అందమైన అబ్బాయి. బాగా పేరున్న ఆర్కిటెక్ట్. ఒక జాతీయ స్థాయి సెమినార్ కి ప్రాజెక్ట్ మేనేజర్ గా ఊటీకి వెళ్లి అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూసాడు. తొలి చూపులో ప్రేమ. నేరుగా ఆమెకి ప్రపోజ్ చేశాడు. ఆమె తిరస్కరించింది. అయినా ఆ అబ్బాయి పట్టు వీడలేదు. నీడలా ఆమె వెంట తిరిగాడు. ఆమె కోసం ఒక తపస్సే చేశాడు. చివరకు ఆమె హృదయాన్ని గెలుచుకున్నాడు. అప్పుడా అబ్బాయి హృదయంలో ఉప్పొంగిన సంతోష సముద్రాన్ని అక్షరాలలో బంధించడం అంటే అగస్త్య మహాముని సముద్రాన్ని పుక్కిట పట్టినంత కష్టసాధ్యమైన విషయం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా పడితే చాలా అలవోకగా, అలతి అలతి పదాలతో ఇలా:
దేవుడే దిగి వచ్చినా
స్వర్గమే నాకిచ్చినా
షాజహాన్ తిరిగొచ్చినా
తాజ్ మహల్ రాసిచ్చినా
ఇప్పుడీ సంతోషం ముందర
చిన్నబోతాయి అన్నీ కదరా
లోలోన మనసంత సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే..అనే అద్భుతమైన పాటగా రూపొందుతుంది
_____________
ప్రేమ పాటలు ఎంతమంది రాసినా ఎవరి బాణీ వారిదే అయినా, ఏ పాట సౌరభం ఆ పాటదే అయినా శ్రోతను నిరంతరం వెంటాడే పాటలు కొన్నే ఉంటాయి. ఆ కొన్నీ రాయడానికి సినీగీత రచయితకు హృదయంలో గులాబీలు ఉండాలి. ఆ గులాబీలను వెన్నంటి ముళ్ళు కూడా ఉండాలి. లేకపోతే ప్రేమలోని పరిమళాన్ని, ప్రేమలోని దుఃఖాన్ని రాయడం సాధ్యం కాదు. ప్రేమలో పడిన తరువాత అప్పటిదాకా చూసిన ప్రపంచం అంతా ఒక్క క్షణంలో అదృశ్యమైపోయి, సరికొత్త ప్రపంచం ఏదో కళ్ళముందు తారాడుతుంది. ఆకాశం చేతికి అందుతుంది. భూగోళం బుజ్జి పాపాయిలా మెడ చుట్టూ చేతులు వేస్తుంది. నీటిపైన చందమామలా నేల మీద ప్రేయసీప్రియుల హృదయం తెలియాడుతుంది.
_____________
ఈ భావానికి అక్షర రూపం ఇస్తే:
నమ్మవా నన్ను నమ్మవా
చేతికందుతూ ఉంది ఆకాశం
ఇప్పుడె పుట్టినట్టుగ
ఎంత బుజ్జిగా వున్నది భూతలం..
అనే అక్షర సముదాయంగానే ఒదుగుతుంది కదా. ఈ పాట ‘సంతోషం’ సినిమాలోది. గీత రచయిత కులశేఖర్.
కులశేఖర్ తెలుగు సినిమా ప్రపంచంలోకి ఒక తారాజువ్వలాగా దూసుకుని వచ్చి, కొంతసేపు కాంతులు వెదజల్లి అంతే వేగంగా నేలకు రాలిపోయినవాడు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ‘విరించినై విరచించితిని’ అనే గీతాన్ని విశ్లేషించడం ద్వారా ఆయన దృష్టిలో పడి, ఆయన శిష్యరికంలో రాటుదేలి, ఆర్.పి.పట్నాయక్, తేజ లతో జట్టుకట్టి ‘చిత్రం’ సినిమా ద్వారా తెరంగేట్రం చేశాడు కులశేఖర్. మొదటి సినిమాకే సింగిల్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఔదార్యం తేజది. అయితే దాన్ని కాపాడుకున్న ప్రతిభ కులశేఖర్ ది. ‘చిత్రం’ సినిమా హిట్ అయిన తరువాత ఆర్.పి, కులశేఖర్ జంట వెనక్కు చూడలేదు. ‘చిత్రం’ సినిమాకు రాసిన ‘ఊహల పల్లకీలో ఊరేగించనా/ఆశల వెల్లువై రాగం పలికించనా’ పాటలో కులశేఖర్ రాసిన:
ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా
బ్రతుకులో చేదువున్నా భయమే వద్దురా
సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా
పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా..
అన్న వాక్యాలు చదివి కె.వి.మహదేవన్ ముగ్ధుడై కులశేఖర్ ని ఆశీర్వదించడం అతడి జీవితంలో ఒక మేలిమి మెరుపు. చాలా తక్కువ మందిని వరించిన ఆత్రేయ-మనస్విని అవార్డు కులశేఖర్ కు కూడా దక్కింది. అది అతడి ప్రతిభ అనే వెండి మబ్బుకు నేసిన జరీ అంచు.
ఆత్రేయ తరువాత అతి సాధారణ పదాలతో ఎంత పెద్ద భావాన్ని అయినా పలికించే గీతకర్తగా కులశేఖర్ పేరు తెచ్చుకున్నాడు. ప్రేమ గీతాలు, విరహ గీతాలు, అల్లరి పాటలు ఏవైనా అలవోకగా రాసే కులశేఖర్ పదిహేను వందలకు పైగా పాటలు రాశాడు. రాసిన ప్రతి పాటలోనూ ఏదో ఒక కొత్త దనం చూపించాలని కులశేఖర్ పడే తాపత్రయానికి ఉదాహరణలు ఎన్నో.
మనసులో ఎందుకో అలజడి కలిగింది. కారణమేమిటో తెలియదు. కుదురుగా ఒక చోట నిలవనీదు. ఏ పనీ చేయనివ్వదు. ఆ అలజడికి కారణం ఏమై ఉంటుంది? అని ప్రశ్న వేసుకుని:
అందమైన మనసులో
ఇంత అలజడెందుకో..
ఎందుకో ఎందుకో ఎందుకో..
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో..
ఎందుకో అసలెందుకో అడుగెందుకో?
మొదటిసారి ప్రేమ కలిగినందుకా?
ఆ అలజడి మొదటి సారి హృదయంలో ప్రేమభావం కలిగినందుకు అని జవాబు చెప్తాడు. అసలెందుకో? అడుగెందుకో? లాంటి ప్రయోగాలు చాలా చోట్ల కులశేఖర్ పాటలలో కనిపిస్తాయి.
ఒకసారెప్పుడో కులశేఖర్ గోదావరి వొడ్డున కూర్చుని వున్నపుడు ఒక అమ్మాయి, మరొక అబ్బాయి వచ్చి గోదావరిలోకి దిగి దోసిలితో నీళ్లు తీసుకుని నెత్తిన చల్లుకున్నారట. ఆ వెంటనే అబ్బాయి అమ్మాయి మెడలో తాళి కట్టాడట. అంటే వేదమంత్రం సాక్షిగా చేసుకునే పెళ్లిని ఆ జంట గోదావరి సాక్షిగా చేసుకున్నదన్నమాట. ఆ దృశ్యం మనసులో అలాగే వుండిపోయిన కులశేఖర్:
నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ..
అని రాశాడట. ప్రేమించుకోవడం, సఫలం కావడం, విఫలం కావడం అంతా మన చేతిలోనే ఉంటుందా? మన చేతిలోనే ఉంటే ఇన్ని విఫల ప్రేమలు ఎందుకు ఉంటున్నాయి? అసలు సంగతి ఏమిటంటే ప్రేమ విఫలం కావడం, సఫలం కావడం మన చేతిలో ఏదీ లేదు. ప్రేమ ఒక ఆట. ఆ ఆటని మనుషులు తామే ఆడుతున్నామని అనుకుంటారు కానీ అది నిజం కాదు.
ఇది మనుషులు ఆడే ఆట
అనుకుంటారే అంతా
ఆ దేవుడు ఆడే ఆటని తెలిసేదెపుడంటా
అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా
అయినా లోకానికి అలుపే రాదుగా
వెయ్యి సార్లు ప్రేమలో విఫలం చెందినా మనిషి వేయిన్నొకటో సారి ప్రేమించడానికి సిద్ధంగా ఉంటాడు. గాయపడుతున్నా, గేయమై రవళించడానికి ప్రేమ మనిషిపైన విసిరే మాయాజాలం ఏమిటి?
పాటకు ప్రాణం
పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం
ప్రేయసి కాదా..
అదన్నమాట అసలు విషయం. ఈ లోకంలో స్త్రీలు, పురుషులు ఉన్నంత కాలం ప్రేమ ఉంటూనే ఉంటుంది. అదొక జీవన వాహిని. ఆనందము, దుఃఖము రెండూ ఒకే నాణేనికి రెండు వైపులు. దుఃఖం లేకుండా ఆనందం ఉండదు. ఆనందం లేకుండా దుఃఖం ఉండదు. ఆనంద స్వరూపం తెలిస్తే దుఃఖ స్వభావం ఏమిటో కూడా తెలుస్తుంది. మరి ఆనంద స్వరూపం ఏమిటీ?
జీవితం చిరునవ్వుతో
గడిపేయడమే కదా ఆనందం
అందరం మనమందరం
కలిసుంటేనే కదా సంతోషం..
ఇది కులశేఖర్ వర్ణించిన ఆనంద స్వరూపం. నేలపైనా నీటి వీణ పల్లవించే మబ్బులు, దాహం కోరే నేల కోసం నింగిలోన మబ్బుకూన అందుకునే చినుకు రాగం,ప్రేమ సెగలు తెలిసిన వచ్చీ రాని కన్నీరు, ప్రేమ లోతేమిటో తెలుసుకున్న ముగ్ధ అధరాలు, అచ్చుల్లోన హల్లులు, కరిమబ్బుల్లోన విల్లులు,మధుమాసంలోన మంచు పూ-జల్లులు, కులశేఖర్ పాటల దినుసులు.
ఇన్ని అద్భుతమైన పాటలు రాసిన కులశేఖర్ 1971 ఆగస్టు 15 సింహాచలంలో పండిత కుటుంబంలో పుట్టాడు. మహామహోపాధ్యాయ శ్రీమాన్ ఎస్.టీ.పీ రామచంద్రాచార్యుల వారి చిన్న కుమారుడు కులశేఖర్. చిన్నప్పటి నుండే సంగీత సాహిత్యాల పట్ల మక్కువ పెంచుకున్న అతడిలోని కవిని మొట్టమొదట గుర్తించింది తన నాయనమ్మ. తరువాత కాలేజీ స్థాయిలో పలు పోటీలలో పాల్గొని బహుమతులు గెల్చుకున్నాడు. కళాశాల చదువు తరువాత ‘ఈటీవి’ జర్నలిస్ట్ గా ఢిల్లీ, మద్రాస్ లలో వుద్యోగం చేశాడు. మద్రాస్ లో వున్నప్పుడు సీతారామ శాస్త్రి శిష్యరికం ఆ తరువాత ‘చిత్రం’ సినిమాలో అవకాశం..ఎక్కడా అపజయం అన్నది లేదు. అదే అతడి పాలిట శాపం అయింది. ‘ప్రేమ లేఖ రాశా’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదల కాకపోవడం, నిర్మాతలతో ఇబ్బందులు, ఓటమి కలిగించిన మానసిక హింసతో డిప్రెషన్ కు లోనయ్యాడు. వీటికి తోడు తన స్వీయ లోపాలు.
ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం
ఏ ఓటమి ఆపునురా రాగల విజయం
చేయరా సాహసం నీ జయం నిశ్చయం
అని యువతకు ఉద్బోధించాడు కానీ ఆ ఆశను బతుకంతా నిలుపుకోలేకపోయాడు కులశేఖర్.
_____________
విజయం వచ్చినంత కాలం మనిషిలో లోపాలు కనపడవు. విజయం వాటిని కప్పేస్తుంది. ఒక్కసారి అపజయం వస్తే చాలు, అది లోపాలని బహిర్గతం చేస్తుంది. జయాన్ని, అపజయాన్ని సమన్వయం చేసుకోవడం, పొంగకుండా, కుంగకుండా ఉండటం తెలియకపోతే, ప్రతిభతో పాటు వినయం లేకపోతే, జీవితం జారుడుబల్ల మీద ఎలా వేగంగా జారిపోతుందో తెలుసుకోవాలనుకుంటే కులశేఖర్ జీవితం ఒక ఉదాహరణ.
____________
కులశేఖర్ జీవితం ఒక విషాదాంత ప్రేమ గీతంగా యాభై మూడేళ్లకే నవంబర్ 26, 2024న అర్ధాంతరంగా ముగిసింది.
-వంశీకృష్ణ
95734 27422