సరిహద్దు గస్తీపై ఇరు దేశాల మధ్య ముందడుగు

అంతర్జాతీయం హోమ్

జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ చర్చలు
మాస్కో : రష్యాలోని కజన్‌లో జరుగుతోన్న బ్రిక్స్‌ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. సరిహద్దు గస్తీపై జరిగిన ఒప్పందాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సరిహద్దులో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం ఇరు దేశాల ప్రాధాన్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల తర్వాత అధికారికంగా సమావేశం అవుతున్నాం. భారత్‌`చైనా సంబంధాలు ఇరు దేశాల ప్రజలకే కాకుండా ప్రపంచ శాంతి, సుస్థిరత, పురోగతికి ఎంతో ముఖ్యమని విశ్వసిస్తున్నాం. గత నాలుగేళ్లుగా సరిహద్దులో తలెత్తిన సమస్యలపై ఇటీవల వచ్చిన ఏకాభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాం. సరిహద్దులో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం మన ప్రాధాన్యంగా ఉండాలి. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం అనేవి మన సంబంధాలకు ప్రాతిపదికగా ఉండాలి‘ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో మోదీ`జిన్‌పింగ్‌లు అధికారికంగా చర్చలు జరపడం ఇదే తొలిసారి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ కీలక గస్తీ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో వీరి భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *