జీవితానికి ప్రతిబింబం సాహిత్యం – అది ఏ ప్రక్రియలోనైనా కానీ. కథ, కథానిక, గల్పిక పరిధికి ఉన్న పరిమితుల దృష్ట్యా ఒక సంఘటన, ఒక సన్నివేశం, ఒక దృశ్యంని చిత్రించినా పాఠకుడికి ఒక అద్భుతం ఆవిష్కరణ కలగవచ్చు. ముగింపులో పరిష్కారం చెప్పటం ప్రతి కథలోనూ ఉండక పోవచ్చు. సమస్యను సమస్యగానే వదిలి వేయటమో, పరిష్కారాన్ని పాఠకుని ఊహకు వదిలివేయటమో రచయిత చేతిలోని కలం నిర్దేశిస్తుంది. కానీ ఒక చమక్కు, ఒక స్పార్క్ ఉంటే అది పాఠకుడి మనసుని తాకుతుంది. కలకాలం వెంటాడుతుంది. మరీ ముఖ్యంగా కథలు రాయాలనుకునే వారు ముందుగా చాలా విస్తృతంగా చదవాలి. ముందు చదువరి, తర్వాతే రచయిత. ఎలా రాయాలో తెలియక పోయినా ప్రమాదం లేదు గాని, ఎలా రాయకూడదో ముందు తెలుసుకోవాలి. ఆ మాత్రం బాధ్యత రచయితకి ఉండాలి. అలాంటి బాధ్యతగల రచయిత డాక్టర్ కె ఎల్వీ ప్రసాద్ గారు. తన వైద్య వృత్తి వల్ల చాలామంది (పంటి) బాధలు, ప్రవృత్తి రీత్యా గాథలు వినే, పరిశీలించే అవకాశం కలిగింది కాబోలు ఆయనకు. రకరకాల ప్రవృత్తులు గమనించే అవకాశమూ ఉంటుంది. అందుకే తన కథల్లో పాత్రలు, వారి ప్రవర్తన, వారి ఆలోచనలు భిన్న కోణాల నుంచి పరిశీలించి సామాజిక స్పృహ గల రచనలు చేయగలిగారు. ఆయా పాత్రల మనోభావాన్ని చిత్రించ గలిగారు.
“నాన్నా! పెళ్లి చేయవూ?” అనే శీర్షికతో వచ్చిన కథా సంపుటిలో పదకొండు కథలున్నాయి. ముగ్గురు ఆడపిల్లలు తర్వాత ఒక మగ పిల్లవాడికి తండ్రి అయిన రాఘవరావు..ఆఫీస్ సూపరింటెండెంట్ గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అతనికి, అతని భార్యకి కాబోయే అల్లుళ్ళ విషయంలో చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నట్లు ఉన్నాయి. కానీ ఆ ధోరణిలో పడి ఆడపిల్లలకి వయసు మీరిపోతున్నది అన్న విషయం గమనించలేదు. ఆ సమయంలో అనూహ్యంగా పెద్ద కూతురు క్యాంప్ వెళ్తున్న తండ్రి సూట్ కేసులో ఒక ఉత్తరం పెడుతుంది. ఆ ఉత్తరంలో ఒక ఆడపిల్ల మనోవేదనని సున్నితంగా ఆవిష్కరించడంలో రచయిత విజయవంతం అయ్యారని చెప్పాలి. “ప్రేమ, ఆప్యాయత, చదువులు, అన్ని సౌకర్యాలు సమకూర్చి పెట్టి, తీరా ఉద్యోగం చేయించకుండా ఇంట్లో కూర్చో పెట్టడం ఎందుకు! స్వేచ్ఛ లేకుండా కనిపించని సంకెళ్ళు వేయటం ఏమి బాగు! పెళ్లి గురించి పెద్ద పెద్ద ఆలోచనలు ఎందుకు! వయసు మీరిపోయాక ఇప్పుడు మీరు ఏమీ చేయలేరు నాన్న! నా తర్వాత వారికైనా పెళ్లి చేయండి” అంటూ కూతురు రాసిన ఉత్తరానికి ఆ తండ్రి కదిలిపోయాడు. ఈ కథా శీర్షికే కథా సంపుటికి ఉంచటం,ముఖచిత్రంగా దానినే ఉంచడం చాలా సమంజసంగా ఉంది.
పై కథలో ఒక అమ్మాయి మనసు ఉంటే, ‘కష్టపడకుండా ఆయాచితంగా వచ్చేది ఏది స్వీకరించను’ అని ఖరాఖండిగా చెప్పి తిరస్కరించే ఒక అవ్వ గురించి చెప్పే కథ ‘అవ్వ మనసు’.
“అందుకే.. అలా..” కథ ఈనాడు కనుమరుగైపోతున్న ఉత్తరాల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రారంభమై, క్రమంగా సీరియస్ విషయంలోకి మారిపోతుంది. సర్వ మానవతాగానం మర్చిపోయిన మనుషుల మధ్య అవకాశాల కోసం పెనుగులాడుతూ, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోలేక, విదేశాలకు వెళ్లిపోయిన ఒక కొడుకు తల్లిదండ్రులకి రాసిన ఉత్తరం ఈ కథ. అసమానతలు, వివక్షతలు సమాజంలో వేళ్లూనుకుపోయి మనసుని మెలిపెడుతుంటే తట్టుకోలేని యువత స్వేచ్ఛని అన్వేషిస్తూ రెక్కలు చాచి ఎగిరిపోవటం అనివార్యమేనేమో! సామాజికంగా సున్నితమైన ‘సెన్సిటివ్’ విషయాన్ని అంతే సున్నితంగా ‘టచ్’ చేశారు రచయిత ఈ కథలో. కానీ బాగా ఆలోచింపజేసే కథ.
ఫస్ట్ తారీకున పెన్షన్ పడిందో లేదో అని మెసేజ్ కోసం మాటిమాటికీ మొబైల్ చూస్తూ కంగారుపడే సీనియర్ సిటిజన్ ఆరాటం చాలా సహజంగా వుండి, చివర్లో ఆరోజు ‘ఆదివారం’ అని భార్య గుర్తు చేయటంతో హాస్యంగా ముగిసినా – ఆ ‘మరుపు’ కొంచెం మనసుని బాధతో చివుక్కుమనిపిస్తుంది. పెళ్లింట్లో హడావుడి, ఆడపిల్లల పకపకల కళకళల మధ్య టూత్ పేస్ట్ అనుకొని షేవింగ్ క్రీమ్ తో బ్రష్ చేసుకునే “తొందర” ఒక హాస్య కథ.
ఎన్నో అందాలు, ఆకర్షణలు మధ్య యువత చిక్కుకుపోయినా మానవ విలువలు, కుటుంబ బాధ్యతలకు పెద్ద పీట వేయాలని బోధించే కథ “నిజాయితీ”. ఒక అమ్మాయి తనను అదేపనిగా చూస్తుంటే అది ‘అదే’ అనుకుంటూ గంటలు గంటలు అద్దం ముందు గడిపిన ఒక అబ్బాయికి ఆమె చూపుల్లో భావం సోదరతుల్యమైందని తెలిసి, మొదట ఖంగుతిన్నా, తర్వాత “అద్దం” లాంటి ఆమె స్వచ్ఛమైన మనసుకి అభినందించక తప్పలేదు.
డా.కె ఎల్వీ గారు “ప్రతిధ్వని” కథ ఎప్పుడు రాసారో గాని, ఈనాడు వాట్సాప్, ఎఫ్ బి లో లైక్ లు, చాటింగ్ లు పెరిగి పోతున్న ఈ రోజులకి సరిగ్గా సరిపోయే కథ. సుందరి కూడా వీటికి అతీతం కాదు.కవితలు రాయడం లైక్స్ వస్తే మురిసిపోవడం అయితే పర్వాలేదు, చాటింగులు, మగవాళ్ళు లేఖల్లో ప్రేమను ఒలకబోస్తే, తాను తిరిగి రిప్లై ఇవ్వటం, ఏడు వందల ఎనభై పైగా (ఎక్కువగా మగ) మొబైల్ ఫ్రెండ్స్ ఉండటం ఈ రోజుల్లో బహుశా అసహజం కాదేమో. కానీ ఆమెలో ఇంకా భారతీయ స్త్రీ లక్షణాలు ఉన్నట్లున్నాయి, కాబట్టే పరిస్థితి చేజారకముందే కలత నిద్రలో భర్త తనను నిలదీస్తున్నట్టు కల వచ్చి ఉలిక్కిపడి లేస్తుంది. ఆ కల ‘నిజమైతే’ అని భయపడుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లలకి ‘తెలిస్తే’ అని కంపించి పోతుంది. వెంటనే మొబైల్లో అనవసరమైన లింకులు అన్నిటినీ తొలగించి వేస్తుంది.
ఈజీమనీకి, విలాసాలకు అలవాటుపడి జనాన్ని మాయచేసి, మోసంచేసి డబ్బులు గుంజటం కొందరికి బాగా అలవాటయి పోయింది. డబ్బులు చాలా అవసరం అన్నట్టు నటిస్తూ ‘ఎమోషనల్ బ్లాక్ మెయిల్’ చేస్తారు. ఆ మాటలు నమ్మి డబ్బులు ఇచ్చామా.. ఇక అంతే సంగతులు. మన పరిచయస్తుల పేరు చెప్పి మోసం చేసే కథ “అపరిచితుడు”.
ఒక ఇల్లాలి మనోవేదన “దిలాస” కథ. తనకు ఉన్న చిన్న చిన్న సరదాలు,ఆనందాలు తీర్చుకోకుండానే ఎన్నో ఏళ్ళు యాంత్రికంగా సాంసారిక జీవితాన్ని ఓర్పు, సహనం అనే ఆయుధంతో నెట్టుకొచ్చిన ‘శుభ’ కథ. అతని వెటకారపు మాటలు మానసికంగా కుంగదీస్తున్నా సహించి, చివరకు తన మానసిక వ్యధనంతా ఉత్తరంలో తెలియ జేస్తుంది. ఆ ఉత్తరం ఒక స్త్రీవాద రచయిత్రి హృదయం నుంచి వచ్చినట్టుగా ఉంది. స్త్రీవాదాన్ని “సహ అనుభూతి”తో రాసిన పురుష రచయితలు ఉన్నారు. వారిని తప్పక అభినందించాలి. The writer is an Engineer of the soul అని జోసెఫ్ స్టాలిన్ చెప్పింది నిత్యసత్యం. స్త్రీని గౌరవించమని ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరూ చెప్తున్నదే. కానీ, ఎందరు ఆచరిస్తున్నారు! అయితే సాహిత్యం అనేది ఒక పదునైన ప్రక్రియ. దానిలో చెప్తే ఏదైనా పాఠకుడి గుండెకి తాకుతుంది. మార్పుకి పునాది వేస్తుంది. స్త్రీల న్యాయబద్ధమైన కోర్కెలకు తనదైన పద్ధతిలో ఈ కథలో మద్దతు ప్రకటించారు డాక్టర్ కె ఎల్వీ ప్రసాద్.
వారి కథల్లో విషయం సూటిగా వ్యక్తీకరించినా, చెప్పే విధానం వాడిగా వేడిగా బాధించేటట్లు భావాలు ఉండవు. వ్యక్తావ్యక్తంగా, ఆలోచింపజేసేవిగా ఉంటాయి. అది కవిత్వ లక్షణం. బహుశా ఆయన కవి కూడా కనుక ఆ లక్షణం కథల్లో కూడ వ్యక్తం అయిందని చెప్పవచ్చు. ఆధునికత తొంగి చూస్తున్నా సంప్రదాయాలను, కుటుంబ సంబంధాలను వదలని కథాంశాలను ఎన్నుకొని రచిస్తున్న ఈ రచయిత మరిన్ని కథలు రాయాలని ఆశిద్దాం.
ప్రొ.సి.హెచ్. సుశీలమ్మ
98491 17879