విఠలేశ్వర శతక కర్తకు ‘పద్మశ్రీ’

కూరెళ్ళ విఠలాచార్య 1938 జూలై 9న వారి అమ్మమ్మ గారి గ్రామం నిర్నేములలో జన్మించారు. వీరిది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం. పద్యం, గద్యం, బుర్రకథ, వ్యాసం, నాటకం, బాల సాహిత్యం, మొదలైన సాహిత్య ప్రక్రియల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. విద్యార్థి దశలోనే తన రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టిన వీరు.. తెలుగులో గొలుసుకట్టు నవలలు, స్వాతంత్ర్యోద్యమం-ఆంధ్రప్రదేశ్‌లో దానిస్వరూపం, విఠలేశ్వర శతకం, శిల్పాచార్యులు (పద్యకవితాసంకలం), స్మృత్యంజలి (పద్యగద్యకవితా సంపుటి), వెల్లంకి వెలుగు (గ్రామ చరిత్ర), సహస్ర సత్యాలు, కూరెళ్ల పద్యకుసుమాలు వంటి రచనలు చేశారు. సాహిత్యమే ఊపిరిగా ఐదు దశాబ్దాలుగా రచనలు సాగిస్తున్న విఠలాచార్య.. ఇప్పటివరకు 22 గ్రంథాలు వెలువరించారు. వీరు రచించిన విఠలేశ్వర శతకం,స్మృత్యంజలి, వెల్లకి వెలుగు, కూరెళ్ళ పద్య కుసుమాలు విశేష పాఠకాదరణ పొందిన గ్రంథాలు.అనేక రచనలు చేసిన వీరు అభినవ పోతన, మధుర కవి,సుధీతిలకం బిరుదులతో సత్కారం పొందడమే గాక.. హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు – 2017 లో సత్కారంతో పాటు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దాశరథి సాహితీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం – 2018,మరెన్నో పురస్కారాలు పొందటం వీరి ప్రతిభకు తార్కాణాలు. ఇప్పుడు భారత ప్రభుత్వం వీరికి ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించడం సాహితీవేత్తలు అందరూ ముక్తకంఠంతో అభినందించవలసిన సందర్భంగా భావిస్తూ వారికి ‘సృజనక్రాంతి’ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా బహుళ పాఠకాదరణ పొందిన ‘విఠలేశ్వర శతకం’ పై ప్రత్యేక వ్యాసం సృజన క్రాంతి పాఠకులకు ప్రత్యేకం-సంపాదకులు.

———————————————————————————————————————–

రవై ఒకటవ శతాబ్దంలో కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో గ్రంథాలయ ఏర్పాట్లను ప్రోత్సహించిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య స్వయంగా కవి. ఆయనను ఎక్కువమంది పద్య కవి అంటారు కానీ వచన కవిత్వం కూడా రాశారు. నిజానికి గ్రంథాలయ ఏర్పాట్లను ప్రోత్సహించడమే కాకుండా స్వయంగా తన ఇంటిని గ్రంథాలయంగా మార్చిన ఉద్యమకారుడు. తన ఇంటిని గ్రంథాలయ అవసరం కోసం నవీకరించి వేలాది పుస్తకాలను సేకరించి పరిశోధకులకు అందుబాటులోకి తేవడం ద్వారా ఆయన సమాజంలో చర్చనీయమైన వ్యక్తిగా మారారు. ఆ చర్చ రాష్ట్రాలను దాటి ప్రధానమంత్రి చెవిన కూడా పడింది.

ప్రధాని నరేంద్ర మోదీ 2021, డిసెంబరు 26 ఆదివారం రోజున రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’లో కూరెళ్ళ విఠలాచార్య గురించి ప్రస్తావిస్తూ ‘‘కలలను నిజం చేసుకోవడానికి వయసు అడ్డుకాదని, ఈ విషయంలో తెలంగాణకు చెందిన 84 ఏళ్ల డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య మనందరికీ ఆదర్శం. ఆయనకు చిన్నతనం నుంచి ఒక పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయాలనే కోరిక ఉండేది. చదువుకుని లెక్చరర్‌‌ గా ఉద్యోగం చేసిన విఠలాచార్య.. పుస్తకాలను సేకరిస్తూ.. ఉద్యోగ విరమణ తర్వాత గ్రంధాలయాన్ని ఏర్పాటు చేశారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, వయసుతో సంబంధం లేదని ఆయన నిరూపించారు” అని ప్రశంసించాడు.

ఆ ప్రస్తావనకి కొనసాగింపుగానే అన్నట్లు ఈ గణతంత్ర దినోత్సవం రోజు కేంద్ర ప్రభుత్వం విఠలాచార్య గారికి ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించడం సాహిత్యకారులకు, పరిశోధకులకు ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా వారి పద్యాన్ని మరొక్కసారి స్మరించుకోవలసిన అవసరం ఉంది.

‘ముందర ముద్దుగా పొగిడి మోమటు
కొంచెము చాటుగాగ, ఏ
ముందట వీని చెంతనుచు మూర్ఖుడు వీడని
వెక్కిరించు వారెందరొ! సాధు పల్వలు మ
రెందరొ! ద్రోహులు మోసకారు లింకెందరొ!
ఉన్న లోకమిది
ఏమని పల్కెద? విఠలేశ్వరా!’ అంటాడు విఠలాచార్య. ఈ పద్యం ఒక రకంగా మొరపెట్టుకున్నట్లు ఉంటది కానీ లోకం పోకడ పూర్తిగా ఆయనకు తెలుసు. అందువల్ల ఈ లోకంతో ఎలా వ్యవహరించాలో కూడా తెలుసు.

అయితే లోకంతో ఆయన వ్యవహారం షార్ట్ కట్ లా ఉండదు. దీర్ఘ దృష్టితో కూడుకొని ఉంటుంది. ఏది హృద్యం, ఏది అపూర్వం ఆయనకు తెలుసు. మహాభారతం లానే లోకం కూడా ఉంటుందని నన్నయకు కొనసాగింపు వాక్యంగా ఉంటాడు విఠలాచార్య. సమాజానికి అతీతమైనదేదీ సాహిత్యానికి ఉపయుక్తం కాదని కూడా తెలుసు. అందుకే రాసేది పద్యమైనా, పేరు పెట్టింది భక్తి అయినా అందులోని రాతంతా లౌకికమే. లోక వ్యవహారాలలోని అపసవ్యతలే విఠలేశ్వర శతకంలోని వస్తువు. నిజానికి తెలుగు శతకం జననమే లౌకిక విషయాలను గ్రంథస్తం చేయడంతో ప్రారంభమైంది. విఠలేశ్వర శతకం దీనికి అతీతం కాదు. ఈ శతకం 24 సంవత్సరాల కింద ప్రచురించబడ్డప్పటికీ ఇవన్నీ ఒక్క రోజు రాయబడ్డ పద్యాలు కావు. 108 పద్యాలు ఉన్న ఈ శతకంలో చాలా పద్యాలు 50 సంవత్సరాల కంటే పూర్వం రాసినవి కూడా అయి ఉంటాయి. దాని వస్తువు, ఎంచుకున్న అభివ్యక్తి ఆ కాలాన్ని ఏదో రకంగా పట్టిస్తుందని మనం గమనించగలుగుతాం.

పద్యాన్ని సామాన్యుల దగ్గరకు ఎంతగా తీసుకువెళ్తాడని చెప్పడానికి విఠలేశ్వర శతకమే ఒక ఉదాహరణ.

ఈ కవి స్వాతంత్రోద్యమం మీద పరిశోధన చేసిన వాడు కాబట్టి ఆ పరిశోధన ప్రభావం ఆయన శతక రచన మీద కూడా ఉంది. ‘శాంతి అహింస సత్యముల చల్లని బాబును చంపినాము’ అన్న పద్య పాదము, ‘ఎందరు మాదు స్వేచ్ఛకయి ఎంత తపించిరొ’ అన్న వ్యక్తీకరణ దీన్నే సూచిస్తుంది. ఇంకొక చోట లోక వ్యవహారాల లోతుల్లోకి పోయిన విధం పాఠకులను ఆశ్చర్య కొలుపుతుంది.

‘లంచమునిస్తే చాలును సలాముల జేయు గులామునంచు’, ‘పైస యనంగ పీనుగకు ప్రాణము వచ్చును’, ‘పెండిలి కూడా నేడు ఒక బేరమయా’, అన్న కవితా పాదాలు కవి సున్నితమైన సమాజ పరిశీలనను పట్టిస్తాయి.

ముందే చెప్పుకున్నట్టు ఈ శతకం 40 50 సంవత్సరాల కిందటి పద్యాలను కూడా కలిగి ఉంది. అప్పుడే ఎన్నికల మీద కవికి ఎంతో వైరాగ్యం ఉన్నట్లు ఈ శతకం చదివితే తెలుస్తుంది. అందుకు కారణం ఓట్ల రాజకీయాలు ఇప్పటంత కాకపోయినా, అప్పుడూ కలుషితమయ్యే ఉన్నాయని మనం గమనించవచ్చు. ఓటర్లకు కూడా చాలా తెలివితేటలు ఉన్నాయని చెబుతూ ‘ఎవ్వడయిన ఓటు నీకె యని పల్కిన పల్కును నమ్మశక్యమే?’ అని ఒక పద్యంలో వ్యాఖ్యానిస్తాడు. ఇంకా కొంచెం ముందుకు ఆలోచించి ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత జీవితాన్ని మొత్తం కూడా ఓట్లే శాసిస్తున్నాయని, ఓట్లే ప్రమాణంగా మారుతున్నాయని ఇది అనారోగ్యకరమైన పరిణామమని చెబుతూ ఇలా అంటారు. చూడండి.

‘ఓట్ల దినాలు కొందరికి/ నూరక నోట్లను తెచ్చు, సార ప్యాకెట్ల గిరాకి పెర్గును, రి/గింగులు కొల్లలు జర్గు, మిత్రులే తిట్లను తిట్టుకొందురు, వి/ధేయుడే వైరిగ మారిపోవు, ఈ/ ఓట్లె ప్రమాణమయ్యె జన/మోడిన గెల్చిన విఠలేశ్వరా!’

నోట్లు, సారా ప్యాకెట్లు అప్పుడూ ఉన్నాయి. మిత్రులు శత్రువులవ్వడం, శత్రువులు కలిసి కౌగిలించుకోవడం అప్పుడూ ఉంది. అప్పుడున్న రిగ్గింగ్ ఒక్కటి సాంకేతికాభివృద్ధి వల్ల లేకుండా పోయిందనిపిస్తుంది. లేదా మనకు తెలియని రూపంలో సుప్త రిగ్గింగు కూడా ఉండొచ్చు. ఇప్పుడే కాదనలేం.

‘విఠలేశ్వర శతకం’లోని పద్యాలు అటు వస్తువులోనే కాకుండా అభివ్యక్తిలో కూడా ఆసక్తిని జనింపజేస్తాయి. సహజంగా పద్య కవిత్వం రాసేవారు సంస్కృత పదాసక్తిని కనబరుస్తారు. విఠలాచార్య దీనికి అతీతం. ఉత్పలమాల పద్య పాదంలో ఎంతో అవసరం అయితే తప్ప ఆయన సంస్కృత పదాలను వాడనే లేదు. అచ్చమైన తెలుగు పదాలను, అందునా తెలంగాణ భాషా పదాలను చాలా పద్యాలలో అపురూపంగా గుదిగుచ్చారు. ఇది కవిగా వారి చేయి తిరిగినతనానికి గుర్తు. ఇలా చూస్తూ పోయినప్పుడు భక్తిని మిషగా పెట్టుకుని లోకం పోకడలను వ్యాఖ్యానించడం అనే లక్ష్యంతో రాయబడి శతకాల పరంపరలో చేర్చదగ్గ ‘విఠలేశ్వర శతకం’ కాలపరీక్షలో నెగ్గిందని చెప్పవచ్చు.

డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారికి పద్య కవిగా ‘పద్మశ్రీ’ పురస్కారం వరించి వచ్చినందుకు ఆయన మేలిమి పద్య కావ్యమైన ఈ శతకాన్ని మరొకసారి గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు.

డా.ఏనుగు నరసింహారెడ్డి

89788 69183