విమర్శ రాసేవాళ్ళలో సృజనాత్మక కోణం ఉండొచ్చు, ఉండక పోవచ్చు. కానీ సృజన చేసేవారిలో మాత్రం విమర్శ కోణం ఒకటి తప్పక ఉండాలి. నావకు చుక్కానిలా. అప్పుడే ఏం రాస్తున్నామో? ఎటు వెళ్తున్నామో? అన్న ప్రశ్నలకు విచక్షణతో కూడిన సమాధానం చెప్పుకోగలుగుతారు. లేకపోతే గానుగెద్దు చందంగా అక్కడక్కడే అన్నట్టుగా మిగిలిపోతారు.
________________
నిబద్ధతతో కవిత్వం, కథలు రాస్తూ వస్తున్న రచయితల్లో ఎమ్వీ రామిరెడ్డి ఒకరు. ఆయన ఈ రెండింటి మధ్యలో అప్పుడప్పుడు తనకు నచ్చిన కవితా, కథా సంపుటాలపై వ్యాసాలు కూడా రాస్తూ వచ్చారు. అలా రాసిన తన వ్యాసాలన్నిటినీ ‘విస్తార’ (కవిత్వ సంపుటాలపై), ‘ప్రస్తార’ (కథా సంపుటాలపై) పేర్లతో సాహితీ లోకంలోకి పుస్తక రూపంగా తీసుకువచ్చారు. ఇటీవల 2026 సంవత్సరానికిగాను ప్రకటించిన ‘కొలకలూరి పురస్కారాలు’లో భాగంగా ‘కొలకలూరి రామయ్య- విమర్శ పురస్కారం’కు ‘విస్తార’ ఎంపిక అయ్యింది.
_________________
‘విస్తార’లో మొత్తం 26 వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాలు 24 మంది కవుల కవిత్వ సంపుటాలను, ‘అరసం’ వారి కవితా సంకలనాన్ని పరామర్శ చేస్తూ రాసినవే. ఇవన్నీ 2018-2024 మధ్య కాలంలో రాయడం, అందులోనూ ఆధునిక కాలంలో వెలువడిన కవితా సంపుటాలపైనే రాయడం విశేషం. రాయలసీమ, తెలంగాణా, ఉత్తరాంధ్ర, సర్కార్… ఇలా అన్ని ప్రాంతాలకు సంబంధించినవి కావడం ఇందులో కొసమెరుపు. ఈ సంపుటిలోని వ్యాసాలను నిశితంగా విహంగ వీక్షణం ద్వారా గమనిస్తే, ఆధునిక తెలుగు సాహిత్యంలో వెలువడుతున్న కవిత్వంలోని వస్తు, రూప, శైలీ పరిణామాల్ని కూడా అంచనా కట్టవచ్చు.
కవిత్వానికి మంచి అక్షర నడక ఉండాలి. దాన్ని నడపడంలోనే రచయిత ప్రతిభ కనబడుతుంది. ‘కవిత్వంలో సుదీర్ఘ వాక్యాల వల్ల ప్రవాహ వేగం తగ్గడం, శృతి తప్పే అవకాశం, వాక్య బంధాలు పెళుసుబారిపోవడం…’ వంటివి కవిత్వ నిర్మాణ పద్ధతిలో చాలా కీలకమైన అంశాలను రామిరెడ్డి వ్యక్తపరిచారు. అలాగే కేవలం పుస్తకంలోని కవిత్వం వరకే పరిమితం కాకుండా పుస్తక ముఖచిత్రం, కవితా శీర్షికలతో పాటు పుస్తకం అంకితం వచనాలను కూడా పరిశీలించడం ఆయనకున్న నిశిత దృష్టికి ఉదాహరణలు. వాస్తవానికి అలా చూడడం ఆయనలో ఉండే విమర్శా దృష్టి కంటే కవిత్వం రాయడంలో ఆ కవి ప్రదర్శించిన ప్రతిభను కనుగొనడంలో ‘పొందే ఆనంద’మే ఎక్కువ.
కవిత్వమే కాకుండా కవి జీవితాన్ని కూడా పరిశీలించడం విమర్శలో ఒక భాగం. రామిరెడ్డి ఈ ‘విస్తార’లో కవులలో తాను గమనించిన విషయాలు, వారి వ్యక్తిత్వం, వారు నిర్వహిస్తున్న బాధ్యతలు మొదలైనవి సందర్భానుసారంగా పేర్కొనడం జరిగింది.
అందులో మచ్చుకు కొన్ని ‘జర్నలిస్ట్ గా సంపాదించుకొన్న సరికొత్త చూపుతో సమాజాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించి, తన వస్తు సామగ్రిని ఎప్పటికికప్పుడు పదును పెట్టుకొంటాడు’. ‘యార్లగడ్డ కవిత్వంలో సంగీతం ఉంటుంది రాగాలుంటాయి ఆలాపనలు ఉంటాయి ఇంకా అమ్మ పాలు జున్నుపాలు వంటి అమూల్య జ్ఞాపకాలు రెక్కలు విప్పుకొని కవితల్లో విహరిస్తుంటాయి’ (యార్లగడ్డ రాఘవేంద్రరావు), పాపినేని ‘మృదుస్వభావి’. విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టదగిన కవితలు పాపినేని సంపుటాల్లో పుష్కలంగా ఉన్నాయంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు తప్పక చదివి తీరవలసిన అద్భుత కావ్యం ‘రజనీగంధ’(పాపినేని), ‘అదనపు కలెక్టర్ కు అదనపు బాధ్యత సృజన’ అంటూనే, “సృజనశీలి అయిన కవి తన పద సంపదను తనే సృష్టించుకుంటాడు. వాడి అరిగిపోయిన పదాలకు దూరం జరిగి భిన్నార్ధ పదబంధాలకు రూపకల్పన చేస్తాడు. సహజ పరిమళాలు వెదజల్లే పాత పదాలను వెలికి తీసి కొత్తగా పరిచయం చేస్తారు.” (ఏనుగు నరసింహారెడ్డి) అని తన విశ్లేషణలలో ఉటంకిస్తారు.
ఏ సాహిత్యంలోనూ రచయితలకు ఫలానా ప్రక్రియ తప్పక రాయాలనే నిబంధనేమీ లేదు. కానీ ప్రతి రచయిత మాత్రం విమర్శకు పాఠకుడు కావాలి. అప్పుడే ముందుతరం సాహిత్యంలోని లోతుపాతులు తెలుసుకోగలుగుతారు. సాహిత్యంలో ఖాళీలను గుర్తించగలుగుతారు. తమదైన ముద్రను వెయ్యగలుగుతారు. వాటివల్ల రచయిత మరింత రాటుదేలే అవకాశం తప్పక ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఆధునిక కాలంలో చదవడం కంటే రాయడం ఎక్కువుంది. అందుకే మొదటి పుస్తకం దగ్గరే ఆగిపోయి సాహిత్యంలో నేలరాలిపోతున్న యువభాస్కరులే ఎక్కువ. ఏ రంగంలోనైనా నిలకడ చాలా కీలకం. అది ఆ రంగాన్ని అర్థం చేసుకోన్నప్పుడే సాధ్యం.
సాహిత్యరంగాన్ని అర్థం చేసుకోవాలంటే విమర్శ చదవడం తప్పనిసరి. సహజంగా మొదట్లో ముందుతరం వాళ్ళ సాహిత్యం చదివి కాస్త మెళకువలు నేర్చుకోవడం జరుగుతుంది. పోతూ పోతూ సహ, యువ రచయితల రచనలు చదవడం పెద్దగా ఉండదు.
కానీ ఎమ్వీ రామిరెడ్డి తన ముందుతరమైన శివారెడ్డి, పాపినేని కవిత్వాన్ని చదువుకొంటాడు. అలాగే సహ రచయితలైన సన్నపురెడ్డి, సురేష్ పిళ్ళై, బండ్ల మాధవరావులను, యువ రచయితలైన పద్మావతి రాంభక్త, కుడికాల వంశీధర్ ల సాహిత్యాన్ని కూడా అంతే శ్రద్ధతో చదువుకుంటాడు. సహ, యువరచయితలను చదవడం వారిపై ఉన్న ప్రేమ, అభిమానం మాత్రమే కాదు. ఏం రాస్తున్నారు? వారి నుంచి నేను ఏం నేర్చుకోవాలి? అనే జిజ్ఞాస అధికంగా రామిరెడ్డిలో కనబడుతుంది. సుమారు నాలుగు దశాబ్దాలుగా సాహిత్యంలో కొనసాగుతూ రావడం వెనుక ఆయనకు ఈ నిలకడతో కూడిన జిజ్ఞాసనే ఇంధనం.
_______________
ఈ విమర్శ వ్యాస సంపుటి చదివితే యువ విమర్శకులు ఎలా కవిత్వాన్ని అంచనా వేయ్యోచ్చో తెలుసుకోవచ్చు. వీరికన్నా ముఖ్యంగా కవిత్వం రాసే యువ కవులు ఈ వ్యాస సంపుటిని తప్పక చదవాలి. వాక్యం వాడడం, శీర్షిక పెట్టడం, ముగింపులో కొసమెరుపు సాధించడం, రచయితగా ఎలా శైలీ ఏర్పాటు చేసుకోవడం, వస్తువు ఎంపిక వంటి కీలకమైన అంశాలపై సందర్భానుసారం పేర్కొన్న కవితా విశ్లేషణ ద్వారా తప్పక నేర్చుకోవచ్చు.
__________________
గుణ-దోష ప్రకటన చెయ్యడమే విమర్శ అసలు లక్షణం. ఈ ‘విస్తార’లో వివిధ కవిత్వ సంపుటాలలో ఆయా రచయితలు కనబరిచిన ప్రతిభ, శైలి, వస్తువు ఎంపిక వంటి గుణాల ప్రకటన మాత్రమే కనబడుతుంది. దోష ప్రకటన ఎక్కడా వ్యక్తపరచలేదు. ఇందుకు కారణం “రామిరెడ్డి గారి సహృదయత, ఆయా కవులలోని చిన్నచిన్న లోపాలను చెప్పడానికి అడ్డు వచ్చి ఉంటుంది. అందుకే ఆయన లోపాల జోలికి వెళ్లలేదు” అని ముందుమాటలో సుంకర గోపాలయ్య పేర్కొనడం జరిగింది. “ఆ కవిత్వంతో నేను ఎంతవరకూ మమేకమయ్యానో పరీక్షించుకోటానికీ, కవిత్వపు లోతులు తెలుసుకోవటానికీ, సృజనాత్మక ఊహాశక్తిని సాధించటానికీ వ్యాసరచనకు పూనుకొన్నాను. నచ్చిన ప్రతి కవితా సంపుటినీ నాదైన దృక్కోణంలోంచి దర్శించడం మొదలుపెట్టాను. బుద్ధిగా హోంవర్క్ చేసే పిల్లవాడికి మంచి మార్కులు ఎందుకు వస్తాయో చాలా సార్లు అనుభవంలోకి వచ్చింది అట్లా రాసుకుంటూ పోయిన కొన్ని వ్యాసాలను గుది గుచ్చి విస్తారంగా మీకు అందిస్తున్నాను” అని దానికి తగ్గ వివరణ ఇచ్చారు.
కానీ ఆ కోణంలో కూడా పరిశీలించి ఉంటే చదివే యువ పాఠకులకు గుణాలతో పాటు దోషాలు కూడా తెలిసేవి. తప్పక ఆ కోణంలో నుంచి ఎమ్వీ రామిరెడ్డి భవిష్యత్తు విమర్శా వ్యాసాలను ఆశించవచ్చు.
(ప్రతిష్టాత్మక కొలకలూరి రామయ్య విమర్శనా పురస్కారం-2026 అందుకున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

-బుగడూరు మదన మోహన్ రెడ్డి,
హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం,
99898 94308.











