సింహపురి మణిదీపం – దీపాల పిచ్చయ్య శాస్త్రి

వీనుమిగిలిన విమర్శకులు, పండిపోయిన పండితులు, సంస్కృతాంధ్ర వాజ్మయ మహోదధికి అగస్త్యప్రాయులు అనిపించుకున్న దీపాల పిచ్చయ్య శాస్త్రిగారు సాహిత్య ప్రపంచానికి విమర్శకులుగానే తెలుసు. అయితే, శాస్త్రిగారు సాహిత్య జీవితాన్ని కవిగానే ప్రారంభించారు. తర్వాతికాలంలో క్రమంగా వారు వ్యాఖ్యానాలు, సాహిత్య విమర్శలవేపు మొగ్గుచూపారు.

శాస్త్రిగారు గుంటూరు జిల్లా కూచిరాజుపల్లె గ్రామంలో వెంకట నరసయ్య, సరస్వతమ్మలకు 27-05-1894 సం.లో జన్మించారు. బొమ్మరాజుపల్లెలో తండ్రివద్ద సంస్కృతాధ్రాలను, వ్యాకరణాన్ని అభ్యసించారు. ఏకసంధాగ్రాహి అవడం మూలాన సంగీతంలో మంచి ప్రవేశం సంపాయించారు. వీణ అద్భుతంగా వాయించగల నేర్పు ఉంది. తిరుపతి వేంకటశాస్త్రి ప్రభావం వల్ల పద్యమైనా, శ్లోకమైనా మంచి గమకంతో పాడే నేర్పు బాల్యంలోనే పట్టుబడిరది. వినుకొండలో బోర్డు హయ్యర్‌ గ్రేడు ఎలిమెంటరీ స్కూల్లో చేరి వారాలు చేసుకుంటూ థర్డ్‌ ఫారం వరకూ చదివారు. అక్కడ సహవిద్యార్ధి అయిన గుఱ్ఱం జాషువాగారితో పరిచయం ఏర్పడిరది. 1912 సం.లో తిరుపతివేంకట కవులు వినుకొండలో అవధానానికి వచ్చినప్పుడు శాస్త్రిగారు వారిపై ఆశువుగా పద్యాలు చెప్పారు. వారు బాలకవిని ఆశీర్వదించారు. ఆనాటినుండి వారికి శాస్త్రిగారు ఏకలవ్య శిష్యులై, జాషువాతో కలిసి అవధానాలు చెయ్యాలని ఆశుకవిత్వం సాధన చేశారు. ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. తరువాయి కాలంలో నెల్లూరులో స్థిరపడ్డారు.

చిన్నతనమునుండి చాటుపద్యాలపై మోజున్న శాస్త్రిగారు 1914 సం.లో శ్రీవేటూరి వారు ప్రకటించిన చాటుపద్యమంజరికి ప్రభావితుడై తానుకూడా అనేక వ్యయప్రయాసలకోర్చి కొన్ని చాటుపద్యాలను సేకరించి 1917 సం.లో ‘‘చాటుపద్యరత్నాకరం’’ అన్నపేరుతో ప్రకటించారు. దాదాపు అదే కాలంలో ‘‘కానన ప్రహసనము’’ పేరుతో శాస్త్రిగారు రాసిన చిన్న గ్రంధం అచ్చుపడిరది. ఆ ప్రతులు లభించడంలేదు. 1917 సం.లో శాస్త్రిగారి ‘‘భక్తకల్పద్రుమా శతకం’’ అచ్చుపడిరది. ఆపుస్తకం వెనుక ‘‘అరుణకిరణ’’ అనే నవల మితిమీరని హాస్య శృంగార నవలగా, అచ్చులో ఉన్నట్టుగాను ప్రకటించారు గానీ అచ్చయిన దాఖలాలు లేవు. తెలుగు నవలా ప్రక్రియ బాల్యదశలో ఉండగా శాస్త్రిగారు నవల రాయడం ప్రశంసింపదగ్గ విషయం.

శాస్త్రిగారు 1927 సం.లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో వేదంవేంకటరాయ శాస్త్రిగారు రాసిన మేఘసందేశ వ్యాఖ్యలో 3 తప్పులను ఎత్తిచూపారు. ఈవిషయంలో పండితలోకంలో పెద్ద దుమారం చెలరేగింది. తిరుపతివేంకట కవుల శిష్యుడన్న నెపంతో శాస్త్రిగారిపై ఉన్నకోపం వేదంవారు చెళ్ళపిళ్ళ వారి రచనలలో తప్పులు పట్టడం ప్రారంభించారు. కానీ శాస్త్రిగారు విధిలేని పరిస్థితులలో రంగంలోకి దిగి ‘‘కవులతోడి కతలు కుమ్మరడుసులు కాదు కమ్మరడుసు’’ అంటూ ‘‘రంగము మీది కెక్కుదము రామరి’’ అని గర్జించే సరికి ప్రత్యర్ధులు మౌనం వహించారు. ఈ వివాదంలో గిడుగువారు శాస్త్రిగారి పాండిత్యాన్ని శ్లాఘిస్తూ ఉత్తరం రాశారు. వేదంవారి సారంగధర గురించి వ్యాఖ్యరాస్తూ సూర్యరాయాంధ్ర నిఘంటువులోని కొన్ని తప్పులని ఎత్తిచూపారు. నిఘంటుకర్తలకు ఆగ్రహం కలిగి శాస్త్రిగారికి హెచ్చరికలు జారీ చేశారు. శాస్త్రి గారు ఈ విషయం కాస్తా గట్టిగా పట్టించుకుని అప్పటికే వెలువడిన నిఘంటువు 4 సంపుటాలను క్షుణ్ణంగా పరిశీలించి, 55 అర్ధదోషాలు, 55 పాఠదోషాలు, 23 శబ్దదోషాలు ఎత్తిచూపారు. ఈ విషయం పత్రికలలో వ్యాసాలు రాస్తూ వేదంవారి పదాలను శబ్దార్ధపాఠదోషాలను ఎంత అపరిశీలితంగా తన నిఘంటువులో చేర్చుకుందో సోదాహరణంగా వివరించారు.

జాతిని జాగృతం చేయవలసిన కవికలంలోని సిరా ఈవిధంగా ఎర్రబారింది. భాషలోని ఎన్నో మలినాలను ప్రక్షాళనం చేసింది. విద్యాగర్వ భూయిష్టులైన కవిపండితుల సాహిత్యంలోని తప్పులను ఎంత వినయ విధేయతలతో ఎంత భక్తిప్రపత్తులతో లోకం తలకెత్తుకుందో వివరించారు. భాషావేత్తల కళ్ళు తెరుచుకున్నాయి. ఆంధ్రదేశం యావత్తూ ఆయనను విమర్శకాగ్రేసరునిగానే నిలిపింది. అయితే ఆయన రాసిన గ్రంధాల జాబీతా ఏమీ చిన్నదికాదు. ఆయన భక్తకల్పద్రుమము, స్వయంవరం, కాలము, భారతి, సువర్ణమేఖల, ప్రణయ కుసుమం, స్వప్న ప్రయాణం, నెల్లూరు గాలివాన, కుసుమగుఛ్చము అనే పద్యకావ్యాలను రాశారు. రఘువంశము, మేఘసందేశము, కుమారకధామంజరి,మధ్యమ వ్యాయోగము, పంచరాత్రము, దూతవాక్యము, కర్ణభారము, దూతఘటోత్కచము, ఊరుభంగము, దేశభక్తి వంటి అనువాద గ్రంధాలను రాశారు. సాహిత్య సమీక్ష, ద్రోణప్రశస్తి, శ్రీనాధుడు – శృంగారము, వచన కంబరామాయణ పరామర్శ వంటి విమర్శనా గ్రంధాలను రాశారు. సారంగధరచరిత్ర – జితకాశివ్యాఖ్య అనే గొప్ప వ్యాఖ్యా గ్రంధం రాశారు. పరశ్శతములు అనే వ్యాససంపుటిని వెలయించారు. శ్రీమదాంధ్ర మహాభాగవతము, సారంగధర చరిత్రము అనే శాస్త్రిగారి పరిష్కరణ గ్రంధాలను ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ ముద్రించి గౌరవించింది. అమరకవులు, స్వయంవరం, తిక్కన తెలుగు తీరుతెన్నులు, శబ్దపల్లవధాతుకోశం అనేవి శాస్త్రిగారి అముద్రిత, అలభ్య గ్రంధాలు.

శాస్త్రిగారి ‘‘సువర్ణమేఖల’’ కావ్యం 1921లో మొదట అచ్చుపడిరది. ఈ కధ ఫ్రెంచ్‌ భాషలో సుప్రసిద్ధ రచయిత ‘‘గేడి మపాసా’’ రాసిన నెక్లెస్‌ ను పోలి ఉన్నా కధాకధనంలో శాస్త్రిగారు కొత్త పుంతలు త్రొక్కి, మన ఆంధ్రప్రాంత ఆచారవ్యవహారాలతో తీర్చి దిద్దారు. ‘‘ఎరువుల సొమ్ములు బరువుల చేటు, తియ్యా పెట్టా తీపుల చేటు, అదొకటిపోతే అప్పులచేటు’’ అంటూ శాస్త్రిగారు చెప్పిన ప్రబోధాత్మకమైన నీతి కధను టూకీగా చూద్దాం.
ఉమాపురంలో చంద్రరేఖ, జయచంద్రులనే దంపతులుండేవారు. జయచంద్రుడు పూర్వాశ్రమంలో జమీందారే కానీ ప్రస్తుతం బడిపంతులు. చంద్రరేఖ సౌందర్యవతి, సుగుణాలరాశి. జయపురంలో ఉన్న బంధువుల వివాహానికి రమ్మని ఆహ్వానం అందింది. ఆ వివాహం జమీందారులది అవడంతో భర్త ఎంతచెప్పినా వినకుండా ఎరువు తెచ్చిన పట్టు చీరె, సువర్ణ మేఖలను ధరించి బయలుదేరుతుంది. వివాహం అనంతరం అక్కడికి దగ్గరలో ఉన్న సత్రంలో బసచేసిన సమయంలో తలక్రింద పెట్టుకున్న పట్టుచీరె, వడాణ్ణం నిద్రలో ఉండగా ఎవరో తస్కరిస్తారు. విషయం తెల్సిన జయచంద్రుడు నిశ్చేష్టుడయ్యాడు. వారిద్దరూ కలిసి అష్టకష్టాలు పడి ఆరునెలలో ధనం పోగుచేసి బంగారు వడ్డాణ్ణము చేయించి ఆమెకు ఇస్తారు. ఆమె ఆశ్చర్యపడి అది గిల్టునగయని చెప్పి, దానికి సరిపడా డబ్బు తీసుకుని ఆమె వడ్డాణ్ణం ఆమెకు ఇస్తుంది. నలుగురమ్మలక్కలు ఆ వడ్డాణ్ణం చూసి ‘‘ఇదీ మాయనగే’’ అని తేల్చేయడం కధ కొసమెరుపు. కావ్యానికి ప్రధాన ప్రయోజనం ఉపదేశమే! ‘‘ఎరువు సొమ్ము పరువు చేటు’’ అన్న ఉపదేశాన్ని యివ్వడమే ఈ లఘుకావ్య ఉద్దేశ్యం. ఈ కావ్యం దీపాల పిచ్చయ్య శాస్త్రిగారి రచనా కౌశలానికి చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.

‘‘పలికిన పల్కుపద్యమయి పండిత సమ్మతమై లసత్‌ రసం/ బుల గనిjైు స్వభావ పోషకమై మృదురీతి ముద్దులం/ గులుకగ బల్క నేర్పు గల కోవిదుడే కవిగాక పొల్లులం/ గిలికెడు వారలెల్ల కవికీర్తికి నర్హులటమ్మ కాలమా!’’ మంచి కవి యెలా ఉండాలో శాస్త్రిగారి ఈ పద్యంలో తేల్చి చెప్పారు. నిస్స్వార్ధంగా సాహిత్య సేవ చేసిన శాస్త్రిగారిని సాహితీలోకం చాలా కాలం క్రితమే మరచిపోయిందన్న సాహితీకౌముది సంపాదకులు శిష్ట్లా వేంకట రావు అన్న మాటలు ఆలోచించదగినవి. ఉపదేశము, ఆనందము అని ఆలంకారికులు చెప్పిన కావ్య ప్రయోజనాలకు అదనంగా శాస్త్రి గారు సామాజిక దృక్పధమును జోడిరచి, అటు ప్రాచీన, ఇటు ఆధునిక రీతులు మేళవించి రచించిన కావ్యాలు ఆంధ్రసాహిత్య లోకానికి మణిదీపాలు. ప్రాచీన భాషాసంస్కృతులను కడదాకా ఊపిరిగా భావించి 17-10-1983న కాలం చేసిన కవి శాస్త్రిగారు. విశ్వనాధ, తుమ్మల, జాషువా, జంధ్యాల, పుట్టపర్తి, గడియారం వంటి కవి పండిత మూర్ధన్యుల సరసన నిలువదగిన వారు. ఆరోజుల్లో ఎంత పెద్ద కవి అయినా తమ పద్యాల్లో భాషాదోషాలు చూపుతారేమోనని శాస్త్రిగారిని చూసి భయపడేవారట. ఇది చాలు శాస్త్రిగారి కవిత్వనైపుణ్యాన్ని మదింపుచేయడానికి. ‘‘సుకవితా యద్యస్తి రాజ్యేన కిం’’ అన్న అభిప్రాయం గలవారికి కవిత్వ రంగంలో కనిపిస్తున్న హీనస్థితి ఆవేదనకు గురిచేస్తుంది.

– కిరణశ్రీ, హైదరాబాదు