వంకిరెడ్డి రెడ్డెప్ప రెడ్డి “చెరువు గండి” నవలలోని వాస్తవ చిత్రంలోకి తొంగిచూస్తే, చరిత్ర పేజీలు మోస్తున్న నిమ్న కులాల రక్తపు కన్నీళ్లు దీనంగా కనిపిస్తున్నాయి. తడి ఆరని కనురెప్పల మధ్య దుఃఖపు మంచుతెరలను మోస్తున్న ఆ జ్ఞాపకాలను మెల్లగా తాకితే, అవి మాట్లాడటం మొదలుపెట్టాయి. ‘స్వతంత్రం, దేశం ముంగిట నిలబడి గడప లోపలికి రావాలా వద్దా అని దోబూచులాడుతున్న రోజులవి…’ అనే వాక్యాలతో ‘చెరువు గండి’ నవల ప్రారంభమవుతుంది.
__________________
ప్రజాస్వామ్యం, లౌకిక, మానవీయ విలువలకు ఇంకా చాలా దూరంలో బ్రతుకుతున్న ఈ దేశంలో.. ఆర్థిక వ్యత్యాసాలతో, కుల వివక్షలతో, భూస్వామ్య వ్యవస్థ రాక్షస క్రీడలతో, దోపిడీ దౌర్జన్యాల మారణకాండలతో విసిగి వేసారిన జనం కన్నీళ్లు కత్తులుగా మారి చేసే తిరుగుబాట్లతో, తన చిత్రాన్ని తానే గీసుకుంటున్న గ్రామాల్లో రాయలసీమలోని ‘చెరువుపల్లి’ ఒకటి. ఈ గ్రామం పేరు ‘చెరువు గండి’గా మారడానికి కారణమైన ఘటనే మొత్తం కథావస్తువుకు తెరుచుకున్న తలుపులా నిలుస్తుంది.
__________________
ఈ నవలలోని విషయం కల్పిత కథ కాదు. మానవజాతిలో ఉంటూ సర్పాలుగా మారి దోపిడీ వర్గం కాటేసిన గాయాల నుండి కారిన రక్తపు చుక్కల ఆనవాళ్లను మోస్తున్న కథ ఇది. లేనివాడికి, ఉన్నవాడికి మధ్య జరిగే ఘర్షణకు టీకా తాత్పర్యాన్ని సమగ్రంగా అందించిన కథ ఇది. మూడు తరాలుగా మీసాలు మెలేస్తూ.. భూములు మావి, ఆస్తులు మావి, ఊరు మాది, సర్వస్వం మాదేనంటూ కళ్లేర్రజేసి, అందుకు తగిన శాసనాలను జారీ చేసే ఆధునిక రాచరిక భూస్వామ్య కుటుంబానికి; నోటికి మెతుకులు కరువై, నిత్యం ఆకలిని మోస్తూ, పెద్దోళ్ల సేవలకు మాత్రమే పరిమితమైన మూడు తరాల ఒక శ్రామిక దళిత కుటుంబానికి మధ్య జరిగిన పోరు చిత్రమే ఈ ‘చెరువు గండి’ నవల.
బ్రిటిష్ పాలనలోనూ, ఆ తరువాత వలసపాలనాంతర కాలంలోనూ గ్రామీణ భారతాన్ని తునాతునకలు చేసిన దౌర్జన్యకర పెత్తందారీ వ్యవస్థకు మూలస్తంభాలుగా, మూడు తరాల ప్రతినిధులుగా దేవస్రష్ట, అతని కొడుకు అగ్నిస్రష్ట, మనవడు రత్నసభారాధ్యలు ఈ నవలలో కనిపిస్తారు. ఆధిపత్యవాదులుగా, నిరంతర దోపిడీదారులుగా వీరు తమ ముద్రలను ఎంత బలంగా వేశారో చూపే సన్నివేశాలు ఈ నవల నిండా పరుచుకుని ఉన్నాయి. దేశం ఇంకా మారలేదన్న నిజానికి ఇవి మనిషి పుర్రెలతో స్వాగతాలు పలుకుతున్నట్లు అనిపిస్తాయి.
కోరితే ఏ ఆడదైనా తమ వశం కావాల్సిందే, కన్ను పడితే ఏ భూమైనా తమ స్వాధీనం కావాల్సిందే. కాదని ఎదురు తిరిగితే, తెల్లారేసరికి తల తెగిన మనిషి మొండెం ఏ కాలువలోనో, చెరువులోనో తేలాల్సిందే. నమ్మకద్రోహానికి నిత్యం హారతులిచ్చే నీచానికి పెద్దాయన దేవస్రష్ట తెర తీస్తే, ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న తర్వాతి తరం మరింత క్రూరంగా ఆయా రంగాలను సిద్ధం చేసుకుంది. పేదరికాన్ని నిత్యం వీపున మోస్తున్న దళిత కుటుంబాలకు ఈ భూస్వాములు అప్పులు ఇచ్చి, ఆ అప్పులు తీర్చలేని పరిస్థితులను వీరే కల్పించి, చివరకు శ్రామిక జనాన్ని శాశ్వత జీతగాళ్లుగా, పనివాళ్లుగా మార్చే ప్రక్రియను తరాలుగా నిరంతరం కొనసాగించడానికి దేవస్రష్ట కుటుంబం తిరుగులేని శాసనాలను సిద్ధం చేసుకుంది.
మనిషి కాలి, కాలి బొగ్గుగా మారి, తిరిగి ఆ బొగ్గును మండించినప్పుడు నిప్పురవ్వగా మారిన రూపమే ఎర్రమ్మ. ఈ నవలలోని తిరుగుబాటులో ఎత్తిన పిడికిళ్ల శబ్దం ఆమె. ఆమె కేవలం దళిత మహిళ మాత్రమే కాదు, దౌర్జన్యానికి సవాలు విసిరిన ఒక విప్లవ ధ్వనితరంగం. ధైర్యాన్ని కనురెప్పల మధ్య ధనుస్సుగా ధరించిన పోరాట యోధురాలు. బాల్యంలో చదువుకున్న నాలుగు అక్షరాలు, ప్రశ్నించే జ్ఞానానికి దీపం వెలుగులా దారి చూపించాయి.
చెరువు గండి మాలపల్లెకు నాగయ్య కోడలుగా, దాశయ్య భార్యగా వచ్చిన ఎర్రమ్మ.. భూస్వామి దగ్గర చేసిన అప్పు, ఆ అప్పుకు రెట్టింపవుతున్న వడ్డీ, దాన్ని తీర్చడానికి చేస్తున్న వెట్టి చాకిరీ… ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటుంది. లెక్కలు కడితే ఏనాడో అప్పు తీరిపోయింది, కానీ మోసం ఇంకా కొనసాగుతూనే ఉంది. “ఏమిటి ఈ అన్యాయం?” అంటూ ప్రశ్నించిన మొదటి గొంతు ఎర్రమ్మదే. ఈ మార్పుకు కుటుంబం ఒక్కసారిగా భయపడిపోయింది. ఎవరు ఎంత వణికిపోయినా ఎర్రమ్మ పిడికిళ్లు మాత్రం మరింతగా బిగుసుకున్నాయి. తన ప్రాణం మీద ఆశను వదిలేసి, పెద్దోళ్లతో పోరాటానికే ఆమె సిద్ధపడింది.
పెద్దాయన దేవస్రష్ట తన కొడుకు అగ్నిస్రష్టను చదువు కోసం అనంతపురం ప్రభుత్వ కళాశాలలో చేర్పిస్తే, అక్కడ తప్పుడు పనులు చేసి అతను తిరిగి ఊరు చేరుకుంటాడు. ఇంటికి వచ్చీరాగానే వాడి కళ్లు ఎర్రమ్మ అందాల మీద పడతాయి. అవకాశం దొరికినప్పుడల్లా కామవేట మొదలుపెడతాడు. అడవిలో జింకపిల్లలా దిక్కు తెలియక తప్పించుకోవడానికి ఎర్రమ్మ చేసిన ప్రయత్నాలన్నీ తన మీదే గురిపెట్టిన బాణాల్లా మారిపోతాయి. చివరికి పులులు తిరిగే అడవిలాంటి పెద్దాయన ఇంటికి పని కోసం ఆమె వెళ్లాల్సి వస్తుంది. అప్పుడే గుహలోంచి వచ్చిన పెద్దపులిలా అగ్నిస్రష్ట తన ఆకలిని బలవంతంగా ఆమెతో తీర్చుకుంటాడు. “ఎవరో ఎంగిలి పడిన కంచంలో కట్టుకున్న మొగుడికి పరమాన్నం పెట్టినా తప్పే” అనుకుంటూ భర్త దాశయ్యకు దూరంగా ఉంటుంది ఎర్రమ్మ.
గుండెలో ఇప్పుడు రక్తం కాదు.. కోపం, పగ, ప్రతీకారం తీవ్రంగా రగిలిపోతున్నాయి. కన్నీళ్లను ఆయుధాలుగా మార్చుకోవడానికి ఆమె సిద్ధపడింది. చదువు విలువ తెలిసిన తను, తనకు పుట్టిన ఇద్దరు బిడ్డలను చదివించుకుంది. లోకాన్ని చదివిన పెద్దకొడుకు భార్గవ, పెత్తందార్ల అకృత్యాలను అరికట్టడానికి ఉద్యమంలో చేరిపోతాడు.
గుండెపోటుతో దేవస్రష్ట మరణించాక, కొడుకు అగ్నిస్రష్ట అక్రమాల సరిహద్దులను మరింతగా విస్తరిస్తాడు. ఎన్నో ఏళ్లుగా సింహం పక్కన జిత్తులమారి నక్కలా మెలిగిన కరణం వెంకటసామిని క్రూరంగా చంపిస్తాడు. ఎర్రమ్మ భర్త దాశయ్యను కాపుకాచి అవిటివాడిని చేస్తాడు. ఎర్రమ్మ చిన్నకొడుకు వేదాంతను కనికరం లేకుండా ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయాలు తెలిసి ఎర్రమ్మ కుతకుతలాడిపోతుంది. ఒక్కసారిగా హైదరాబాద్ సంస్థానంపై సామాన్య ప్రజలు చేసిన తిరుగుబాటు ఆమెకు గుర్తుకొస్తుంది.
జనం మనసులో దాచుకున్న ఆవేశం నవాబు రాజ్యాన్ని కూలదోయడానికి ఏ మార్గాన్ని ఎన్నుకుందో, అదే మార్గంలో అగ్నిస్రష్ట అంతానికి తన ఆలోచనలను నడిపించడానికి ఎర్రమ్మ సిద్ధపడుతుంది. అగ్నిస్రష్ట కామానికి బలైపోయిన పీడిత మహిళలు వసంతమ్మ, కదిరమ్మ, సుంకులమ్మ, చిన్నక్క మొదలైన వారందరినీ కలుపుకొని, కాలం కలిసివచ్చేదాకా ఆగి, ఒక అర్థరాత్రి పక్కా ప్రణాళికతో అగ్నిస్రష్టను అంతమొందిస్తుంది ఎర్రమ్మ. రాక్షస సంహారం చేసిన ఆ ఏడుగురు బాధిత వనితలను చూస్తుంటే, ఒక దుష్ట రాక్షసుడికి చివరి దర్శనం ఇవ్వడానికి వచ్చిన దేవతల్లా కనిపిస్తారు.
అగ్నిస్రష్ట మరణం తర్వాత ఆ వారసత్వానికి సంతకాలు చేస్తూ, అతని కొడుకు రత్నసభారాధ్య రాజకీయాల్లోకి వచ్చి హోంమంత్రి అవుతాడు. ఎర్రమ్మ పెద్దకొడుకు భార్గవ బతికి ఉంటే ఏనాటికైనా తన ప్రాణానికి ముప్పు తప్పదని భావించి, అతడిని చంపడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. అనుకున్నట్లే భార్గవను చంపిస్తాడు. అనేక పరిణామాల తర్వాత ఎన్నికల్లో రత్నసభారాధ్య ఘోరంగా ఓడిపోతాడు. భార్గవ మరణం ఉద్యమకారుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలకు కారణమవుతుంది.
ఒకరోజు నలుగురు మనుషులు మిలిటరీ దుస్తుల్లో వచ్చి రత్నసభారాధ్యను తీసుకువెళ్లి ప్రజాకోర్టు నిర్వహిస్తారు. అక్కడ హాజరైన ప్రజలంతా అతడిని చంపమని పిడికిళ్లతో నినదిస్తారు. కానీ ఎర్రమ్మ అందుకు అంగీకరించదు. ఎర్రమ్మ నిర్ణయానికి రత్నసభారాధ్య ఆశ్చర్యపోతాడు. వారిద్దరి మధ్య సంభాషణ చాలాసేపు కొనసాగుతుంది. ఆ సమయంలో ఎర్రమ్మ వేసిన ప్రశ్నలకు జవాబులు దొరక్క రత్నసభారాధ్య తలవంచుకుంటాడు. ఆమె కొడుకును తానే చంపించి పూడ్చిపెట్టించానని, ఆ స్థలంలోనే తనను కూడా చంపితే ఆనందిస్తానని పశ్చాత్తాపంతో పలుకుతాడు.
ఆ మాటలు విన్న ఎర్రమ్మ తన కనురెప్పల చూపులను మాటలుగా మారుస్తూ… ‘చచ్చిన కొడుకులో నిన్ను చూడగలుగుతున్నాను. నలుగురి పట్ల వాడు ఆశించిన మేలు కొంతైనా నువ్వు చేస్తున్నావు. అందుకే నువ్వు నా కొడుకయ్యావు. చచ్చిన నా కొడుకు కోసం బతికున్న కొడుకును చంపను…’ అంటుంది. ఆమె మాటలకు రత్నసభారాధ్య క్షమాపణలతో నేలమీద ముద్దలా కూలిపోతాడు.
ఆ రోజు రాత్రి ఎర్రమ్మ ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తారు. చివరి ముద్ద నోట్లో పెట్టుకుంటూ ‘జీవితంలో ప్రశాంతతను పొందానురా…’ అంటూ ఆమె కన్నీళ్లతో మాట్లాడుతుంది. తెల్లారింది, కానీ ఎర్రమ్మ నిద్ర నుంచి లేవలేదు. శాశ్వతంగా మెలుకువ రాని నిద్రలోకి జారుకుంది. జీవితంలో దెబ్బతిన్న గాయాలు కానీ, వాటి తాలూకు మచ్చలు కానీ, కారిన కన్నీళ్ల చారలు కానీ ఏవీ ఆమె ముఖంలో ఇప్పుడు కనిపించడం లేదు. ప్రేతకళ అస్సలు లేదు, జీవకళ ఉట్టిపడుతోంది. ‘జీవితంలో ఏదో సాధించాననే తృప్తి కనపడుతోంది….’ అంటూ ఈ మాటలతో ‘చెరువు గండి’ నవల పూర్తవుతుంది.
__________________
ఇది కేవలం నవల కాదు, ఒక వాస్తవ చిత్రం. ఇందులో రంగులన్నీ సమర్థవంతంగా రంగరించబడ్డాయి. మోసపూరిత చర్యతో ముత్యాలమ్మ చెరువుకు పెద్దాయన గండి కొట్టించిన దృశ్యం, ఊరు మధ్య రచ్చబండ, దాని చుట్టూ జరిగే కోలాహలం, ఊరిలో మెరవణి దృశ్యాలు, వాటిలో చోటుచేసుకునే కులాల వారీ పంతాలు, పట్టింపులు, దళిత కుటుంబాల పెళ్లి వ్యవహారాలు, ఆచారాలు, గ్రామాలలో జరిగే హత్యలు, దాడులు, దోపిడీలు, కోరలు సాచి కాటేసే అమానుషాలు… ఇలా లెక్కలేనన్ని సంగతులు ఒక సజీవ చిత్రంలా మన ముందు ఆవిష్కరించబడ్డాయి.
___________________
పుస్తకం తెరిచిన దగ్గరి నుండి ఎర్రమ్మ మరణం దాకా ప్రతి సన్నివేశంలో మనం అక్కడే ఉన్నామన్న అనుభూతిని కలిగించడంలో రచయిత వంకిరెడ్డి రెడ్డప్ప రెడ్డి గారి కలం చేసిన విన్యాసాల సమర్థత పాఠకులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ నవలలో అన్ని వర్గాల జీవితాలు ఉన్నాయి. ఒక ప్రాంత జీవితాన్ని సజీవంగా నవలా రూపంలో అందించడానికి తీసుకోదగిన జాగ్రత్తలన్నీ క్రమపద్ధతిలో తీసుకున్న రచయిత వంకిరెడ్డి రెడ్డెప్ప రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు.
–
సాహిత్య ప్రపూర్ణ డాక్టర్ కె.జి. వేణు
98480 70084













