స్వచ్ఛమైన రెక్కలతో ఎగిరిన ఓ ప్రేమకథ

సాహిత్యం

దాదాపు వంద సంవత్సరాలుగా నా గుర్తింపుకోసం గాలిస్తూనే వున్నాను. నా కన్నీటి చుక్కల చిరునామా పాఠకుల జాలి చూపుల్లో ఒక ప్రతిబింబమై వెలిగే ఆ దృశ్యం కోసం, ప్రతి తెలుగు లోగిలి గడప, గడప దగ్గర నా కళ్లను అతికించి ఎదురుచూస్తూనే వున్నాను. ‘బారిష్టర్ పార్వతీశం’ నవల పుటల్లో అట్టడుగున కూరుకుపోయిన నా శిరస్సును, తండ్రిగా నిమిరే ఒక సాహితీవేత్త చేతులకోసం ఇన్నాళ్లు ఎంతగానో తపించి పోయాను. ఖండాలకు అవతల ఇంగ్లండు దేశంలో పుట్టిన నేను దాదాపు పది దశాబ్దాలుగా దర్జాగా మీ మధ్యనే తిరుగుతున్నాను. మహా రచయిత ‘మొక్కపాటి నరసింహశాస్త్రి’ గారు నవలలో సృష్టించిన సన్నివేశాలను వేదికగా చేసుకొని నా ప్రేమను, నా వేదనను, నా కన్నీళ్లను మీముందు వుంచుతున్నాను. ‘బారిష్టర్ పార్వతీశం’ నవలను చదివిన వారికి నేను ఒక పాత్రను మాత్రమే. కాని ఈ పాత్రకూ ఒక మనసు, ఒక ప్రేమ వుంటుందని చెప్పే ప్రయత్నమే ఇది.

ఇంతకీ ఈ ఇంగ్లీషు వనిత ఎవరన్నది కదూ మీ సందేహం. ఆలస్యం లేకుండా నా పరిచయాన్ని నేనే నిర్వహిస్తాను. హాస్య నవల అనగానే తెలుగువారికి వెంటనే గుర్తుకొచ్చే ‘బారిష్టరు పార్వతీశం’ నవలలో ఒక ప్రేమికురాలి పాత్రను నేను. నవలలో నాపేరు ప్రస్తావించవలసిన అవసరం ఎక్కడా రాలేదు. పార్వతీశం పట్ల సుసంపన్నమైన ప్రేమానురాగాలతో జీవం నింపుకున్న పాత్రను నేను. తనువు, మట్టిలో కలిసేదాకా మనసులో ఒకరికే స్థానమన్న సిద్ధాంతానికి హారతులిచ్చే నైజానికి వారసురాలిని నేను. పార్వతీశాన్ని నేను మనసారా ప్రేమించాను. ఆ ప్రేమ జ్ఞాపకాలతోనే చివరిదాకా బ్రతికాను. చనిపోతూ కూడా నా ప్రేమను పంచుకున్న పార్వతీశాన్ని ఐ మీన్ ‘శ్యాం’ ను నా కౌగిట్లో ఊహించుకొనే కళ్లు మూశాను.

నర్సాపురం దగ్గర మొగల్తూరులో పుట్టిన ‘శ్యాం’ బారిష్టరు చదువుకోసం ఇంగ్లండు వచ్చాడు. ఎడింబరోలో చదువు సాగిన్తున్నాడు. వేసవి సెలవుల్లో శ్యాం ఐర్లాండ్ వైపునున్న సముద్ర తీరానికి వెళ్లాలనుకున్నాడు. రైలు ఎక్కాడు. అందులో నేనూ వున్నాను. అదే మా మొదటి పరిచయం. శ్యాం నవ్విన నవ్వు నాకు ఎంతగానో నచ్చింది. శ్యాంతో ఆ రైలు ప్రయాణం చాలా క్రొత్త అనుభూతినిచ్చింది. మా ఇద్దరిమధ్య మాటలు మమ్మల్ని ఆత్మీయులుగా మార్చాయి. రైలులో శ్యాం ప్రవర్తన నాకెంతగానో నచ్చింది. నన్ను ఆ క్షణంలో ఒక దేవతా స్వరూపంగా శ్యాం చూశాడు. దిగవలసిన స్టేషన్ రాగానే, ఎవరిదారిన వాళ్లం వెళ్లిపోయాం. ఆ తరువాత ఒకరోజు బజారులో హఠాత్తుగా శ్యాం ఎదురయ్యాడు. అతడ్ని చూడగానే ఏదో గొప్ప సంపద లభించినంత ఆనందపడిపోయాను. ఎలా వున్నావని నేనే పలకరించాను. శ్యాం కూడా చాలా సంతోషంగానే కనిపించాడు. నేను ఉద్యోగం చేస్తున్న విషయం విని, నా బాధ్యతలు పంచుకొనే వ్యక్తి ఎవరూ లేరా? అని అడిగాడు. ‘మీలాంటి ఉత్తములు దొరకాలి కదా’ అన్నాను నేను. ఎందుకో అతడి కళ్లు ఆ క్షణంలో మెరిశాయి. రెస్టారెంట్లో కాఫీ త్రాగి, చేతులు కలిపి గుడ్ నైట్ చెప్పాను. శ్యాం చేతుల్ని నా చేతులు ఎందుకో వదలటం లేదు. అతని స్పర్శలో ఏదో మాయ వుందనిపించింది. అతికష్టం మీద నా చేతిని వెనక్కి తీసుకొని చక,చకా వెళ్లిపోయాను. వెనక్కి చూస్తే శ్యాం ఇంకా అక్కడే నిలబడి నావైపే చూస్తున్నాడు.
___________
ఇంటికొచ్చాక అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. ఆశ్చర్యంగా శ్యాం అందులో కనిపిస్తున్నాడు. అర్థరాత్రి దాటినా నిద్ర రావటం లేదు. శ్యాంని చూస్తే చాలన్న కోరిక మనసంతా దహించుకుపోతోంది. నాకు బాగా తెలుసు, ఈ కోరిక శారీరక సుఖం కోసం వికృతంగా తయారయిన ఆకారం కాదిది. ఆ తరువాత ఉదయించే సూర్యుడిలో, వీస్తున్న గాలిలో, కురుస్తున్న మంచులో… ఇలా అన్నింటిలోనూ నాకు శ్యాం కనిపించటం మొదలుపెట్టాడు. కనురెప్పల్ని మూయటం మరిచిపోయాను. కారణం, రెప్పల మధ్య కొంటెగా నవ్వుతూ శ్యామ్ నిలబడి కవ్విస్తున్నాడు. తెల్లారి తలుపులు తీస్తేచాలు ప్రపంచమంతా తానే విస్తరించినట్లుగా భ్రమ పడుతున్నాను. నేనెవరో నేనే మరిచిపోయిన స్థితిని శ్యాంతో చెప్పే సమయం కోసం నిమిషాలు యుగాలుగా గడిపాను.
___________

మా ప్రణాళిక ప్రకారం అనుకున్న రోజు తప్పకుండా కలుసుకునే వాళ్ళం. ఇద్దరం కలిసి సినిమాకు వెళ్లే వాళ్ళం. ఒకరోజు సినిమా నచ్చక మాకు నచ్చిన కొండమీదికి వెళ్లాం. శ్యాంకు దగ్గరగా జరిగి అమాంతం కౌగిలించుకొని, అతడికి భార్యగా మిగిలిపోవాలనుకున్న నా మనసులోని మాటను చెప్పాను. అతడ్ని నా వైపుకు త్రిప్పుకొని ‘ఏ స్త్రీ కూడా తన భావాలను సిగ్గు విడిచి ఇలా చెప్పదు. నేను సిగ్గులేని దాన్నని మాత్రం అనుకోకు…’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ కన్నీళ్లను తన చేతుల్తో తుడుస్తూవుంటే ‘శ్యాం’ ను నా గుండెలకు హత్తుకున్నాను. నా కౌగిలిలో శ్యాం పరవశుడై పోయాడు. ఆ తరువాత మెల్లగా తాను మాట్లాడటం మొదలు పెట్టాడు. ‘నువ్వు మీ వాళ్లను విడిచిపెట్టి మా దేశం రాగలవా? లేక నేను నా వాళ్లను వదిలిపెట్టి మీ దేశంలో వుండగలనా? నువ్వు మా దేశంలోకి వచ్చినా మా వాళ్లు మనల్ని గుమ్మంలోకి కూడా రానివ్వరు. ఈ పరిస్ధితుల్లో మన వివాహం సాధ్యం కాదు, మన కలయిక తాత్కాలికం మాత్రమే అన్నాడు. ఆ మాటలు విని నిర్ఘాంత పోయాను. కన్నీళ్లు తప్ప నాకు మాటలు రాలేదు. నేలమీద కూలబడి రోదిస్తున్నాను. నన్ను పట్టుకొని పైకి లేపాడు. నా దుఃఖం మరింత రెట్టింపయింది. వెక్కివెక్కి ఏడుస్తూ ‘వెన్నెల లేకపోతే చందమామకు విలువుందా?, చల్లదనం లేకపోతే మేఘం వర్షించగలుగుతుందా? నువ్వు లేకపోతే నేనూ అంతే శ్యాం…’ అంటూ అతడి మెడచుట్టూ చేతులు బిగించి ఏడ్వసాగాను. నా చెక్కిళ్లను ప్రేమగా నిమిరాడు. నా కళ్లను ముద్దు పెట్టుకున్నప్పుడు నా విచారం మొత్తాన్ని మరచిపోయాను. అతడి పెదాల స్పర్శతో ‘శ్యాం ఈజ్ మైన్ ఫర్ ఎవర్’ అనుకుంటూ అతని కౌగిట్లో గువ్వలా వొదిగిపోయాను.

పరీక్షల ఫలితాలు వచ్చాయి. శ్యాం ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. నా ఆనందానికి అంతేలేదు. శ్యాం ను మనసారా అభినందించాను. స్వదేశానికి శ్యాం తిరుగు ప్రయాణం ఖరారై పోయింది. తనను మరచిపోయి, అనుకూలుడైన యువకుడ్ని వివాహమాడి సుఖపడమని శ్యాం ఉత్తరం రాశాడు. చదివి నవ్వుకున్నాను. నా దృష్టిలో ఈ లోకంలో యువకుడంటే శ్యాం మాత్రమే. మొదటిసారి శ్యాం నన్ను తన కౌగిట్లోకి తీసుకున్నప్పుడే నా పెళ్లి అతడితో జరిగిపోయింది. మరో పెళ్లికి నా జీవితం సిద్ధంగా లేదు. ప్రయాణం రోజున లండన్ వెళ్లే రైలు ఎక్కి శ్యాం కూర్చున్నాడు. కిటికీలోంచి చూస్తూ చేతులు ఊపుతున్నాడు. రైలు కదిలింది. శ్యాంను చూస్తూ రైలు వెంట నేను పరిగెత్తాను. పరిగెత్తి, పరిగెత్తి చివరకు ఆ రైలు పెట్టెలోకి అమాంతం దూకేశాను. శ్యాం నిర్ఘాంతపోయాడు. మందలింపుగా ఏమిటీ సాహసం? చావంటే భయంలేదా? అన్నాడు. నీ కోసం ప్రాణాలు పోయినా ఫరవాలేదన్నాను. వెంటనే నన్ను దగ్గరికి తీసుకున్నాడు. ఆ రాత్రంతా మేము మాట్లాడుకుంటూనే వున్నాం. ఈ రాత్రి ఇలాగే ఆగిపోతే బాగుండుననిపించింది. రైలు దిగి శ్యాంతో కలిసి నేనూ స్టీమరు దాకా వెళ్లాను. ఆ తరువాత ఇద్దరం కలిసి డెక్ మీద నిలబడ్డాం. నేను మొత్తం శూన్యంగా మారిపోయాను. ‘శ్యాం ఒక్కసారి నిన్ను కౌగిలించుకోనా…’ అని బ్రతిమాలాను. వెంటనే నన్ను తన గుండెలకు హత్తుకున్నాడు. వెయ్యి జన్మలదాకా గుర్తుండిపోయే ముద్దుల్ని నాకు కానుకగా ఇచ్చాడు. ఇంతలో ఓడ బయలుదేరుతున్నట్లు గంట మ్రోగింది. మనిషిని కోసి గుండెను ఎవరో లాక్కెళ్లి పోతున్నట్లుగా వుంది. ఇక వెళ్లమన్నట్లు కళ్లతోనే దారి చూపించాడు శ్యాం. ‘గుడ్ బై… గాడ్ బ్లెస్ యూ’ అన్నాను. కాని నా మాటలు బయటికి రాలేదు. నేను అచేతనంగా ఓడ దిగి బయటికి నడిచాను.

శ్యాం వెళ్లిపోయాక అతడి మీద అసలు నాకు కోపం రాలేదు, మరింత ప్రేమ పెరిగింది. గతంలో శ్యాం చెప్పిన బాధాకరమైన మాటలేవీ ఇప్పుడు నాకు గుర్తుకు లేవు. ఒకరోజు చీకట్లో ఒంటరిగా కూర్చుని ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చాను. నా ప్రేమకు రంగుల్ని మార్చలేను. శ్యాం రూపాన్ని నా మనసునుంచి తుడిచివేయటానికి అద్దం మీద పడ్డ ధూళికణం కాదతడు, నాలో ప్రవహిస్తున్న ఒక జీవకణం. ఊపిరి లేకపోయినా బ్రతకగలనేమోకాని, శ్యాం ఊసులు లేకుండా అసలు బ్రతకలేను. చివరిదాకా నేను ఇలాగే బ్రతకాలి. బ్రతికి చూపించాను కూడా.

ఇదీ నా ప్రేమకథ. నవలా రచనలో ప్రతి పాత్ర, రచయిత కలం ఆదేశాల పరిధుల్లో మాత్రమే ఒదగబడుతుంది. ఆ నవల పాఠకుల చేతుల్లోకి వచ్చిన తరువాత పాత్రలన్నీ స్వేచ్ఛాజీవులవుతాయి. వ్యాఖ్యానాల కోసం ఎదురుచూస్తాయ్. నవలలో కనిపించని, వినిపించని మనోభావాలను సంపూర్ణంగా ఇలా పంచుకుంటాయ్. రచయిత ఆలోచన బావిలాంటిది. అందులోనుంచి ఎవరైనా ఎన్ని నీళ్లయినా తోడుకోవచ్చు.

ఉత్తమ ప్రేమికుల జాబితాలోకి ప్రవేశించే అర్హత నా పాత్రకు వుంటే నా గురించి కూడా మాట్లాడండి, చర్చించండి, నాలుగుముక్కలు రాయండి, ‘నన్ను ఒక స్వచ్ఛమైన ప్రేమికురాలిగా గుర్తించి ఆదరించండి. ‘బారిష్టరు పార్వతీశం’ పేరును ఎవరు ఎక్కడ ఉచ్చరించినా ఆ నీడలో ఆయన ప్రేమికురాలిగా నేను ఎప్పటికీ తొంగిచూస్తూనే వుంటాను.

 

-డాక్టర్ కె.జి. వేణు,
98480 70084