అనువాదం కాదు – అవసరం

సాహిత్యం హోమ్

గలివర్, జొనాధన్ స్విఫ్ట్ – ఈ పేర్లు తెలియకపోవచ్చుగానీ లిల్లీపుట్లు, వాళ్ళుండే కథ తెలియని వారుండరేమో! పాఠంగా పుస్తకాల్లో ఉన్నా, లేకపోయినా రావాల్సిన మాస్టారు సెలవులో ఉన్నపుడు ఆపద్ధర్మ మాష్టారు ఈ కథ చెప్పే ఉంటారు, కదా! అలా మనందరి బాల్యంలో భాగమైనవి “గలివర్ ట్రావెల్స్”.

‘భైరవద్వీపం’ సినిమా చూస్తుంటే మరుగుజ్జులు కనిపించగానే ఈ కథే గుర్తుకు వచ్చింది. 2010లో ఈ సినిమా వస్తే 28ఏళ్ల వయసులో పనిగట్టుకు వెళ్ళి చూసొచ్చాను. అందుకే ఇలాంటి కథలు ఆనందించడానికి వయసుతో పనిలేదు అని మనమంటే, వ్రాయడానికి వయసు అవరోధం కాదు అంటున్నారు శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మగారు. ఐతే, నాలుగు భాగాల ఈ పుస్తకంలో మొదటి రెండుభాగాలే బాగా పాపులర్ అయ్యాయి. కొన్ని పుస్తకాలు అంతే. బారిస్టర్ పార్వతీశం చాలా ఇష్టమని చెప్పే చాలామందికి, వారికి తెలిసింది మొదటి భాగమే అని, ఇంకో రెండు భాగాలున్నాయని తెలియదు. అందుకే శేషమ్మగారు “గలివర్ సాహస సాగర ప్రయాణాలు” పేరిట నాలుగు భాగాలకూ సమ ప్రాధాన్యతనిస్తూ “ఇదార్రా అసలు సంగతి” అని 120 పేజీల కథ చెప్పారు.

శేషమ్మగారి శైలి.. అమ్మమ్మ పిల్లలకు కథ చెబుతున్నట్టు ఉంటుంది. నిద్దరొచ్చినా ‘ఇక చాలు’ అనలేం. అలా మొత్తం కథ చెప్పేశాక వారు అమ్మమ్మ పాత్ర నుంచి సీనియర్ ఉపాధ్యాయినిగా మారిపోతారు. లెక్కల పుస్తకంలో అధ్యాయం చివర “కీలక భావనలు”లా ఇంతవరకూ మనమేం నేర్చుకున్నామో మరోసారి గుర్తు చేస్తారు. అలా మరో అధ్యాయంలో మనల్ని ప్రవేశ పెడతారు.

‘మొదటి భాగం – లిల్లీపుట్ల రాజ్యంలో పర్యటన. రెండవ భాగం – బ్రాబ్డింగ్ నాగ్ (మహాకాయుల దేశం)లో పర్యటన. మూడవ భాగం – ఎగిరే ద్వీపాలు. నాలుగో భాగం – విచిత్రజీవుల మధ్య’ అనే శీర్షికలతో వ్రాసి, ముందుమాటలో “చివరి రెండుభాగాలూ ప్రస్తుత ప్రపంచ సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక పరిస్థితులను పోలి ఉంటాయి” అంటారు. ఈ మాటలు నూటికి నూరుపాళ్ళు నిజం.

రెండవభాగంలో ఓ సన్నివేశం బాగా గుర్తుకువస్తోంది. మహాకాయుల దేశంలో అన్ని జీవులూ కథానాయకుడి కంటే ఎంతో పెద్దగా ఉంటాయ్. గలివర్ ఓరోజు పరిసరాలు పరిశీలిస్తూ తిరుగుతుంటే ఓ కోతి వచ్చి ఎత్తుకుపోతుంది. తన ముందుకాళ్ళపై పడుకోపెట్టి పరిశీలించి, తన బిడ్డను లాలించినట్లు ముద్దు చేస్తుంది. పశు పక్ష్యాదులకు, సాటిప్రాణిపై గల ప్రేమ ఇక్కడ వ్యక్తమవుతుంది.

ఇదే భాగంలో గలివర్ తనని అల్పజీవిగా భావిస్తున్న రాజుకు (మహాకాయుల దేశపు) మనుషుల గొప్పతనం తెలియజేయాలని ప్రయత్నిస్తాడు. ఎన్నో శతాబ్దుల క్రితమే తాము తయారుచేసిన తుపాకీమందు గురించి, దానితో చేయగల మారణహామం, విధ్వంసం గురించి వర్ణించి చెప్పడమే కాక వారికి కావాలంటే అది ఎలా తయారుచేయాలో శిక్షణనిస్తానంటాడు. తనమాటలకు రాజు ఎంతో ఆనందించి తనని గౌరవిస్తాడనుకుంటాడు. అందుకు భిన్నంగా “నీ దేశం గురించి నీవు మొదట్లో గొప్పగా చెప్పినపుడు అక్కడ కళలు, సృష్టికి సంబంధించిన ఆవిష్కరణలు నాకు ఆనందాన్నిచ్చాయి. కాని ఇలాంటి పనికిరాని విషయాలు గురించి మరోసారి మాట్లాడకు. నా రాజ్యంలో సగభాగం వదులుకోవడానికి నేను సిద్ధం, కానీ నీవు చెప్పిన హీనమైన, హేయమైన మందుసామగ్ర్రి తయారీకి ఏమాత్రం సమ్మతించను” అంటాడు, రాజు.

మరోమాట అంటాడు – “ఉత్తమ విలువలు ఏవో నీకు తెలుసా! చేతనయితే మానవుడు తనకు మరికొంత ఆహారం, పశువులకు మరింత గ్రాసం పండించగల్గడము.అంతేకానీ మానవాళిని, జీవాలను, సంపదలను సర్వనాసనం చేసి మరణాలకు కారణం కారాదు” – ఇవి రాజు మాటలు కాదు, జోనాధన్ స్విఫ్ట్ ప్రపంచానికి చెప్పాలనుకున్న మాటలు. 300 సంవత్సరాలకు ముందే ఇలాంటి స్థితికి వగచిన మహా రచయిత వేదనను మనకు మరోసారి గుర్తుచెయ్యాలనే శేషమ్మ గారు ఇంత శ్రమకోర్చి ఈ పుస్తకం మన ముందుకు తెచ్చారు.

మూడోకథలో ఒకచోట ఆశ్చర్యం కలిగింది – “ఈ దేశంలో మనుష్యులు చెత్తగా, అస్తవ్యస్తంగా, క్రమపద్ధతి లేకుండా ఉన్నారు. ఆలోచన, అవగాహన ఏమీలేనివారు. అవి ఉన్నవారిని చూసి సహించలేరు”. అవును కదా, ఇపుడు కూడా మనకు ఇలాంటివాళ్ళు తారసపడుతూనే ఉంటారు. లేకపోవడం లోపం కాదుగానీ, అవి ఉన్నవాళ్ళను సహించలేకపోవడం ప్రమాదం. ఇదే అధ్యాయంలో మాంత్రికుల సహాయంతో మరణించిన మహావీరులను, చారిత్రిక పురుషులను, తత్త్వవేత్తలను గలివర్ చూసి మాట్లాడతాడు. మరో సన్నివేశంలో అమరులైన సమూహం గురించి (స్ట్రల్డ్ బర్గ్స్) గురించి గొప్పగా చెప్పి చివరిలో అంత బతుకూ బతికాక అంత్యజీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో తెలిపే సన్నివేశం చిత్రంగా అనిపిస్తుంది. ఆపకుండా పుస్తకం చదివేలా ఈ విషయాలన్నీ శేషమ్మగారు ఆసక్తికరంగా వ్రాశారు.

చివరి అధ్యాయంలో కూడా మానవప్రవృత్తి మీద రచయితకు గల ఏహ్యభావన ‘హ్యూహ్నిమ్స్ జాతి’ (గుర్రాలు) ద్వారా వ్యక్త పరుస్తాడు. “మీకు మావలె గట్టి దంతాలు, కాళ్ళకు గిట్టలు ఉంటే అతి క్రూరంగా ఒకరినొకరు చంపుకునే వారు” అని అవి నిందిస్తే, గలివర్ గొప్పగా సమాధానం చెబుతాడు, మాకు అంతకంటే శక్తివంతమైన మారణాయుధాలు ఉన్నాయని. ఆ గుర్రాల నాయకుడు నివ్వెరపోయి – “నా చెవులు ఎంత దౌర్భాగ్యం చేసుకున్నాయి. సిగ్గు విడచి ఒకరినొకరు చంపుకుంటున్న మీ జాతిని చూస్తే అసహ్యం వేస్తున్నది. ఇంక చట్టాలెందుకు? శాసనాలెందుకు? సభలెందుకు, యుద్ధమే లక్ష్యంగా ఉందే. మీకు వివేకం, విచక్షణ, ప్రేమ, స్నేహం ఏమీ లేవా? అన్నీ అవలక్షణాలేనా? మీ న్యాయవాదులు కోర్టులలో వాదించే వాదనలు జుగుప్సను కలిగిస్తున్నాయ్. ఇంత హేయమైన జాతిని గురించి ఇంతవరకూ వినలేదు”. నిజంగా పశు పక్ష్యాదులకు మాటలొస్తే మనిషిని ఇలాగే నిలదీస్తాయేమో! మూలరచయిత పుస్తకం చివరలో “ఈ పుస్తకం చదివాక కొందరు మనుషులైనా తమ అవలక్షణాలను మార్చుకోవాలని” అభిలషించాడు.

ఒక వ్యక్తి తనలాంటివాడు తాను మాత్రమే ఉండే ప్రదేశాల్లో చిక్కుబడినపుడు కూడా జీవితేచ్ఛ నశించకుండా ఆ కొత్త సమూహంతో అనుగుణ్యతపొంది, తనను తాను దిద్దుకుని, వారికి కావలసినవాడిగా మన్ననపొంది, వారి భాషనేర్చి, వారి సహకారంతో మరలా తన దేశానికి తిరిగిరావడం వెనుక ఎన్నెన్ని జీవ నైపుణ్యాలను రచయిత ‘గలివర్’ పాత్రలో నిక్షిప్తం చేశాడో. ఆ స్థైర్యం, బుద్ధి కుశలత ఉంటే సాధించలేనిది ఏముంటుoది!.

కథైనా, కల్పన అయినా విలువలు బోధించి, మనిషిని ఉత్తమ పథంలో నడిపించే ఇలాంటి పుస్తకాలు ప్రతీ తరంలో రావాలి. వారి అపార అనుభవాన్ని, అధ్యయన సారాన్నీ అన్వయించి ఓ అద్భుత గ్రంథాన్ని అందంగా అనువదించి మన ముందుంచిన శ్రీమతి శేషమ్మ గారికి ధన్యవాదాలు చెబుదాం.

(ప్రతులకు:స్మృతి పబ్లికేషన్స్, 1-9-23, శ్రీరామ్ నగర్, కాకినాడ. మొబైల్ నెంబర్: 98854 01882)

-అవధానుల మణిబాబు
99481 79437.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *