోని కథల్ని చదివినప్పుడు ఈ ఈ అంశాలూ, వాటి ప్రాధాన్యం, విస్తృతీ కూడా అర్థమవుతాయి.
_____
ఈనాటి సమాజం ధోరణులు, ఈనాటి మనిషి చిత్తవృత్తి, ప్రవర్తనా ఏ కథకైనా వస్తుబీజాన్ని అందిస్తాయి. ఈ సంపుటిలోని కథలన్నీ ఈ వాస్తవానికి దర్పణం పడుతున్నాయి. జరుగుతున్న సంభవాల్లోని వాంఛనీయతనీ, అవాంఛనీయతనీ చాలా స్పష్టంగా మనముందు పెడతాయి. రచయిత అభ్యుదయ కామన-ఆయన సమాజం, సంక్షోభంలో కూరుకుపోయిన అభాగ్యులపట్ల చూపే సహానుభూతిలో వ్యక్తమవుతోంది. అంతేగాక, ఆ శుభకామన సాఫల్యానికి మనుషులుగా మన బాధ్యత ఏమిటో కూడా-ఆలోచనా ప్రేరకంగా అందిస్తుంది.
బడుగుజీవులు చదువుకుని, తెలివిమీరితే(!) తమ ఉనికికే ప్రమాదమని ధనస్వామ్యం నిశ్చితాభిప్రాయం. అందుకనే-దాని చేతి ఆయుధం అణిచివేత. దాని దుర్మార్గం ఎన్ని దురాగతాలకైనా ఒడిగడుతుంది. ‘కొండపరియ’ చదవండి. అలాగే ‘కొర్రమీనుల కయ్య’ కూడా కలిమిబలిమి-సత్యాసత్యాలతో సంబంధం లేకుండా బడుగుబతుకుల్ని ‘ఛీ’ కొట్టి తొలగించుకోగలదనే వాస్తవాన్ని కథాత్మకం చేసింది.
ఈనాటి సామాజిక విషాదాల్లో ప్రముఖమైనవి- ‘ఆడపిల్ల’ల భ్రూణహత్యలు. ‘పుట్టాల్సిన పిల్లల్ని చంపేస్తున్నాం. సరే, అంతకుముందే పుట్టిన పిల్లల్ని ఏంచేద్దాం?’ అంటూ ప్రశ్నిస్తున్నది ఒక యువతి. సమాధానం? ఇంతకింత విషాదకరమైన సంభవాలు అద్దెగర్భం విషయంలోనూ జరుగుతున్నాయి. ఈ వస్తువు కథల్లో, కవిత్వంలో బాగా నలిగినదే. అయితే, సుబ్బారావుగారు ‘అమ్మ కడుపు చల్లగా’ కథలో ఈ సమస్యకు ఒక కొత్తకోణాన్ని చూపేరు. ఎవరికోసమో మోస్తున్నా, కడుపులో బిడ్డ తన బిడ్డకాకుండా పోతుందా? ఒక తల్లి సంవేదన ఇది. ఆమె మమకారం-ఆ బిడ్డ కొన్నవారికి కాకుండా తనకే దక్కాలని, తానే తన సొంతం చేసుకోవాలనీ నిర్ణయించుకుంది. పేగుబంధాన్ని ఇలా ఉన్నతీకరించారు రచయిత.
‘చేతికర్ర’ కథలో యువతి సూడోప్రేమకూ, మగవాడి నయవంచనకూ గురయి, ఆత్మహత్యాప్రయత్నం చేస్తుంది. సరిగ్గా ఆ క్షణంలో ఒక దివ్యాంగుడి ‘చేతికర్ర’- ఆమెను ఆ ప్రయత్నం నుండి పక్కకు తీస్తుంది. చేతికర్ర-ఒక పాత్రగా, ఆమెకు బతుకుమీద ఆశనీ, విశ్వాసాన్నీ కలిగించి, దారిచూపే సాధనంగా నిలుస్తుంది. జీవనలాలస ఆవశ్యకతను చక్కగా ఆవిష్కరించారు సుబ్బారావుగారు.
______
ఒక వృక్ష పరిరక్షకుడి ప్రాణాలన్నీ చెట్టూ మొక్కలపైనే వాటి కొఱకూ, వాటిమీదా, వాటిలోనే. సంతానానికి ఆ చెట్లపేర్లే పెట్టుకునేంత తాదాత్మ్యం వాటితో ఆయనకు. ఆర్ద్రమైన భావన. పరిణతశిల్పంతో మంచికథగా వచ్చింది-‘ప్రాణంచెట్టు’, ‘మనిషిచెట్టు’ కథకూడా పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతని విశేషిస్తుంది.
______
వ్యక్తి చేష్టలు సమాజ అనారోగ్యానికి కారణభూతమవుతున్నప్పుడు, చికిత్స చేయవలసినవారు-తన,మన-భేదాన్ని పక్కకు పెట్టి తమకర్తవ్యాన్ని నిర్వహించటం ఎంతో ఆవశ్యకం. ఈ వాంఛితాన్ని నెరవేరుస్తాడు-ఒక అవినీతి నిరోధకశాఖ అధికారి. కొడుకు తప్పుడు పనిని జీర్ణించుకోలేక కొడుకు పైనే కేసు పెడతాడు. ‘అగుణితం’ కథ.
సముద్రం అలలపై తేలుతూ, త్రుళ్లుతూ ఆటాడుకొనే ‘మొనగాడు’ గంగులు సాహసి మాత్రమే కాదు. ప్రమాదంలో కొట్టుకుపోతున్న విద్యార్థిని రక్షించిన ఆపద్బాంధవుడు కూడా.
‘పుట్టిన ఊరు’ కథని నిదానంగా చదివితే బుర్రతినేస్తుంది. గ్రామీణ కులవృత్తుల విచ్ఛిత్తి గ్లోబలైజేషన్ పర్యాప్తి పర్యవసానం. ఒక భౌతికవాస్తవం. మంగలి నాదముని నగరానికి వలసవచ్చి, సుఖజీవనాన్ని గడుపుతూ సంపన్నుడైనాడు. కాలపరిణామం ఈ స్థితిని ప్రోదిచేసింది. ఈ అభ్యుదయం వాంఛనీయమా, కులవృత్తిని పట్టుకుని గ్రామంలోనే కునారిల్లటం మంచిదా? క్లిష్టమైన ప్రశ్న!
మానవసంబంధాల వైచిత్రీ, మనుషుల స్వభావాల్లోని వైరుధ్యాలూ-కథకులకు మంచి వస్తు సంబరాన్ని అందించే తరగని గనులే. సుబ్బారావుగారి జీవితానుభవాలు ఇలాంటి కథలకు వస్తు స్వీకరణని అందించాయి.
‘మా కథ’లో శివుణ్ణి పెద్దచదువు చదివించింది ‘మా’. అది ఆమె కోరిక. శివుడు పెద్దచదువులు చదివి పెద్ద ఉద్యోగే అయ్యాడు. అయితే, ఆమె గురించి లోకంలో ఉన్న (అప) ప్రథమాత్రం అతని మనసులో జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది!
______
‘పోడుగాలి’ కథాంశం అన్నాచెల్లెలు మధ్య అనుబంధాన్ని ఎంతో ఆర్ద్రంగా, ఉత్కంఠభరితంగా చెబుతుంది. ఒకరి గురించి మరొకరికి మనసుల్లో నిక్షిప్తమైవున్న వ్యక్తావ్యక్త మమతను అనుభూతిదాయకంగా చిత్రించారు రచయిత. చివరికి కలో నిజమో తెలియని ఒకానొక సంభవంతో కథను ముగించి పఠితను ఆలోచనలోకి నెట్టారు. ‘మేజికల్ రియలిజం’ ఛాయతో అద్భుత వాస్తవికతను ధ్వనింపజేశారు.
______
‘అపరిచితురాలు’ కథలో దేవుడమ్మ గ్రామాభివృద్ధికి ఆయాచితంగా కావలసినవన్నీ చేసింది. చింతాడ తండా గిరిజన గ్రామంలో ఎన్నికల బూతు వచ్చింది. రహదారి ఏర్పడింది. స్కూలు ఏర్పాటైంది. తన తమ్ముడికి ప్రాణదానం చేసిన పూజారి భిల్లూ దేశ్ ముఖ్ కోసం ఒక నైతిక బాధ్యతగా ఇన్నింటినీ చేసింది. అయితే, చదువులతల్లి అయికూడా ఆనాడు రాజావారికి ఉంపుడుకత్తెగా ఎందుకు వెళ్లింది? ఆ త్యాగమూర్తి కథ చదవండి. అనేక భావాలు ప్రకాశించి హృదయాన్ని రసతరంగితం చేస్తాయి. సంకీర్ణ సమాజంలో అంతకంటే ఎక్కువ సంకీర్ణమైన మానవసంబంధాల ఆట, నాటకం మనల్ని అప్రతిభుల్ని చేస్తాయి. కథలో అంతర్లీనమై ప్రవహించిన చారిత్రక వాస్తవాలు, సంఘం నడత-మనల్ని ‘ఆగు-చూడు-నడు’ అన్నట్టు హెచ్చరిస్తూ వుంటాయి. మంచి కథ ప్రయోజనం మనసుని వెంటాడే సత్యదర్శనం అనుకుంటే, ఈ ‘అపరిచితురాలు’ మరీ మంచి కథే!!
‘బంధం’ కథ తల్లిదండ్రుల పట్ల సంతానం నిరాదరణ. నిజానికి వస్తువు చాలా కథల్లో చర్వితచర్వణమే. కానీ, సుబ్బారావుగారు దీనిలోని మరో కొత్త పార్శ్వాన్ని మనముందుంచారు. ముగ్గురు కొడుకులు, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని ఆస్పత్రికి తీసుకువెళ్తున్నట్టు నమ్మించి, ఆటోరిక్షాలో తీసుకువచ్చి బస్టాండులో వదిలిపెట్టి వెళ్లారు. ఆమెది అనంత నిరీక్షణ!! మానవత్వం నశించిపోయి, సంబంధం మాసిపోయింది!
‘మాటల మనిషి’ మాటతీరు ప్రాధాన్యతని ఉన్నతీకరించి, దాని ఆవశ్యకతని కథాత్మకం చేసింది.
______
కాగా, ‘పోడుగాలి’ సంపుటికంతా అమూల్యమైన విలువనీ, ఔన్నత్యాన్నీ కలిగిస్తున్న కథ ‘పూలవాగు’, ఐదుగురు యువకులు, ఉన్నత చదువులు చదివి ఉన్నతోద్యోగాలు చేస్తున్న ప్రతిభామూర్తులు. ఒక ఆదర్శం సాఫల్యంకోసం, పనిగట్టుకుని, కష్టసాధ్యమైన పనికి పూనుకున్నారు. ‘వారికి వారి మాట, ఆలోచన, ఆచరణశక్తి పట్ల నమ్మకం’. ఆ ప్రయత్నం ఏమిటంటే ఎప్పుడో వందేళ్లక్రితం పెన్నానది వరదల్లో పూడుకుపోయిన తమ పూలవాగు గ్రామాన్ని శిథిలాలనుండి పెకలించి దాని పునఃసృజన చేయటం, పునర్జన్మ నివ్వటం. వారి కష్టం ఫలిస్తుంది. ఆనాటి గ్రామం గ్రామంగా, స్పష్టమైన నిర్మాణాలతో సహా వెలికివచ్చింది. ఇది కథేనా అంటే కాదు అనే చెప్పుకోవాలి. ఒక చరిత్ర. ఆ చరిత్ర పునస్సృష్టి. మల్లంపల్లి సోమశేఖరశర్మగారు అంటారు, ‘చరిత్ర అభివృద్ధి పంథాను నిరూపిస్తుంది. చరిత్ర నిర్మాణం మనిషి సాగిపోవలసిన సరళమైన మార్గాన్ని చూపుతుంది’ అని. అదీ ఇది! కథలోని అనిర్వచనీయత అనేక విధాల మన హృదయాన్ని స్పందింపజేస్తుంది. ఆలోచనాప్రేరకమైన సంభవాలు మనసును సంచలింపజేస్తాయి. ఒక దశాబ్ది మంచి తెలుగు కథల్ని పదింటిని ఎంపిక చేయవలసివస్తే ఆ పదిలో తప్పకుండా ఈ ‘పూలవాగు’ ఒకటిగా ఠీవిగా నిలుస్తుంది!!
______
ఇలా, సుబ్బారావుగారి కథల్లో సమాజంలోని, మనిషిలోని సర్వత్రా సంభావ్యమైన వైచిత్రి మాత్రమే కాక స్థలకాలాలవైవిథ్యం కూడా చాలా అపూర్వంగా ప్రతిఫలిస్తోంది.
ఈతకోటవారి కథాశిల్పంలో రెండు ప్రత్యేక మెరుపుల్ని గమనిస్తాము. ఒకటి సందర్శన పద్ధతి, డాక్యుమెంటరీ టెక్నిక్. సన్నివేశ దృశ్యీకరణ. ‘మిణుగురు’, ‘ప్రాణంచెట్టు’ వంటి కథల్లో ఈ విధానం పారదర్శకమవుతుంది. రెండవది ధ్వన్యాత్మకపద్ధతి. చెప్పీచెప్పని సంభవాల స్పర్శతో, గాఢమైన అనుభూతిని పంచుతూ, నిగూఢతతో సాగే కథనం. ఒక్క
ఉదాహరణగా ‘అపరిచితురాలు’ కథ చాలు.
________
‘పత్రికాసంపాదకుడుగా శతాధిక కథల్ని చదివిన, చదువుతున్న సాహితీవేత్తగా సుబ్బారావుగారు-కథానికకు ప్రాణ సమానమైన ‘క్లుప్తత’ లక్ష్యాన్ని బాగా జీర్ణించుకున్నారు. కథను ఎక్కడ మొదలెట్టి, ఎలా నడిపి, ఎక్కడ ముగించాలో-తెలుసుకోదలచిన రచయితలకు ఈ సంపుటి ఒక ‘మోడల్’ పాఠ్యాంశం. అలాగే కథలో వాస్తవికత నగ్నవాస్తవికత కాకూడదు. అది కథాత్మక వాస్తవికత కావాలి. ఆ కథాత్మక వాస్తవికతతోపాటు, కథలో జీవితవ్యాఖ్యానం కావాలి. ‘కోరిక కొన్నాళ్లు బతికిస్తుంది. ఆశయం మాత్రం చావులేకుండా చేస్తుంది’, ‘తల్లి గుండెకు మమకారం ఎక్కువ. తండ్రి గుండెకు కారుణ్యం తక్కువ’, ‘ఒకరు కడుపుచూస్తే మరొకరు క్రమశిక్షణ చూస్తారు’, బహుశ కుటుంబమంటే ఆ రెండు దృక్పథాల అమరికేనేమో’ వంటి వ్యాఖ్యలు జీవన తాత్త్వికతని ప్రోదిచేస్తూ పఠితను అంతర్ముఖుని చేస్తున్నాయి.
________
‘పోడుగాలి’ సంపుటి ఒక సామాజిక కథాదర్పణం. ఒక వ్యక్తిత్వవికాస ప్రబోధిని. కథారచన పట్ల ఆరాధనాభావం కలిగిన కథకుని సామాజిక బాధ్యతానిర్వహణకు తార్కాణంగా నిలుస్తున్న నిలువెత్తు సంతకం!
కథాప్రేమికులకు మంచి పుస్తకాన్ని అందించిన సుబ్బారావుగారికి అభినందనలు!
-విహారి
98480 25600