విద్వేషాలపై ఎక్కుపెట్టిన కవితాస్త్రం- మౌమిత ఆలం కవిత్వం

సాహిత్యం హోమ్

“వాస్తవాల నుంచే సత్యాన్ని గ్రహించాలి” అంటారు మావో.మానవహక్కుల హననం తీవ్రతరమవుతున్న నేటి సమాజ వాస్తవ పరిస్థితుల్లో ఈ మాటను మనం కచ్చితంగా గుర్తు చేసుకోవాలి. వీధివీధిన విద్వేషం వెల్లువలై పారుతున్న రోజులివి. ప్రజలు కుల మత ఓటర్లుగా,పదవీమోహపు స్వార్ధాల్లో పావులుగా మార్చబడుతున్నారు.సమకాలీన రాజకీయ కుట్రలు సమాజాన్ని మరింత కలవరపెడుతున్నాయి.
మతాన్ని,దేవుడును, వ్యక్తిని, కుటుంబాల్ని దాటి రాజకీయ వేదికలు ఎక్కి విద్వేషపు కత్తులు నూరుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. మనిషిని, మనిషి పుట్టుకను వర్ణాలుగా చీల్చిన మనువాదాన్ని నెత్తిన పెట్టుకుని, అనాగరిక కాలంవైపు నడవడాన్నే అభివృద్ధిగా పిలుచుకుంటూ అమానవీయ హృదయ శకలాలుగా మారుతున్నాం. ఇటువంటి సమయంలో మనిషితనాన్ని తొడిగి,ప్రేమని తాపి మానవీయ సమాజాన్ని నిర్మించడానికి నిబద్ధతగల గొంతులు కావాలి. బాధ్యతాయుతమైన ప్రజాస్వామిక స్వరాలు కావాలి.

ఈ పరిస్థితుల్లో:

“ప్రియతమా.. బెదురెందుకు
కోటలు బద్దలై
రాజ్యాలు కుప్పగూలేదాక
నిను ముద్దాడుతా” (ప్రేమ కూడ నిరసనే) అంటూ ప్రేమను ధిక్కార సూచకంగా కాలం మీద నిలబెడతానంటున్న మౌమిత ఆలం కవిత్వం మనకు ఒక ఆశను,నమ్మకాన్ని పురిపెడుతుంది. మౌమిత, పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర బెంగాల్ జల్పాయ్ గురి ప్రాంతపు నివాసి.

భారతీయ పురుషాధిపత్యాన్ని మోస్తున్న సమాజం నుంచి,ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన చైతన్య స్వరం. మహిళా గొంతుక. కుటుంబ పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం, అణచివేతలు,ఆధిపత్యాలు మనుషుల మధ్య ముళ్లకంచెలెలా నాటుతున్నాయో? చదువుకున్న తరం కూడా ఎలా ఆ ఊబిలో పడి అజ్ఞానాన్ని పులుముకుంటున్నదో మౌమితకు స్పష్టత ఉంది.మనుషులుగా కాక పార్టీల జెండాలు, అజెండాల్లో సమిధలుగా మారిపోతున్న వైనాన్ని ఏకరువు పెడతారు. పాసిస్టు ప్రభుత్వాలు దేశభక్తి పాట పాడుతూ దేశాన్ని ఆదిమ యుగాల్లో నెట్టేస్తున్న దుస్థితిని నిరసిస్తూ ఆలం కవిత్వం చైతన్యపు ఖడ్గచాలనం చేస్తుంది.

కేవలం సమస్యను చూపించి మాట్లాడటం కాక,అందుకు మూలాలను,వాటిని వెలికి తీయాల్సిన అవసరాన్ని,విముక్తి కార్యాచరణను చెప్పడంలో ఈ కవయిత్రి అవగాహన అభినందనీయం.నడుస్తున్న రాజకీయ వాతావరణం నుంచి ఎదిగివచ్చిన కవయిత్రి, ఆలోచనా పరురాలు అయిన మౌమిత ఆలం.. ‘కాలం ప్రసవించిన కవయిత్రి’ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కనుకనే:

” నర్మద రక్తమోడినప్పుడు
నగరం
కాలిన మాంసపు వాసన వేసింది
జకియా దుఃఖం ఘనీభవించినపుడు
బిల్ కిస్ ముక్కలై కుప్పకూలినప్పుడు
నువ్వు వాళ్లకోసం నిలిచావు
మొక్కవోని విశ్వాసాలు రగిల్చావు” అని ‘నువ్వు సెతల్వాద్ వి’ కవితలో దేశంలో మతరాజకీయాల దుర్మార్గపు చర్యలను కళ్ళకు కడుతుంది.

ఆలం ఈ గమనింపు నుంచి సమకాలీన సామాజిక, రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తూ రాసిన కొన్ని కవితలను “The Musings of the Dark” అనే మొదటి కవితా సంపుటిగా 2020 లో ముద్రించింది.ఆ కొనసాగింపులో నిరంతరం నిఘా కన్నుతో రాజ్యాన్ని,రాజ్యహింసను గమనిస్తోంది. ప్రపంచ రాజ్యాలలో జాతులమధ్య విద్వేషాలను,అందుకు బీజాలను అధ్యయనం చేస్తున్నది.ఈ వాస్తవాలనుంచే తనను కవిత్వంగా వ్యక్తం చేసుకుంటున్న సమకాలీన కవితా భాస్వరంగా మౌమిత కనిపిస్తుంది.
ఈమె ఆంగ్లంలో రాస్తున్న కవితలు చాలా వేగంగా వివిధ భారతీయ భాషల్లోకి అనువాదం అవుతున్నాయి.ఆ క్రమంలోనే తెలుగులో ఉదయమిత్ర గారు అనువదించిన ఈమె కవితలు ఎక్కువగా రమాసుందరి గారి సంపాదకత్వంలో వెలువడుతున్న మాతృక మాసపత్రికలో అచ్చయ్యాయి.ఆ కవితల్ని ఇపుడు ‘రాయగూడని పద్యం’కవితా సంపుటిగా మాతృక ప్రచురించింది.యాభై ఆరు కవితల ఈ అనువాద సంపుటిలో ప్రతి కవితా వాస్తవికతను పట్టిచూపేదే. వాక్యం వాక్యం హృదయ లోతుల్లో భావాగ్నిని రగిలించే శక్తివంతమైన వ్యక్తీకరణ ఆలం సొంతం.
అట్టడుగు బతుకుల,అణచివేతకు గురైన స్త్రీల ఆత్మగౌరవ ప్రకటన,గుండెలు పగిలి రోధిస్తున్న నేల గొంతుకల ఆర్తి ఈమె కవిత్వంలో వినిపిస్తుంది. కశ్మీర్, గుజరాత్, బెంగాల్,ఉత్తరప్రదేశ్,మణిపూర్ మొదలైన ఎన్నో సామాజిక హింసాత్మక ఘటనల గాయాలు గుండెల్ని మెలిపెడుతాయి. ఆ గాయాల్లోంచి కూడా:

మీ వెక్కిరింతల కొక్కిరింతల మధ్య
బుసకొట్టే విషనాగుల మధ్య
నిశ్చలంగా నడుచుకుంటూ వెళ్లే
నిర్భయ శిఖరాన్ని నేను((నేను ధిక్కార పతాకను) అంటూ మొక్కవోని తన ఆత్మ విశ్వాస స్వరం వినిపిస్తుంది ఈ కవయిత్రి.

మాట్లాడటం కూడా నేరం అయిపోతున్న గడ్డు కాలాన్ని,న్యాయం పక్షాన,రాజ్యాంగ విలువల పక్షాన నిలబడినందుకే ప్రజాస్వామ్యవాదులను, మేధావులను ఎలా జైళ్లలో బంధీలు చేస్తున్నారో మనం గమనిస్తూనే ఉన్నాం.ఎలా పొట్టన బెట్టుకున్నారో చూసాం. కానీ వెనకడుగు వేయని నినాదమై…

“మౌనం వేడుకైన చోట
మాటలు నిషేధమైన చోట
హంతకుడు తీర్పు చెబుతున్న చోట
నిప్పులై కురవండి.. లేవండి!” అంటూ సత్యం వైపు నిటారుగా నిలబడాలని పిలువునిస్తుంది. జాతిని జాగృతి పరుస్తుంది.

” బుల్ డోజర్ ప్రజాస్వామ్యమా
ఇల్లంటే
ఇన్ని గోడలో, దర్వాజలో,
జమాఖర్చులో గాదు
దశాబ్దాలుగా
ఊపిరిబిగబట్టిన
నిలువెత్తు ఉమ్మడి కల “(ఇల్లు)అంటూ రాజ్యపు నిరంకుశాన్ని నిర్భయంగా నిలదీస్తుంది.
____________
మౌమిత మాట్లాడే ప్రతి మాటలో తనదైన అవగాహన,పరిణితి మనల్ని వాక్యాల వెంట, పదాల వెంట పరిగెత్తించి చదివిస్తుంది. చదువుతున్నంత సేపూ మన చెవుల చుట్టూ కవయిత్రి గొంతు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.అనువాదంలో కూడా ఉదయమిత్ర గారు స్వీయ రచన అన్నంత సరళంగా,సహజంగా అనువదించడం కూడా తెలుగు పాఠకులకు మౌమిత హృదయం అర్ధమవుతుంది.
______________

‘నా కవిత్వమే నా నిరసన’ అని స్పష్టంగా చెప్పుకునే మౌమిత ఆలం దోపిడీ, దుర్మార్గం, దాష్టీకం ఏ స్థాయిలో వున్నా ఎక్కడ ఉన్నా దానిపై తన ప్రజాస్వామిక గొంతును బాణంగా ఎక్కుపెడుతుంది.
తన అస్తిత్వపు గడ్డ మీద నిలబడి ప్రపంచ మానవుల పక్షం నిలబడటం ఈ కవయిత్రి నైజం. నిజాన్ని నిజమని,అబద్ధాన్ని అబద్ధమని గొంతెత్తి చెప్పడానికి మూగతనం నటిస్తున్న సమాజంలో సత్యం వైపు నిలబడి మాట్లాడే గొంతులకు ఒక బాసట.ఒక ఊతం మౌమిత ఆలం కవిత్వం.
మౌమిత వంటి కవుల్ని, కవయిత్రులను చదవడం ఇప్పటి అవసరం.ఈ అవసరాన్ని గుర్తించి,తెలుగు సమాజానికి తన కవిత్వాన్ని,
కవిత్వంలో తన దృష్టిని దృక్పథాన్ని పరిచయం చేసే కృషి సల్పినందుకు,ఆ రకంగా సమాజాన్ని మెలుకువలో ఉంచే పనికి పూనుకున్నందుకు ప్రజాస్వామ్యవాది, మానవ హక్కుల పక్షపాతి ఉదయమిత్ర గారికి, మాతృక సంపాదకులకు ప్రత్యేక అభినందనలు..

-పల్లిపట్టు నాగరాజు.
99894 00881

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *