క్లుప్తత,సాంద్రత,లోతైన తాత్త్వికతల కలయిక ‘ఏకాంత స్పర్శ’

సాహిత్యం హోమ్

కవిత్వం రాయటమంటే
ఖడ్గంతో సహజీవనం చెయ్యటం-
మొద్దుబారటానికీ వీల్లేదు
మోడుగా మిగలడానికీ వీల్లేదు
-కె.శివారెడ్డి

కవిత్వంలో వస్తువు, శైలి, అభివ్యక్తితో పాటు క్లుప్తత, సాంద్రతలను సాధించడం కవికి ఒక పెద్ద సవాలు. తక్కువ పదాల్లో ప్రపంచాన్ని చూపించాలంటే వస్తువుపై పూర్తి పట్టు ఉండాలి. చందలూరి నారాయణ రావు తన “ఏకాంత స్పర్శ” కవితా సంపుటి ద్వారా ఈ విద్యను సమర్థవంతంగా ప్రదర్శించారు. పాఠకుడు కవితను చదవడం ముగించిన తర్వాత, అతని అంతరంగంలో అసలైన కవిత మొదలవ్వడమే క్లుప్తత సాధించే విజయం.
___________________

​ నారాయణ రావు కవిత్వం బాహ్య ప్రపంచపు అలికిడి కంటే అంతరంగ మథనానికి, సామాజిక వాస్తవికతకు అద్దం పడుతుంది. ఎంచుకున్న వస్తువు ఏదైనా, దానిని వ్యక్తీకరించే క్రమంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారు. ఈ సంపుటిలోని కవిత్వం కేవలం పదాల కూర్పు కాదు; అదొక అనుభవం. క్లుప్తతను ఆయుధంగా, తాత్వికతను ప్రాణంగా మలచి అద్భుతమైన భావచిత్రాలతో ఆయన అక్షర సేద్యం చేస్తున్నారు.
_________________

​వృత్తిరీత్యా ఆంగ్లోపాధ్యాయుడిగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూనే, ప్రవృత్తిరీత్యా మనసు పొరల్లోని మౌనాన్ని పలకరించే అక్షరాన్ని ఆలంబనగా చేసుకుని మానవీయ విలువల పునాదిపై సాహితీ ప్రయాణం చేస్తున్నారు. వృత్తి పట్ల నిబద్ధత, సాహిత్యం పట్ల మమకారం ఆయన వ్యక్తిత్వానికి రెండు కళ్లు.

​ సామాజిక స్పృహతో ఆయన కలం నుండి జాలువారిన మూడు కవితా సంపుటులు ఆయన తాత్వికతకు నిదర్శనాలు. ‘మనం కాసేపు మాట్లాడుకుందాం’ యాంత్రిక జీవనంలో కనుమరుగవుతున్న పలకరింపులను గుర్తు చేస్తే, ‘మనిషి గుర్తుల్ని బ్రతికించుదాం’ గతాన్ని గౌరవిస్తూ వర్తమానానికి స్ఫూర్తినిచ్చే అక్షర కావ్యంగా నిలుస్తుంది. ఇక మూడవ సంపుటి ‘ఏకాంత స్పర్శ’లో క్లుప్తతను అలంకారంగా కాక ఒక శక్తిగా మలచి, అనంతమైన భావనను సాహితీ సమాజానికి పంచారు. ఈ సంపుటిలోని కొన్ని కవితల ద్వారా నాకు కలిగిన సృజనానుభవాన్ని పంచుకోవడమే ఈ వ్యాస ఉద్దేశ్యం.

***
భయం, రహస్యం అనే ముసుగుల్లో బందీ అయిన మనిషి స్వేచ్ఛ కోసం పడే తపన ‘పచ్చని పిలుపు’ (పే.31) కవితా వస్తువు. మనిషి యొక్క అంతరంగ సంఘర్షణను, స్వేచ్ఛాకాంక్షను ప్రకృతి సంబంధమైన ప్రతీకలతో చిత్రించబడిన ఈ కవితలో “చీకటిని శ్వాసిస్తూ రహస్యం ఎన్నాళ్ళు?” అనే వాక్యంలో ‘చీకటిని శ్వాసించడం’ అనేది ఒక అద్భుతమైన పదచిత్రం. అంటే అబద్ధాన్ని లేదా భయాన్ని అలవాటుగా మార్చుకోవడం. “ఒంటరి కోటలో జీవితమంతా ఇంతేనా? అని ప్రశ్నించడం ద్వారా మనిషి తన చుట్టూ తాను గీసుకున్న గీతలను, ఏర్పరుచుకున్న ఒంటరితనాన్ని ప్రశ్నిస్తున్నారు. “చిక్కుపడ్డ మనసులో బందీకాబడ్డ కలకు విముక్తి లేదా?” – వాక్యంలో ప్రతి మనిషి లోపల ఒక కల ఉంటుంది, కానీ సామాజిక భయాల వల్ల అది బందీ అవుతుంది అనే తాత్వికను పలికించారు. “పచ్చని పిలుపు అల్లుకుని ఏపుగా పాకితే… అన్నప్పుడు ‘పచ్చని పిలుపు’ అనేది కేవలం ప్రకృతి పిలుపు మాత్రమే కాదు, అది ఒక సాహసోపేతమైన జీవన తాత్వికత.

‘కన్నీటి వాసన’ (పే.33) కవిత మానవ సంబంధాలలోని వేదనను, బతుకు పోరాటాన్ని సామాజిక కోణంలో విశ్లేషించిన కవిత. నిరంతర సంఘర్షణ, మనుషుల మధ్య పెరిగిన దూరం, బానిసత్వాలే ఇందులో వస్తువులు. “ఎవరి పక్కన నిలబడినా కన్నీటి వాసనే” వాక్యంలో దుఃఖానికి ఒక ‘వాసన’ ఉంటుందని అనడం కవి యొక్క సూక్ష్మ పరిశీలనకు నిదర్శనం. సమాజం అంతా ఒక అదృశ్య వేదనలో మునిగి ఉందని ఈ వాక్యంలోని భావమే కాక ఇది మంచి శైలికి నిదర్శనం. “ముఖంలో యుద్ధం చేస్తున్న ఆనవాళ్లు” అన్నప్పుడు మనిషి బయటికి నవ్వుతున్నా, లోపల నిరంతరం ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుందని చెప్పడం ద్వారా అద్భుతమైన శిల్పాన్ని సాధించారు. “తప్పని కలను తలకు చుట్టుకుని…” పదాలలో ‘కల’ అనేది ఇక్కడ ఒక బాధ్యతగా లేదా ఒక భారంగా మారింది. మొత్తంగా ఈ కవితలో మంచి అభివ్యక్తి ఉంది. జీవితం ఎన్ని అందమైన పేర్లతో పిలిచినా, అంతర్లీనంగా అది ఒక బానిసత్వం లేదా సంఘర్షణ అని చెప్పడం ద్వారా కవి వాస్తవికతను ఈ కవితలో నిర్భయంగా ఆవిష్కరించారు.

‘జవాబు అడిగితే’ (పే.50) కేవలం పది వరుసల కవిత. ఈ సంపుటిలోని ఈ కవిత అత్యంత శక్తివంతమైన సామాజిక కవిత అని చెప్పవచ్చు. దీని ‘క్లుప్తత’ పాఠకుడిని నివ్వెరపరుస్తుంది. సామాజిక అసమానతలు మరియు వ్యవస్థపై తిరుగుబాటు ఇందులోని వస్తువు. కేవలం మూడే మూడు సన్నివేశాలతో కవితను ముగించి గొప్ప శిల్ప చాతుర్యాన్ని ప్రదర్శించిన కవిత. ఈ కవితను చూద్దాం.

జవాబు అడిగితే ?
రోజూ వీధిపక్కనే
ఆ చేతులు నిలబడి అడిగేది
చిల్లర కాబట్టి సరిపోయింది….

అలా కాకుండా
అవి ప్రశ్నగా మారి
జవాబు అడిగితే?

మనుషులు మాయమై
వీధులన్ని ఖాళీగా
ఊరు నిజం దాటి బయటకు
రాలేదు.

మొదటి ఆవృతంలో చేతులు చాచి చిల్లర అడగడం (యాచన). రెండవ ఆవృతంలో అదే చేతులు జవాబు అడగడం (ప్రశ్న). చిల్లర అడిగితే మనం ఇచ్చి వెళ్ళిపోతాం, కానీ అదే పేదరికం మనల్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక “మనుషులు మాయమై వీధులన్నీ ఖాళీగా” ఉంటాయని మూడవ ఆవృతంలో అనడం ఈ కవితలోని గొప్ప వ్యంగ్యం. సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను పక్కాగా ఎండగట్టిన కవిత ఇది. మనిషి తన సౌకర్యవంతమైన ప్రపంచం (comfort zone) దాటి బయటకు రాలేడని, వాస్తవాలను ఎదుర్కోలేడని కవి ఎద్దేవా చేయడం ఇందులోని సందేశం. ఈ కవితను చదివాక, తక్కువ పదాలతో ఎక్కువ భావాన్ని పలికించిన కవి ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేం.

“కొత్త ఇష్టం” (పే.70)కవితలో “ముఖాన్ని పుస్తకంలో ఉతుక్కోవడం”, “కళ్ళతో రుద్దడం” వంటి పద ప్రయోగాలు కవిత్వ ప్రక్రియ ద్వారా కలిగే మానసిక ప్రక్షాళనను కళ్లకు కట్టినట్లు చూపిస్తే.. “పగటి మోసం” (పే.91)కవితలో “విషం పూసిన డబ్బు కట్టలు”, “వేలును కోసిచ్చి హక్కును అమ్ముకోవడం” వంటి చిత్రాలు నేటి రాజకీయ స్థితిగతులకు పదునైన ప్రతీకలు.

నారాయణ రావు కవిత్వంలో అభివ్యక్తిలో ఒక రకమైన ఆర్ద్రత ఉంటుంది. “అంకితం”(పే.61) కవితలో వ్యక్తిగత సంఘర్షణను, ప్రేమను లేదా ప్రేరణను “నా మనసును నాకే శత్రువుగా మార్చి” అనడంలో ఎంతో లోతైన భావ వ్యక్తీకరణ ఉంది. గెలుపును ప్రేరణగా నిలిచిన వ్యక్తికి అంకితం చేయడంలో కవి సంస్కారం కనిపిస్తుంది.

“పగటి మోసం” (పే.91) కవిత నేటి రాజకీయాల మీద ఒక గట్టి చురక. ఓటును అమ్ముకోవడం వల్ల వచ్చే సంతోషం రేపటి స్మశానానికి పునాది అని హెచ్చరించడం కవి బాధ్యతాయుతమైన సామాజిక స్పృహను తెలియజేస్తుంది.

ఈ కవితా సంపుటి శీర్షిక కవిత ‘ఏకాంత స్పర్శ’ (పే.48) కవియొక్క తాత్విక పరిణతికి శిఖరం. శీర్షికలోనే ఉన్న సున్నితమైన వైరుధ్యం—అంతరంగంతో తాను జరిపే ఆత్మీయ సంభాషణే ఈ ‘ఏకాంత స్పర్శ’. “నీవు నీ నుండి విడిపోయినా సరే నీతో కలసి చేసే ప్రయాణమే ఏకాంతం” అనే నిర్వచనం ద్వారా కవి బాహ్య ప్రపంచపు ‘నేను’ నుండి విడివడి, అసలైన అంతరాత్మతో మమేకం కావడమే నిజమైన స్వేచ్ఛ. ‘నీ తనం తవ్వి తోడే నిజాలు ఏకాంత స్పర్శకు తడిసి ముద్దయ్యాయి’ అన్న వాక్యంలో, ఆత్మపరిశీలనలో బయటపడే చేదు నిజాలు సైతం ఏకాంతంలో కన్నీరుగా మారి ఆత్మీయతను పొందుతాయని చిత్రించారు. యాతన అంచుల్లో ధైర్యంగా నడిచే వారికే “కాలం దారి వదులుతుంది” అంటూ గొప్ప ఆశావాదాన్ని ప్రకటించారు. లోకాన్ని “ఇష్టాలతో పనిలేని ప్రశ్నాపత్రం”గా, సమస్యలను “రాత్రంత పొడవు, రోజంత బరువు”గా వర్ణించి, జీవితం ఎదురొడ్డి రాయాల్సిన పరీక్ష అని పదచిత్రాల ద్వారా ఆవిష్కరించారు. “వయసుకి రెట్టింపు ఆలోచన, మనిషెత్తు తపన” ఉన్నప్పుడే మనసు పదునెక్కి ‘బతుకు’ కాస్త ‘జీవితం’గా మారుతుందన్న సత్యాన్ని కవితాత్మకంగా చెప్పారు.

_________________

అమూర్తమైన ‘ఏకాంతం’, ‘తపన’ వంటి భావాలను ‘తవ్వడం’, ‘పారడం’ వంటి భౌతిక క్రియలతో పోల్చి కవి అద్భుతమైన శిల్పాన్ని సాధించారు. క్లుప్తత కంటే ‘భావ సాంద్రత’ ఎక్కువగా ఉన్న ఈ శీర్షిక, సంపుటిలోని ప్రతి కవితా ఒక ఏకాంత సంభాషణే అని నిరూపిస్తూ కవికి, పాఠకుడికి మధ్య ఒక అవినాభావ అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ సంపుటిలోని 76 కవితలలో సింహభాగం ఆధునిక కవిత్వంలో ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమిస్తాయనడంలో సందేహం లేదు.
_________________

“రసోద్దీపనమే కవిత్వానికి గీటురాయి అయితే కవిత్వం ఏ దేశంలో అయినా ఏ కాలంలో అయినా ఏక రసోద్దీపకంగానే ఉంటుంది. నవరసభరితమైన మహాకావ్యమైనా ఏదో ఒక రసం కావ్యానికంతటికీ ప్రధాన రసంగా ఉంటూ తక్కిన రసాలు పోషక రసాలుగా మాత్రమే ఉంటాయి.” అంటారు సుప్రసిద్ధ విమర్శకులు రారా. నేను గమనించినంత వరకు నారాయణ రావు గారి కవిత్వంలో ప్రధాన గుణాలు ‘తక్కువ మాటల్లో ఎక్కువ భావం’ పలికించడం, అనవసరమైన పదజాలం వాడకపోవడం, ప్రతి కవితలోనూ తాను తీసుకున్న వస్తువు పట్ల స్పష్టమైన అవగాహన కలిగివుండటం. ఈ గుణాలే ఈ కవితా సంపుటి చదివే పాఠకులకు రసోద్దీపాలు.

 

-విల్సన్ రావు కొమ్మవరపు
89854 35515