ఇతని రెండు కళ్లూ కవిత్వాన్ని కనే రెండు గర్భ సంచులు. ఇతని నోరు చింతల తొవ్వ చుట్టూ పారుతున్న పదాల నది, రెండు కాళ్ళూ ఊరి చివర నిలబడ్డ తాటి చెట్లు. ఇతని రెండు చేతులూ సలువ ను ధారపోసే కల్లు రేకలు. ప్రతి కవితను సహజ పురిటి నొప్పితోనే కన్నాడితడు. అతడు తుల శ్రీనివాస్ అనే కవిత్వ ప్రేమికుడు.
Poems are moments’ monuments. మనం రాసే కవిత మనం నిర్మించే కట్టడం. కొన్ని చుక్కల రక్తాన్ని ఇంకొన్ని చమటబొట్లతో కలిపి నాలుగు కన్నీటి గింజల్ని విత్తి దారి పొడుగునా నాటితే అదే ‘చింతల తొవ్వ’ అనే కవిత్వ కట్టడం. ఈ కవిత్వ కట్టడాన్ని కట్టినవాడు తుల శ్రీనివాస్ అనే కవి. ఐతే తాను నిర్మించిన కవిత్వ కట్టడానికి తాను వాడిన వస్తువులు..అనుభవాలు, అనుభూతులు, బాల్యం, స్నేహం, సమాజం, అమ్మ నాన్న, అన్న ఇంకా చాలా చాలా.
ఎంత నిరోధించినా, నియంత్రించినా సీతాకోక చిలుకలు.. పూల తల మీదనే కుర్చుంటాయి. తరిమినా ఊదరగొట్టినా పోనే పోవు. అది వాటి బేసిక్ ఇన్స్టింక్ట్. ఎంత కంచె వేసినా, గోడ కట్టినా పూల వాసనని ఆపలేం ఎందుకని? అది వాటి గుణం. ఇప్పుడు ఈ కవి కూడా మనం ఎన్ని అనుకున్నా మరెన్ని రాసుకున్నా ఇతని కళ్ళు..నేలతో జ్ఞాపకాల సూర్యుని చుట్టూ తిరుగుతూ ‘చింతల తొవ్వ’ ను సంపుటిగా దిద్దారు. కవిత్వంగా పరిచారు. ‘చింతలతొవ్వ’ ను చేతికి తీసుకుంటే తుల శ్రీనివాస్ కనిపిస్తాడు. పొనీ అతడినే చదువుదామంటే చింతలతొవ్వ ముందుకి వొచ్చి మాట్లాడుతుంది. ఇతనంటే చింతల తొవ్వ. చింతల తొవ్వ అంటే శ్రీనివాస్. ఒకరికొకరు నానార్ధాలు. ఒకరికి మరొకరు పరమ పదార్థాలు. కవిత్వం నుండి ఇతను పుట్టాడో, ఇతడి నుండి కవిత్వం పుట్టిందో ఎంత అన్వేషించినా అంతుచిక్కదు. ఇతడు ఏ కవిత్వ పాఠశాలలోనూ చదువుకోలేదు. ఏ గురువు ఇతనికి సిమిలీలను, మెటాఫర్ లను దిద్దబెట్టలేదు. ఇతడ్ని ఇతడే పుట్టించుకున్నాడు. ఇతడ్ని ఇతడే కవిగా పట్టించుకున్నాడు. కాలం ఇతడ్ని కన్నది. కరోనా ఇతడ్ని కవిగా పెంచింది. కాలం పురిటిలోంచి కలం పట్టుకొని చింతలతొవ్వ మీద నడిచాడు. నడుస్తూనడుస్తూ పదాల్ని పెంచాడు. వాక్యాల్ని వండి వార్చాడు. కవిత్వాన్ని తత్త్వంగా మార్చుకున్నాడు.
ఈ తొవ్వ చుట్టూ ఉన్న ‘పురిటి మట్టి’ మీద ‘అనురాగపు జల్లు’ని కురిపించాడు, ‘అలా తాటి వనంలోకి’ తీసుకుపోయి, ‘కల్లు రేఖలదార చుట్టూ పొంగే చమటను చూపెట్టాడు. ‘ఊపిరి దీప’మైన నాన్నని రాస్తూ, ‘పల్లె నిద్రవోయిందని’, ‘మట్టి శిల్పం’లో పొర్లి తళతళ మెరిసిపోతున్న ముత్తయ్య తాతను పరిచయం చేశాడు. ‘గుప్పెడంత జీవితం’రా బాబు.. ప్రేమని పంచండని ప్రవచనం బోధించాడు ,‘దీపంత’ చెరువుని, చెరువులా పొంగిపొర్లే కన్నీటి ‘పావన గంగ’ని చిలికి, అరే నువ్వు ఇంకొకరికి రుణపడ్డావురా అనే ‘ఋణ బంధాన్ని’ దారిపొడుగునా నాటి ‘యాసంగి నాటు’ మీదుగా ‘మట్టి పూలచెట్టు’ను ఎక్కించి ఆ పాదాలకు కవిత్వం పూసి ‘తాత చెప్పిన కథల్ని’,‘యాది’ చేసి, ‘నాయనమ్మ ఒక్కసారి ఒచ్చి పోవే’ అని దుఃఖాన్ని కక్కాడు. ‘రెక్కలు తొడిగిన జ్ఞాపకాల’సాక్షిగా ‘సృష్టి పాట’లు పాడుతూ ‘తీయటి జ్ఞాపకం’లాంటి పిన్నీసును తలుస్తూ ‘రంగు వెలసిన జీవితం’ చెప్తూ, ‘ఆడ పిల్లలంటే’ ప్రకృతి వికృతి అని, ‘స్నేహితుడు కథ’ని ‘వెంటాడే జ్ఞాపకాలు’గా ‘అనగనగా సైకిల్’ను ‘మనసంతా నువ్వే’గా మార్చుకొని ‘వేగు చుక్క’మీదుగా, ‘కలత పడ్డ కన్న పేగు’.. ‘అంతిమ యాత్ర’చూసి, ‘ఊరు చిన్నబోయింది’ని ఇప్పుడు ‘నిజంగా ఓ మనిషికావాలంటూ’.. ‘నేనొక కలగన్నాను’ ఆ కలలో.. ‘వలస వెతలు’ చూసి ‘కన్నీటి జల్లు’ గా కురిసి ‘రైతు కష్టం’విని గుండెలు బాదుకుని కన్నీటిని చిలికి పదాల్ని పెంచి కవితల చెట్లుగా కవిత్వపు అడవిగా రూపుదిద్దాడు.
ఎవరి భాష వాళ్ళకి ఉండాలి. ఎవరి వ్యక్తీకరణ వాళ్ళకి ఉండాలి. ఎవరి మాండలికంలో వాళ్ళు రాయాలి. కవి తుల శ్రీనివాస్ అదే చేశాడు. అద్దె రక్తాన్ని, కొనుగోలు చేసిన చెమటను.. ఇతను కవిత్వంలో వాడలేదు.తన పాట తనే తన గొంతుతో పాడాడు. అతని స్కానింగ్ రిపోర్ట్ అతని కవిత్వం. వైయక్తిక అంశాల్ని దాటి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల దాకా ఇతని కవిత్వం నడిచింది. వస్తు వైవిధ్యతలోనూ, శిల్ప నిర్మాణంలోనూ అభివ్యక్తిలోనూ ఈ కవిని చూస్తే.. ఇది ఇతని మొదటి కవితా సంపుటి అని అనుకోలేము.
______________
కవిత్వం ఒక ముందస్తు చర్యగా చేసే ప్రక్రియ కాదు. మంచి కవిత్వం..దానంతట అది అలా సహజంగా బయల్పడాలి. అలా..సహజంగా తండ్రి పిలుపులాగా, తల్లి తినిపించే గోరుముద్దలాగా, పిల్లల అమలిన ముద్దులాగా హాయిగా, పఠనీయంగా ఉన్నాయి ఈ కవిత్వ సంపుటిలోని చాలా కవితలు. ఏమి రాశాడు ఈ కవి అని తొంగి చూస్తే మన ఊరు కనబడుతుంది. నాన్న కనబడతాడు. మన ఊరి తాటి తోపు దగ్గర ఎంతకు తెగని హృదయంగమయమైన ముచ్చట చెప్పే ప్రాణ స్నేహితులు దొరుకుతారు. మన లోపల దొరికే మనమే మనకు కనబడతాము.
______________
మనల్ని మనం చూసుకునేందుకు మనల్ని మనం దొరకబుచ్చుకునేందుకు ‘చింతలతొవ్వ’ లోనూ, దాని చుట్టూ ఇష్టంగా మన చిటికెన వేలు పట్టుకుని నడిపిస్తాడు ఈ కవి. ఆ కవిత్వ వాతావరణాన్ని చూసి ముగ్దులమవ్వడం ఇక మన పని అవుతుంది.
వస్తు విస్తృతితో, చాలా కవితలను ఒక అందమైన శిల్పంలా మలిచి, మంచి కవిత్వం రాయగల సత్తా ఉన్న తుల శ్రీనివాస్ మరో సంపుటితో మరింత సెన్సేషన్ అవుతాడని బలంగా నమ్ముతూ….
-పెద్దన్న మారాబత్తుల
98668 81140