నిజాల ఊడలతో విస్తరించిన మర్రిచెట్టు రూపం ‘నీడ’ నాటకం

ప్రపంచ మేధావులు నిర్దేశించిన నాటక లక్షణాలతో సంపూర్ణంగా జీవం పోసుకున్న నాటకం, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి సృజనాత్మక సంపద ‘నీడ’. ప్రపంచ చరిత్ర పుటలలో కొన్ని వర్గాల క్షమించరాని తప్పిదాలతో వికారంగా మరకలు పడ్డ పేజీలలోని సత్యాలు సజీవంగా మనతో సంభాషించేలా చేసిన నాటకం ‘నీడ’.
__________________

అప్పటి సమాజపు ఉన్నత వర్గాలు, వారి గమనానికి మూలాధారమైన ఒక వర్గాన్ని, ఆంక్షల ఉరిత్రాళ్లకు వ్రేలాడదీసి, బ్రతకటం, చావటం ఈ రెండింటితో సంబంధంలేని ఒక నరకయాతన అవస్థను ఆ వర్గానికి శాశ్వతం చేసి, పైవర్గాలవారి సేవకే ఆ వర్గ ప్రజల జీవితం పరిమితం కావాలంటూ ఆదేశించిన పైశాచిక తత్వాన్ని తగిన రీతిలో మనం అర్థం చేసుకోవడానికి ‘నీడ’ నాటకం, తన అక్షరాలను సరికొత్తగా ముస్తాబు చేసి ప్రదర్శనకు సిద్ధం చేసిన శుభ సందర్భమిది.
__________________

వైవిధ్యాన్ని అంగవస్త్రంగా ధరించిన ఈ నాటకంలో తెర లేవగానే అప్పటి సమాజ స్వరూపం, అందులోని మనుషులు, ఆ మనుషుల మనస్తత్వాలు, వైరుధ్యాలు, వ్యత్యాసాలు సమస్తం సంపూర్ణంగా ప్రతీకల రూపంలో ఆవిష్కరించబడుతున్నాయి.

ఎదురుగా ఒక పెద్ద చెట్టు. దానిమీద వివిధ ఎత్తుల్లో నలుగురు వ్యక్తులు ఆసనాలను ఏర్పాటుచేసుకుని కూర్చున్నారు. వాళ్లంతా సుఖాలకు, సంతోషాలకు, సంపదలకు తామే వారసులుగా ప్రకటించుకుంటున్నారు. ఒక్కడు మాత్రం, వొంటిమీద మట్టి తప్ప వస్త్రం ఎప్పుడూ ఎరుగని వ్యక్తిలా, ఆకలితోనూ, దప్పికతోనూ, ఎండిన డొక్కతోనూ, రక్తం చెమటగా మారుతున్న దృశ్యాలకు మాత్రమే తాను వారసుడుగా, దైన్యం నిండిన కళ్లతో, న్యాయం కోసం తాతల కాలం నుంచి ఎదురుచూస్తున్న చూపులతో, అలిసిపోయిన శ్వాసతో అందరిముందు శాశ్వత బానిసలా చేతులు కట్టుకుని నీడకు దూరంగా తాను నేలమీద నిలబడి వున్నాడు. ఎండిన అతని ముఖంమీద, జీవితమంతా కార్చిన కన్నీళ్లు చారల్లా కనిపిస్తున్నాయి. ఎన్నో మహిమలతో దేవుడున్నాడనే మత్తును ఈ మనిషి శ్వాసలోకి ప్రాణవాయువుగా ఎక్కించటానికి మేధావులు చేసిన కుట్ర, కుతంత్రాల వాస్తవ రూపాల్ని సమగ్రంగా ఈ ‘నీడ’ నాటకం మనకందిస్తోంది.

నాటక ప్రారంభంలో సమయం ప్రాతఃకాలం. ‘ఉత్తిష్ఠ దైవ ధ్వజా!, ఉత్తిష్ఠ కరవాల సింహా!, ఉత్తిష్ఠ ధనకేతనా!, ఉత్తిష్ఠ శ్రమజీవన!, ఉత్తిష్ఠ చిరపీడితా!, ఉత్తిష్ఠ మానవతా!…’ అంటూ ఒక నూతన సుప్రభాత గానం వినిపిస్తుంది. అక్కడున్న మనుషుల స్వభావాలకు ప్రతీకగా ఈ స్తోత్రం తన గొంతును సవరించుకుంటోంది. అక్కడ హాజరైన ఐదుమందిలో ప్రధానపాత్ర ఐదవవాడిదే. బాధలు, కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు అన్నీ అతడివే. కట్టుబానిస పదానికి కట్టుబడిన కష్టజీవి అతడు. మిగిలిన నలుగురిని అందలం ఎక్కించిన చెట్టుకు..నిత్యం నీళ్లు పోస్తూ సంరక్షించే బాధ్యత అతడిదే. ఎంత అలిసినా నిద్రపోకుండా ఆ చెట్టుకు నిత్యం కాపలా కాచినా ఈ మనిషి ఆ చెట్టును ఎక్కి కూర్చోవడానికి మాత్రం వీల్లేదు. అసలు ఆ చెట్టు నీడలో కూడా తాను నిలబడకూడదు. అది అక్కడి ఆచారం.

ఆ చెట్టు అందిస్తున్న ఫల సంపదలో వాటా అడిగే హక్కు తనకు ఏమాత్రం లేదని మిగిలిన నలుగురి తీర్మానం. పోనీ, క్రింద రాలిన పండ్లు తిందామంటే, అవి భూదేవి ఆకలికోసం నిర్దేశించబడినవని ఆంక్షలు. దప్పికకోసం కడవలోని నీళ్లయినా త్రాగుదామనుకుంటే, ఆ అదృష్టం అతడి నుదుట దేవుడు రాయలేదని జ్ఞాపకం చేస్తున్నారు. చివరికి చెట్టు కుదుట్లో వున్న నీళ్లు త్రాగుదామనుకుంటే, తాను ఆ నీళ్లను ఎంగిలి చేస్తే, చెట్టు, ఆచెట్టుతో పాటు దానికి కాసే పళ్లు సమస్త ఎంగిలి అవుతాయట. ఆ ఎంగిలిని పైవాళ్లు ఎలా స్వీకరిస్తారు. అంచేత ఆ నీళ్లు కూడా అతనికి అందుబాటులో లేవని శాస్త్రాలను సాక్ష్యంగా చూపుతున్నారు. ఆకలిని తీర్చుకోవడం కోసం కందమూలాల్నయినా తిందామని అడుగులు వేస్తే, దేవుడి ఆజ్ఞ ప్రకారం అవి సన్యాసుల కోసం కేటాయించబడినవని, వాటిని అసలు ముట్టుకోవడానికి వీల్లేదన్నారు. చివరకు ఆకలిని తట్టుకోలేక గడ్డీగాదం, ఆకులు అలుములు తింటూ పశువుల సమూహంలోకి బలవంతంగా తాను విసిరివేయబడుతున్నాడు.

అతడికీ నోరుంది కదా! తన అన్యాయాన్ని గురించి అడగలేడా? అనుకుంటే పొరపాటే. అడుగుతున్నాడు, అర్థిస్తున్నాడు. కన్నీళ్లతో పెద్దల పాదాలు కడుగుతున్నాడు. అందరిలోనూ ఒక్కటే రక్తం. మరి ఈ తేడాలెందుకో తేల్చమంటే… ‘మాది స్వర్గరక్తం, నీది నరకరక్తం. అంతేకాదు, మేము దేవతలం కాబట్టి మాకు చెమట పట్టదు. నువ్వు మా కోసం పుట్టిన మనిషివి. తప్పదు నీకు శ్రమ, చెమట…’ అంటూ అతడి నుదుటిమీద బానిస రాతల్ని బలవంతంగా రాస్తున్నారు. ఏదో కనికరాన్ని కుంభవృష్టిలా కురిపిస్తున్నామంటూ…‘ఇదిగో నువ్వు ఈ చెట్టు క్రింద తిరిగే అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాం.

కానీ ఒక్క షరతు. నువ్వు ఈ చెట్టు క్రింద ఎంత తిరిగినా అభ్యంతరం లేదు కానీ, నీ ఉమ్ము ఈ నేలమీద పడకూడదు. ఎందుకంటే నీ ఉమ్ము పడినచోట అది మైల అవుతుంది. దైవకార్యాలను నిర్వహించే మాకు ఆ నేలమీద నడవటం అసహ్యమవుతుంది. దేవుడు దీన్ని వొప్పుకోడు. పైగా అతడికి కోపం కూడా వస్తుంది. అందుచేత నీ ఉమ్ము నేలమీద పడకుండా, అది వచ్చిన ప్రతిసారి దాన్ని ఉమ్మటానికి నీ మెడలో ముంతకట్టుకోవాలి. నిద్రలో సైతం దాన్ని తీయకూడదు. శరీరంలో ఒకభాగంలాగా చచ్చేదాకా అది నీతోనే వుండాలి..’ అంటూ అతడి మెడకు ఒక ముంతను తగిలించారు. అతడు ఎక్కడ నడిచినా ఆ దారిని వెంటనే శుభ్రపరిచేందుకు అతడి నడుంకి వెనక పొడవాటి చీపురును కట్టుకునే నియమాన్ని కూడా తప్పక పాటించాలని శాసనాలు చేశారు. ఈ అనాగరిక ఆలోచనల పైశాచిక రూపాలను ఈ నాటకంలో మనం చూడవచ్చు.

బలవంతులు, ఒక బలహీనుడ్ని తీవ్రంగా పరాభవించిన నీచ, నికృష్ణ సందర్భమది. ఎంతో శక్తివున్నాసరే అతడు తిరగబడటానికి సిద్ధం కావలసిన అతడి మనసును శతాబ్దాలుగా నిర్వీర్యం చేశారు. మానసికంగా ఆ మనిషి మనోధైర్యాలను ఎప్పటికప్పుడు దగ్ధం చేస్తూనే వచ్చారు. కర్మ సిద్ధాంతానికి రోజూ అతడ్ని బలి ఇవ్వటం తప్పనిసరి చర్యగా మారిపోయిన రోజులవి. వాటి స్వరూపాన్ని చాలా సమర్థవంతంగా ఈ నాటికలోని సన్నివేశాలు మనకందించటానికి వేదికల్ని సిద్ధం చేసుకున్నాయి.

‘ఓ దేవుడా! నన్నెందుకు పుట్టించేవు తండ్రీ! నన్ను సృష్టించి పెంట దొడ్లో పారేసిన కన్నతల్లిలా ఊరకున్నావా? నా బతుకింతేనా? ఇది మారదా? నేను చేసిన పాపమేమిటి?’ అంటూ కన్నీరు మున్నీరుగా రోదిస్తుండగా సృష్టికర్త వచ్చాడు. అక్కడున్న చెట్టును చూపించి ‘నువ్విచ్చిన స్థలంలోనే వాళ్లు దాన్ని పెంచుకున్నారు. నువ్వు బలవంతుడవని వాళ్లకు తెలుసు. నీతో ప్రమాదముంటుందని నిన్ను వేరుచేసి నీ ఎదుగుదలకు అడ్డంగా ఆచారాల మేకులను కొడుతున్నారు. అంతా దేవుడి నిర్ణయమంటూ జరిగేదంతా నాకు ఆపాదిస్తున్నా- కర్త, కర్మ, క్రియ అన్నీ వాళ్లే. అందులో జ్ఞానవంతుడని చెప్పుకుంటూ బ్రతికే మొదటివాడిదే ప్రధానపాత్ర. నీ బాగోగులు అన్నీ నీ చేతుల్లోనే వున్నాయి. ఆలోచించుకో…’ అంటూ అంతర్ధానమవుతాడు సృష్టికర్త.

ఆ తరువాత బౌద్ధ బిక్షువు వచ్చాడు. ఆ వెనక, వరుసగా ఫకీరు, మిషనరీ, రాజకీయ సన్యాసి, రఘుపతి రాఘవ రాజారాం పాడుకుంటూ గాయకుడు, ఆ వెంటనే విమోచకుడు, అతడ్ని అనుసరిస్తూ మేధావి, చివరగా తుపాకీతో అన్న… అందరూ ఒకరి తరువాత ఒకరు వచ్చారు. ఎవరి సిద్ధాంతాలను వాళ్లు పాఠాల్లా అప్పజెప్పుతున్నారు. బానిస బ్రతుకునుండి విముక్తి కోసం శాశ్వతమార్గం ఏదీ కనిపించటంలేదు. ఆ మార్గాన్ని నిర్దేశిస్తూ మళ్ళీ నాటక ప్రారంభ దృశ్యంలోని చెట్టు, దాని క్రింద ఐదుగురు మనుషులు నిలబడివున్న దృశ్యం మనముందుకు వస్తుంది. ఏం జరుగుతుందోనని ఎంతో ఉత్కంఠతో అందరూ ఎదురుచూస్తున్న సమయమది. ఆ ఐదుగురి మధ్య చర్చలు జరిగాయి. మాటలు కలిసాయి. జరిగిన తప్పిదాలకు క్షమాపణలు చెప్పుకున్నారు. వాస్తవాల అసలు స్వరూపాలలోకి తలలు దూర్చి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అందరి రక్తం ఎర్రగానే కనిపిస్తోంది. అందరి శ్వాసకు అవసరమైన ప్రాణవాయువు ఒకటేనన్న సత్యం సంపూర్ణంగా తెలిసింది.
_________________

ఇన్నాళ్లగా రాజ్యమేలిన అసమానతలకు ఎదురుగానున్న చెట్టే కారణమని గుర్తించటానికి వాళ్ల వివేకం సమర్థవంతంగా పనిచేసింది. మనుషుల్ని విడగొట్టి, మానవత్వ కళేబరాలతో పూజలు కోరుకుంటూ ఒక అనాగరిక వ్యవస్థకు ప్రతిరూపమైన ఆ చెట్టును అందరూ కలిసి, కత్తీ, సుత్తి, కొడవలి, గొడ్డలి, గునపం, రంపం పనిముట్లతో నిలువునా కూలగొట్టిన దృశ్యంతో, రంగస్థలం నిండా ఒక కొత్త కాంతిని నింపటానికి కాలం తన పాత్రను సిద్ధం చేసుకుంటుండగా నాటకం ముగుస్తుంది.
_________________

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి కలం అద్భుతంగా సృష్టించిన ఈ నాటకం నిండా వాస్తవికత, సజీవకత పోటీ పడ్డాయి. ఇందులోని ప్రతి సంభాషణ, ప్రతి సన్నివేశం, నాటక ఔన్నత్యానికి ఉన్నతస్థాయిలో సహకరించాయి.

ముందు మాటల్లో ఆయన అన్నట్లు ‘నీడ’ నాటకం ప్రతీకాత్మక రూపం. ఈ నాటకంలోని నీడ, చెట్టు, మనుషుల పాత్రలు…అన్నీ, మన వ్యవస్థలోని నిజాలకు ప్రతీకలే. అవన్నీ సమిష్టికి సంకేతంలా కొనసాగాయి. నడిచిన మానవచరిత్ర పుటలలోని సందర్భానుసార సారంపట్ల మన అవగాహన రెట్టింపు కావడానికి ఈ నాటకం ఎంతగానో దోహదపడుతుంది. పఠనకే కాదు, ప్రదర్శనలో సైతం తన సత్తాను నిరూపించుకోవడానికి సర్వశక్తుల్ని సమీకరించుకున్న అసాధారణ నాటకమిది. ఇంత గొప్ప రచనను అందించిన ఆచార్య కొలకలూరి ఇనాక్ గారికి వినమ్రంగా నా ప్రణామాలు.

 

 

-సాహిత్య ప్రపూర్ణ డాక్టర్ కె.జి. వేణు,
98480 70084